Read more!

భగవద్గీత పార్ట్ - 19

 

యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః
విశంతినాశాయ సమృద్ధవేగాః !
తథైవ నాశాయ విశంతి లోకాః
తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః !! 29

యథా - ప్రదీప్తం - జ్వలనం - పతంగాః - విశంతి - నాశాయ - సమృద్ధవేగాః
తథా - ఏవ - నాశాయ - విశంతి - లోకాః - తవ - అపి - వక్త్రాణి - సమృద్ధవేగాః


పతంగాః - మిడుతలు, ప్రదీప్తం - మండుచున్న, జ్వలనం - అగ్నిని, సమృద్ధవేగాః - అతివేగము గలవియై, యథా - ఏ రీతి, నాశాయ - నాశము కొరకు, విశంతి - ప్రవేశించు చున్నవో, తథా ఏవ - ఆ రీతినే, లోకాః అపి - జనసమూహములును, సమృద్ధవేగాః - అతివేగము గలవియై, తవ - నీయొక్క, వక్త్రాణి - ముఖములను, నాశాయ - నాశము కొరకు, విశంతి - ప్రవేశించుచున్నవి.

మిడుతలన్నియును మోహవశమున బాగుగా మండుచున్న అగ్నివైపు అతివేగముగా పరుగెత్తి, తమ నాశనము కొఱకు అందు ప్రవేశించి, నశించునట్లు ఈ వీరులందఱును తమనాశమునకై అతివేగముగా పరుగెత్తి, నీ నోళ్ళయందు నాశముగోరి ప్రవేశించుచున్నారు.

లేలిహ్యసే గ్రసమానః సమంతాత్
లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః !
తేజోభిరాపూర్వ జగత్ సమగ్రం
భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో !! 30

లేలిహ్యసే - గ్రసమానః - సమంతాత్ - లోకాన్ - సమగ్రాన్ - వదనైః - జ్వలద్భిః
తేజోభిః - అపూర్వం - జగత్ - సమగ్రం - భాసః - తవ - ఉగ్రాః - ప్రతపంతి - విష్ణో


విష్ణో - విష్ణుమూర్తీ, జ్వలద్భిః - మండుచున్న, వదనైః - నోరులచేతను, సమంతాత్ - అన్నివైపుల నుండి, సమగ్రాన్ - సమస్తమైనట్టి, లోకాన్ - లోకములను, గ్రసమానః - మ్రింగుచు, లేలిహ్యసే - ఆస్వాదించుచున్నావు, తవ - నీయొక్క, ఉగ్రాః - ప్రచండమైన, భాసః - కాంతులు, సమగ్రం - సమస్తమైన, జగత్ - జగత్తును, తేజోభిః - కాంతులచేత, అపూర్వ - నింపి, ప్రతపంతి - తపింపచేయుచున్నవి.

హే విష్ణో ! ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను అన్నివైపుల నుండి కబళించుచు మాటిమాటికిని చప్పరించుచున్నావు. నీ ఉగ్రతేజస్సులు సమస్తమైన జగత్తును తపింపజేయు చున్నవి.

ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో
నమోస్తుతే దేవవర ప్రసీద !
విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం
న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్ !! 31

ఆఖ్యాహి - మే - కః - భవాన్ - ఉగ్రరూపః - నమః - అస్తు - తే - దేవవర - ప్రసీద
విజ్ఞాతుం - ఇచ్ఛామి - భవంతం - ఆద్యం - న - హి - ప్రజానామి - తవ - ప్రవృత్తిం


దేవవర - దేవదేవా, ఉగ్రరూపః - భయంకర రూపుడవైన, భవాన్ - నీవు, కః - ఎవరో, మే - నాకు, ఆఖ్యాహి - చెప్పుము, తే - నీకొఱకు, నమః అస్తు - వందనము అగుగాక, ప్రసీద - ప్రసన్నుడవగుము, ఆద్యం - ఆదిపురుషుడవైన, భవంతం - నిన్ను, విజ్ఞాతుం - తెలిసికొను, ఇచ్ఛామి - కోరుచున్నాను, తవ - నీయొక్క, ప్రవృత్తిం - ప్రవర్తనమును, న ప్రజానామి హి - తెలియలేకున్నాను.

ఓ పరమాత్మా ! నీకు నా నమస్కారములు - ప్రసన్నుడవు కమ్ము. ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆదిపురుషుడవైన నిన్ను విశదముగా తెలిసికొనగోరుచున్నాను. ఏలనన నీ ప్రవృత్తి నాకు భోధపడుటలేదు.

