భగవద్గీత పార్ట్ - 24
అథ షోడశోధ్యాయః - దైవాసురసంపద్విభాగయోగః
శ్రీభగవాన్ ఉవాచ
అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః !
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్ !! 1
అహింసా సత్యమక్రోథః త్యాగః శాంతిరపైశునమ్ !
దయా భూతేష్వలోలుప్త్యం మార్దవం హ్రీరచాపలమ్ !! 2
తేజః క్షమా ధృతిః శౌచమ్ అద్రోహో నాతిమానితా !
భవంతి సంపదం దైవీమ్ అభిజాతస్య భారత ! 3
శ్రీ భగవానుడు ఇట్లు పలికెను - నిర్భయత్వము, అంతఃకరణశుద్ధి, తత్త్వజ్ఞానప్రాప్తికై ద్యానయోగము నందు నిరంతర దృఢస్థితి, సాత్వకదానము, ఇంద్రియనిగ్రహము, భగవంతుని, దేవతలను, గురుజనులను పూజించుట అట్లే అగ్నిహోత్రాది - ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్రములపఠన, పాఠనములు మఱియు భగవంతుని నామగుణకీర్తనములు, స్వధర్మాచరణము నందలి కష్టములకు ఓర్చుకొనుట, శరీరేంద్రియాంతఃకరణముల సరళత్వము.
అహింస, సత్యము, క్రోధము, త్యాగము, శాంతి, ఎవ్వరినీ నిందింప కుండుట, దయ, మార్దవము, శాస్త్ర విరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట, చపలత్వము లేకుండుట.
ఓ అర్జునా ! తేజస్సు, క్షమా, ధైర్యము, బాహ్యశుద్ధి ఎవ్వరిపైనను శత్రుభావము లేకుండుట తాను పూజ్యుడనను అభిమానము లేకుండుట మొదలగునవి యన్నియును దైవీసంపద గలవాని లక్షణములు.
దంభోదర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ !
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్ !! 4
దంభః - దర్పః - అభిమానః - చ - క్రోధః - పారుష్యం - ఏవ - చ
అజ్ఞానం - చ - అభిజాతస్య - పార్థ - సంపదం - ఆసురీం
పార్థ - అర్జునా, దంభః - కపటము, దర్పః - గర్వము, అభిమానః చ - దురభిమానము, క్రోధః - క్రోధము, పారుష్యం ఏవ చ - పౌరుషమును, అజ్ఞానం చ - అజ్ఞానము, ఆసురీం - రాక్షససంబంధమైన, సంపదం - సంపదను గూర్చి, అభిజాతస్య - పుట్టినవానికి.
ఓ పార్థా ! కపటము, దర్పము మొండితనము, అభిమానము, క్రోధము, పారుష్యము, అజ్ఞానము మొదలగునవి ఆసురీస్వభావముగలవాని లక్షణములు.
దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా !
మా శుచః సంపదం దైవీమ్ అభిజాతోసి పాండవ !! 5
దైవీ - సంపత్ - విమోక్షాయ - నిబంధాయ - ఆసురీ - మతా
మా - శుచః - సంపదం - దైవీం - అభిజాతః - అసి - పాండవ
పాండవ - అర్జునా, దైవీ - దైవసంబంధమైన, సంపత్ - సంపద,విమోక్షాయ - బంధవృత్తి కొరకును, ఆసురీ - రాక్షససంబంధమైన, సంపదం - సంపదను గురించి, అభిజాతః - పుట్టినవాడవు, అసి - అయి ఉన్నావు, మా శుచః - దుఃఖించకుము.
ఓ అర్జునా ! దైవీసంపద ముక్తిదాయకము. ఆసురీసంపద బంధహేతువు. నీవు దైవీసంపదతో పుట్టినవాడవు. కనుక శోకింపదగదు.
ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ !
దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు !! 6
ద్వౌ - భూత సర్గౌ - లోకే - అస్మిన్ - దైవః - ఆసురః - ఏవ - చ
దైవః - విస్తరశః ప్రోక్తః - ఆసురం - పార్థః - మే - శృణు
పార్థ - అర్జునా, అస్మిన్ - ఈ, లోకే - లోకమునందు, దైవః - దైవసంబంధ మనియు, ఆసురః ఏవ చ - అసుర సంబంధమనియును, భూత సర్గౌ - ప్రాణసృష్టులు, ద్వౌ - రెండు విధములు, దైవః - దైవసంబంధమైనది, విస్తరశః - విస్తారముగాను, ప్రోక్తః - చెప్పబడునది, ఆసురం - అసురమగుదానిని, మే - నావలన, శృణు - వినుము.
ఓ అర్జునా ! ఈ లోకముననున్న మానవులు రెండువిధములుగా ఉందురు. దైవలక్షణములు గలవారు కొందఱు. అసురలక్షణములు గలవారు మరికొందఱు. దైవ లక్షణములు విస్తృతముగా తెల్పబడినవి. ఇప్పుడు ఆసురలక్షణములు గలవారిని గూర్చి వివరముగా తెల్పెదను వినుము.
ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః !
న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే !! 7
ప్రవృత్తిం - చ - నివృత్తిం - చ - జనాః - న - విదుః - ఆసురాః
న - శౌచరం - న - అపి - చ - ఆచారః - న - సత్యం - తేషు - విద్యతే
ఆసురాః - అసుర స్వభావముగల, జనాః - జనులు, ప్రవృత్తిం చ - ప్రవృత్తిం చ - ప్రవృత్తిమార్గముగాని, నివృత్తిం చ - నివృత్తి మార్గమును గాని, న విదుః - ఎరుగురు, తేషు - వారియందు, శౌచం - శుభ్రత, న విద్యతే - ఉండదు, ఆచారః చ న - ఆచారము లేదు, సత్యం అపి న - సత్యము కూడా ఉండదు.
అసురస్వభావముగలవారు ప్రవృత్తినివృత్తులను ఎరుగరు. కనుక వారిలో బాహ్యాభ్యంతరం శుచిత్వముగాని, శ్రేష్ఠమైన ప్రవర్తనగాని, సత్యభాషణముగాని ఉండనే ఉండవు.
అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్ !
అపరస్పరసంభూతం కిమన్యత్ కామహైతుకమ్ !! 8
అసత్యం - అప్రతిష్ఠం - తే - జగత్ - ఆహుః - అనీశ్వరం
అపరస్పరం సంభూతం - కిం - అన్యత్ - కామహైతుకం
తే - వారు, జగత్ - ప్రపంచము, అసత్యం - అసత్యము, అప్రతిష్ఠం - ప్రతిష్ఠలేనిది, అనీశ్వరం - ఈశ్వరుడు లేనిది, కామహైతుకం - కామకారణమైనది, అపరస్పర సంభూతం - స్త్రీ పురుష సంయోగము వలన కలిగినది, అన్యత్ కిం - మరియేమున్నది యని, ఆహుః - చెప్పుదురు.
ఈ జగత్తునకు ఆధారమైనది ఏదియును లేదనియు, ఇది అసత్య మనియు, భగవంతుడనెడివాడు లేనేలేడనియు, కామప్రేరితులైన స్త్రీ పురుషుల సంయోగ కారణముగ జీవులు సహజముగనే పుట్టుచున్నారనియు, కావున సృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదనియు ఆసురలక్షణములు గలవారు భావింతురు.
ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః !
ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతోహితాః !! 9
ఏతాం - దృష్టిం - అవష్టభ్యః - నష్టాత్మానః - అల్పబుద్ధయః
ప్రభవంతి - ఉగ్రకర్మాణః - క్షయాయ - జగతః - అహితాః
ఏతాం - ఈ, దృష్టిం - దృష్టిని, అవష్టభ్య - అవలంభించి, నష్టాత్మానః - చెడినమనస్సు గలవారు, అల్పబుద్ధయః - అల్పబుద్ధులు, ఉగ్రకర్మాణః - ఉగ్రకర్మలు చేయువారు, అహితాః - చెడువారును, జగతః - జగత్తుయొక్క, క్షయాయ - నశింపునకు, ప్రభవంతి - పుట్టుచున్నారు.
అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదముచేయుభౌతికవాదులు ఆత్మనుగూర్చి తలంపరు. వారు మందబుద్ధులు, వారు అందరికిని అపకారము చేయుక్రూరులు. వారి శక్తిసామర్థ్యములు ప్రపంచ వినాశనమునకే వినియోగపడుచుండును.
కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః !
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః !! 10
కామం - ఆశ్రిత్య - దుష్పూరం - దంభమాన - మదాన్వితాః
మోహాత్ - గృహీత్వా - అసద్గ్రాహాన్ - ప్రవర్తంతే - అశుచివ్రతాః
దుష్పూరం - తృప్తిచెందని, కామం - కామమును, ఆశ్రిత్య - ఆశ్రయించి, దంభమాన మదాన్వితాః - దంభముతోను అభిమానముతోను గర్వముతోను కూడినవారలై, అశుచివ్రతాః - బ్రష్టాచారములు గలవారై, అసద్గ్రాహాన్ - దురాచారములను, మోహాత్ - మోహము వలన, గృహీత్వా - గ్రహించి, ప్రవర్తంతే - ప్రవర్తించుచుందురు.
దంభము, దురభిమానము, మదములతోగూడిన ఈ ఆసుర లక్షణములు గలవారు యుక్తాయుక్తములను మరచి, తమ వాంఛలను ఏదో విధముగ తీర్చుకొనుటకు సిద్ధపడుదురు. అజ్ఞానకారణముగ మిథ్యాసిద్ధాంత ములను ఆశ్రయింతురు. శాస్త్ర విరుద్ధముగా ఆచారములేక ప్రవర్తింతురు.
చింతామపరిమేయాం చ ప్రలయాంతాముపాశ్రితాః !
కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః !! 11
చింతాం - అపరిమేయాం - చ - ప్రలయాంతాం ఉపాశ్రితాః
కామోపభోగ పరమాః - ఏతావత్ - ఇతి - నిశ్చితాః
అపరిమేయాం - అపరిమితమైనదియు, ప్రలయాంతాం - మృత్యువేఅంతముగా గలదియు నగు, చింతాం - చింతను, ఉపాశ్రితాః - ఆశ్రయించినవారై, కామోప భోగపరమాః - విషయభోగాలే ఉత్తమమనుచు, ఏతావత్ ఇతి - ఇదియే పరమార్థమనుచు, నిశ్చితాః - నిశ్చయించినవారై....
మరణించువరకును వారు అంతులేని చింతలలోనే మునిగిపోవు చుందురు. విషయభోగానుభవముల యందే మునిగి, అదియే నిజమైన సుఖమని భావింతురు.
ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః !
ఈహంతే కామభోగార్థమ్ అన్యాయేనార్థసంచయాన్ !! 12
ఆశాపాశశతైః - బద్ధాః - కామక్రోధః పరాయణాః
ఈహంతే - కామభోగార్థం - అన్యాయేన - అర్థసంచయాన్
ఆశాపాశశతైః - వందలకొలది ఆశాపాశముల చేత, బద్ధాః - బంధింపబడినవారై, కామక్రోధ పరాయణాః చ - కామక్రోధముల చేత కూడినవారై, కామభోగార్థం - కామానుభమునకై, అన్యాయేన - అన్యాయముగ, అర్థసంచయాన్ - ధనసంపాదనమును, ఈహంతే - కోరుచున్నారు.
వారు ఆశాపాశపరంపరలచే ఎల్లప్పుడును బంధింపబడుచుందురు. కామక్రోధపరాయణులై ప్రవర్తింతురు. విషయభోగముల నిమిత్తమై, అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనకు పాల్పడుచుందురు.
ఇదమద్య మయా లబ్దమ్ ఇమం ప్రాప్స్యే మనోరథమ్ !
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్దనమ్ !! 13
ఇదం - అద్య - మయా - లబ్ధం - ఇమం - ప్రాప్స్యే - మనోరథం
ఇదం - అస్తి - ఇదం - అపి - మే - భవిష్యతి - పునః - ధనం
ఇదం - ఇది, అద్య - ఇప్పుడు, మయా - నాచేత, లబ్ధం - పొందబడినది, ఇమం - ఈ, మనోరథం - కోరికను, ప్రాప్స్యే - పొందగలను, మే - నాకు, ఇదం - ఇది, అస్తి - కలదు, పునః - మరల, ఇదం - ఈ, ధనం అపి - ధనముకూడా, భవిష్యతి - కలుగగలదు.
