Read more!

భగవద్గీత పార్ట్ - 18

 

అథ ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శన యోగః



అర్జున ఉవాచ :-
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ !
యత్త్వయోక్తం వచస్తేన మొహోయం విగతో మమ !! 1

మదనుగ్రహాయ - పరమం - గుహ్యం - అధ్యాత్మసంజ్ఞితం
యథ - త్వయా - ఉక్తం - కాచః - తేన - మోహః - అయం - విగతః - మమ 


మదనుగ్రహాయ - నన్ను అనుగ్రహించుటకొరకు, త్వయా - నీచేతను, పరమం - ఉత్కృష్టమైన, గుహ్యం - రహస్యమైన, అధ్యాత్మసంజ్ఞితం - అధ్యాత్మమైనది యును, యత్ - ఏ, వచః - వాక్యము, ఉక్తం - చెప్పబడినదో, తేన - దానిచేత, మమ - నాయొక్క, అయం - ఈ, మోహః - మోహము, విగతః - పోయినది.

అర్జునుడు పలికెను ఓ కృష్ణా! నన్ను అనుగ్రహింపదలచి అతిరహస్యమైన ఆధ్యాత్మికవిషయములను ఉపదేశించితివి. దానివలన నా మోహము పోయినది.

భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా !
త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయమ్ !! 2

భవాప్యయౌ - హి - భూతానాం - శ్రుతౌ - విస్తరశః - మయా
త్వత్తః - కమలపత్రాక్ష - మహాత్మ్యం - అపి - చ - అవ్యయం 


కమలపత్రాక్ష - శ్రీకృష్ణా, త్వత్తః - నీవలన, భూతానాం - భూతముల యొక్క, భవాప్యయౌ - ఉత్పత్తినాశములు, తే - నీ యొక్క, అవ్యయం - నాశరహితమైన, మహాత్మ్యం అపి చ - మహాత్మ్యముగూడ, విస్తరశః - విస్తారముగా, మయా - నాచేత, శ్రుతౌ హి - వినబడినవి గదా.

ఓ కమల ప్రత్రక్షా ! ఓ కృష్ణా ! సమస్తప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గూర్చి సవిస్తముగా వింటిని. అట్లే శాశ్వతమైన నీ మహత్వమును గూర్చియు వింటిని.

ఏవమేతద్యథాత్థ త్వమ్ ఆత్మానం పరమేశ్వర !
ద్రష్టుమిచ్ఛామి తే రూపమ్ ఐశ్వర్యం పురుషోత్తమ !! 3

ఏవం - ఏతత్ - యథా - ఆత్థ - త్వం - ఆత్మానం - పరమేశ్వర
ద్రష్టుం - ఇచ్ఛామి - తే - రూపం - ఐశ్వర్యం - పురుషోత్తమ


పరమేశ్వర - కృష్ణా, ఆత్మానం - నిన్ను గురించి, యథా - ఏ ప్రకారముగ, త్వం - నీవు, ఆత్థ - చెప్పితివో, ఏవం ఏతత్ - ఇదంతయును, పురుషోత్తమ - కృష్ణా, తే -  నీ యొక్క, ఐశ్వర్యం - ఈశ్వరసంబంధమైన, రూపం - రూపమును, ద్రష్టుం - చూచుటకు, ఇచ్ఛామి - కోరుచున్నాను.

ఓ పరమేశ్వరా! నిన్ను గురించి నీవు చెప్పినదంతయు సత్యమే. అందుసందేహమునకు తావులేదు. కాని ఓ పురుషోత్తమా! జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బల, వీర్య, తేజోమహితమైన నీ షడ్గుణైశ్వర్య సంపన్న రూపమును  ప్రత్యక్షముగా నేనిపుడు చూడదలుచుచున్నాను.

మనస్యే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో !
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ !! 4

మన్యసే - యది - తత్ - శక్యం - మయా - ద్రష్టుం - ఇతి - ప్రభో
యోగేశ్వర - తతః - మే - త్వం - దర్శయః - ఆత్మానం - అవ్యయం


ప్రభో - ప్రభూ, మయా - నాచేత, తత్ - ఆ స్వరూపము, ద్రుష్టుం - గాంచుటకు, శక్యం ఇతి - సాధ్యమని, మన్యసే యది - తలచెదవేని, యోగేశ్వర - యోగేశ్వరుడా, తతః - అటుపిమ్మట, త్వం - నీవు, మే - నాకొరకు, అవ్యయం - నిత్యమైన, ఆత్మానం - ఆత్మస్వరూపమును, దర్శయః - చూపుము.

