Read more!

భగవద్గీత పార్ట్ - 21

 

అథ త్రయోదశోధ్యాయః - క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః  

శ్రీభగవాన్ ఉవాచ
ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే !
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః !! 1

ఇదం - శరీరం - కౌంతేయ - క్షేత్రం - ఇతి - అభిధీయతే
ఏతత్ - యః - వేత్తి - తం - ప్రాహుః - క్షేత్రజ్ఞః - ఇతి - తద్విదః


కౌంతేయ - అర్జునా, ఇదం - ఈ, శరీరం - శరీరము, క్షేత్రం ఇతి - క్షేత్రమని, అభిధీయతే - చెప్పబడుచున్నది, ఏతత్ - క్షేత్రమును, యః - ఎవ్వడు, వేత్తి - తెలిసికొనుచున్నాడో, తం - వానిని, క్షేత్రజ్ఞః - క్షేత్రజ్ఞుడు, ఇతి - అని, తత్ విదః - తద్విదులు, ప్రాహుః - చెప్పిరి.

శ్రీ భగవానుడు పలికెను - ఓ కౌంతేయా ! ఈ శరీరమును క్షేత్రము అని పేర్కొందురు. ఈ క్షేత్రమును గూర్చి ఎరింగిన వానిని క్షేత్రజ్ఞుడు అని తత్త్వజ్ఞులు తెలిపిరి.

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత !
క్షేత్రక్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ !! 2

క్షేత్రజ్ఞం - చ - అపి - మాం - విద్ధి - సర్వక్షేత్రేషు - భారత
క్షేత్రక్షేత్రజ్ఞయోః - జ్ఞానం - యత్ - తత్ - జ్ఞానం - మతం - మమ


భారత - అర్జునా, సర్వక్షేత్రేషు - సర్వక్షేత్రముల యందు, మాం చ - నన్నే, క్షేత్రజ్ఞం అపి - క్షేత్రజ్ఞునిగ, విద్ధి - ఎరుగుము, క్షేత్రక్షేత్రజ్ఞయోః - క్షేత్రజ్ఞులయొక్క, జ్ఞానం - జ్ఞానము, యత్ - ఏదో, తత్ - అది, జ్ఞానము, మమ - నాయొక్క, మతం - అభిప్రాయము.

ఓ అర్జునా ! అన్ని క్షేత్రములయందున్న క్షేత్రజ్ఞుడను అనగా జీవాత్మను నేనే అని తెలిసికొనుము. క్షేత్రక్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా త్రిగుణాత్మకమైన ప్రకృతి మరియు నిర్వికారపురుషుల తత్త్వములను గూర్చి తెలిసికొనుటయే జ్ఞానము అని నా అభిప్రాయము.

తత్ క్షేత్రం యచ్చ యాదృక్చయద్వికారి యతశ్చ యత్ !
స చ యో యత్ర్పభావశ్చ తత్సమాసేన మే శృణు !! 3

తత్ - క్షేత్రం - యత్ - చ - యాదృక్ - చ - యద్వికారి - యతః - చ - యత్
సః - చ - యః - యత్ర్పభావః - చ - తత్ - సమాసేన - మే - శృణు


తత్ - ఆ, క్షేత్రం - క్షేత్రము, యత్ చ - ఏదియో, యాదృక్ చ - ఏవిధమైనదియో, యత్ వికారి - ఎటువంటి వికారము గలదియో, యతః చ యత్ - ఎచ్చటి నుండి ఏదియో, సః చ - ఆ క్షేత్రజ్ఞుడు, యః - ఎవడో, యత్ - ప్రభావః చ - ఎట్టి మహిమ గలవాడో, తత్ - ఆ వివరమును, సమాసేన - సంక్షేపముగా, మే - నావలన, శృణు - వినుము.

క్షేత్రమనగానేమి? అది యెట్లుండును? దాని వికారములు ఏవి? ఆ వికారములు దేనినుండి ఏర్పడినవి? అట్లే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు? అతని ప్రభావమేమి? ఆ వివరములను అన్నింటిని సంక్షిప్తముగా చెప్పెదము వినుము.

ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ !
బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః !! 4

ఋషిభిః - బహుధా - గీతం - ఛందోభిః - వివిధైః - పృథక్
బ్రహ్మసూత్రపదైః - చ - ఏవ - హేతుమద్భిః - వినిశ్చితైః


ఋషిభిః - ఋషులచేత, బహుధా - అనేకవిధములుగ, పృథక్ - వేరుగా, వివిధైః - అనేకములైన, ఛందోభిః - వేదముల చేత, హేతుమద్భిః - సహేతుకములైనవియు, వినిశ్చితైః - నిశ్చయమైనవియునగు, బ్రహ్మసూత్రపదైః చ ఏవ - బ్రహ్మసూత్రపదముల చేత, గీతం - చెప్పబడినది.

