Read more!

భగవద్గీత పార్ట్ - 20

 

అథ ద్వాదశోధ్యాయః - భక్తియోగః

అర్జున ఉవాచ:-
ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే !
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః !! 1

ఏవం - సతతయుక్తాః - యే - భక్తాః - త్వాం - పర్యుపాసతే
యే - చ - అపి - అక్షరం - అవ్యక్తం - తేషాం - కే - యోగవిత్తమాః


ఏవం - ఈ విధముగా, సతతయుక్తాః - సదా నీయందే చిత్తమును ఉంచి, యే - ఎవ్వరయితే, భక్తాః - భక్తులు, త్వాం - నిన్ను, పర్యుపాసతే - ఉపాసించుచున్నారో, యే చ - ఎవరయితే, అవ్యక్తం - వ్యక్తముగాని, అక్షరం అపి - అక్షరబ్రహ్మమును, పర్యుపాసతే - ఉపాసించుచున్నారో, తేషాం - వారలలో కే - ఎవరు, యోగవిత్తమాః - యోగము నెరిగినవారు.

అర్జునుడు పలికెను ఓ కృష్ణా ! అనన్యభక్తితో పూర్వోక్తరీతిగా నిరంతరము నిన్నే భజించుచు, ధ్యానించుచు, పరమేశ్వరుడనైన నీ సగుణరూపమును ఆరాధించువారును, కేవలము అక్షరుడవగు పరబ్రహ్మవైన నిన్ను అత్యంతభక్తిభావముతో సేవించువారును కలరు. ఈ రెండు విధములైన ఉపాసకులాలో అత్యుత్తమయోగులెవరు?

శ్రీ భగవాన్ ఉవాచ:-
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే !
శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః !! 2

మయి - ఆవేశ్యః - మనః - యే - మాం - నిత్యయుక్తాః - ఉపాసతే
శ్రద్ధయా - పరయా - ఉపేతాః - తే - మే - యుక్తతమాః - మతాః


మయి - నాయందు, మనః - మనస్సును, ఆవేశ్య - నిలిపి, నిత్యయుక్తాః - నిత్యయుక్తులై, పరయా - ఉత్తమమైన, శ్రద్ధయా - శ్రద్ధతో, ఉపేతాః - కూడినవారై, యే - ఎవరు, మాం - నన్ను, ఉపాసతే - ఉపాసించుచున్నారో, తే - వారు, మే - నాకు, యుక్తతమాః - ఉత్తమయోగులని, మతాః - అభిప్రాయము.

శ్రీ భగవానుడు ఇట్లనెను - పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై, నిరంతరము నా భజనధ్యానాదుల యందే నిమగ్నులై, అత్యంతశ్రద్ధాభక్తులతో నన్ను ఆరాధించు భక్తులే యోగశ్రేష్టులని నా అభిప్రాయము.

యే త్యక్షరమనిర్దేశ్యమ్ అవ్యక్తం పర్యుపాసతే !
సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువమ్ !! 3

యే - తు - అక్షరం - అనిర్దేశ్యం - అవ్యక్తం -  పర్యుపాసతే
సర్వత్రగం - అచింత్యం - చ - కూటస్థం - అచలం - ధ్రువం


యే తు - ఎవరయితే, అనిర్దేశ్యం -  నిర్వచించుటకు వీలులేనిది, అవ్యక్తం - వ్యక్తముగాని, సర్వత్రగం - అంతటా వ్యాపించుచున్నదియు, అచింత్యం - చింతించుటకు వీలుకానిదియు, అచలం - స్థిరమైనదియు, ధ్రువం - నిత్యమైనదియు, కూటస్థం  చ - కూటస్థము నైన, అక్షరం - క్షరముగాని బ్రహ్మమును, పర్యుపాసతే - ఉపాసించుచున్నారో...

ఎవరయితే, సర్వవాప్తి ఐనవాడును, మనసుకు, బుద్ధికి అందనివాడును, నిశ్చలుడు, నిత్యుడు, అయిన పరబ్రహ్మను ఉపాసింతురో....

సంని యమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః !
తే ప్రాప్త్నువంతి మామేవ సర్వభూతహితే రతాః !! 4

సంనియమ్య - ఇంద్రియగ్రామం - సర్వత్ర - సమబుద్ధయః
తే - ప్రాప్నువంతి - మాం - ఏవ - సర్వభూతరహితే - రతాః


ఇంద్రియగ్రామం - సర్వేంద్రియములను, సంనియమ్య - నియమించి, సర్వత్ర - అంతటను, సమబుద్ధయః - సమబుద్ధిగలవారై, సర్వభూతహితే - సర్వభూతముల క్షేమమునందు, రతాః - రమించువారై, తే - వారు, మాం ఏవ - నన్నే, ప్రాప్నువంతి - పొందుదురు.