శ్రీభగవాన్ ఉవాచ:-
కాలోస్మిలోకక్షయకృత్ ప్రవృద్ధో
లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః !
ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే
యేవస్థితాః ప్రత్యనీకేషు యోధాః !! 32

కాలః - అస్మి - అస్మి - లోకక్షయకృత్ - ప్రవృద్ధః - లోకాన్ - సమాహర్తుం - ఇహ - ప్రవృత్తః
ఋతే - అపి - త్వాం - న - భవిష్యంతి - సర్వే - యే - అవస్థితాః - ప్రత్యనీకేషు - యోధాః


లోకక్షయకృత్ - లోకసంహారకుడనై, ప్రవృద్ధః - వృద్ధిచెందిన, కాలః - కాలుడును, అస్మి - అయియున్నాను, ఇహ - ఇప్పుడు, లోకాన్ - లోకములను, సమాహర్తుం - సంహరించుటకు, ప్రవృత్తః - ప్రవర్తించినవాడను, యే - ఏ, యోధాః - యోధులు, ప్రత్యనీకేషు - ప్రతిపక్ష సైన్యములందు, అవస్థితాః - ఉండిరో, సర్వే - వారందరు, త్వాం ఋతే అపి - నీవు లేకపోయినను, న భవిష్యంతి - ఉండరు.

శ్రీ భగవానుడు పలికెను నేను లోకముల నన్నింటిని తుదముట్టించుటకై విజృంభించి మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొని యున్నాను. కనుక నీవు యుద్ధము చేయకున్నన్నూ ప్రతిపక్షమున నన్ను ఈ వీరులెవ్వరును జీవించియుండరు.

తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ
జేత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధమ్ !
మయైవైతే విహతాః పూర్వమేవ
నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ !! 33

తస్మాత్ - అందువలన, త్వం - నీవు, ఉత్తిష్ఠ - లెమ్ము, శత్రూన్ - శత్రువులను, జిత్వా - జయించి, యశః - కీర్తిని, లభస్వ - పొందుము, సమృద్ధం - సమృద్ధం - సంపూర్ణమగు, రాజ్యం - రాజ్యమును, భుంక్ష్వ - అనుభవింపుము, ఏతే - ఈ, మయా ఏవ - నా చేతనే, పూర్వమే - పూర్వమే, నిహతాః - చంపబడిరి, సవ్యసాచిన్ - అర్జునా, నిమిత్తమాత్రం - నిమిత్త,మాత్రం - నిమిత్తమాత్రుడవు, భవ - కమ్ము.

కాబట్టి ఓ సవ్యసాచీ ! లెమ్ము, కీర్తి గాంచుము. శత్రువులను జయించి సర్వసంపదలతో తులతూగు రాజ్యమును అనుభవింపుము. వీరందఱును నా చేత మునుపే చంపబడియున్నారు. నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము.

ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథాన్యానపి యోధవీరాన్ !
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ !! 34

ద్రోణం - చ - భీష్మం - చ - జయద్రథం - చ - కర్ణం - తథా - అన్యాన్ - అపి - యోధవీరాన్
మయా - హతాన్ - త్వం - జహి - మా - వ్యథిష్ఠాః - యుధ్యస్వ - జేతాసి - రణే - సపత్నాన్.


మయా - నాచేత, హతాన్ - చంపబడిన, ద్రోణం చ - ద్రోణుని, భీష్ముని, జయద్రథం చ - జయద్రథుని, కర్ణం - కర్ణుని, తథా - అటులనే, అన్యాన్ - ఇతరులైన, యోధవీరాన్ అపి - యోధవీరులను సైతము, త్వం - నీవు, జహి - చంపుము, మావ్యధిష్ఠాః - విచార పడకుము, యుధ్యస్వ - యుద్ధము చేయుము, రణే - యుద్ధమునందు, సపత్నాన్ - శత్రువులను, జేతాసి - జయింపగలవు.

ఇది వరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ కర్ణాది యుద్ధ వీరులందరిని నీవు సంహరింపుము. భయపడకుము. రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు. కనుక యుద్ధము చేయుము.

సంజయ ఉవాచ :-
ఏతచ్ర్ఛుత్వా వచనం కేశవస్య
కృతాంజలిర్వేపమానః కిరీటీ !
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం
సాగద్గదం భీతభీతః ప్రణమ్య !! 35

ఏతత్ - శ్రుత్వా - వచనం - కేశవస్య - కృతాంజలిః - వేపమానః - కిరీటి
నమస్కృత్వా - భూయః - ఏవ - ఆహ - కృష్ణం - సగద్గదం - భీతభీతః - ప్రణమ్య


కిరీటీ - అర్జునుడు, కేశవస్య - శ్రీకృష్ణుని యొక్క, ఏతత్ - ఈ, వచనం - వాక్యమును, శ్రుత్వా - విని, కృతాంజలిః - చేతులు జోడించిన వాడును, వేపమానః - వణుకుచున్న వాడునై, కృష్ణం - కృష్ణుని, నమస్కృత్వా - నమస్కరించి, ప్రణమ్య - వినమ్రుడై, భీతభీతః - మిగుల భయపడుచు, సగద్గదం - గద్గద స్వరముతో, భూయః ఏవ - మరలా, ఆహ - పలికెను.

