భగవద్గీత పార్ట్ - 22

 

అథ చతుర్ధశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః 

శ్రీభగవాన్ ఉవాచ :-
పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ !
యద్ జ్ఞాత్వా మునయస్సర్వే పరాం సిద్దిమితో గతాః !! 1

 
పరం - భూయః - ప్రవక్ష్యామి - జ్ఞానానాం - జ్ఞానం - ఉత్తమం

  యత్ - జ్ఞాత్వా - మునయః - సర్వే - పరాం - సిద్ధిం - ఇతః - గతాః

 యత్ - జ్ఞాత్వా - గ్రహించి, సర్వే - సమస్తమైన, మునయః - మునులు, ఇతః - ఈ సంసారమున, పరాం - ఉత్తమమైన, సిద్ధిం - సిద్ధిని, గతాః - పొందిరో, పరం - ఉత్తమమైన, జ్ఞానానాం - జ్ఞానములలో, ఉత్తమం - ఉత్తమమైనది యగు, జ్ఞానం - విద్యను, భూయః - మరల, ప్రవక్ష్యామి - చెప్పుచున్నాను.

శ్రీ భగవానుడు పలికెను - జ్ఞానములలో అత్యుత్తమమైన పరమజ్ఞానమును నీకు మరల తెల్పుచున్నాను. ఆ పరమజ్ఞానమును తెలిసికొనిన మునులు సంసార బంధముల నుండి విముక్తులై పరమసిద్ధిని పొందిరి.

ఇదం జ్ఞానము పాశ్రిత్యమమ సాధర్మ్యమాగతాః !
సర్గేపి నోపజాయంతే ప్రలయే న వ్యథంతి చ !! 2

ఇదం - జ్ఞానం - ఉపాశ్రిత్య - మమ - సాధర్మ్యం - ఆగతాః
సర్గే - అపి - న - ఉపజాయంతే - ప్రలయే - న - వ్యథంతి - చ 


ఇదం - ఈ, జ్ఞానం - జ్ఞానమును, ఉపాశ్రిత్య - ఆశ్రయించి, మమ - నాయొక్క, సాధర్మ్యం - స్వరూపమును, ఆగతాః - పొందినవారు, సర్గే అపి - శృష్టియందు, న ఉపజాయంతే - పుట్టరు, ప్రలయే - ప్రళయ కాలమునందు, న వ్యథంతి చ - దుఃఖమును పొందరు.

ఈ జ్ఞానమును ఆశ్రయించినవారు నా స్వరూపమునే పొందుదురు. అట్టి పురుషులు సృష్టి కాలమందు మరల జన్మింపరు, ప్రళయకాలమున నశింపరు.

మమ యోనిర్మహద్ర్బహ్మ తస్మిన్ గర్భం దధామ్యహమ్ !
సంభవః సర్వభూతానాం తతో భవతి భారత !!
3

మమ - యోనిః - మహత్ - బ్రహ్మ - తస్మిన్ - గర్భం - దధామి - అహం
సంభవః - సర్వభూతానాం - తతః - భవతి - భారత


భారత - అర్జునా, మహత్ బ్రహ్మ - మహత్తు లేక మాయ, మమ - నాకు, యోనిః - గర్భాస్థానము, తస్మిన్ - దానియందు, అహం - నేను, గర్భం - గర్భమును, దధామి - ఉంచుచున్నాను, తతః - ఆకారణముచే, సర్వభూతానాం - సర్వభూతముల యొక్క, సంభవః - ఉత్పత్తి, భవతి - అగుచున్నది.

ఓ అర్జునా ! నా మహద్బ్రహ్మరూపమైన మూలప్రకృతి సర్వప్రాణులకు జన్మస్థానము. దానియందు చేతనసముదాయ రూపమైన బీజమును ఉంచెదను. దాని వలననే సర్వభూతముల ఉత్పత్తి కలుగుచున్నది.

సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః !
తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా !! 4

సర్వయోనిషు - కౌంతేయ - మూర్తయః - సంభవంతి - యాః
తాసాం - బ్రహ్మ - మహత్ - యోనిః - అహం - బీజప్రదః - పితా


కౌంతేయ - అర్జునా, సర్వయోనిషు - సమస్త యోనులందును, యాః - ఏ, మూర్తయః - మూర్తులు, సంభవంతి - పుట్టుచున్నవో, తాసాం - వానికి, మహత్ బ్రహ్మ - ప్రకృతి, యోనిః - కారణము, అహం - నేను, బీజప్రదః - బీజప్రదాతను అగు, పితా - తండ్రిని.

ఓ అర్జునా ! నానా యోనులయందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపనచేయు నేను వాటికి తండ్రిని. అనగా సర్వప్రాణులకును ప్రకృతియే తల్లి. నేను తండ్రిని.

సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః !
నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ !! 5

సత్త్వం - రజః - తమః - ఇతి - గుణాః - ప్రకృతి సంభవాః
నిబధ్నంతి - మహాబాహో - దేహే - దేహినం - అవ్యయం


మహాబాహో - అర్జునా, సత్త్వం - సత్త్వము, రజః - రజస్సు, తమః - తమస్సు, ఇతి - అనెడి, ప్రకృతిసంభవాః - ప్రకృతివలన పుట్టిన, గుణాః - గుణములు, అవ్యయం - నాశరహితుడైన, దేహినం - జీవుని, దేహే - దేహమునందు, నిబధ్నంతి - బంధించుచున్నవి.

ఓ అర్జునా ! ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్త్వరజస్తమోగుణములు నాశములేని జీవాత్మను శరీరమున బంధించుచున్నది.

తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశమనామయమ్ !
సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానషు !! 6    

తత్ర - సత్త్వం - నిర్మలత్వాత్ - ప్రకాశకం - అనామయం
సుఖసంగేవ - బధ్నాతి - జ్ఞానసంగేన - చ - అనషు


అనఘ - అర్జునా, తత్ర - ఆ గుణములయందు, ప్రకాశకం - ప్రకాశమును కలిగించు నదియు, అనామయం - నిర్వికారమైనదియునైన, సత్త్వం - సత్త్వగుణము, నిర్మలత్వాత్ - నిర్మలమగుటవలన, సుఖసంగేన - సుఖాభిలాషచేతను, జ్ఞానసంగేన చ - జ్ఞానాభిలాషచేతను, బధ్నాతి - బంధించుచున్నది.

ఓ పాపరహితుడా ! ఈ మూడింటిలో సత్త్వగుణము నిర్మలమైనది. కనుక ప్రకాశకమైనది. వికారరహితమైనది. కాని అది సుఖనందలి ఆసక్తి చేత, జ్ఞానాభిమానము వలన మనుజుని బంధించుచున్నది.

రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్ !
తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్ !! 7

రజః - రాగాత్మకం - విద్ధి - తృష్ణా సంగ సముద్భవం
తత్ - నిబధ్నాతి - కౌంతేయ - కర్మసంగేన - దేహినం


కౌంతేయ - అర్జునా, రజః - రజోగుణము, రాగాత్మకం - రాగముతో గూడినదిగను, తృష్ణాసంగ సముద్భవం - విషయాసక్తి వలన కలిగినవిగను, విద్ధి - తెలిసికొనుము, తత్ - అది, దేహినం - ఆత్మను, కర్మసంగేన - కర్మాసక్తిచేత, నిబధ్నాతి - బంధించుచున్నది.

అర్జునా ! రజోగుణము రాగాత్మకము. అది కామము, ఆసక్తుల నుండి ఉత్పన్నమగునని యెరుంగము. అది జీవాత్మను కర్మలయొక్కయు, కర్మఫలముల యొక్కయు ఆసక్తిని కల్పించి జీవుని బంధించును.

తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ !
ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి భారత !! 8

తమః - తు - అజ్ఞానజం - విద్ధి - మోహనం - సర్వదేహినాం
ప్రమాదాలస్య నిద్రాభిః - తత్ - నిబధ్నాతి - భారత


భారత - అర్జునా, అజ్ఞానజం - అజ్ఞానము వలన కలిగిన, తమః తమోగుణము, సర్వదేహినాం - సర్వ ప్రాణులకు, మోహనం - మోహమును కలుగజేయునదిగా, విద్ధి - గ్రహించుము. తత్ - అది, ప్రమాదాలస్య - నిద్రాభిః - మరపుచేతను అలసత్వము చేతను, దేహినం - దేహించి, నిబధ్నాతి - బంధించుచున్నది.

