Read more!

భగవద్గీత పార్ట్ - 23

 

అథ పంచదశోధ్యాయః - పురుషోత్తమయోగః

శ్రీభగవాన్ ఉవాచ:-
ఊర్ధ్వమూలమధశ్శాఖమ్ అశ్వత్థం ప్రాహురవ్యయమ్ !
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదనిత్ !! 1

ఊర్ధ్వమూలం - అధః శాఖం - అశ్వత్థం - ప్రాహుః - అవ్యయం
ఛందాంసి - యస్య - పర్ణాని - యః - తం - వేద - సః - వేదవిత్


ఊర్ధ్వమూలం - మూలము పైన గలదియు, అధః శాఖం - శాఖలు క్రింద గలదియు, అశ్వత్థం - అశ్వత్థమును, అవ్యయం - నశించని దానినిగ, ప్రాహుః - చెప్పిరి, యస్య - దేనికి, ఛందాంసి - వేదములు, పర్ణాని - ఆకులో, తం - దానిని, యః - ఎవడు, వేదగ్రహించుచున్నాడో, సః - వాడు, వేదవిత్ - వేదార్థమును తెలిసినవాడు.

శ్రీకృష్ణభగవానుడు పలికెను - ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే ముఖ్యశాఖగా, వేదములే ఆకులుగా గల ఈ సంసారరూప - అశ్వత్థవృక్షము శాశ్వతమైనది. ఈ సంసారవృక్షతత్త్వమును మూలసహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను తెలిసినవాడు.

అధశ్చోర్థ్వం ప్రసృతాస్తస్య శాఖా
గుణ ప్రవృద్ధా విషయప్రవాలాః !
అధశ్చమూలాన్యనుసంతతాని
కర్మానుబంధీని మనుష్యలోకే !! 2

అధః - చ - ఊర్ధ్వం - ప్రసృతాః - తస్య - శాఖాః - గుణప్రవృద్ధాః - విషయ ప్రవాలాః
అధః - చ - మూలాని - అనుసంతతాని - కర్మానుబంధీని - మనుష్యలోకే


తస్య - దానియొక్క, శాఖాః - కొమ్మలు, గుణప్రవృద్ధాః - గుణములచే వృద్ధినొందియున్నవి, విషయ ప్రవాలాః - విషయములనెడి చిగుళ్ళు గలవి, అధః చ - క్రిందికిని, ఊర్ధ్వం - మీదికిని, ప్రసృతాః - వ్యాపించియున్నవి, మూలాని - వెళ్ళు, కర్మానుబంధీని - కర్మాను బంధము గలవియై, మనుష్యలోకే - మనుష్యలోకమునందు, అధః చ - క్రిందను, అనుసంతతాని - విస్తరించియున్నవి.

ఈ సంసారవృక్షమును త్రిగుణములనెడి జలములు తడుపుచుండును. ఆ జలములచే వృద్ధిపొందు శాఖలే దేవమనుష్యతిర్యోగ్యనులలో జన్మించు ప్రాణులు, చిగుళ్లే విషయభోగములు. ఈ శాఖముల, చిగుళ్ళు  సర్వత్ర వ్యాపించి యున్నవి.మనుజులను కర్మానుసారముగా బంధించు అహంకార మమకార వాసనలనెడి వేర్లు, ఊడలు అన్నిలోకములలోను క్రింద, పైన వ్యాపించి ఉన్నవి.

న రూపమస్యేహ తథోపలభ్యతే
నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా !
అశ్వత్థమేనం సువిరూఢమూలమ్
అసంగశస్త్రేణ ధృఢేన ఛిత్త్వా !! 3

న - రూపం - అస్య - ఇహ - తథా - ఉపలభ్యతే - న - అంతః - న - చ - ఆదిః - న - చ - సంప్రతిష్ఠా
అశ్వత్థం - ఏనం - సువిరూఢమూలం - అసంగశస్త్రేణ - ధృఢేన - ఛిత్వా