సంజయుడు పలికెను ఓ రాజా! శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలను విని, అర్జునుడు వణకుచు, చేతులు జోడించి నమస్కరించెను, మరల మిక్కిలి భయముతో ప్రణమిల్లి, గద్గదస్వరముతో తడబడుచు ఇలా పలికెను.

అర్జున ఉవాచ :-
స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రాహృష్యత్యనురజ్యతే చ !
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః !! 36

స్థానే - హృషీకేశ - తవ - ప్రకీర్త్యా - జగత్ - ప్రహృష్యతి - అనిరజ్యతే - చ
రక్షాంసి - భీతాని - దిశః - ద్రవంతి - సర్వే - సమస్యంతి - చ - సిద్ధసంఘాః


హృషీకేశ - కృష్ణా, తవ - నీయొక్క, ప్రకీర్త్యా - మాహత్మ్యముచేత, జగత్ - జగత్తు, ప్రహృష్యతి - సంతసించుచున్నది, అనురజ్యతే చ - అనురాగమును పొందుచున్నది, రక్షాంసి - రాక్షసులు, భీతాని - భయపడిన వారలై, దిశః - దిక్కులను గూర్చి, ద్రవంతి - పరుగిడుచున్నారు, సర్వే - సమస్తమైన, సిద్ధసంఘాః -  సిద్ధసంఘములు, నమస్యంతి చ - నమస్కారము చేయుచున్నవి, స్థానే - తగియున్నది.

అర్జునుడు పలికెను ఓ అంతర్యామీ ! కేశవా ! నీమహత్యముచేత జగత్తు హర్షాతికములతో, అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకును పారిపోవుచున్నారు. సిద్ధగణముల వారెల్లరును ప్రణమిల్లు చున్నారు.

కస్మాచ్చ తే న నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రాహ్మణోపాదికర్త్రే !
అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్ తత్పరం యత్ !! 37

కస్మాత్ - చ - తే - న - నమేరన్ - మహాత్మన్ - గరీయసే - బ్రహ్మణః - అపి - ఆదికర్త్రే
అనంత - దేవేశ - జగన్నివాస - త్వం - అక్షరం - సత్ - అసత్ - తత్పరం - యత్


మహాత్మన్ - మహాత్మా, అనంత - అనంతుడా, దేవేశ - దేవదేవ, జగన్నివాస - జగదంతర్యామీ, సత్ - సత్తు, అసత్ చ - అసత్తును, యత్ - ఏదో, తత్పరం - డానికి పరమైన, అక్షరం - అక్షరబ్రహ్మము, త్వం - నీవు, అసి - అయియున్నావు, బ్రహ్మణః అపి - బ్రహ్మకును, ఆదికర్త్రే - మూలకర్తవు, గరీయసే - గొప్పవాడవునైన, తే - నీకొరకు, కస్మాత్ - ఏల, న నమేరన్ - నమస్కరింపకుందురు.

ఓ మహాత్మా ! నీవు సర్వశ్రేష్ఠుడవు. సృష్టికర్తయైన బ్రహ్మకే మూలకారకుడవు కనుక వారు (సిద్దాదులందఱును) నీకు నమస్కరింపక ఎట్లుండగలరు? ఓ అనంతా! ఓ దేవేశా! సత్ అసత్ లు నీవే. వాటి కంటెను పరమైన అక్షరస్వరూపుడవు అనగా పరబ్రహ్మవు నీవే. నిన్ను ఎవరు నమస్కరింపకుందురు.

త్వమాదిదేవః పురుషః పురాణః
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ !
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ
త్వయా తతం విశ్వమనంతరూప !! 38

త్వం - ఆదిదేవః - పురుషః - పురాణ - త్వం - అస్య - విశ్వస్య - పరం - నిదానం
వేత్తా - అసి - వేద్యం - చ - పరం - చ - ధామ - త్వయా - తతం - విశ్వం - అనంతరూప


అనంతరూప - అనంతరూపుడా, త్వం - నీవు, ఆదిదేవః - ఆదిదేవుడవు, పురాణః - సనాతనుడవైన, పురుషః - పురుషుడవు, త్వం - నీవు, అస్య - ఈ, విశ్వస్య - విశ్వమునకు, పరం - ఉత్తమమైన, నిధానం - ఆశ్రయానివి, వేత్తా - సర్వజ్ఞుడవు, వేద్యం చ - తెలియదగిన విషయమును, పరం చ - పొందదగిన, ధామ - ధామము, అసి - అయియున్నావు, విశ్వం - విశ్వము, నీచేత, తతం - వ్యాప్తమై యున్నది.

ఓ అనంతరూపా ! నీవు ఆదిదేవుడవు, సనాతనపురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు. సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరంధాముడవు. ఈ జగత్తు అంతయును నీచేత వ్యాప్తమై యున్నది.