నేను మిక్కిలి పురుషార్థిని గనుక ఈ కోరుకున్న వస్తువును పొందితిని. ఇంకను నా కోరికలన్నింటిని సాధించుకొనగలను. ఇప్పటికి నాకాడ ఎంతో ధనము ఉన్నది. మున్ముందు ఇంకను ఎంతోధనమును సంపాదింపగలను అని వారు తలంచుచుందురు.
అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరనపి !
ఈశ్వరో హమహం భోగి సిద్దోహం బలవాన్ సుఖీ !! 14
అసౌ - మయా - హతః - శత్రుః - హనిష్యే - చ - అపరాన్ - అపి
ఈశ్వరః - అహం - అహం - భోగీ - సిద్ధః - అహం - బలవాన్ - సుఖీ
అసౌ - ఈ, శత్రుః - శత్రువు, మయా - నాచేత, హతః - చంపబడెను, అపరాన్ అపి చ - ఇతరులను కూడా, హనిష్యే - వధింతును, అహం - నేను, ఈశ్వరః - ఈశ్వరుడు, అహం - నేను, భోగీ - భోగిని, అహం - నేను, సిద్ధః - సిద్ధుడను, అహం - నేను, బలవాన్ - బలవంతుడు, సుఖీ - సుఖవంతుడను.
నేను ఈ శత్రువును వధించితిని. ఇతర శత్రువులను గూడ వధింపగలను, నేనే సర్వాధిపతిని. సమస్త సుఖ భోగములను అనుభవింపగల వాడను నేనే. సిద్ధులన్నియు నా గుప్పిటనే యున్నవి. నేనే గొప్ప బలవంతుడను.
ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా !
యక్ష్యే దాస్యామి మోదిప్య ఇత్యజ్ఞానవిమోహితాః !! 15
ఆఢ్యః - అభిజనవాన్ - అస్మి - కః - అన్యః - అస్తి - సదృశః - మయా
యక్ష్యే - దాస్యామి - మోదిష్యే - ఇతి - అజ్ఞాన విమోహితా
ఆఢ్యః - ధనవంతుడను, అభిజనవాన్ - గొప్ప కులమున జన్మించినవాడను, అస్మి - అయి ఉన్నాను, మయా - నాతోడ, సదృశః - సమానుడు, అన్యః - ఇతరుడు, కః - ఎవడు, అస్తి - కలడు, యక్ష్యే - యజ్ఞముచేసెదను, దాస్యామి - ఇచ్చెదను, మోదిష్యే - సంతోషించెదను, ఇతి - అని, అజ్ఞానవిమోహితాః - అజ్ఞానమోహితులై.
నేనే గొప్ప ధనవంతుడను, మిక్కిలి పరివారము గలవాడను. నాతో సమానుడు మరియొకడులేడు. నేను యజ్ఞములను చేయగలను. దానములు ఇయ్యగలను. యథేచ్ఛగా వినోదింపగలను. అనుచు అనేక విధములుగా అజ్ఞానమోహితులై...
అనేకచిత్తవిభ్రాంతాః మోహజాలసమావృతాః !
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే శుచౌ !! 16
అనేక చిత్త విభ్రాంతాః - మోహజాల సమావృతాః
ప్రసక్తాః - కామభోగేషు - పతంతి - నరకే - అశుచౌ
అనేకచిత్తవిభ్రాంతాః - అనేకములైన మనోభ్రాంతులు కలవారై, మోహజాల సమావృతాః - మోహజాలముచే, నావరింపబడినవారై, కామభోగేషు - కామభోగముల యందు, ప్రసక్తాః - ప్రసక్తులై, అశుచౌ - మలినపూరితమైన, నరకే - నరకమునందు, పతంతి - పడుచున్నారు.
చిత్తభ్రాంతికి లోనై మోహజాలము నందు చిక్కుకొని, ఆసురలక్షణములు గలవారు విషయ భోగముల యందే మిక్కిలి ఆసక్తులై ఘోరనరకముల యందు పడిపోవుచుందురు.
ఆత్మసంభావితాః స్తబ్ధాః ధనమానమదాన్వితాః !