ఇహ - ఈ లోకమునందు, అస్య - ఈ అశ్వత్థ వృక్షమునకు, రూపం - స్వరూపము, న ఉపలభ్యతే - పొందశక్యము గాదు, తథా - అలాగుననే, ఆదిః న - ఆది తెలియకున్నది, అంతః చ న - అంతము తెలియకున్నది, సంప్రతిష్ఠా న చ - స్థితియును తెలియకున్నది, సువిరూఢమూలం - పాతుకొన్న వేళ్ళుగల, ఏనం - ఈ, అశ్వత్థం - అశ్వత్థమును, దృఢేన - ధృడమైన, అసంగ శాస్త్రేణ - అసంగ శస్త్రముచే, ఛిత్వా - చేధించి,

ఈ సంసార వృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యము గాదు. ఇది ఆదియు, అంతము, సరియైన స్థితియు లేనిది. కనుక అహంకారమమ కారవాసనారూపములైన దృఢమైన వేర్లు, ఊడలు గల ఈ సంసారరూప - అశ్వత్థవృక్షమును సునిశితమైన విరాగ్యమనెడి శస్త్రముతో ఖండించి....  

తతః పదం తత్పరిమార్గితవ్యం
యస్మిన్ గతా న నివర్తంతి భూయః !
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ !! 4

తతః - పదం - తత్ - పరిమార్గితవ్యం - యస్మిన్ - గతాః - న - నివర్తంతి - భూయః
తం - ఏవ - చ - ఆద్యం - పురుషం - ప్రపద్యే - యతః - ప్రవృత్తిః - ప్రసృతా - పురాణీ


తతః - తరువాత, యస్మిన్ - దేనియందు, గతాః - మరలినవారు, భూయః - మరల, న నివర్తంతి - మరలరో, యతః - ఎవనివలన, పురాణీ - అనాదియైన, ప్రవృత్తిః - ప్రవృత్తి, ప్రసృతా - వ్యాప్తమైనదో, ఆద్యం - ఆద్యుడైన, తం - ఆ, పురుషం ఏవ చ - పురుషుడగు నారాయణునే, ప్రపద్యే - శరణు పొందుచున్నాను, తత్ - ఆ, పదం -  స్థానము, పరిమార్గితవ్యం - అన్వేషించదగినది.

అనంతరము ఆ పరమపదరూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగ అన్వేషింపవలెను. ఈ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు మరలరారు. అట్టి పరమేశ్వరుని నుండియే ఈ సనాతనమైన సంసారవృక్షపరంపర విస్తరించియున్నది. అట్టి పరమాత్ముని శరణుపొంది, దృఢనిశ్చయముతో ఆ పరమేశ్వరుని సదా మనన, నిదిధ్యాసాదులు చేయవలెను.

నిర్మానమోహా జితసంగదోషా
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః !
ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః
గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్ !! 5

నిర్మానమోహాః - జితసంగదోషాః - అధ్యాత్మనిత్యాః - వినివృత్త కామాః
ద్వంద్వైః - విముక్తాః - సుఖదుఃఖ సంజ్ఞైః - గచ్ఛంతి - అమూఢాః - పదం - అవ్యయం - తత్


నిర్మానమోహాః - అభిమానము మోహము లేనివారును, జితసంగదోషాః - సంగత్వ దోషమును జయించినవారు, అధ్యాత్మ నిత్యాః - ఆత్మజ్ఞానము కలవారును, వినివృత్త కామాః - కామములను త్యజించినవారు,సుఖదుఃఖసంజ్ఞైః - సుఖదుఃఖరూపములైన, ద్వంద్వైః - ద్వంద్వములచేత, విముక్తాః - విముక్తులగు, అమూఢాః జ్ఞానులు, అవ్యయం - నశించని, తత్ - ఆ, పదం - పదమును, గచ్చంతి - పొందుచున్నారు.

దురాభిమానమును, మోహమును వదిలిపెట్టినవారు, ఆసక్తియను దోషమును జయించినవారును, ప్రాపంచికవాంఛలవదిలినవారు పరమాత్మ స్వరూపము నందు నిత్యము చలించువారు, సుఖదుఃఖాదిద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు.