ఓ యోగేశ్వరా ! ఓ ప్రభూ ! నీ దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో శాశ్వతమైన నీ విశ్వస్వరూపమును నాకు చూపుము.

శ్రీభగవాన్ ఉవాచ :-
పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః !
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ !! 5

పశ్య - మే - పార్థ - రూపాణి - శతశః - అథ - సహస్రశః
నానావిధాని - దివ్యాని - నానావర్ణాకృతీని - చ


పార్థ - అర్జునా, మే - నాయొక్క, నానావిధాని - అనేకవిధములైనవియు, నానావర్ణాకృతీని - అనేకవిధములైన రంగులు, రూపములు గలవియు, దివ్యాని చ - దివ్యములైనట్టివియు, శతశః - వందలకొలదియును, అథ - ఇంకను, సహస్రశః - వేలకొలదియును అగు, రూపాణి - రూపములను, పశ్య - చూడుము.

శ్రీభగవానుడు పలికెను ఓ అర్జునా ! అసంఖ్యాకములైన బహువిధములైన, పెక్కువర్ణములు, ఆకృతులు గల నా రూపములను గాంచుము.

పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా !
బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత !! 6

పశ్య - ఆదిత్యాన్ - వసూన్ - రుద్రాన్ - అశ్వినౌ - మరుతః - తథా
బహూని - అదృష్టపూర్వాణి - పశ్య - ఆశ్చర్యాణి - భారత


భారత - అర్జునా, ఆదిత్యాన్ - ఆదిత్యులను, వసూన్ - వసువులను, రుద్రాన్ - రుద్రులను, అశ్వినౌ - అశ్వినీదేవతలను, మరుతః - మరుత్తులను, పశ్య - చూడుము, తథా - అటులే, అదృష్టపూర్వాణి - ఇంతవరకు చూడబడనట్టివియును, బహూని - అనేకములైన, ఆశ్చర్యాణి - ఆశ్చర్యములను, పశ్య - చూడుము.

ఓ అర్జునా ! ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, ఏకాదశరుద్రులను, అశ్వినీ కుమారులను, మరుద్గణములను నాయందు చూడుము. అంతేగాక ఇంకను మునుపెన్నడును చూచి యెరుగని అనేకములైన అద్భుతములను చూడుము.

ఇహైకస్థం జగత్ కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్ !
మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ద్రష్టుమిచ్ఛసి !! 7

ఇహ - ఏకస్థం - జగత్ - కృత్స్నం - పశ్య - అద్య - సచరాచరం
మమ - దేహే - గుడాకేశ - యత్ - చ - అన్యత్ - ద్రుష్టుం - ఇచ్ఛసి


గుడాకేశ - అర్జునా, యత్ - ఏ, అన్యత్ - ఇతరమైన దానిని, ద్రష్టుం - చూచుటకు, ఇచ్ఛసి చ -కోరుచున్నావో, సచరాచరం - చరాచర స్వరూపమైన, కృత్స్నం - సమస్తమైన, జగత్ - జగత్తును చూడుము.

ఓ అర్జునా ! నా ఈ రూపమునందు ఒకేచోట స్థితమై యున్న సమస్తచరాచర జగత్తును చూడుము. అంతేగాక ఇంకను నీవు చూడదలచు కొనిన వాటినన్నింటినీ నా శరీరము నందు ఒకే చోట దర్శింపుము.

న తు మాం శక్యసే ద్రష్టుమ్ అనేనైవ స్వచక్షుషా !
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్ !! 8

న - తు - మాం - శక్యసే - ద్రష్టుం - అనేన - ఏవ - స్వచక్షుషా
దివ్యం - దదామి - తే - చక్షుః - పశ్య - మే - యోగం - ఐశ్వరం


మాం నన్ను, అనేన - ఈ, స్వచక్షుషా ఏవ - నీ కన్నులచేతనే, ద్రష్టుం - చూచుటకు, న శక్యసే తు - సాధ్యపడదు, తే - నీ కొరకు, దివ్యం - దివ్యమైన, చక్షుః - దృష్టిని, దదామి - ఇచ్చుచున్నాను, మే - నాయొక్క, ఐశ్వరం - దివ్యమైన, యోగం - యోగమును, పశ్య - చూడుము.

చర్మ చక్షువులతో నా ఈ రూపమును నీవు నిస్సందేహముగా చూడజాలవు. కనుక నీకు దివ్య దృష్టిని ప్రసాదించుచున్నాను. ఈ దివ్యదృష్టితో నా ఈశ్వరీయ యోగశక్తిని దర్శింపుము.