క్షేత్ర, క్షేత్రజ్ఞులతత్త్వములను గూర్చి ఋషులెల్లరును బహువిధములుగా చెప్పిరి, వివిధ వేదమంత్రములను వేర్వేరుగా తెల్పినవి. అట్లే బ్రహ్మసూత్ర పదములు గూడ నిశ్చయాత్మకముగ సహేతుకముగ నిర్ణయించి చెప్పినవి.

మహాభూతాన్వహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ !
ఇంద్రియాణి దశైకం చ పంచ చేంద్రియగోచరాః !! 5

మహాభూతాని - అహంకారః - బుద్ధిః - అవ్యక్తం - ఏవ చ
ఇంద్రియాణి - దశ - ఏకం చ - పంచ - చ - ఇంద్రియగోచరాః


మహాభూతాని - పంచభూతములు, అహంకారః - అహంకారము, బుద్ధిః - బుద్ధి, అవ్యక్తం ఏవ చ - అవ్యక్తమును, దశ ఇంద్రియాణి - పది ఇంద్రియములు, ఏకం చ మనస్సును, ఇంద్రియగోచరాః - ఇంద్రియ విషయములు, పంచ చ - అయిదును, ఇచ్ఛా - కోరిక, ద్వేషః - ద్వేషము, సుఖం - సుఖము, దుఃఖం - దుఃఖము, సంఘాతః - సమూహము, చేతనా - చేతనత్వము, ధృతిః - ధైర్యము, ఏతత్ - ఇది, క్షేత్రం - క్షేత్రము, సమాసేన - సంక్షేపముగా, సవికారం - వికార సహితముగా, ఉదాహృతం - చెప్పబడినది.

పంచమహభూతములు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతియు, అట్లే దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియ గ్రాహ్య విషయములు.

ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః !
ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్ !! 6

ఇచ్ఛా - ద్వేషః - సుఖం - దుఃఖం - సంఘాతః - చేతనా - ధృతిః
ఏతత్ - క్షేత్రం - సమాసేన - సవికారం - ఉదాహృతం


ఇచ్చ, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూలశరీరము, చైతన్యము, ధృతి అను వికారములతో గూడినదియే క్షేత్రము.

అమానిత్వమదంభిత్వమ్ అహింసా క్షాంతిరార్జవమ్ !
ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః !! 7

అమానిత్వం - అదంభిత్వం - అహింసా - క్షాంతిః - ఆర్జవం
ఆచార్యోపాసనం - శౌచం - స్థైర్యం - ఆత్మవినిగ్రహః


అమానిత్వం - అభిమానము లేకుండుట, అదంభిత్వం - దంభము లేకుండుట, అహింసా - అహింసయు, క్షాంతిః - సహనము, ఆర్జవం - ఋజుత్వము, ఆచార్యోపాసనం - ఆచార్యసేవ, శౌచం - శుభ్రత, స్థైర్యం - స్థిరత్వము, ఆత్మవినిగ్రహః - ఆత్మనిగ్రహము.

తానే శ్రేష్ఠుడనను భావము లేకుండుట, డాంబికము లేకుండుట, అహింస, క్షమించుగుణము, మనోవాక్కుల యందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, బాహ్యాభ్యంతరశుద్ధి, అంతఃకరణస్థిరత్వము, మనశ్శరీరేంద్రియముల నిగ్రహము.

ఇంద్రియార్థేషు వైరాగ్యమ్ అనహంకార ఏవ చ !
జన్మమృత్యుజరావ్యాధి దుఃఖదోషానుదర్శనమ్ !! 8

ఇంద్రియార్థేషు - వైరాగ్యం - అనహంకారః - ఏవ - చ
జన్మమృత్యుజురావ్యాధిదుఃఖదోషానుదర్శనం


ఇంద్రియార్థేషు - ఇంద్రియ విషయములయందు, వైరాగ్యం - విరక్తి, అనహంకారః - నిరహంకారము, జన్మమృత్యుజరావ్యాధి దుఃఖదోషానుదర్శనం - జననము, మరణము, ముసలితనము, వ్యాధుల వలన కలిగెడి దుఃఖ దోషములను గ్రహించుట.

ఇందరియార్థములయందు వైరాగ్యము అహంకార రాహిత్యము, జన్మ, మృత్యు, ముసలితనము రోగాదుల యందు దుఃఖదోషములను దర్శించుట.

అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు !
నిత్యం చ సమచిత్తత్వమ్ ఇష్టానిష్టోపపత్తిషు !! 9

అసక్తిః - అనభిష్వంగః - పుత్రదారగృహాదిషు
నిత్యం - చ - సమచిత్తత్వం - ఇష్టానిష్టోపపత్తిషు


పుత్రదారగృహాదిషు - పుత్రుడు, సతి, గృహాదులయందు, అసక్తిః - ఆసక్తి లేకుండుట, అనభిష్వంగః - ప్రీతిలేకుండుట, ఇష్టానిష్టోపపత్తిషు - ఇష్టానిష్టముల యందు, నిత్యం - ఎల్లప్పుడును, సమచిత్త్వం చ - సమబుద్ధియును.

భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు మున్నగువానియందు మమతాసక్తులు లేకుండుట, ఇష్టానిష్ట వస్తుప్రాప్తివలన ఎత్తి మనోవికారములకును లోనుగాకుండుట, ఎల్లప్పుడును సమబుద్ధిని కలిగియుండుట మరియు

మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ !
వినిక్తదేశసేవిత్వమ్ అరతిర్జనసంసది !! 10

మయి - చ - అనన్యయోగేన - భక్తిః - అవ్యభిచారిణి
వినిక్తదేశసేవిత్వం - ఆరతిః - జనసంసది 


మయి - నాయందు, అనన్యయోగేన - అనన్యయోగముచేత, అవ్యభిచారిణీ - మార్పులేని, భక్తిః - భక్తియును,వినిక్తదేశ సేవిత్వం - ఏకాంత ప్రదేశమునందుండుట, జనసంసది - ప్రజాసమూహము నందు, అరతిః - ఇష్టములేని.

పరమేశ్వరుడైన నాయందు అనన్యయోగముద్వారా అవ్యభిచారిణిభక్తి కలిగియుండుట, ఏకాంతపవిత్రప్రదేశమున ప్రవృత్తి కలిగియుండుట, విషయాసక్తులైన జనులయెడ ప్రీతి లేకుండుట.

అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్ !
ఏతద్ జ్ఞానమితి ప్రోక్తమ్ అజ్ఞానం యదతోవ్యథా !! 11

అధ్యాత్మజ్ఞాననిత్యత్వం - తత్వాజ్ఞానార్థదర్శనం
ఏతత్ - జ్ఞానం - ఇతి - ప్రోక్తం - అజ్ఞానం - యత్ - అతః - అన్యథా


అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం - ఆత్మజ్ఞాన నిత్యత్వము, తత్త్వజ్ఞానార్థదర్శనం ఏవ చ - తత్త్వజ్ఞాన స్వరూపానుభవము, ఏతత్ - ఇదియంతయు, జ్ఞానం - జ్ఞానము, ఇతి - అని, ప్రోక్తం - చెప్పబడినది, అతః - దీనికంటెను, అన్యథా - వేరుగా, యత్ - ఏదియో, తత్ - అది, అజ్ఞానం - అజ్ఞానము.

ఆధ్యాత్మికజ్ఞానమునందు నిత్యస్థితుడై యుండుట, తత్త్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడేయని ఎరుంగుట - ఇవియన్నియును జ్ఞానప్రాప్తికి సాధనములు. దీనికి అన్యమైన దంతయు అజ్ఞానము.

జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వామృతమశ్నుతే !
అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే !! 12

జ్ఞేయం - యత్ - తత్ - ప్రవక్ష్యామి - యత్ - జ్ఞాత్వా - అమృతం - ఆశ్నుతే
అనాదిమత్ - పరం - బ్రహ్మ - న - సత్ - తత్ - న - అసత్ - ఉచ్యతే


జ్ఞేయం - తెలియదగినది, యత్ - ఏదియో, యత్ - దేనిని, జ్ఞాత్వా - తెలిసికొని, అమృతం - మోక్షమును, అశ్నుతే - పొందుచున్నాడో, తత్ - దానిని, ప్రవక్ష్యామి - చెప్పుచున్నాను, తత్ - అది, అనాదిమత్ - ఆదిలేనిది, పరంబ్రహ్మ - పరబ్రహ్మ, సత్ - సత్తు, న ఉచ్యతే - చెప్పబడదు, అసత్ - అసత్తని, న ఉచ్యతే - చెప్పబడదు.

అనాదియైన పరబ్రహ్మయే తెలిసికొనదగినవాడు. అతనిని తెలిసికొనుట వలన మానవుడు పరమానందమును పొందును. అతడు సదసత్తులకు అతీతుడు. ఆ పరమాత్మను గూర్చి సమగ్రముగా నీకు చెప్పుచున్నాను.

సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖమ్ !
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి !! 13

సర్వతః - పాణిపాదం - తత్ - సర్వతః - అక్షిశిరోముఖం
సర్వతః - శ్రుతిమత్ - లోకే - సర్వం - ఆవృత్య - తిష్ఠతి 


తత్ - అది, సర్వతః - అంతటను, పాణిపాదం - చేతులుకాళ్ళుకలది, సర్వతః - అంతటను, అక్షిశిరోముఖం - కనులు తలలు నోరులు గలది, సర్వతః - అంతటను, శ్రుతిమన్ - చెవులు గలది, లోకే - లోకమునందు, సర్వం - సమస్తమును, ఆవృత్య - ఆవరించి, తిష్ఠతి - ఉన్నది.