న తద్భావసయతే సూర్యో న శశాంకో న పావకః !
యద్గత్వాన నివర్తంతే తద్దామ పరమం మమ !! 6

న - తత్ - భాసయతే - సూర్యః - న - శశాంకః - న - పావకః
యత్ - గత్వా - న - నివర్తంతే - తత్ - ధామ - పరమం - మమ 


యత్ - దేనిని, గత్వా - పొంది, న నివర్తంతే - తిరిగి రారో, తత్ - అది, సూర్యః - సూర్యుడు, న భాసయతే - ప్రకాశింప జేయజాలడు, పావకః - అగ్ని, న భాసయతే - ప్రకాశింపజేయజాలడు, తత్ - అది, మమ - నాయొక్క, పరమం - ఉత్తమమైన, ధామ - ధామము.

స్వయంప్రకాశస్వరూపమైన ఆ పరమాత్మను సూర్యుడు గాని, చంద్రుడుగాని, అగ్నిగాని ప్రకాశింపజేయజాలరు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మరల ఈ జగత్తున ప్రవేశింపరు.

మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః !
మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి !! 7

మమ - ఏవ - అంశః - జీవలోకే - జీవభూతః - సనాతనః
మనః షష్ఠాని - ఇంద్రియాణి - ప్రకృతిస్థాని - కర్షతి


సనాతనః - శాశ్వతమైన, మమ ఏవ - కేవలం నా యొక్క, అంశః - అంశము, జీవభూతః - జీవుడై, జీవలోకే - జీవలోకము నందు, ప్రకృతి స్థాని - ప్రకృతియందున్న, మనః షష్ఠాని - మనస్సుతో కూడి ఆరుయైన, ఇంద్రియాణి - ఇంద్రియములను, కర్షతి - ఆకర్షించుచున్నది.

ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రకృతియందు స్థితములైన మనస్సు ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తనవైపు ఆకర్షించును.

శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః !
గృహీత్వైతానిసంయాతివాయుర్గంధానివాశయాత్ !! 8

శరీరం - యత్ - అవాప్నోతి - యత్ - చ - అపి - ఉత్క్రామతి - ఈశ్వరః
గృహీత్వా - ఏతాని - సంయాతి - వాయుః - గంధాన్ - ఇవ - ఆశయాత్
 

ఈశ్వరః - ఈశ్వరుడు, యత్ - ఎప్పుడు, శరీరం - శరీరమును, అవాప్నోతి - పొండుచున్నాడో, యత్ చ అపి - ఎప్పుడు, ఉత్క్రామతి - విడుచుచున్నాడో, వాయుః - గాలి, ఆశయాత్ - సౌరభస్థానము నుండి, గంధాన్ ఇవ - గంధమువలె, ఏతాని - ఈ ఇంద్రియములను, గృహీత్వా - గ్రహించి, సంయాతి - వెలువడు చున్నాడు.

వాయువు వాసనలను ఒకచోటినుండి మఱియొకచోటికి తీసికొని పోయినట్లుగా దేహాడులకు స్వామియైన జీవాత్మ ఒక శరీరమును త్యజించునపుడు, మనస్సును ఇంద్రియములను గ్రహించి, వాటితో గూడ మరొక శరీరమును పొందును.

శ్రోత్ర్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ !
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే !! 9

శ్రోత్రం - చక్షుః - స్పర్శనం - చ - రసనం - ఘ్రాణం - ఏవ - చ
అధిష్ఠాయ - మనః - చ - అయం - విషయాన్ - ఉపసేవతే


అయం - ఈ, శ్రోత్రం - చెవిని, చక్షుః - కంటిని, స్పర్శనం చ - చర్మమును, రసనం - నాలుకను, ఘ్రాణం ఏవ చ - ముక్కును, మనః చ - మనస్సును, అధిష్ఠాయ - అధిష్టించి, విషయాన్ - విషయములను, ఉపసేవతే - అనుభవించుచున్నాడు.

ఈ జీవాత్మ పంచేంద్రియములను, మనస్సును ఆశ్రయించి, శబ్దాది విషయములను అనుభవించును.

ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితమ్ !
విమూఢాః నానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః !! 10

ఉత్క్రామంతం - స్థితం - వా -  అపి - భుంజానం - వా - గుణాన్వితం
విమూఢాః - న - అనుపశ్యంతి - పశ్యంతి - జ్ఞానచక్షుషః


ఉత్క్రామంతం - వెడలునట్టి వానినిగాని, స్థితం వా అపి - ఉన్నవానిని గాన, భుంజానం వా - అనుభవించుచున్న వానినిగాని, గుణాన్వితం - గుణములతో గూడిన వానిని, విమూఢాః అజ్ఞానులు, న అనుపశ్యంతి - చూడజాలరు, జ్ఞానచక్షుషః - జ్ఞానదృష్టిగలవారు, పశ్యంతి - చూచుకున్నారు.

జీవాత్మ శరీరమును త్యజించునప్పుడును, శరీరమునందు స్థితుడై యున్నప్పుడును, విషయభోగములను అనుభవించు చున్నప్పుడును, త్రిగుణములతో కూడియున్నప్పుడును అజ్ఞానులు తెలిసికోనలేరు. కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమ జ్ఞాననేత్రములవలన స్వస్వరూపమును తెలిసికొనుచున్నారు.

యతంతో యోగినశ్చైవం పశ్యంత్యాత్మన్యవస్థితమ్ !
యతంతోప్యకృతత్మానో నైనం పశ్యంత్యచేతసః !! 11

యతంతః - యోగినః - చ - ఏనం - పశ్యంతి - ఆత్మని - అవస్థితం
యతంతః - అపి - అకృతాత్మానః - న - ఏనం - పశ్యంతి - అచేతసః


యోగినః - యోగులు, యతంతః - సదా అభ్యాసపరులై, ఆత్మని - ఆత్మయందు, అవస్థితం - ఉన్నటువంటి, ఏనం - ఈ పరమాత్మను, పశ్యంతి - చూచుచున్నారు, అకృతాత్మనః - ఆత్మజ్ఞానము లేని, అచేతసః - అవివేకులు, యతంతః అపి - అభ్యాస పరులైనను, ఏనం - ఈ పరమాత్మను, నచ పశ్యంతి - చూడజాలరు.

అంతః కరణశుద్ధిగలయోగులు తమహృదయముల యందున్న ఈ ఆత్మతత్త్వమును ప్రయత్నించి తెలిసికొనగలరు. కాని అంతఃకరణశుద్ధిలేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించియు, ఈ ఆత్మను తెలిసికొనజాలరు.

యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలమ్ !
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ !! 12

యత్ - ఆదిత్యగతం - తేజః - జగత్ - భాసయతే - అఖిలం
యత్ - చంద్రమసి - యత్ - చ - అగ్నౌ - తత్ - తేజః - విద్ధి - మామకం


యత్ - ఏ, తేజః - తేజస్సు, ఆదిత్యగతం - సూర్యునియందు ఉన్నదియై, అఖిలం - సమస్తమైన, జగత్ - జగత్తును, భాసయతే - ప్రకాశింపజేయుచున్నదో, తత్ - ఆ, తేజః - తేజస్సును, మామకం - నా సంబంధమైన దానినిగ, విద్ధి - తెలిసికొనుము.

సర్వజగత్తును ప్రకాశింపజేయు సూర్యునితేజస్సును, అటులనే చంద్రునితేజస్సును, అగ్నితేజస్సును నాతేజస్సేయని తెలిసికొనుము.

గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా !
పుష్ణామి చౌషదీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః !! 13

గాం - ఆవిశ్య - చ - భూతాని - ధారయామి - అహం - ఓజసా
పుష్ణామి - చ - ఓషధీః - సర్వాః - సోమః - భూత్వా - రసాత్మకః


అహం - నేను, గాం - భూమిని, ఆవిశ్య - భూతాని - భూతములను, ఓజసా - శక్తిచేతను, ధారయామి చ - ధరించుచున్నాను, రసాత్మకః - రస స్వరూపుడగు, సోమః - చంద్రుడను, భూత్వా - అయి, సర్వాః -  సమస్తమైన, ఓషధీః - ఓషదులను, పుష్ణామి - పోషించుచున్నాను.

భూమియందు ప్రవేశించి, నేను నా శక్తిద్వారా సకల భూతములను ధరించి, పోషించుచున్నాను. రసస్వరూపుడనై - అనగా అమృతమయుడైన చంద్రుడనై ఓషదులకు అనగా వనస్పతులన్నింటికిని, పుష్టిని చేకూర్చుచున్నాను.