సంజయ ఉవాచ :-
ఏవముక్త్వాతతో రాజన్ మహాయోగేశ్వరో హరిః !
దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్ !! 9

ఏవం - ఉక్త్వా - తతః - రాజన్ - మహాయోగేశ్వరః - హరిః
దర్శయామాస - పార్థాయ - పరమం - రూపం - ఐశ్వర్యం


రాజన్ - రాజా, ఏవం - ఈ విధముగ, ఉక్త్వా - పలికి, తతః - ఆ తరువాత, మహాయోగేశ్వరః - గొప్ప యోగేశ్వరుడైన, హరిః - శ్రీహరి, పరమం - ఉత్తమమైన, ఐశ్వరం - ఈశ్వర సంబంధమైన, రూపం - విశ్వరూపమును, పార్థాయ - పార్థునికొరకు, దర్శయామాస - చూపెను.

సంజయుడు పలికెను ఓ రాజా ! మహాయోగేశ్వరుడును, పాపములను హరించువాడును ఐన భగవానుడు ఈ విధముగా పలికి, అనంతరము షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన విశ్వరూపమును అర్జునునకు చూపెను.

అనేకవక్త్రనయనమ్ అనేకాద్భుతదర్శనమ్ !
అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్ !! 10

అనేకవక్త్రంనయనం - అనేకాద్భుతదర్శనం
అనేకదివ్యాభరణం - దివ్యానేకోద్యతాయుధం


అనేకవక్త్రనయనం - అనేకమైన ముఖములు కన్నులు గలదియును, అనేకాద్భుత దర్శనం - అనేకములైన అద్భుతదర్శనములు గలదియు, అనేకదివ్యాభరణం - అనేకములైన దివ్య ఆభరణములు గలదియును, దివ్యానేకోద్యతాయుధం - దివ్యములు, అనేకములునైన ఎత్తబడిన ఆయుధములు గలదియు.

దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనమ్ !
సర్వాశ్చర్యమయం దేవమ్ అనంతం విశ్వతోముఖమ్ !! 11

దివ్యమాల్యాంబరధరం - దివ్యగంధానులేపనం
సర్వాశ్చర్యమయం - దేవం - అనంతం - విశ్వతోముఖం


దివ్యమాల్యాంబరధరం - దివ్యములైన హారములు, వస్త్రములు గలదియు, దివ్యగంధానులేపనం - దివ్యమైన గంధపులేపనము గలదియు, సర్వాశ్చర్యమయం - సర్వములైన ఆశ్చర్యములతో నిండినదియు, అనంతం - అనంతమైనదియు, విశ్వతోముఖం - అంతటను ముఖములు గలదియు, దేవం - స్వయం ప్రకాశమానమునైనది.

అర్జునుడు చూచిన ఆ పరమేశ్వరుని దృశ్యములు అద్భుతములైనవి. ఆ రూపము అనేక దివ్యాభరణశోభితము. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను చేపట్టియుండెను. దివ్యములగు మాలలను, వస్త్రములను ధరించియుండెను. ఆ దివ్యశరీరము నుండి దివ్యచందనపరి మళములు దశదిశల గుబళించు చుండెను. ఆ విశ్వరూపమును అర్జునుడు దర్శించెను.

దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థిథా !
యది భాః సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః !! 12

దివి - సూర్యసహస్రస్య - భవేత్ - యుగపత్ - ఉత్థితా
యది - భాః - సదృశీ - సా - స్యాత్ - భాసః - తస్య - మహాత్మనః


దివి - ఆకాశమునందు, సూర్యసహస్రస్య - వేలకొలది సూర్యుల యొక్క, యుగపదుత్థితా - ఏకకాలమందు కదిలిన, భాః - కాంతి, భవేత్ యది - సంభవించెనేని, సా - ఆకాంతి, తస్య - ఆ, మహాత్మనః - మహాత్ముని యొక్క, భాసః - కాంతికి, సదృశీ - సమానమైనది, స్యాత్ - అగును.

ఆకాశమున వేలకొలది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించినచోవచ్చు కాంతి పుంజములును ఆ విరాట్ రూపతేజస్సులకు సాటిరావు.