వాయుర్యమోగ్నిర్వరుణ శ్శాశాంకః
ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ !
నమో నమస్తేస్తు సహస్రకృత్వః
పునశ్చ భూయోపి నమో నమస్తే !! 39

వాయుః - యమః - అగ్నిః - వరుణః - శశాంకః - ప్రజాపతిః - త్వం - ప్రపితామహః - చ
నమః - నమః - తే - అస్తు - సహస్రకృత్వః - పునః - చ - భూయః - అపి - నమః - నమః - తే


త్వం - నీవు, వాయుః - వాయువు, యమః - యముడవు, అగ్నిః - అగ్నివి, వరుణః - వరుణుడవు, శశాంకః - చంద్రుడవు, ప్రజాపతిః - ప్రజాపతిని, ప్రపితామహః చ - ముత్తాతవును, తే - నీకొరకు, సహస్రకృత్వః - వేయిసారులు, నమో నమః -  నమస్కారములు, అస్తు - అగుగాక, పునః చ - మరల, భూయః అపి -  మరల కూడా, తే - నీకొరకు, నమోనమః - నమస్కారములు.

నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతియైన బ్రహ్మవు. బ్రహ్మకును జనకుడవు. నీకువేలకొలది నమస్కారములు. మరల నమస్కారములు. ఇంకను నమస్కారములు.

నమః పురస్తాదథ పృష్ఠతస్తే
నమోస్తుతే సర్వత ఏవ సర్వ !
అనంతవీర్యామితవిక్రమస్త్వం
సర్వం సమాప్నోషితతోసి సర్వః !! 40

నమః - పురస్తాత్ - అథ - పృష్ఠతః - తే - నమః - అస్తు - తే - సర్వ
అనంతవీర్య - అమితవిక్రమః - త్వం - సర్వం - సమాప్నోషి - తతః - అసి - సర్వః


సర్వ - సర్వస్వరూపుడా, పురస్తాత్ - ముందు, పృష్ఠత - వెనుక, తే - నీకు, నమః - నమస్కారము, అథ - అటుపిమ్మట, సర్వతః ఏవ - అన్నివైపులను తే - నీ కొరకు, నమః - నమస్కారము, అస్తు - అగుగాక, త్వం - నీవు, అనంత - అపరిమితమైన, విర్యామిత విక్రమః - శక్తిసామర్థ్యములు గలవాడవు, సర్వం - సర్వమును, సమాప్నోషి - వ్యాపించి యున్నావు, తతః - అందువలన, సర్వః - సర్వస్వస్వరూపుడవు, అసి - అయియున్నావు.

అనంతసామర్థ్యముగలవాడా ! నీవు ఎదురుగా ఉండియు, వెనుక నుండియు నమస్కరించుచున్నాను. ఓ సర్వాత్మా! నీకు అన్నివైపుల నుండియు నమస్కారములు. ఏలనన అనంతపరాక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించి యున్నవాడవు. అందుచేతచే సర్వడనబడుచున్నావు.

సఖేతి మత్వా ప్రసభం యదుక్తం
హే కృష్ణ ! హే యాదవ ! హే సఖేతి !
అజానతా మహిమానం తవేదం
మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి !! 41

సఖా - ఇతి - మత్వా - ప్రసభం - యత్ - ఉక్తం - హే - కృష్ణ - హే - యాదవ - హే - సఖే - ఇతి
అజానతా - మహిమానం - తవ - ఇదం - మయా - ప్రమాదాత్ - ప్రణయేన - వా - అపి


తవ - నీయొక్క, ఇదం - ఈ, మహిమానం - మాహాత్మ్యమును, అజానతా - తెలియక, మయా - నాచేత, ప్రమాదాత్ - ఆకాస్మికంగా గాని, ప్రణయేన వా అపి - ప్రేమచేతగాని, సఖా ఇతి మత్వా - స్నేహితుడవని భావించి, ప్రసభం - నిర్లక్ష్యముగను హే కృష్ణ - హే కృష్ణా, హే యాదవ - హే యాదవుడా, హేసఖే - హే మిత్రుడా, ఇతి - అని, యత్ - ఏది, ఉక్తం - చెప్పబడినదో....

యచ్చాపహాసార్థమసత్కృతోసి
విహారశయ్యాసనభోజనేషు !
ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం
తత్ క్షమయే త్వామహమప్రమేయమ్ !! 42

యత్ - చ - అవహాసార్థం - అసత్కృతః - అసి - విహారశయ్యాసనభోజనేషు
ఏకః - అథవా - అపి - అచ్యుత - తత్సమక్షం - తత్ - క్షమమే - త్వాం - అహం - అప్రమేయం


అచ్యుత - అచ్యుతడా, విహారశయ్యాసన, భోజనేషు - విహారములయందును, పడకయందును, కూర్చొనుటయందును,  భోజనము లందును, అవహాసార్థం - పరిహాసమునకై, ఏకః - ఒంటరిగా నున్నప్పుడు, అథవా అపి - వెనుకను, తత్సమక్షం - పరులముందుగాని, అసత్కృతః  అసి - అవమానింప బడితివి, యత్ చ - ఏదో, తత్ - దానినంతయును, అప్రమేయం - అప్రమేయుడవైన, త్వాం - నిన్ను, అహం - నేను, క్షమయే - క్షమము గోరుచున్నాను.