అర్జునా ! తమోగుణము సకలదేహాభిమానులను మోహితులనుగా చేయును. అజ్ఞానము వలన జనించును. అది జీవుని బంధించి వేయుచున్నది.

సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత !
జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత !! 9

సత్త్వం - సుఖే - సంజయతి - రజః - కర్మణి - భారత
జ్ఞానం - ఆవృత్య - తు - తమః - ప్రమాదే - సంజయంతి - ఉత


భారత - అర్జునా, సత్త్వం - సత్త్వగుణము, సుఖే - సుఖమునందు, సంజయతి - చేర్చుచున్నది, రజః - రజోగుణము, కర్మణి - కర్మల యందు, సంజయతి - చేర్చుచున్నది, తమః తు - తమోగుణము, జ్ఞానం - జ్ఞానమును, ఆవృత్య - ఆవరించి, ప్రమాదే - ప్రమాదము నందు, సంజయతి ఉత - చేర్చుచున్నది గదా.

ఓ అర్జునా ! సత్త్వగుణము జీవుని సుఖములలో నిమగ్నము చేయును. రజోగుణము కర్మలయందు నిమగ్నునిగా చేయును. తమోగుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదాదులలో ముంచును.

రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత !
రజః సత్త్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా !! 10

రజః - తమః - చ - అభిభూయ - సత్త్వం - భవతి - భారత
రజః - సత్త్వం - తమః - చ - ఏవ - తమః - సత్త్వం - రజః - తథా


భారతా - అర్జునా, సత్త్వం - సత్త్వగుణము, రజః - రజోగుణము, తమః చ - తమోగుణము, అభిభూయ - తిరస్కరించి, భవతి - అగుచున్నది, రజః - రజోగుణము, సత్త్వం - సత్త్వగుణమును, తమః చ ఏవ - తమోగుణమును, తథా - అటులనే, తమః - తమోగుణము, సత్త్వం - సత్త్వగుణమును, రజః - రజోగుణమును.

ఓ అర్జునా ! రజస్తమోగుణములననచి సత్త్వగుణము వృద్ధిచెందును. సత్త్వతమోగుణములనణచి రజోగుణము వృద్ధి చెందును. అట్లే సత్త్వరజో గుణములనణచి తమోగుణము వృద్ధియగుచుండును.

సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే !
జ్ఞానం యదా తదా విద్యాన్ వివృద్ధం సత్త్వమిత్యుత !! 11

సర్వద్వారేషు - దేహే - అస్మిన్ - ప్రకాశః - ఉపజాయతే
జ్ఞానం - యదా - తదా - విద్యాన్ - వివృద్ధం - సత్త్వం - ఇతి - ఉత


అస్మిన్ - ఈ, దేహే - దేహమునందు, సర్వద్వారేషు - సర్వద్వారముల యందును, ప్రకాశః - ప్రకాశమగు, జ్ఞానం - జ్ఞానము, యదా - ఎప్పుడు, ఉపజాయతే - పుట్టుచున్నదో, తదా - అప్పుడు, సత్త్వం - సత్త్వగుణము, వివృద్ధం ఇతి -  వృద్ధిని జెందినదని, విద్యాత్ ఉత - తెలిసికొనవలెనుగదా.

శరీరేంద్రియములయందును, అంతఃకరణమునందును చైతన్యము, వివేకశక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్త్వగుణము వృద్ధి చెందినదని గ్రహింపుము.

లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా !
రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ !! 12

లోభః - ప్రవృత్తిః - ఆరంభః - కర్మణాం - ఆశమః - స్పృహా
రజసి - ఏతాని - జాయంతే - వివృద్దే - భరతర్షభ 


భరతర్షభ - అర్జునా, రజసి - రజోగుణము, వివృద్దే - వృద్ధిని పొందునప్పుడు, లోభః - లోభము, ప్రవృత్తిః - ప్రవృత్తియు, కర్మణాం - కర్మలయొక్క, ఆరంభః - ఆరంభము, ఆశమః - అశాంతి, స్పృహా - ఆశ, ఏతాని - ఇవి, జాయంతే - కలుగుచున్నవి.