వారు ఇంద్రియ  నిగ్రహం కలిగి సకల ప్రాణులకు హితము చేయుచు నన్నే పొందుదురు.

క్లేశోధికతరస్తేషామ్ అవ్యక్తాసక్తచేతసామ్ !
అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే !! 5

క్లేశః - అధికతరః - తేషాం - అవ్యక్తాసక్త చేతసాం
అవ్యక్తా - హి - గతిః - దుఃఖం - దేహవద్భిః అవాప్యతే


అవ్యక్తాసక్తచేతసాం - అవ్యక్తమునందు ఆసక్తి గల చిత్తము గల్గిన, తేషాం - వారికి, క్లేశః - కష్టము, అధికతరః - అధికము, అవ్యక్తా - అవ్యక్తవిషయమైన, గతిః - గతి, దుఃఖం - బాధగానూ, దేహవద్భిః - దేహాభిమానము గలవారలచే, అవాప్యతే హి - పొందబడుచున్నది గదా.

కాని పరబ్రహ్మమునందు ఆసక్తి గల చిత్తము గల్గిన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో గూడినది. ఏలనన దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి అతికష్టముగా పొందబడుచున్నది.

యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః !
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే !! 6

యే - తు - సర్వాణి - కర్మాణి - మయి - సంన్యస్య - మత్పరాః
అనన్యేన - ఏవ - యోగేన - మాం - ధ్యాయంత - ఉపాసతే


పార్థ - అర్జునా, మత్పరాః - నేనే పరమగతియనెడి వారలు,యే తు - ఎవరైతే, సర్వాణి - సర్వములైన, కర్మాని - కర్మలను, మయి - నాయందు, సంన్యస్య - సమర్పించి, అనన్యేన - ఏకాంతమైన, యోగేన ఏవ - యోగముచే, మాం - నన్ను, ధ్యాయంత - ధ్యానము చేయుచు, ఉపాసతే - ఉపాసించుచుందురో, మయి - నాయందు, ఆవేశిత చేతసాం - ఉంచబడిన మనస్సుగల, తేషాం - వారలను, అహం - నేను, నచిరాత్ - త్వరలోనే, మృత్యుసంసార సాగరాత్ - జననమరణ సంసార సాగరము నుండి, సముద్ధర్తా - ఉద్దరించువాడను, భవామి అగుచున్నాను.

తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ !
భవామి నచిరాత్ పార్థ మయ్యావేశితచేతసామ్ !! 7


తేషాం - అహం - సముద్ధర్తా - మృత్యుసంసారసాగరాత్
భవామి - నచిరాత్ - పార్థ - మయి - ఆవేశిత చేతసాం


ఓ అర్జునా ! నాయందే లగ్నమనస్కులైన అట్టి పరమభక్తులను నేను శీఘ్రముగనే మృత్యురూపసంసార సాగరము నుండి ఉద్దరింతును.

మయ్యేవ మన ఆధత్స్వమయి బుద్ధిం నివేశయః !
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః !! 8

మయి - ఏవ - మనః - ఆధత్స్వ - మయి - బుద్ధిం - నివేశయ
నివసిష్యసి - మయి - ఏవ - అతః - ఊర్ధ్వం - న - సంశయః   


మయి ఏవ - నాయందే, మనః - మనస్సును, ఆధత్స్వ - ఉంచుము, మయి - నాయందే, బుద్ధిం - బుద్ధిని, నివేశయ - ప్రవేశపెట్టుము, అతః ఊర్ధ్వం - అటుపిమ్మట, మయి ఏవ - నాయందే, నివసిష్యసి - నివసింతువు, న సంశయః - సందేహము లేదు.

నా యందే మనస్సును నిలుపుము. నాయందే బుద్ధిని లగ్నము చేయుము. పిమ్మట నా యందే స్థిరముగానుందువు. ఇందు ఏ మాత్రమూ సందేహం అవసరం లేదు.