తత్రైకస్థం జగత్ కృత్స్నం ప్రవిభక్తమనేకధా !
అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా !! 13

తత్ర - ఏకస్థం - జగత్ - కృత్స్నం - ప్రవిభక్తం - అనేకధా
అపశ్యత్ - దేవదేవస్య - శరీరే - పాండవః - తదా 


తదా - అప్పుడు, పాండవః - అర్జునుడు, అనేకధా - అనేకవిధములుగ, ప్రవిభక్తం - విభజించబడియున్న, జగత్ - జగత్తును, కృత్స్నం - సర్వమును, దేవదేవస్య - దేవదేవుని యొక్క, తత్ర - ఆ, శరీరే - దేహమునందు, ఏకస్థం - ఒక్కచోట నున్నదానిగ, అపశ్యత్ - చూచెను.

ఆ సమయమున అర్జునుడు ఆ దేవాదిదేవుని శరీరమునందు అసంఖ్యాకములైన వివిధబ్రహ్మాండములు వేర్వేరుగా ఒకేచోట ఉన్నదానినిగా దర్శించెను.

తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః !
ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత !! 14

తతః - సః -  విస్మయావిష్టః - హృష్టరోమా - ధనంజయః
ప్రణమ్య - శిరసా - దేవం - కృతాంజలిః - అభాషత


తతః - తరువాత, సః - ఆ, ధనంజయః - అర్జునుడు, విస్మయావిష్టః - విస్మయయుక్తుడై, హృష్టరోమా - పులకాంకితుడునై, దేవం - దేవుని గూర్చి, శిరసా - శిరస్సుచేత, ప్రణమ్య - నమస్కరించి, కృతాంజలిః - అంజలి ఘటించి, అభాషతః - పలికెను.

అద్భుతమైన ఆ పరమాత్ముని విశ్వరూపమును జూచి, అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకాంకితుడై. తేజోమయమైన ఆ విరాట్ రూపమునకు శిరస్సువంచి చేతులు జోడించి నమస్కరించుచు ఇట్లనెను.

పశ్యామి దేవాంస్తవ దేవ దేహే
సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్ !
బ్రహ్మాణమీశం కమలాసనస్థమ్
ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ !! 15

పశ్యామి - దేవాన్ - తవ - దేహే - సర్వాన్ - తథా - భూతవిశేషసంఘాన్
బ్రహ్మాణం - ఈశం - కమలాసనస్థం - ఋషీన్ - చ - సర్వాన్ - ఉరగాన్ - చ - దివ్యాన్


దేవాన్ - దేవా, తవ - నీ యొక్క, దేహే - దేహమునందు, సర్వాన్ - సమస్తమైన, దేవాన్ - దేవతలను, తథా - అటులే, భూతవిశేష సంఘాన్ - చరాచర భూతసమూహములను, ఈశం - ఈశుడు, కలాసనస్థం - పద్మాసనము నందున్నవాడునైన, బ్రహ్మాణం - బ్రాహ్మను, సర్వాన్ - సమస్తములైన, ఋషీన్ చ - ఋషులను, దివ్యాన్ - దివ్యములైన, ఉరగాన్ చ - ఉరగములను, పశ్యామి - చూచుచున్నాను.

అర్జునుడు పలికెను ఓ దేవాదిదేవా ! నీ విరాట్ రూపమునందు సకల దేవతలను, నానావిధప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్యసర్పములను గాంచుచున్నాను.

అనేకబాహూదరవాక్త్రనేత్రం
పశ్యామి త్వాం సర్వతోనంతరూపమ్ !
నాంతం న మధ్యం న పునస్తవాదిం
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప !! 16

అనేక - బాహూదరవక్త్రనేత్రం - పశ్యామి - త్వాం - సర్వతః - అనంతరూపం
న - అంతం - న - మధ్యం - న - పునః - తవ - ఆదిం - పశ్యామి - విశ్వేశ్వర - విశ్వరూప


విశ్వేశ్వర - విశ్వేశ్వరుడా, విశ్వరూప - విశ్వరూపుడా, అనేక బాహూదరవక్త్రనేత్రం - అనేకములైన బాహువులు,పొట్టలు, ముఖములు, నేత్రములు కలిగియున్న, సర్వతః - అన్నిచోట్ల, అనంతరూపం - అనంతరూపములు గల, త్వాం - నిన్ను, పశ్యామి - చూచుచున్నాను, పునః - మరియు, తవ - నీయొక్క, ఆదిం - మొదలును, న పశ్యామి - చూడజాలకున్నాను, అంతం - అంతమును, న - చూడజాలకున్నాను, మధ్యం - మధ్యమును, న - చూడజాలకున్నాను.