ఓ అర్జునా ! రజోగుణము వృద్ధియైనప్పుడు లోభము, ప్రవృత్తి, (ప్రాపంచిక విషయములయందు ఆసక్తి) స్వార్థబుద్ధితో సకామభావముతో కర్మాచరణము, అశాంతి, విషయభోగములయందు లాలసమొదలగు గుణములు కలుగును.

అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదోమోహ ఏవ చ !
తమస్యేతాని జాయంతే వివృద్దే కురునందన !! 13

అప్రకాశః - అప్రవృత్తిః - చ - ప్రమాదః - మోహః - ఏవ - చ
తమసి - ఏతాని - జాయంతే - వివృద్దే - కురునందన


కురునందనా - అర్జునా, తమసి - తమోగుణము, వివృద్దే - వృద్ధినొందినప్పుడు, అప్రకాశః - అజ్ఞానము, అప్రవృత్తిః చ - నిర్వ్యాపారం, ప్రమాదః - అజాగ్రత్త, మోహః ఏవ చ - మూఢభావము, ఏతాని - ఇవి, జాయంతే - కలుగుచున్నవి.

ఓ అర్జునా ! తమోగుణము అధికమైనప్పుడు అంతః కరణమునందును. ఇంద్రియములయందును వివేకశక్తి నష్టమగును. కర్తవ్యకర్మలయందు విముఖత, ప్రమాదము అనగా అంతఃకరణమును మోహములు కలుగును.

యదా సత్త్వేప్రవృద్దే తు ప్రలయం యాతి దేహభృత్ !
తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే !! 14

యదా - సత్త్వే - ప్రవృద్దే - తు - ప్రలయం - యాతి - దేహభృత్
తదా - ఉత్తమ విదాం - లోకాన్ - అమలాన్ - ప్రతిపద్యతే


యతా - ఎప్పుడు, సత్త్వే - సత్త్వగుణము, ప్రవృద్దే - వృద్ధినొందినపుడు, దేహభృత్ - దేహధారి, ప్రలయం తు - ప్రళయమును, యాతి - పొందుచున్నాడు, తదా - అప్పుడు, ఉత్తమ విదాం - ఉత్తమ జ్ఞానులయొక్క, అమలాన్ - నిర్మలములైన, లోకాన్ - లోకములను, ప్రతిపద్యతే - పొందుచున్నాడు.

సత్త్వగుణము వృద్ధిచెందినపుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరెడి నిర్మలములైన స్వర్గాది పుణ్యలోకములను పొందును.

రజసి ప్రలయం గత్వాకర్మసంగిషు జాయతే !
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే !! 15

రజసి - ప్రలయం - గత్వా - కర్మసంగిషు - జాయతే
తథా - ప్రలీనః - తమసి - మూఢయోనిషు - జాయతే


రజసి - రజోగుణము వృద్ధినొందినపుడు, ప్రలయం - మృతిని, గత్వా - పొంది, కర్మసంగిషు - కర్మసంగత్వము గలవారి యందు, జాయతే - పుట్టుచున్నాడు, తథా - అట్లే, తమసి - తమోగుణమునందు, ప్రలీనః - మృతి నొందినవాడు, మూఢయోనిషు - మూఢ ప్రాణులయందు, జాయతే - పుట్టుచున్నాడు.

రజోగుణము వృద్ధిచెందినపుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అట్లే తమోగుణము వృద్ధిచెందినప్పుడు మృతిచెందిన మానవుడు పశుపక్షికీటకాది నీచయోనులలో జన్మించుచున్నాడు.