ఆ పరమాత్ముని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్ర స్థితములై యున్నవి. అది సర్వత్రా వ్యాపించియున్నది.

సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియవివర్జితమ్ !
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ !! 14

సర్వేంద్రియగుణాభాసం - సర్వేంద్రియవివర్జితం
అసక్తం - సర్వభ్రుత్ - చ - ఏవ - నిర్గుణం - గుణభోక్తృచ


తత్ - అది, సర్వేంద్రియ గుణాభాసం - సకల ఇంద్రియముల గుణములను ప్రకాశింప జేయునదియు, సర్వేంద్రియ వివర్జితం - సర్వేంద్రియరహితమును, అసక్తం - నిస్సంగమైనదియు, సర్వభ్రుత్ - అన్నిటికి ఆధారమైనదియు, నిర్గుణం ఏవ చ - త్రిగుణరహితమైకూడ, గుణభోక్తృచ - గుణములననుభవించునదియు

అతడు ఇంద్రియగ్రాహ్యవిషయములను అన్నింటిని ఎరిగినవాడు. కాని వాస్తవముగా ఇంద్రియాదులకు అతీతుడు. ఆసక్తిరహితుడైనను సమస్తజగత్తును భరించి పోషించువాడు. అతడు గుణాతీతుడయ్యును ప్రకృతి సంబంధమువలన గుణములను అనుభవించుచున్నాడు.

బహిరంతశ్చభూతానామ్ అచరం చరమేవ చ !
సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ !! 15

బహిః - అంతః - చ - భూతానాం - అచరం - చరం - ఏవ - చ
సూక్ష్మత్వాత్ - త్వత్ -అవిజ్ఞేయం - దూరస్థం - చ - అంతికే - చ - తత్


భూతానాం - ప్రాణులకు, బహిః - బాహ్యమును, అంతః చ - లోపలను, అచరం - చరింపనిదియును, చరం ఏవ చ - చరించునదియు, సూక్ష్మత్వాత్ - సూక్ష్మత్వము వలనను, అవిజ్ఞేయం - తెలియబడనిదియు, దూరస్థం చ - దూరము నందున్నదియు, అంతికే చ - దగ్గర నున్నదియు, తత్ - అది.

చరాచారభూతములన్నింటికిని బాహ్యాభ్యంతరములయందు పరిపూర్ణముగా ఉండువాడును, చరాచరరూపుడును అతడే. అతిసూక్ష్మ రూపుడైనందున తెలిసికొన శక్యముకానివాడు, అతిదూరముగను, దగ్గరగను యున్నది.

అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ !
భూతభర్తృచ తద్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ !! 16

అవిభక్తం - చ - భూతేషు - విభక్తం - ఇవ - చ - స్థితం
భూతభర్తృ - చ - తత్ - జ్ఞేయం - గ్రసిష్ణు - ప్రభవిష్ణు - చ


భూతేషు - భూతములయందు, అవిభక్తం చ - విభజింపబడనిదియు, విభక్తం ఇవ చ - వేరుచేయబడిన దానివలె, స్థితం - ఉన్నదియు, తత్ - అది, భూతభర్తృచ - భూతములను భరించునదియును, గ్రసిష్ణు - హరించుచునదియు,ప్రభవిష్ణు చ - కలిగించునదియు,

పరమాత్మ ఆకాశమువలె విభజించుటకు వీలులేని ఒకే రూపమున పరిపూర్ణుడైయున్నను, సమస్తచరాచరప్రాణుల రూపములలో వేర్వేరుగా గోచరించుచుండును. ఆ పరమాత్మయే భూతములను భరించునదియును, హరించునదియు, కలిగించునదియు అయి ఉన్నది.

జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే !
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్ !! 17

జ్యోతిషాం - అపి - తత్ - జ్యోతిః - తమసః - పరం - ఉచ్యతే
జ్ఞానం - జ్ఞేయం - జ్ఞానగమ్యం - హృది - సర్వస్య - విష్ఠితం


జ్ఞేయం - తెలియదగినదియు, తత్ - అది, జ్యోతిషాం అపి - జ్యోతులకు కూడా, జ్యోతిః - ప్రకాశమును, తమసః - చీకటికి, పరం - పరమైనదియు, జ్ఞానం - జ్ఞానము, జ్ఞేయం - జ్ఞేయము, జ్ఞానగమ్యం - జ్ఞానముచేత పొందదగినదియు, సర్వస్య - సమస్త భూతముల యొక్క, హృది - హృదయమునందు, విష్ఠితం - ఉన్నదినియు, ఉచ్యతే - చెప్పబడుచున్నది.