అథ చిత్తం సమాధాతుం న శక్నోషిమయి స్థిరమ్ !
అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ !! 9

అథ - చిత్తం - సమాధాతుం - న - శక్నోషి - మయి - స్థిరం
అభ్యాసయోగేన - తతః - మాం - ఇచ్ఛ - ఆప్తుం - ధనంజయ


ధనంజయా - అర్జునా, అథ - ఇంకను, మయి - నాయందు, స్థిరం - నిలకడగ,చిత్తం - మనస్సును, సమాధాతుం - నిలుపుటకు, న శక్నోషి - అశక్తుడవైనచో, తతః - అటుపైన, అభ్యాసయోగేన - అభ్యాసముయోగముచేత, మాం - నన్ను, ఆప్తుం - పొందుటకు, ఇచ్ఛ - అభిలషింపుము.

మనస్సును సుస్థిరముగా నాయందే నిల్పుటకు సమర్థుడవు కానిచో అర్జునా ! అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు యత్నించు.

అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మపరమో భవ !
మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి !! 10

అభ్యాసే - అపి - అసమర్థః - అసి - మత్కర్మపరమః - భవ
మదర్ధం - అపి - కర్మాణి - కుర్వన్ - సిద్ధిం - అవాప్స్యసి


అభ్యాసే అపి - అభ్యాసయోగమునందును, అసమర్థః - అసమర్థుడవు, అసి - అయినచో, మత్కర్మ పరమః - నా నిమిత్తమైన కర్మయందు పరాయణుడవు, భవ - కమ్ము, కర్మాణి - కర్మలను, మదర్థం - నా కొరకు, కుర్వన్ అపి - చేయుచున్నను, సిద్ధిం - సిద్ధిని, అవాప్స్యసి - పొందగలవు.

అభ్యాసము చేయుటకును అశక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము. ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించుట ద్వారా కూడ నీవు సిద్ధిని పొందగలవు.

అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః !
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ !! 11

అథ - ఏతత్ - అపి - అశక్తః - అసి - కర్తుం - మద్యోగం - ఆశ్రితః
సర్వకర్మఫలత్యాగం తతః - కురు - యతాత్మవాన్ 


అథ - ఇంకను, ఏతత్ అపి - ఇదికూడా, కర్తుం - చేయుటకు, అశక్తః - ఆశక్తుడవు, అసి - అయినచో, తతః - ఆ తరువాత, మద్యోగం - నాయోగమును, ఆశ్రితః - ఆశ్రయించినవాడవై, యతాత్మవాన్ - నిగ్రహవంతుడవై, సర్వకర్మఫలత్యాగం - సర్వకర్మల యొక్క ఫలత్యాగమును, కురు - చేయుము.

మత్ప్రాప్తికై వలయు యోగమునాశ్రయించి సాధన చేయుటకును నీవు ఆశక్తుడవైనచో మనోబుద్ధీంద్రియాదులను వశమునందు ఉంచుకొని, కర్మఫలాసక్తిని వదిలి కర్మలనాచరింపుము.

శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే !
ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్చాంతిరనంతరమ్ !! 12

శ్రేయః - హి - జ్ఞానం - అభ్యాసాత్ - జ్ఞానాత్ - ధ్యానం - విశిష్యతే
ధ్యానాత్ - కర్మఫలత్యాగః - త్యాగాత్ - శాంతిః - అనంతరం


అభ్యాసాత్ - అభ్యాసము కంటెను, జ్ఞానం - జ్ఞానము, శ్రేయః - శ్రేష్ఠుము, జ్ఞానాత్ - జ్ఞానము కంటెను, ధ్యానం - ధ్యానము, విశిష్యతే హి - విశిష్టమైనదియే, ధ్యానాత్ - ధ్యానముకంటెను, కర్మఫలత్యాగః - కర్మఫలత్యాగము, త్యాగాత్ - త్యాగము వలన, అనంతరం - తరువాత, శాంతిః - శాంతియును.

తత్త్వము నేరుంగకయే చేయు అభ్యాసముకంటెను జ్ఞానము శ్రేష్ఠము. కేవలము పరోక్షజ్ఞానముకంటెను అనగా అనుభవ రహితమైన జ్ఞానము కంటెను (శాస్త్ర పాండిత్యము కంటెను) పరమేశ్వర స్వరూపధ్యానము శ్రేష్ఠము. ధ్యానము కంటెను కర్మఫలత్యాగము మిక్కిలి శ్రేష్ఠమైనది. ఏలనన త్యాగమువలన వెంటనే పరమశాంతి లభిస్తుంది.

అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ !
నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ !! 13

అద్వేష్టా - సర్వభూతానాం - మైత్రం - కరుణః - ఏవ - చ
నిర్మమః - నిరహంకారః - సమదుఃఖసుఖః - క్షమీ 


సర్వభూతానాం - సకలభూతము యందు, అద్వేష్టా - ద్వేషము లేనివాడు, మైత్రి కలవాడు, కరుణః ఏవ చ - దయగలవాడు, నిర్మమః - మమకారము లేనివాడు, నిరహంకారః - అహంకారము లేనివాడు, సమదుఃఖసుఖః - సుఖదుఃఖముల యందు సమముగ నుండెడివాడు, క్షమీ - సహనశీలుడు...

ఏ ప్రాణియందును ద్వేషభావము లేనివాడును, పైగా సర్వప్రాణుల యందును అవ్యాజమైనప్రేమ, కరుణ కలవాడును, మమత అహంకారములు లేనివాడును, సుఖము ప్రాప్తించినను, దుఃఖము ప్రాప్తించినను, సమభావము కలిగియుండు వాడును, క్షమాగుణము కలవాడును

సంతుష్టస్సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః !
మయ్యర్పితమనోబుద్ధిః యో మద్భక్తస్సమే ప్రియః !! 14

సంతుష్టః - సతతం - యోగీ - యతాత్మా - ధృఢనిశ్చయః !
మయి - అర్పితమనోబుద్ధిః - యః - మద్భక్తః - సః - మే - ప్రియః


సతతం - సదా, సంతుష్టః - సంతృప్తి చెందినవాడు, యోగీ - యోగయుక్తుడు, యతాత్మా - ఆత్మనిగ్రహము కలవాడు, దృఢ నిశ్చయః - ధృఢసంకల్పము గలవాడు, మయి - నాయందు, అర్పిత మనోబుద్ధిః - నిలిపిన మనోబుద్ధులు గలవాడు, మద్భక్తః - నా భక్తుడు, యః - ఎవరో, సః - వాడు, మే - నాకు, ప్రియః - ప్రియుడు.

సర్వకాల సర్వావస్థలయందును సంతుష్టుడై యుండు యోగియు, శరీరేంద్రియ మనస్సులను వశము నందుంచుకొనినవాడును, నాయందు దృఢమైన నిశ్చయము గలవాడును, అయి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ఇష్టుడు.

యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః !
హర్శామర్షభయోద్వేగైః ముక్తోయస్స చ మే ప్రియః !! 15

యస్మాత్ - న - ఉద్విజతే - లోకః - లోకాత్ - న - ఉద్విజతే - చ - యః
హర్శామర్షభయోద్వేగైః - ముక్తః - యః - సః - చ - మే - ప్రియః - ప్రియుడు.


యస్మాత్ - ఎవనివలన, లోకః - లోకము,న ఉద్విజతే - భయపడదో, లోకాత్ చ - లోకము వలన, యః - ఎవడు, న ఉద్విజతే - భయపడడో, హర్శామర్షభయోద్వేగైః - సంతోషము, క్రోధము భయము, ఉద్వేగముల నుండి, ముక్తః - ముక్తుడు, యః - ఎవడో, సః చ - వాడును, మే - నాకు, ప్రియః - ప్రియుడు.

లోకమున ఎవరికిని ఉద్వేగము కలిగింపనివాడును, ఎవరివలనను తాను ఉద్వేగమునకు గురికానివాడును, హర్షము, ఈర్ష్య, భయము మున్నగు వికారములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు.

అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః !
సర్వారంభపరిత్యాగీ యోమద్భక్తస్స మే ప్రియః !! 16

అనపేక్షః - శుచిః - దక్షః - ఉదాసీనః - గతవ్యథః
సర్వారంభపరిత్యాగీ - యః - మద్భక్తః - సః - మే - ప్రియః 


అనపేక్షః - కోరికలేనివాడు, శుచిః - పరిశుద్ధుడు, దక్షః - సమర్థుడు, ఉదాసీనః - నిర్లిప్తుడు, గతవ్యథః - అంతరించిన విచారము గలవాడు, సర్వారంభపరిత్యాగీ - సర్వకర్మల లోని కర్తృత్వము విడిచినవాడు, మద్భక్తః - నా భక్తుడు, యః - ఎవడో, సః - వాడు, మే - నాకు, ప్రియః - ప్రియుడు.

ఏ మాత్రమూ కాంక్షలేనివాడును, శరీరేంద్రియమనస్సుల యందు శుచియై యున్నవాడును, దక్షుడును, పక్షపాతరహితుడును, ఎట్టి దుఃఖములకును చలింపనివాడును, సమస్తకర్మలయందును కర్తృ త్వాభిమానములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు.