కర్మణః సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్ !
రజసస్తు ఫలం దుఃఖమ్ అజ్ఞానం తమసః ఫలమ్ !! 16

కర్మణః - సుకృతస్య - ఆహుః - సాత్త్వికం - నిర్మలం - ఫలం
రజసః - తు - ఫలం - దుఃఖం - అజ్ఞానం - తమసః - ఫలం


సుకృతస్య - సుకృతమైన, కర్మణః - కర్మమునకు, సాత్త్వికం - సాత్త్వికమైన, నిర్మలం - నిర్మలత్వము, ఫలం - ఫలమును, రజసః తు - రజోగుణసంబంధమైన, దుఃఖం - దుఃఖము, ఫలం - ఫలము, తమసః - తమోగుణయుతమైన, అజ్ఞానం - అజ్ఞానము, ఫలం - ఫలమును అని, ఆహుః - చెప్పుదురు.

శ్రేష్ఠములైన కర్మలను ఆచరించుటవలన సాత్త్వికఫలము అనగా సుఖము,జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మలఫలములు కలుగును. రాజసకర్మలకు ఫలము దుఃఖము. తామసకర్మలకు అజ్ఞానము ఫలము.

సత్త్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ !
ప్రమాదమోహౌ తమసో భవతోజ్ఞానమేవ చ !! 17

సత్త్వాత్ - సంజాయతే - జ్ఞానం - రజసః - లోభః - ఏవ చ
ప్రమోదమోహౌ - తమసః - భవతః - అజ్ఞానం - ఏవ - చ


సత్త్వాత్ - సత్త్వగుణము వలన, జ్ఞానం - జ్ఞానము, సంజాయతే - కలుగుచున్నది, రజసః - రజోగుణమువలన, లోభః ఏవ చ - లోభగుణము, సంజాయతే - కలుగుచున్నవి, తమసః - తమోగుణమువలన, ప్రమాదమోహౌ - ప్రమాదమును, అజ్ఞానం ఏవ చ - అజ్ఞానమును, భవతః - కలుగుచున్నవి.

సత్త్వగుణము వలన జ్ఞానమూ, రజోగుణమువలన లోభమూ, తమో గుణము వలన ప్రమాదమోహాదులూ, అజ్ఞానమూ తప్పక సంభవించును.

ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థాః మధ్యే తిష్ఠంతి రాజసాః !
జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్ఛంతి తామసాః !! 18

ఊర్ధ్వం - గచ్ఛంతి - సత్త్వస్థాః - మధ్యే - తిష్ఠంతి - రాజసాః
జఘన్య గుణ వృత్తిస్థాః - అధః - గచ్చంతి - తామసాః 


సత్త్వస్థాః - సత్త్వగుణము నందున్నవారు, ఊర్ధ్వం - ఊర్ధ్వమునకు, గచ్చంతి - పోవుచున్నారు, రాజసాః - రజోగుణము గలవారు, మధ్యే - మధ్యను, తిష్ఠంతి - నిలుచుచున్నారు, జఘన్య గుణవృత్తిస్థాః - నికృష్టమైన గుణప్రవృత్తి గల, తామసాః - తమోగుణము కలవారు, అధః - క్రిందికి, గచ్చంతి - పోవుచున్నారు.

సత్త్వగుణస్థితులు స్వర్గాది - ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణస్థితులైన పురుషులు మధ్య లోకమునందే ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్రా ప్రమాదాలస్యాదులయందు స్థితులైనవారు అధోగతిని పొందుదురు.

నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి !
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సో దిగచ్చతి !! 19

న - అన్యం - గుణేభ్యః - కర్తారం - యదా - ద్రష్టా - అనుపశ్యతి
గుణేభ్యః - చ - పరం - వేత్తి - మద్భావం - సః - అధిగచ్చతి  


ద్రష్టా - ఆత్మదర్శి, గుణేభ్యః - గుణములకంటెను, అన్యం - ఇతరుడైన, కర్తారం - కర్తను, యదా - ఎప్పుడు, న అనుపశ్యతి - చూడడో, గుణేభ్యః - గుణముల కంటెను, పరం చ - అతీతముగాను, వేత్తి - తెలిసికొనుచున్నాడో, సః - వాడు, మద్భావం - నా భావమును, అధిగచ్ఛతి - పొందుచున్నాడు.

ద్రష్టయైనవాడు గుణములే గుణములయందు వర్తించు చున్నవనియూ, త్రిగుణములు తప్ప వేఱుగా కర్తలు లేరనియూ తెలిసికొని, త్రిగుణములకు అతీతముగానున్న నా తత్త్వమును తెలిసికొనును. అప్పుడతడు నా స్వరూపమునే పొందుచున్నాడు.