ఆ పరబ్రహ్మ అన్నిజ్యోతులకును జ్యోతి మాయాతీతుడును, జ్ఞానస్వరూపుడును, తెలిసికొనదాగిన వాడును, తత్వజ్ఞానము ద్వారా ప్రాప్యుడును అతడే. సర్వప్రాణుల హృదయముల యందు ప్రకాశించుచున్నది అతడే.

ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః !
మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే !! 18

ఇతి - క్షేత్రం - తథా - జ్ఞానం - జ్ఞేయం - చ - ఉక్తం - సమానతః
మద్భక్తః - ఏతత్ - విజ్ఞాయ - మద్భావాయ - ఉపపద్యతే


ఇతి - ఈ విధముగ, క్షేత్రం - క్షేత్రము, తథా - అటులే, జ్ఞానం - జ్ఞానము, జ్ఞేయం చ - జ్ఞేయమును, సమాసతః - సంగ్రహముగ, ఉక్తం - చెప్పబడినది, మద్భక్తః - నాభక్తుడు, ఏతత్ - దీనిని, విజ్ఞాయ - తెలిసికొని, మద్భావాయ - నాభావమును పొందుటకు, ఉపపద్యతే - తగిన వాడగుచున్నాడు.

ఇంతవరకును క్షేత్రమును గూర్చియు, జ్ఞానమును గూర్చియు, జ్ఞేయమును గురించియు సంక్షిప్తముగా వివరించితిని. ఈ తత్త్వమును సమగ్రముగా తెలిసికొనిన నా భక్తుడు నా స్వరూపమునే పొందుటకు అర్హుడగుచున్నాడు.

ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావసి !
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసంభవాన్ !! 19

ప్రకృతిం - పురుషం - చ - ఏవ - విద్ధి - అనాదీ - ఉభౌ - అపి
వికారాన్ - చ - గుణాన్ - చ - ఏవ - విద్ధి - ప్రకృతిసంభవాన్


ప్రకృతిం - ప్రకృతిని, పురుషం చ ఏవ - పురుషుని, ఉభౌ అపి - రెండింటిని, అనాదీ - ఆదిలేని వానినిగ, విద్ధి - గ్రహించుము, వికారాన్ చ - వికారములను, గుణాన్ చ ఏవ - గుణములను, ప్రకృతి సంభవాన్ - ప్రకృతి వలన పుట్టిన వానినిగ, విద్ధి - తెలిసికొనుము.

ప్రకృతి, పురుషుడు, - అను ఈ రెండును అనాదియైన వనియు, రాగద్వేషాదివికారములును, త్రిగుణాత్మకములైన పదార్థములన్నియును ప్రకృతినుండియే ఉత్పన్నములైనవనియు తెలిసికొనుము.

కార్యకరణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే !
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే !! 20

కార్యకారణకర్తృత్వే - హేతుః - ప్రకృతిః - ఉచ్యతే
పురుషః - సుఖదుఃఖానాం - భోక్తృత్వే -  హేతుః - ఉచ్యతే


ప్రకృతిః - ప్రకృతి, కార్యకారణ కర్తృత్వే - కార్యకారణ కర్తృత్వములకు, హేతుః - హేతువుగా, ఉచ్యతే - చెప్పబడుచున్నది, పురుషః - పురుషుడు, సుఖదుఃఖానాం - సుఖదుఃఖములను, ఉచ్యతే - చెప్పబడుచున్నది, పురుషః - పురుషుడు, సుఖదుఃఖానాం - సుఖదుఃఖములను, భోక్తృత్వే - అనుభవించుట యందు, హేతుః - హేతువుగా, ఉచ్యతే - చెప్పబడుచున్నాడు.

కార్యకారణములను ఉత్పన్నము  చేయుటలో ప్రకృతియే హేతువనియు, సుఖ దుఃఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువనియు చెప్పబడినది.

పురుషః ప్రకృతిస్థోహి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ !
కారణం గుణసంగోస్య సదసద్యోనిజన్మసు !! 21

పురుషః - ప్రకృతిస్థః - హి - భుంక్తే - ప్రకృతిజాన్ - గుణాన్
కారణం - గుణసంగః - అస్య - సదసద్యోనిజన్మసు


ప్రకృతిస్థః - ప్రకృతియందున్నవాడై, పురుషః - పురుషుడు, ప్రకృతిజాన్ - ప్రకృతిచే బుట్టిన, గుణాన్ - గుణములను, భుంక్తే హి - అనుభవించునుగదా, అస్య - ఇతనికి, సదసద్యోని జన్మసు - సుకృత దుష్కృతములయిన యోనులందు, గుణసంగః - గుణసంగము, కారణం - కారణము.

పురుషుడు ప్రకృతిస్థుడై ప్రకృతినుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించుచు. ఈ గుణసాంగత్యము వలన జీవాత్మయొక్క నీచోన్నత జన్మలు కలుగుచున్నవి.

ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః !
పరమాత్మేతి చాప్యుక్తోదేహేస్మిన్ పురుషః పరః !! 22

ఉపద్రష్టా - అనుమంతా - చ - భర్తా - భోక్తా - మహేశ్వరః
పరమాత్మా - ఇతి - చ - అపి - ఉక్తః - దేహే - అస్మిన్ - పురుషః - పరః


అస్మిన్ - ఈ, దేహే - దేహమునందు, పరః - పరుడైన, పురుషః - పురుషుడు, ఉపద్రష్టా - సాక్షియు, అనుమంతా చ - అనుమతించు వాడు, భర్తా - భరించువాడు, భోక్తా - అనుభవించువాడు, మహేశ్వరః - మహేశ్వరుడు, పరమాత్మా ఇతి చ అపి - పరమాత్మ అని కూడా, ఉక్తః - చెప్పబడుచున్నాడు.

ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే, అతడు సాక్షిభూతుడగుటవలన ఉపద్రష్టయనియు, యథార్థసమ్మతినిచ్చువాడగుట వలన అనుమంత అనియు, అన్నింటిని ధరించి, పోషించువాడు అగుటవలన భర్త అనియు, జీవరూపములో భోక్త అనియు, బ్రహ్మాదులకును స్వామి యగుటవలన మహేశ్వరుడు అనియు, పరమాత్మ అనియు చెప్పబడుచున్నాడు. 

య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైస్సహ !
సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే !! 23

యః - ఏవం - వేత్తి - పురుషం - ప్రకృతిం - చ - గుణైః - సహ
సర్వథా - వర్తమానః - అపి - న - సః - భూయః - అభిజాయతే  


యః - ఎవడు, ఏవం - ఇటుల, పురుషం - పురుషుని, గుణైః సహ - గుణములతో గూడ, ప్రకృతిం చ - ప్రకృతిని, వేత్తి - తెలిసికొనుచున్నాడో, సః - వాడు, సర్వథా - సకల విధముల, వర్తమానః అపి - వర్తమానములలో చరించుచున్నను, భూయః - తిరిగి, న అభిజాయతే - పుట్టడు.

ఈ విధముగా  పురుషునితత్త్వమును, గుణసహితమైన ప్రకృతితత్త్వమును తెలిసికొనినవాడు అన్ని విధములగు కర్తవ్యకర్మలను ఆచరించుచున్నప్పటికిని తిరిగి జన్మించడు.

ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా !
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే !! 24

ధ్యానేన - ఆత్మని - పశ్యంతి - కేచిత్ - ఆత్మానం - ఆత్మనా
అన్యే - సాంఖ్యేన - యోగేన - కర్మయోగేన - చ - అపరే


కేచిత్ - కొందరు, ధ్యానేన - ధ్యానముచేత, ఆత్మని - ఆత్మయందు, ఆత్మనా - ఆత్మచేత, ఆత్మానం - ఆత్మను, పశ్యంతి - చూచుచున్నారు, అన్యే - మరికొందరు, సాంఖ్యేన - జ్ఞానసంబంధమైన, యోగేన - యోగముచేత, అపరే - ఇతరులు, కర్మయోగేన చ -  కర్మయోగముచేతను, పశ్యంతి - చూచుచున్నారు.

కొందరు ఈ పరమాత్మను శుద్ధమైన సూక్ష్మబుద్ధితో ధ్యానయోగముద్వారా తమహృదయములయందు చూతురు. మరికొందరు జ్ఞాన యోగముద్వారాను, మరికొందరు కర్మయోగముచేతను ఆ పరమాత్మను దర్శింతురు.

అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే !
తేపి చాతితరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః !! 25

అన్యే - తు - ఏవం - అజానంతః - శ్రుత్వా - అన్యేభ్యః - ఉపాసతే
తే - అపి - చ - అతి - తరంతి - ఏవ - మృత్యుం - శ్రుతిపరాయణాః


అన్యే తు - కొందరు, ఏవం - ఇటుల, అజానంతః - గ్రహించలేనివారై, అన్యేభ్యః - ఇతరులవలన, శ్రుత్వా - ఆలకించి, ఉపాసతే - ఉపాసించుచున్నారు, శ్రుతిపరాయణాః - శ్రవణాసక్తులయిన, తే అపి చ - వారుకూడా, మృత్యుం - మృత్యువును, అతితరంతి ఏవ - దాటుచునే యున్నారు.

కాని ఈ సాధనమార్గములను గూర్చి ఎరుగని మందబుద్ధులు తత్త్వజ్ఞానముగల ఇతరులనుండి విని, తదనుసారముగ ఉపాసనలు చేయుదురు. ఆ శ్రవణపరాయణులును మృత్యువును దాటుచున్నారు.