నీ మహిమను ఎరుగక నిన్ను నా సఖునిగా భావించి, చనువుచేగాని, పొరపాటువలన గాని, ఓ కృష్ణా ! ఓ యాదవా! ఓ మిత్రమా ! అనుచు తొందరపాటుతో ఆలోచింపక, నేను నిన్ను సంబోధించి ఉంటిని. ఓ అచ్యుతా ! విహారశయ్యాసన భోజనాది సమయముల యందు ఏకాంతమునగాని, అన్యసఖుల సమక్షమున గాని సరసమునకై పరిహాసములాడి, నేను నిన్ను కించపరచి యుండవచ్చును. ఓ అప్రమేయస్వరూపా! నా అపరాధముల నన్నింటిని క్షమింపుమని నిన్ను వేడుకొనుచున్నాను.

పితాసి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజశ్చ గురుర్గరీయాన్ !
న త్వత్సమో స్త్వభ్యదికః కుతోన్యో
లోకత్రయోప్యప్రతిమప్రభావ !! 43

పితా - అసి - లోకస్య - చరాచరస్య - త్వం - అస్య - పూజ్యః - చ - గురుః - గరీయాన్
న - త్వత్సమః - అస్తి - అభ్యధికః - కుతః - అన్యః - లోకత్రయే - అపి - అప్రతిమ ప్రభావ


అప్రతిమప్రభావ - అతిశయ ప్రభావము గల ఓ కృష్ణా, త్వం -  నీవు, అస్య - ఈ, చరాచరస్య - చరాచర స్వరూపమైన, లోకస్య - లోకమునకు, పితా అసి - తండ్రివి, పూజ్యః - పూజ్యుడవు, గురుః - గురువు, గరీయాన్ చ - గొప్పవాడవును, అసి - అయియున్నావు, లోకత్రయే అపి - ముల్లోకములయందును, త్వత్సమః - నీకు సమానుడు, న అస్తి - లేడు, అభ్యదికః - అధికుడైన, అన్యః - ఇతరుడు, కుతః - ఎక్కడున్నాడు.

ఓ అనుపమప్రభావా ! ఈ సమస్త చరాచరజగత్తునకు నీవే తండ్రివి. నీవు పూజ్యుడవు. గురుడవు. సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకముల యందును నీతో సమానుడెవ్వడును లేడు. ఇంక నిన్ను మించిన అధికుడెట్లుండును?

తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్ !
పితేవ పుత్రస్య సఖేన సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్ !! 44

తస్మాత్ - ప్రణమ్య - ప్రణిధాయ - కాయం - ప్రసాదయే - త్వాం - అహం - ఈశం - ఈడ్యం
పితా - ఇవ - పుత్రస్య - సఖా - ఇవ - సఖ్యుః - ప్రియః - ప్రియాయాః - అర్హసి - దేవ - సోఢుం


తస్మాత్ - అందువలన, ఈశం - ఈశుడవు, ఈడ్యం - ప్రస్తుతింపదగిన వాడవు, త్వాం - నిన్ను గూర్చి, అహం - నేను, కాయం - శరీరమును, ప్రణిధాయ - వంచి, ప్రణమ్య - ప్రణమిల్లి, ప్రసాదయే - అనుగ్రహింప వేడుచున్నాను, దేవ - కృష్ణా, పుత్రస్య - పుత్రుని తప్పును, పితా ఇవ - తండ్రివలెను, సఖ్యుః - సఖుని తప్పును, సఖా ఇవ - సఖుని వలెను, ప్రియాయాః - ప్రియురాలి తప్పును, ఇవ - ప్రియునివలెను, సోఢుం - సహించుటకు, అర్హసి - తగియున్నావు.

కనుక ఓ ప్రభూ ! నా శరీరమును నీపాదములకడనిడి, సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. స్తవనీయుడవు. సర్వేశ్వరుడవు ఐన నీవు నాయందు ప్రసన్నుడవగుటకై నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా ! కుమారుని తండ్రి క్షమించినట్లును, మిత్రుని మిత్రుడు క్షమించినట్లును, భార్యను భర్త క్షమించునట్లును, నా అపరాధములను నీవు క్షమింపుము.

అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా
భయేన చ ప్రవ్యథితం మనోమే !
తదేన మే దర్శయ దేవరూపం
ప్రసీద దేవేశ జగన్నివాస !! 45

అదృష్టపూర్వం - హృషితః - అస్మి - దృష్ట్వా - భయేన - చ - ప్రవ్యథితం - మనః - మే
తత్ - ఏవ - మే - దర్శయ - దేవరూపం - ప్రసీద - దేవేశ - జగన్నివాస


అదృష్టపూర్వం - పూర్వమెన్నడూ దర్శించని రూపమును, దృష్ట్వా - చూచి, హృషితః - సంతసించివాడవు, అస్మి - అగుచున్నాను, మే - నాయొక్క, మనః - మనస్సు, భయేన - భయము చేత, ప్రవ్యథితం చ - బాధింపబడుచున్నది, దేవేశ - దేవదేవా, జగన్నివాస - జగదాశ్రయా, మే - నాకు, తత్ - అపూర్వపు, దేవరూపం  ఏవ - దివ్యరూపమునే, దర్శయ - చూపుము, ప్రసీద - కరుణింపుము.

మునుపు ఎన్నడును చూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమును గాంచి, మిక్కిలి సంతసించితిని. కాని భయముచే నామనస్సు కలవరపాటు పొందినది. కనుక చతుర్భుజయుక్తుడవై విష్ణురూపముతోడనే నాకు దర్శనమిమ్ము. ఓ దేవేశా ! జగన్నివాసా ! కరుణించుము.

కిరీటినం గదినం చక్రహస్తమ్
ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ !
తేనైవ రూపేణ చతుర్భుజేన
సహస్రబాహో ! భవ విశ్వమూర్తే ! 46

కిరీటినం - గదినం - చక్రహస్తం - ఇచ్ఛామి - త్వా - ద్రష్టుం - అహం - తథా - ఏవ
తేన - ఏవ - రూపేణ - చతుర్భుజేన - సహస్రబాహో - భవ - విశ్వమూర్తే


విశ్వమూర్తే - విశ్వరూపా, అహం - నేను, కిరీటినం - కిరీటముగలవాడవు, గదినం - గద గలవాడవు, చక్రహస్తం - చక్రహస్తుడవు అగు, త్వాం - నిన్ను, ద్రష్టుం - గాంచుటకు, ఇచ్ఛామి - కోరుచున్నాను, తథా ఏవ - అటులనే, సహస్రబాహో - సహస్ర బాహువులు గలవాడా, చతుర్భుజేన - నాలుగు భుజములు గల, తేన - ఆ, రూపేణ ఏవ - రూపముతోనే, భవ - ఉండుము.

కిరీటమును, గదను, శంఖచక్రములను ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహూ ! విశ్వమూర్తి ! నీ చతుర్భుజరూపమును నాకు చూపుము.

శ్రీభగవాన్ ఉవాచ:-
మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ !
తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్ !! 47

మయా - ప్రసన్నేన - తవ - అర్జున - ఇదం - రూపం - పరం - దర్శితం - ఆత్మయోగాత్
తేజోమయం - విశ్వం - అనంతం - ఆద్యం - యత్ - మే - త్వదన్యేన - న - దృష్టపూర్వం


అర్జున - అర్జునా, మే - నాయొక్క, యత్ - ఏ, తేజోమయం - తేజోమయమును, విశ్వం - విశ్వము, అనంతం - అనంతమైనదియు, ఆద్యం - ఆదియైనదియు, త్వత్ - నీ కంటెను, అన్యేన - ఇతరునిచేత, న దృష్టపూర్వం - ఇంతవరకు చూడబడనిదియు, పరం - పరమైనది యగు, ఇదం - ఈ, రూపం - రూపమును, తవ - నీకు, ప్రసన్నేన - ప్రసన్నుడనైన, మయా - నాచేత, ఆత్మయోగాత్ - ఆత్మయోగము వలన, దర్శితం - చూపబడినది.

శ్రీ భగవానుడు పలికెను ఓ అర్జునా ! నీపైగల అనుగ్రమున నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్ రూపమును ప్రదర్శించితిని. అది మిక్కిలి తేజోమయమైనది. అనంతమైనది, ఆద్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకు ముందు మరి యెవ్వరును దర్శించలేదు.

న వేదయజ్ఞాధ్యయనైర్నదానైః
న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః !
ఏవం రూపః శక్య అహం నృలోకే
ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర !! 48

న - వేదయజ్ఞాధ్వయనైః - దానైః - చ - క్రియాభిః - న - తపోభిః - ఉగ్రైః
ఏవం - రూపః - శక్యః - అహం - నృలోకే - ద్రష్టుం - త్వదన్యేన - కురుప్రవీర


కురుప్రవీర - అర్జునా, ఏవం రూపః - ఇటువంటి రూపము, అహం - నేను, నృలోకే - మనుష్య లోకమునందు, త్వదన్యేన - నీవుగాక ఇతరునిచేత, వేదయజ్ఞాధ్యయనైః - వేదాధ్యయనము చేతను, యజ్ఞములచేతను, దానైః - దానముల చేతను, న - కాను, క్రియాభిః చ - కర్మలచేతను, న - కామ, ఉగ్రైః - తీవ్రమైన, తపోభిః - తపస్సుల చేతను, ద్రష్టుం - చూచుటకు, న శక్యః - సాధ్యమైన వాడను గాను.