కైర్లింగైః త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో !
కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే !! 20

కైః - లింగైః - త్రీన్ - గుణాన్ - ఏతాన్ - అతీతః - భవతి - ప్రభో
కిం ఆచారః కథం - చ - ఏతాన్ - త్రీన్ - గుణాన్ - అతివర్తతే


ప్రభో - కృష్ణా, ఏతాన్ - ఈ, త్రీన్  మూడైన, గుణాన్ - గుణములను, అతీతః - అతిక్రమించినవాడు, కైః లింగైః - ఏ లక్షణము గలవాడు, కిమాచారః - ఎట్టి ఆచారముగలవాడు, భవతి - అగుచున్నాడు, ఏతాన్ - ఈ, త్రీన్ - మూడైన, గుణాన్ - గుణములను, కథం చ - ఎటుల, అతివర్తతే - అతిక్రమించుచున్నాడు.

అర్జునుడు పలికెను - ఓ ప్రభూ ! డద్ మూడు గుణములకును అతీతుడైనవాని లక్షణములెవ్వి? అతని లోకవ్యవహారరీతి యెట్లుండును? మనుష్యుడు త్రిగుణములను ఎట్లు అతిక్రమించును ?

శ్రీభగవాన్ ఉవాచ :-
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ !
న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాన్ని కాంక్షతి !! 21

ప్రకాశం - చ - ప్రవృత్తిం - చ - మోహం - ఏవ - చ - పాండవ 
న - ద్వేష్టి - సంప్రవృత్తాని - న - నివృత్తాని - కాంక్షతి


పాండవ - అర్జునా, సంప్రవృత్తాని - సంప్రాప్తములైన, ప్రకాశం చ - ప్రకాశమును, ప్రవృత్తిం చ - ప్రవృత్తిని, మోహం ఏవ చ - మోహమును, న ద్వేష్టి - ద్వేషింపడు, నివృత్తాని - విదిచిపోయిన వానిని, న కాంక్షతి - కోరడు.

శ్రీ భగవానుడు పలికెను - ఓ పాండవా ! సత్త్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణకార్యరూపమైన మోహము, తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు - ప్రాప్తించనపుడు ఆశించడు.

ఉదాసీనవదాసీనో గుణైర్యోన విచాల్యతే !
గుణా వర్తంత ఇత్యేన యోవతిష్ఠతి నేంగతే !! 22

ఉదాసీనవత్ - ఆసీనః - గుణైః - యః - న - విచాల్యతే
గుణాః - వర్తంతే - ఇతి - ఏవ - యః - అవతిష్ఠతి - న - ఇంగతే


యః - ఎవడు, ఉదాసీనవత్ - తటస్థునివలె, ఆసీనః - ఉన్నవాడై, గుణైః - గుణములచేత, న విచాల్యతే - చలింపబడడో, గుణాః - గుణములు, వర్తంతే ఇతి ఏవ - ప్రవర్తించుచున్నవనియే, అవతిష్ఠతి - తలంచుచున్నాడో, న ఇంగతే - చలింపడో

త్రిగుణములకును, వాటి కార్యరూపములైన శరీరేంద్రియాంతఃకరణ వ్యాపారములకును ఏ మాత్రము చలింపక, త్రిగుణాతీతుడు, సాక్షివలె ఉండును. గుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు సచ్చిదానందఘనపరమాత్మ యందు ఏకీభావస్థితుడై యుండును. ఈ స్థితినుండి ఎన్నడును చలింపడు.

సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాంచనః !
తుల్యప్రియాప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః !! 23

సమదుఃఖసుఖః - స్వస్థః - సమలోష్టాశ్మ కాంచనః
తుల్యప్రియాప్రియః - ధీరః - తుల్యనిందాత్మసంస్తుతిః


సమదుఃఖసుఖః - సుఖదుఃఖములయందు సముడును, స్వస్థః - తనలో తానుండువాడును, సమలోష్టాశ్మకాంచనః - మట్టిగడ్డను రాతిని బంగారమును సమముగా జూచువాడును, తుల్యప్రియాప్రియః - ప్రియాప్రియములను సమముగా జూచువాడును, ధీరః - ధీరుడును, తుల్యప్రియాప్రియః - ప్రియాప్రియములను సమముగా జూచువాడును, తుల్యనిందాత్మ సంస్తుతిః - నిందాస్తుతుల యందు సమబుద్ధిగలవాడును.