అహం వైశ్వానరో భూత్వాప్రాణినాం దేహమాశ్రితః !
ప్రాణాపానస మాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ !! 14

అహం - వైశ్వానరః - భూత్వా - ప్రాణినాం - దేహం - ఆశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః - పచామి - అన్నం - చతుర్విధం


అహం - నేను, వైశ్వానరః జఠరాగ్ని, భూత్వా - అయి, ప్రాణినాం - ప్రాణుల యొక్క, అహం - నేను, విశ్వానరః - జఠరాగ్ని, భూత్వా - అయి, ప్రాణినాం - ప్రాణుల యొక్క, దేహం - దేహమును, ఆశ్రితః - ఆశ్రయించిన వాడనగుచు, ప్రాణాపాన సమాయుక్తః - ప్రానాపానాది వాయువులతో కూడినవాడనై, చతుర్విధం - నాలుగు విధములైన, అన్నం - అన్నమును, పచామి - పచనము చేయుచున్నాను.

నేనే ప్రాణాపానసంయుక్తమైన వైశ్వానరుడు అనే అగ్ని రూపములో సర్వప్రాణుల శరీరములయందుండి నాలుగు విధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును.

సర్వస్య చాహం హృది సన్నివిష్టో
మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ !
వైదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాంతకృద్వేదవిదేవ చాహమ్ !! 15

సర్వస్య - చ - అహం - సంనివిష్టః - మత్తః - స్మృతిః - జ్ఞానం - అపోహనం - చ
వేదైః - చ - సర్వైః - అహం - ఏవ - వేద్యః - వేద్యాంతకృత్ - వేదవిత్ - ఏవ - చ - అహం


అహం - నేను, సర్వస్య చ - సమస్త ప్రాణులయొక్క, హృది - హృదయమునందు, సంనివిష్టః - ఉన్నవాడును, మత్తః - నావలన, స్మృతిః - జ్ఞాపకశక్తి, జ్ఞానం - జ్ఞానము, అపోహనం చ - మరపును, అహం ఏవ - నేనే, సర్వైః - సమస్తములైన, వేదైః - వేదములచేత, వేద్యః చ - తెలియదగినవాడను, అహం ఏవ - నేనే, వేదాంతకృత్ - వేదాంతకర్తను, వేదవిత్ చ - వేదవిదుడను.

అన్ని ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే. నానుండియే స్మృతి, జ్ఞానము, మరపు కలుగుచున్నవి. వేదముల ద్వారా తెలిసికొనదగిన వాడను నేనే. వేదాంతకర్తను, వేదజ్ఞుడను గూడ నేనే.

ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ !
క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే !! 16

ద్వౌ - ఇమౌ - పురుషౌ - లోకే - క్షరః - చ - అక్షరః - ఏవ - చ
క్షరః - సర్వాణి - భూతాని - కూటస్థః - అక్షరః - ఉచ్యతే


లోకే - లోకమునందు, క్షరః చ - క్షరుడును, అక్షరః ఏవ చ - అక్షరుడును, ఇమౌ - ఈ, ద్వౌ -ఇరువురు, పురుషౌ - పురుషులు, సర్వాణి - సమస్తమైన, భూతాని - భూతములు, క్షరః - క్షరమనియు, అక్షరః - అక్షరుడగు పురుషుడు, కూటస్థః - జీవుడనియు, ఉచ్యతే - చెప్పబడుచున్నాడు.

ఈ లోకమునందు క్షరుడు (నశ్వరుడు ), అక్షరుడు (వినాశనము లేనివాడు) అని పురుషులు రెండు విధముగా గలరు. సకల ప్రాణులశరీరములు నశ్వరములు. జీవాత్మ నాశరహితుడు.

ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః !
యో లోకత్రయమావిశ్వ బిభరత్యవ్యయ ఈశ్వరః !! 17

ఉత్తమః - పురుషః - తు - అన్యః - పరమాత్మా - ఇతి - ఉదాహృతః
యః - లోకత్రయం - ఆవిశ్య - బిభర్తి - అవ్యయః - ఈశ్వరః


యః - ఎవడు, అవ్యయః - అవినాశియు, ఈశ్వరః - ఈశ్వరుడు, లోకత్రయం - మూడులోకములను, ఆవిశ్య - ప్రవేశించి, బిభర్తి - భరించుచున్నాడో, అన్యః తు - ఇతరుడైన, పురుషః - పురుషుడు, ఉత్తమః - ఉత్తముడు, పరమాత్మా ఇతి - పరమాత్మయని, ఉదాహృతః - చెప్పబడుచున్నాడు.

పై ఇద్దరికంటెను ఉత్తముడైన పురుషుడు వేరైనవాడొకడు కలడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ.అతడు మూడులోకములయందును ప్రవేశించి, అందరిని భరించి పోషించుచున్నాడు.

యస్మాత్ క్షరమతీతో హమ్ అక్షరాదపి చోత్తమః !
అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః !! 18

యస్మాత్ - క్షరం - అతీతః - అహం - అక్షరాత్ - అపి - చ - ఉత్తమః
అతః - అస్మి - లోకే - వేదే - చ - ప్రథితః - పురుషోత్తమః


అహం - నేనే, యస్మాత్ - ఎందువలన, క్షరం - క్షరమునకు, అతీతః - అతీతుడనో, అక్షరాత్ అపి చ - అక్షరము కన్నను, ఉత్తమః - శ్రేష్ఠుడనో, అతః - అందువలన, లోకే - లోకమునందును, వేదే చ - వేదమునందును, పురుషోత్తమః - పురుషోత్తముడని, ప్రథితః - ప్రసిద్ధుడను, అస్మి - అయితిని.

నశ్వరమగు క్షేత్రము కంటెను నేను సర్వదా అతీతుడను. నాశరహితమైన జీవాత్మ కంటెను ఉత్తముడను. కనుక ఈ జగత్తునందును పురుషోత్తముడనని ప్రసిద్ధికెక్కెతిని.

యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్ !
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత !! 19

యః - మాం - ఏవం - అసమ్మూఢః - జానాతి - పురుషోత్తమం
స - సర్వవిత్ - భజతి - మాం - సర్వభావేన - భారత 


భారత - అర్జునా, యః - ఎవడు, అసమ్మూఢః - జ్ఞానియై, మాం - నన్ను, ఏవం - ఇట్లు, పురుషోత్తమం - పురుషోత్తమునిగ, జానాతి - తెలిసికొనుచున్నాడో, సః - వాడు, సర్వవిత్ - సర్వము తెలిసినవాడై, సర్వభావేన - సమస్త భావములచేత, మాం - నన్ను, భజతి - భజించుచున్నాడు.

ఓ అర్జునా ! జ్ఞానియైనవాడు ఈ విధముగా నన్ను తత్త్వతః పురుషోత్తమునిగా ఎరుంగును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును.

ఇతి గుహ్యతమం శాస్త్రమ్ ఇదముక్తం మాయానఘ !
ఏతద్ బుద్ధ్యా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత !! 20

ఇతి - గుహ్యతమం - శాస్త్రం - ఇదం - ఉక్తం - మయా - అనఘ
ఏతత్ - బుద్ధ్వా - బుద్ధిమాన్ - స్యాత్ - కృతకృత్యః - చ - భారత


అనఘ - పపరహితుడా, భారత - అర్జునా, మయా - నాచేత, ఇదం - ఈ, గుహ్యతమం - అతిరహస్యమైనటువంటి, శాస్త్రం - యోగశాస్త్రము, ఇతి - ఇటుల, ఉక్తం - చెప్పబడినది, ఏతత్ - దేనిని, బుద్ధ్వా - తెలిసికొని, బుద్ధిమాన్ - బుద్ధిమంతుడును, కృతకృత్యఃచ - కృతకృత్యుడును, స్యాత్ - అగును.

ఓ పుణ్యపురుషా ! ఓ అర్జునా ! అత్యంతము రహస్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. దీని తత్త్వమును తెలిసికొనిన మనుష్యుడు జ్ఞానియై కృతార్థుడు కాగలడు.

ఓం తత్సదితిశ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగాశాస్త్రే
శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగోనామ
పంచదశోధ్యాయః !!