ఓ అర్జునా ! వేదాధ్యయనములచేగాని, యజ్ఞాచరణములచే గాని, దానములచేగాని, తీవ్రతపశ్చర్యలచేగాని, తదితర పుణ్య కర్మలచేగాని ఈ మానవలోకమున నా ఈ విశ్వరూపమును నీకు దప్ప మరియెవ్వరికిని చూడశక్యము గాదు.

మాతే వ్యథా మా చ విమూఢభావో
దృష్ట్వారూపం ఘోరమీదృజ్మమేదమ్ !
వ్యపేతభీః ప్రీతమానాః పునస్త్వం
తదేవ మే రూపమిదం ప్రపశ్య !! 49

మా - తే - వ్యథా - మా - చ - విమూఢభావః - దృష్ట్యా - రూపం - ఘోరం - ఈదృక్ - మమ - ఇదం
వ్యపేతభీః - ప్రీతమనాః - పునః - త్వం - తత్ - ఏవ - యే - రూపం - ఇదం - ప్రపశ్య


ఈదృక్ - ఇట్టి, ఘోరం - భయంకరమైన, మమ - నాయొక్క, ఇదం - ఈ, రూపం - రూపమును, దృష్ట్వా - చూచి, తే - నీకు, వ్యథా - భయము, మా - వలదు, విమూఢభావః చ - చిత్తసంక్షోభమున్ను, మా - వలదు, త్వం - నీవు, వ్యపేతభీః - భయము పోయినవాడవు, ప్రీతమనాః - తృప్తి చెందినవాడవై, మే - నాయొక్క, తదేవ - ఆ పూర్వపు, ఇదం - ఈ, రూపం - రూపమును, పునః - మరల, ప్రపశ్య - దర్శించుము.

ఈ విధమైన నా ఈ భయంకరరూపమును చూచి, నీవు ఎట్టి వ్యథకునుం మోహమునకును గురికావలదు. భయమును వీడి ప్రసన్నచిత్తుడవై శంఖచక్ర గదాపద్మములతో విలసిల్లుచున్న నా చతుర్భుజరూపమును మరల దర్శించుము.

ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా
స్వకం రూపం దర్శయామాస భూయః !
ఆశ్వాసయామాస చ భీతమేనం
భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా !! 50

ఇతి - అర్జునం - వాసుదేవః - తథా - ఉక్త్వా - స్వకం - రూపం - దర్శయామాస - భూయః
ఆశ్వాసయామాస - చ - భీతం - ఏనం - భూత్వా - పునః - సౌమ్యవపుః - మహాత్మా


మహాత్మా - మహాత్ముడైన, వాసుదేవః - శ్రీకృష్ణుడు, ఇతి - ఇటుల, అర్జునం - అర్జునుని గురించి, ఉక్త్వా - పలికి, తథా - అలాగుననే, స్వకం - తనదైన, రూపం - రూపమును, భూయః - మరల, దర్శయామాస - చూపెను, పునః - మరల, సౌమ్యవపుః - సౌమ్యస్వరూపుడు, భూత్వా - ఆయి, భీతం - భయపడిన, ఏనం - అర్జునుని, అశ్వాసయామాస చ - ఓదార్చెను.

సంజయుడు పలికెను వాసుదేవుడు ఈ విధముగా పలికి, అర్జునునకు తన చతుర్భుజరూపమున దర్శనమిచ్చెను. అనంతరము శ్రీకృష్ణపరమాత్మ సౌమ్యమూర్తియైన తన కృష్ణరూపమును స్వీకరించి, భయపడుచున్న అర్జునుని ఓదార్చెను.

అర్జున ఉవాచ :-
దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన !
ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః !! 51

దృష్ట్వా - ఇదం - మానుషం - రూపం - తవ - సౌమ్యం - జనార్ధన
ఇదానీం - అస్మి - సంవృత్తః - సచేతాః - ప్రకృతిం - గతః


జనార్దన - కృష్ణా, తవ - నీయొక్క, ఇదం - ఈ, మానుషం - మనుజసహజమైన, సౌమ్యం - ప్రసన్నమైన, రూపం - రూపమును, దృష్ట్వా - దర్శించి, ఇదానీం - ఇప్పుడు, సచేతాః - ప్రసన్న చిత్తము గలవాడను, ప్రకృతిం - స్వభావమును, గతః - పొందినవాడు, సంవృత్తః అస్మి - అయితిని.

అర్జునుడు పలికెను ఓ జనార్దనా ! మీ అతిసౌమ్యమైన మానవాకృతిని (శ్యామసుందరరూపమును) చూచి, ఇప్పుడు నా మనస్సు కుదుటబడినది. నేను నా స్వాభావిక ప్రసన్నతను పొందితిని.