త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడై యుండును. సుఖదుఃఖములను సమానముగా భావించును. మట్టి, రాయి, బంగారముల యందు సమభావమునే కలిగియుండును. అనగా ఆ మూడింటియందును గ్రాహ్యత్యాజ్య భావములను కలిగియుండడు. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియా ప్రియములకు గాని, నిందాస్తుతులకు గాని తొణకుడు. అనగా రెండింటి యందును సమస్థితిలోనే యుండును.

మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః !
సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే !! 24

మానాపమానయోః - తుల్యః - తుల్యః - మిత్రారిపక్షయోః
సర్వారంభ పరిత్యాగీ - గుణాతీతః - సః - ఉచ్యతే


మానాపమానాయోస్తుల్యః - మానావమానములను సమానముగా జూచువాడును, మిత్రారిపక్షయోఃతుల్యః - శత్రుమిత్రపక్షముల యందు తుల్యుడును, సర్వారంభపరిత్యాగీ - కర్తృత్వాభిమానమును త్యజించినవాడును, యః - ఎవడో, సః - వాడు, గుణాతీతః - గుణాతీతుడని, ఉచ్యతే - చెప్పబడుచున్నాడు.

మానవమానములయందును, మిత్రులయందును, శత్రువుల యందును సమభావముతో ప్రవర్తించువాడును, విధ్యుక్తకర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును ఐనవాడు త్రిగుణాతీతుడని చెప్పబడును.

మాం చ యోవ్యభిచారేణ భక్తియోగేన సేవతే !
స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే !! 25

మాం - చ - యః - అవ్యభిచారేణ - భక్తియోగేన - సేవతే
సః - గుణాన్ - సమతీత్య - ఏతాన్ - బ్రహ్మభూయాయ - కల్పతే


యః - ఎవడు, అవ్యభిచారేణ - ఏకాంతమైన, భక్తియోగేన - భక్తియోగముచేత, మాం నన్ను, సేవతే - సేవించుచున్నాడో, సః - వాడు, ఏతాన్ - ఈ, గుణాన్ - గుణములను, సమతీత్య - అతిక్రమించి, బ్రహ్మభూయాయ - బ్రహ్మత్వమునకు, కల్పతే చ - కల్పింపబడుచున్నాడు.

నిర్మలమైన భక్తియోగము ద్వారా నన్నే నిరంతరము భజించువాడును, ఈ మూడు గుణములకును పూర్తిగా అతీతుడైనవాడును అగు పురుషుడు పరబ్రహ్మ స్వరూపమును పొందుచున్నాడు.

బ్రాహ్మణోహి ప్రతిష్ఠాహమ్ అమృతస్యావ్యయస్య చ !
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ !! 26

బ్రహ్మణః - హి - ప్రతిష్ఠా - అహం - అమృతస్య - అవ్యయస్య - చ
శాశ్వతస్య - చ - ధర్మస్య -సుఖస్య - ఏకాంతికస్య - చ


అహం - నేను, అమృతస్య - అమృత స్వరూపము, అవ్యయస్య చ - అవ్యయమును అయిన, బ్రహ్మణః - బ్రహ్మమునకు, శాశ్వతస్య - శాశ్వతమైన, ధర్మస్య చ - ధర్మమునకు, ఏకాంతికస్య - అంచలమైన, సుఖస్య చ - సుఖమునకును, ప్రతిష్ఠా హి - ఆశ్రయుడను గదా.


ఏలనన అట్టి శాశ్వతపరబ్రహ్మకును, అమృతతత్వమునకును, సనాతన ధర్మమునకును, అఖండా నందమునకును నేనే ఆశ్రయుడను.

 

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జునసంవాదే గుణత్రయవిభాగయోగోనామ

చతుర్ధశోధ్యాయః !!