యజంతే నామయజ్ఞెస్తే దంభేనా విధిపూర్వకమ్ !! 17
ఆత్మసంభావితాః - స్తబ్ధాః - ధనమాన మదాన్వితాః
యజంతే - నామయజ్ఞైః - తే - దంభేన - అవిధిపూర్వకం
తే - వారు, ఆత్మసంభావితాః - ఆత్మస్తుతి గలవారునై, స్తబ్ధాః - స్తబ్ధులును, ధనమాన మదాన్వితాః - ధనాభిమానములవలన ఉన్మత్తులగుచు, దంభేన - డాంభికముగ, నామయజ్ఞైః - నామమాత్ర యజ్ఞములచేత, అవిధిపూర్వకం - విధిరహితముగా, యజంతే - యజ్ఞ మాచరించుచుందురు.
వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచు, గర్వోన్మత్తులై ధనదురహంకారములతో కన్నుమిన్నుగానక అప్రమత్తులై, శాస్త్రవిరుద్ధముగా ఆడంబరప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞముల నాచరించుదురు.
అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః !
మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః !! 18
అహంకారం - బలం - దర్పం - కామం - క్రోధం - చ - సంశ్రితాః
మాం - ఆత్మపరదేహేషు - ప్రద్విషంతః - అభ్యసూయకాః
అహంకారం - అహంకారమును, బలం - బలమును, దర్పం - గర్వమును, కామం - కామమును, క్రోధం చ - క్రోధమును, సంశ్రితాః - ఆశ్రయించినవారై, ఆత్మపరదేహేషు - తమయందును ఇతరులయందును ఉన్న, మాం - నన్ను, అభ్యసూయకాః - అసూయతో జూచువారలై, ప్రద్వింషంతః - ద్వేషించుచున్నారు.
అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధములకు వశులై, ఇతరులను నిందించుచు తమశరీరములయందును ఇతరుల శరీరముల యందును, అంతర్యామిగానున్న నన్ను ద్వేషించుచుందురు.
తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ !
క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు !! 19
తాన్ - అహం - ద్విషతః - క్రూరాన్ - సంసారేషు - నరాధమాన్
క్షిపామి - అజస్రం - అశుభాన్ - ఆసురీషు - ఏవ - యోనిషు
అహం - నేను, ద్విషతః - ద్వేషించువారును, క్రూరాన్ - క్రూరులను, అశుభాన్ - అశుభులును అగు, తాన్ - ఆ, నరాధమాన్ - నరాధములను, సంసారేషు - సంసారమున, అజస్రం - సదా, ఆసురీషు - రాక్షస సంబంధములైన, యోనిషు ఏవ - గర్భముల యందు, క్షిపామి - ఉంచుచున్నాను.
అట్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములను, క్రూరులైన నరాధములను మాటిమాటికిని ఈ సంసారమునందు అసురీయోనులలోనే నేను పడవేయుచుందును.
ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని !
మామప్రాప్తైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిమ్ !! 20
ఆసురీం - యోనిం - ఆపన్నాః - మూఢాః - జన్మని - జన్మని
మాం - అప్రాప్య - ఏవ - కౌంతేయ - తతః - యాంతి - అధమాం - గతిం
కౌంతేయ - అర్జునా, ఆసురీం - రాక్షససంబంధమైన, యోనిం - జన్మమును, ఆపన్నాః - పొందిన, మూఢాః - మూర్ఖమానవులు, జన్మజన్మని - ప్రతి జన్మమందును, మాం - నన్ను, అప్రాప్య ఏవ - పొందకనే, తతః - అంతకంటెను, అధమాం - అధమమైన, గతిం - గతిని, యాంతి - పొందుచున్నారు.
ఓ అర్జునా ! ఈ రాక్షసప్రకృతిగల మూడులు, నన్ను పొందకయే, ప్రతిజన్మయందును ఆసురీయోనులనే పొందుచు చివరకు అంతకంటెను హీనమైనగతిని పొందుదురు. అనగా ఘోరమైన నరకముల యందు పడెదరు.
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః !
కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్త్ర యం త్యజేత్ !! 21
త్రివిధం - నరకస్య - ఇదం - ద్వారం - నాశనం - ఆత్మనః
కామః - క్రోధః - తథా - లోభః - తస్మాత్ - ఏతత్ - త్రయం - త్యజేత్
ఆత్మనః - తనకు, నాశనం - వినాశనమైనదియు, నరకస్య - నరకమునకు, ద్వారం - ద్వారమైనదియునగు, ఇదం - ఇది, త్రివిధం - మూడు విధములు, కామః - కామము, క్రోధః - కోపము, తథా - అటులనే, లోభః - లోభము, తస్మాత్ - అందువలన, ఏతత్ - ఈ, త్రయం - మూడింటిని, త్యజేత్ - విడువవలయును.
కామక్రోధలోభములు అను ఈ మూడును నరకద్వారములు. అవి ఆత్మ నాశనమునకు కారణములు. మనుజుని అధోగతిపాలుచేయునవి. అనగా మరలా జన్మించేలా చేయుచున్నది కనుక ఈ మూడింటిని త్యజింపవలెను.
ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైః త్రిభిర్నరః !
ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిమ్ !! 22
ఏతైః - విముక్తః - కౌంతేయ - తమోద్వారైః - త్రిభిః - నరః
ఆచరతి - ఆత్మనః - శ్రేయః - తతః - యాతి - పరాం - గతిం
కౌంతేయ - అర్జునా, తమోద్వారైః - అజ్ఞాన ద్వారములైన, ఏతైః - ఈ, త్రిభిః - మూడింటిచేతను, విముక్తః - విడువబడిన, నరః - నరుడు, ఆత్మనః - తనకు, శ్రేయః - శ్రేయమును, ఆచరతి - ఆచరించుకొనుచున్నాడు, తతః - తదనంతరము, పరాం - పరమమైన, గతిం - మోక్షమును, యాతి - పొందుచున్నాడు.
ఓ అర్జునా ! ఈ మూడు నరకద్వారముల నుండి బయటపడినవాడు శుభకర్మలచే ఆచరించును. అందువలన అట్టివాడు పరమగతిని పొందును. అనగా నన్నే పొందును.
యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః !
న శ సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ !! 23
యః - శాస్త్రవిధిం - ఉత్సృజ్య - వర్తతే - కామకారతః
న - సః - సిద్ధిం - అవాప్నోతి - న సుఖం - న - పరాం - గతిం
యః - ఎవడు, శాస్త్రవిధిం - శాస్త్రవిధిని, ఉత్సృజ్య - విడిచి, కామకారతః - కోరిక ననుసరించి, వర్తతే - వర్తించుచున్నాడో, సః - వాడు, సిద్ధిం - సిద్ధిని, న అవాప్నోతి - పొందడు, సుఖం - సుఖమును, న - పొందడు, పరాం - ఉత్తమమైన, గతిం - మోక్షమును, న - పొందడు.
శాస్త్రవిధిని త్యజించి, యథేచ్ఛగా విశృంఖలముగా ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు. వానికి ఇహపర లోకసుఖములు లభింపవు. పరమగతియు ప్రాప్తించదు.
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ !
జ్ఞాత్వాశాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి !! 24
తస్మాత్ - శాస్త్రం - ప్రమాణం - తే - కార్యకార్యవ్యవస్థితౌ
జ్ఞాత్వా - శాస్త్రవిధానోక్తం - కర్మ - కర్తుం - ఇహ - అర్హసి
తస్మాత్ - అందువలన, తే - నీకు, కార్యాకార్యవ్యవస్థితౌ - కార్యాకార్య నిర్ణయమునందు, శాస్త్రం - శాస్తము, ప్రమాణం - ప్రమాణము, శాస్త్రవిధానోక్తం - శాస్త్రవిధానము నిర్ణయించిన, కర్మ - కర్మమును, జ్ఞాత్వా - తెలిసికొని, ఇహ - ఇచ్చట, కర్తుం - చేయుటకు, అర్హసి - తగియున్నావు.
కర్తవ్యాకర్తములను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము. కనుక శాస్త్రోక్తకర్మలను గూర్చి బాగుగా తెలిసికొని, అట్టి కర్మలను ఆచరింపుము.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జునసంవాదే దైవాసురసంపద్విభాగయోగోనామ
షోడశోధ్యాయః !!