శ్రీ భగవాన్ ఉవాచ  :-
సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ !
దేవా అప్యస్య నిత్యం దర్శనకాంక్షిణః !! 52

సుదుర్దర్శం - ఇదం - రూపం - దృష్టవాన్ - అపి - యత్ - మమ
దేవాః - అపి - అస్య - రూపస్య - నిత్యం - దర్శన కాంక్షిణః


మమ - నాయొక్క, యత్ - ఏదయితే, ఇదం - ఈ, సుదుర్దర్శం - చూడదుర్లభమైన, రూపం - రూపమును, దృష్టవాన్ - చూచినవాడవు, అసి - అయితివో, దేవాః అపి - దేవతలును, నిత్యం - ఎల్లప్పుడు, అస్య - ఈ, రూపస్య - రూపముయొక్క, దర్శనకాంక్షిణః - దర్శనమును కోరువారు.

శ్రీ భగవానుడు పలికెను నీవు చూచినా నా ఈ చతుర్భుజరూపము యొక్క దర్శనభాగ్యము అన్యులకు అంత్యంతదుర్లభము. దేవతలు సైతము ఈ రూపమును దర్శింపగోరుచుందురు.

నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా !
శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా !! 53

న - అహం - వేదైః - న - తపసా - న - దానేన - న - చ - ఇజ్యయా
శక్యః - ఏవంవిధః - ద్రష్టుం - దృష్టవాన్ - అసి - మాం - యథా


మాం - నన్ను, యథా - ఏవిధముగా, దృష్టవాన్ - చూచినవాడవు, అసి - అయితివో, ఏవం విధః - ఇట్టి స్వరూపము గల, అహం - నేను, వేదైః - వేదములచేతను, తపసా - తపస్సుచేతను, ద్రష్టుం - దర్శించుటకు, న శక్యః - శక్యుడను గాను, దానేన - దానముచేతను, ఇజ్యయా చ - యజ్ఞము చేతను, న - కాను.

నీవు గాంచిన నా రూపమును దర్శించుటకు వేదపఠనములచే గాని, తపశ్చర్యలచేగాని, దానములచే గాని, యజ్ఞకర్మలచేగాని, దర్శింప శక్యముగాదు.

భక్త్వాత్వనన్యయా శక్యః అహమేవంవిధోర్జున !
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరంతప !! 54

భక్త్యా -  తు - అనన్యయా - శక్యః - అహం - ఏవం - విధః అర్జున
జ్ఞాతుం - ద్రష్టుం - చ - తత్త్వేన - ప్రవేష్టుం - చ - పరంతప 


పరంతప - అర్జునా, ఏవం విధః - ఇట్టి విశ్వరూపుడవైన, అహం - నేను, అనన్యయా - అనన్యమైన, భక్త్యా తు - భక్తిచేతనే, తత్త్వేన - యథార్థముగ, జ్ఞాతుం - తెలిసికొనుటకు, ద్రష్టుం చ - చూచుటకును, ప్రవేష్టుం చ - ప్రవేశించుటకును, శక్త్యః - శక్యుడను, అర్జున - అర్జునా.

కాని ఓ పరంతపా ! అర్జునా ! ఇట్టి నా రూపమును ప్రత్యక్షముగా చూచుటకును, తత్త్వజ్ఞానమును పొందుటకును, అందు ప్రవేశించుటకును కేవలము అనన్యభక్తి యే సాధనము.

మత్కర్మకృత్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః !
నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ !! 55

మత్కర్మకృత్ - మత్పరమః - మద్భక్తః - సంగవర్జితః
నిర్వైరః - సర్వభూతేషు - యః - సః - మాం - ఏతి - పాండవ


పాండవ - అర్జునా, మత్కర్మకృత్ - నా కొరకు కర్మలు చేయువాడు, మత్పరమః - నాయందాసక్తి గలవాడు, మద్భక్తః - నాయందే భక్తి గలవాడు, సంగవర్జితః - సంగమును విడిచినవాడు, సర్వభూతేషు - సమస్త భూతములందును, నిర్వైరః - వైరము లేనివాడును, యః - ఎవడో, సః వాడు, మాం - నన్ను, ఏతి - పొందుచున్నాడు.


అర్జునా ! కర్తవ్యకర్మలను అన్నింటిని నాకే అర్పించు వాడును, మత్పరాయణుడును, నాయందు భక్తిశ్రద్ధలు గలవాడును, ప్రాపంచిక విషయములయందు ఆసక్తిలేని వాడును, ఏ ప్రాణియందుణు ఏమాత్రము వైరాభావము లేనివాడును ఐన పరమ భక్తుడు మాత్రమే నన్ను పొందుచున్నాడు.

 

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జునసంవాదే విశ్వరూపసందర్శనయోగోనామ
ఏకాదశోధ్యాయః !!