యోన హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి !
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః !! 17

యః - న - హృష్యతి - న - ద్వేష్టి - న - శోచతి - న - కాంక్షతి
శుభాశుభ పరిత్యాగీ - భక్తిమాన్ - యః - సః - మే - ప్రియః


యః - ఎవడు, న హృష్యతి - సంతసింపడో, న ద్వేష్టి - ద్వేషింపడో, న శోచతి - శోకింపడో, న కాంక్షతి - అభిలషింపడో, శుభాశుభపరిత్యాగీ - శుభాశుభ కర్మములను విడిచినవాడైన, భక్తిమాన్ - భక్తుడు, యః - ఎవడో, సః - వాడు, మే - నాకు, ప్రియః - ఇష్టుడు.

ఇష్టవస్తుప్రాప్తికి పొంగిపోనివాడును, దేనియందును ద్వేషభావము లేనివాడును, దేనికినీ శోకింపనివాడును, దేనినీ ఆశింపనివాడును, శుభాశుభకర్మలను త్యజించిన వాడును, ఐన భక్తుడు నాకు ఇష్టుడు.

సమశ్శత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః !
శీతోష్ణసుఖదుఃఖేషు సమస్సంగవివర్జితః !! 18

సమః - శత్రౌ - చ - మిత్రే - చ - తథా - మానాపమానయోః
శీతోష్ణ - సుఖదుఃఖేషు - సమః - సంగవివర్జితః


శత్రౌచ - శత్రువునందును, మిత్రేచ - మిత్రునియందును, తథా - అటులే, మానాపమానయోః - మానావమానముల యందును, సమః - సముడు, శీతోష్ణసుఖదుఃఖేషు సమః - శీతోష్ణముల యందును, సుఖదుఃఖముల యందును సముడు, సంగవివర్జితః - సంగత్వము లేనివాడు, తుల్య నిందాస్తుతిః - నిందాస్తుతులను సమముగా నెంచువాడు, మౌనీ - మననశీలుడు, యేనకేనచిత్ - దేని చేతనైనను, సంతుష్టః - తృప్తి నొందినవాడు, అనికేతః - ఇల్లు లేనివాడు, స్థిరమతిః - స్థిరబుద్ధి గలవాడు, భక్తిమాన్ - భక్తిమంతుడు నైన, నరః - మానవుడు, మే - నాకు, ప్రియః - ఇష్టుడు.

శత్రువులయెడను, మిత్రులయెడను సమభావముతో మెలుగువాడును, మానావమానములు, శీతోష్ణములు, సుఖదుఃఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును, ఆసక్తిరహితుడును...

తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ !
అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియః నరః !! 19

తుల్యనిందాస్తుతిః - మౌనీ - సంతుష్టః - యేన - కేనచిత్
అనికేతః - స్థిరమతిః - భక్తిమాన్ - మే - ప్రియః - నరః


నిందాస్తుతులకు చలింపనివాడును, మననశీలుడును, శరీరనిర్వహణకై లభించిన దానితోడనే తృప్తిపడు వాడును, గృహాదుల యందు మమతాసక్తులు లేనివాడును, స్థిరబుద్ధి కలిగియుండు భక్తుడెవ్వడో వాడు నా కిష్టుడు.

యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే !
శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తే తీవ మే ప్రియాః !!
20

యే - తు - ధర్మ్యామృతం - ఇదం - యథా - ఉక్తం - పర్యుపాసతే
శ్రద్ధధానాః - మత్పరమాః - భక్తః - తే - అతీవ - మే - ప్రియాః

యే తు - ఎవరయితే, శ్రద్ధాధానాః - శ్రద్ధగలవారై, మత్పరమాః - నాయందాసక్తిగలవారై, యథా ఉక్తం - పైన తెలిపిన విధముగా, ఇదం - ఈ, ధర్మ్యామృతం - ధర్మరూపమైన అమృతమును, పర్యుపాసతే - సేవించుచున్నారో, తే - ఆ, భక్తాః - భక్తులు, మే - నాకు, అతీవప్రియాః - మిగుల ఇష్టులు.

శ్రద్ధావంతులై, నన్నేపరమగతిగాభావించి, ఇంతవరకు నే తెలిపిన ఈ ధర్మస్వరూపమైన అమృతమును ఎవరు సేవిస్తున్నారో వారు నాకు అత్యంత ప్రియులు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జునసంవాదే భక్తియోగోనామ
ద్వాదశోధ్యాయః !!