యావత్సంజాయతే కించిత్ సత్త్వం స్థావరజంగమమ్ !
క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్ తద్విద్ధి భరతర్షభ !! 26

యావత్ - సంజాయతే - కించిత్ - సత్త్వం - స్థావరజంగమం
క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగాత్ - తత్ - విద్ధి - భరతర్షభ


భరతర్షభ - అర్జునా, స్థావరజంగమం - స్థావరజంగమ రూపమైన, సత్త్వం - వస్తువు, యావత్ కించిత్ - ఏ కొంచెము, సంజాయతే - పుట్టుచున్నదో, తత్ - అది, క్షేత్రక్షేతజ్ఞ సంయోగాత్ - క్షేత్రక్షేత్రజ్ఞుల సంయోగమువలన, విద్ధి - ఎరుగము.

ఓ అర్జునా ! ఆ స్థావరజంగమప్రాణులన్నియును క్షేత్ర - క్షేత్రజ్ఞ సంయోగము వలననే కలుగుచున్నవని గ్రహించుము.

సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ !
వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి శ పశ్యతి !! 27

సమం - సర్వేషు - భూతేషు - తిష్ఠంతం - పరమేశ్వరం
వినశ్యత్సు - అవినశ్యంతం - యః - పశ్యతి - సః - పశ్యతి


సర్వేషు - సమస్తములైన, భూతేషు - భూతములయందు, సమం - సమముగా, తిష్ఠంతం - ఉన్న, పరమేశ్వరం - పరమేశ్వరుని, వినశ్యత్సు - వినాశమొందుచున్నను, అవినశ్యంతం - నశింపని వానినిగా, యః - ఎవడు, పశ్యతి - గాంచుచున్నాడో, సః - వాడు, పశ్యతి - చూచుచునాడు.

నశ్వరములైన చరాచరభూతముల యందు సమముగా స్థితుడైయున్న పరమేశ్వరుడు నాశరహితుడు, అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజముగా చూచువాడు.

సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్ !
న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్ !! 28

సమం - పశ్యన్ - హి - సర్వత్ర - సమవస్థితం - ఈశ్వరం
న - హినస్తి - ఆత్మనా - ఆత్మానం - తతః - యాతి - పరాం - గతిం


సర్వత్ర - అంతటను, సమం - సమముగా, సమవస్థితం - ఉన్నటువంటి, ఈశ్వరం - ఈశ్వరుని, పశ్యన్ హి - చూచున్నవాడై, ఆత్మానం - తనను, ఆత్మనా - ఆత్మచేత, న హినస్తి - హింసింపడో, తతః - తరువాత, పరాం - ఉత్తమమైన, గతిం - స్థానమును, యాతి - పొందుచున్నాడు.

సమస్తప్రాణులయందును సమభావముతో నుండు పరమేశ్వరుని సమత్వభావముతో చూచువాడు ఆత్మాహంతకుడు కాడు అనగా తనను తాను నాశము చేసికొనువాడు కాడు. అందువలన అతడు పరమగతిని పొందుచున్నాడు.

ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః !
యః పశ్యతి తథాత్మానమ్ అకర్తారం స పశ్యతి !! 29

ప్రకృత్యా - ఏవ - చ - కర్మాణి - క్రియమాణాని - సర్వశః
యః - పశ్యతి - తథా - ఆత్మానం - అకర్తారం - సః - పశ్యతి


సర్వశః - సర్వవిధముల, ప్రకృత్యా ఏవ చ - ప్రకృతిచేతనే, కర్మాణి - కర్మలు, క్రియమాణాని - చేయబడుచున్న వానినిగ, తథా - అటులనే, ఆత్మానం - తనను, అకర్తారం - కర్త గాని వానినిగ, యః - ఎవడు, పశ్యతి - గాంచుచున్నాడో, సః - వాడు, పశ్యతి - చూచుచున్నాడు.

సకలకర్మలు అన్ని విధములుగ ప్రకృతిద్వారానే జరుగుచున్నవనియు, ఆత్మ అకర్త అనియు ఎరింగినవాడు నిజముగ చూచువాడు. 

యదా భూతపృథగ్భావమ్ ఏకస్థమనుపశ్యతి !
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా !! 30

యదా - భూతపృథగ్భావం - ఏకస్థం - అనుపశ్యతి
తతః - ఏవ - చ - విస్తారం - బ్రహ్మ - సంపద్యతే - తదా 


యదా - ఎప్పుడు, భూతపృథగ్భావం - ప్రాణుల వేర్వేరు భావమును, ఏకస్థం - ఏకస్థముగాను, తతః ఏవ చ - దానివలననే, విస్తారం - విస్తారముగాను, అనుపశ్యతి - గాంచుచున్నాడో, తదా - అప్పుడు, బ్రహ్మ - బ్రహ్మము, సంపద్యతే - అగుచున్నాడు.

వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులన్నియును ఒకే పరమాత్మయందు స్థితమై యున్నవనియు, అట్లే అవి యన్నియును ఆ పరమాత్మ నుండియే విస్తరించు చున్నవనియు, ఎరింగిన పురుషుడు ఆ క్షణముననే పరబ్రహ్మను పొందుచున్నాడు. 

అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః !
శరీరస్తోపి కౌంతేయ న కరోతి న లిప్యతే !! 31

అనాదిత్వాత్ - నిర్గుణత్వాత్ - పరమాత్మా - అయం - అవ్యయః
శరీరస్థః - అపి - కౌంతేయ  - న - కరోతి - న - లిప్యతే    


కౌంతేయ - అర్జునా, అనాదిత్వాత్ - అనాదియైనందున, నిర్గుణత్వాత్ - నిర్గుణమైనందున, అవ్యయః - అవ్యయమైనందున, అయం - ఈ, పరమాత్మా - పరమాత్మ, శరీరస్థః అపి - దేహమునందున్నను, న కరోతి - చేయడు, న లిప్యతే - అంటడు.

ఓ అర్జునా ! నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నప్పటి కిని అనాది అగుటవలనను, నిర్గుణుడు అగుటవలనను ఎట్టి కర్మలకును కర్తకాడు. కనుక కర్మలచే అంటబడడు. 

యథా సర్వగతం సాక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే !
సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే !! 32

యథా - సర్వగతం - సౌక్ష్మ్యాత్ - ఆకాశం - న - ఉపలిప్యతే
సర్వత్ర - అవస్థితః - దేహే - తథా - ఆత్మా - న - ఉపలిప్యతే


సర్వగతం - సర్వగతమైన, ఆకాశం - ఆకాశము, సాక్ష్మ్యాత్ - సూక్ష్మమైనందున, యథా - ఎటుల, న ఉపలిప్యతే - అంటబడదో, తథా - అటుల, దేహే - దేహమునందు, సర్వత్ర - అంతటను, అవస్థితః - ఉన్నటువంటిదైన, ఆత్మా - ఆత్మ, న ఉపలిప్యతే - అంటబడదు.

సర్వత్ర వ్యాపించుయున్న ఆకాశము సూక్ష్మ మగుట వలన వాటి గుణదోషములు దానికి అంటవు. అట్లే సకల ప్రాణుల దేహముల యందు స్థితమైయున్నను ఆత్మ నిర్గుణమగుటవలన వాటి గుణదోషములును దానికంటవు.

యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమియం రవిః !
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత !! 33

యథా - ప్రకాశయతి - ఏకః - కృత్స్నం - లోకం - ఇమం - రవిః
క్షేత్రం - క్షేత్రీ - తథా - కృత్స్నం - ప్రకాశయతి - భారత


భారత - అర్జునా, ఏకః - ఒక్కడైన, రవిః - సూర్యుడు, ఇమం - ఈ, కృత్స్నం - సమస్తమైన, లోకం - లోకమును, యథా - ఎటుల, ప్రకాశయతి - ప్రకాశింపజేయుచున్నాడో, తథా - అటుల, క్షేత్రీ - క్షేత్రజ్ఞుడు, కృత్స్నం - సమస్తమైన, క్షేత్రం - క్షేత్రమును, ప్రకాశయతి - ప్రకాశింప జేయుచున్నాడు.

అర్జునా ! ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశిత మొనర్చుచున్నట్లు, ఒకే ఆత్మ సర్వప్రాణులయందును స్థితమై, వాటినన్నింటిని ప్రకాశింప జేయుచున్నాడు.

క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమ్ అంతరం జ్ఞానచక్షుషా !
భూతప్రకృతిమోక్షం చ యే విదుర్యాంతి తే పరమ్ !! 34

క్షేత్రక్షేత్రజ్ఞయోః - ఏవం - అంతరం - జ్ఞానచక్షుషా
భూతప్రకృతిమోక్షం - చ - యే - విదుః - యాంతి - తే - పరం


జ్ఞానచక్షుషా - జ్ఞానదృష్టిచే, ఏవం - ఈరీతి, క్షేత్రక్షేత్రజ్ఞయోః - క్షేత్రక్షేత్రజ్ఞులయొక్క, అంతరం - భేదమును, భూతప్రకృతి - భూతప్రకృతిని, మోక్షం చ - మోక్షమును, యే - ఎవరు, విదుః - తెలిసికొనుచున్నారో, తే - వారు, పరం - మోక్షమును, యాంతి - పొందుచున్నారు.


ఈ విధముగా క్షేత్ర - క్షేత్రజ్ఞుల మధ్యగల అంతరమును, కార్యసహిత ప్రకృతినుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాననేత్రముల ద్వారా ఎరింగిన మహాత్ములు మోక్షమును పొందుచున్నారు.

ఓం తత్సదితిశ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జునసంవాదే క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగో నామ
త్రయోదశోధ్యాయః !!