ఓ విశ్వేశ్వరా ! విశ్వరూపా ! నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు, అసంఖ్యాకములు. నీ అనంతరూపము సర్వతోముఖముగ విలసిల్లుచున్నది. నీవు ఆదిమధ్యాంత రహితుడవు. మహత్త్వపూర్ణమైన నీ దివ్యరూపమునకు ఆది మాధ్యాంతములు గోచరింపకున్నవి.

కిరీటినం గదినం చక్రిణం చ
తేజోరాశిం సర్వతో దీప్తిమంతమ్ !
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్
దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్ !! 17

కిరీటినం - గదినం - చక్రిణం - చ - తేజోరాశిం - సర్వతః - దీప్తిమంతం
పశ్యామి - త్వాం - దుర్నిరీక్ష్యం - సమంతాత్ - దీప్తానలార్కద్యుతిం - అప్రమేయం


కిరీటినం - కిరీటము గలవానినిగ, గదినం - గదాధరునిగ, చక్రిణం చ - చక్రధరునిగ, సర్వతః - అంతటను, దీప్తిమంతం - ప్రకాశించుచున్న వానినిగ, తేజోరాశిం - తేజోరాశివిగ, దుర్నిరీక్ష్యం - చూడశక్యము కాని వానినిగ, దీప్తానలార్క ద్యుతిం - ప్రజ్వలించెడి అగ్ని సూర్యుల కాంతిగల వానినిగ, అప్రమేయం - అప్రమేయునిగ, సమంతాత్ - అంతటను, త్వాం - నిన్ను, పశ్యామి చూచుచున్నాను.

హే విష్ణో ! కిరీటమును, గదను, చక్రమును ధరించి, అంతటను తేజోవంతమైన కాంతులను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలి తాగ్నివలెను, జ్యోతిర్మయుడైన సూర్యునివలెను వెలుగొందుచున్న నీ అప్రమేయరూపము గాంచుచున్నాను.

త్వమక్షరం పరమం వేదితవ్యం
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ !
త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా
సనాతనస్త్వం పురుషోమతోమే !! 18

త్వం - అక్షరం - పరమం - వేదితవ్యం - త్వం - అస్య - విశ్వస్య - పరం - నిధానం
త్వం - అవ్యయః - శాశ్వత ధర్మగోప్తా - సనాతనః - త్వం - పురుషః - మతః - మే


త్వం - నీవు, అక్షరం - అవినాశివి,పరమం - పరమాత్మవు, వేదితవ్యం - తెలియదగిన వాడవు,త్వం - నీవు, అస్య - ఈ, విశ్వస్య - విశ్వమునకు, పరం - పరమైన, నిధానం - ఆశ్రయుడవు, త్వం - నీవు, శాశ్వత ధర్మగోప్తా - సనాతన ధర్మమును రక్షించెడి, అవ్యయః - నిత్యుడవు, త్వం - నీవు, సనాతనః - సనాతనుడవైన, పురుషః - పురుషుడవు, మే - నాయొక్క, మతః - అభిప్రాయము.

పరమ అక్షరస్వరూపుడవైన పరబ్రహ్మపరమాత్మవు నీవే, కనుక అందరికిని తెలిసికొనదగినవాడవు. ఈ జగత్తునకు నీవే పరమాశ్రయుడవు. సనాతన ధర్మరక్షకుడవు. నీవు అవ్యయుడవు. సనాతనపురుషుడవు, అని నా అభిప్రాయము.

అనాదిమధ్యాంతమనంతవీర్యమ్
అనంతబాహుం శశిసూర్యనేత్రమ్ !
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం
స్వతేజసా విశ్వమిదం తపంతమ్ !! 19

అనాదిమధ్యాంతం - అనంతవీర్యం - అనంతబాహుం - శశిసూర్యనేత్రం
పశ్యామి - త్వాం - దీప్తహుతాశవక్త్రం - స్వతేజసా - విశ్వం - ఇదం - తపంతం


త్వాం - నిన్ను, అనాదిమధ్యాంతం - ఆదిమధ్యాంత రహితుడవుగను, అనంతవీర్యం - అంతములేని తేజోవంతుడుగను, అనంతబాహుం - అనంతమైన బాహువులు గల వానినిగను, శశిసూర్యనేత్రం - చంద్ర సూర్యులు కన్నులుగాగల వాడవుగను, దీప్తహుతాశ వక్త్రం - ప్రజ్వలించుచున్న అగ్ని ముఖములయందు గలవాడవుగను, స్వతేజసా - స్వీయమైన తేజస్సుచేత, ఇదం - ఈ, విశ్వం - విశ్వమును, తపంతం - తపింపజేయువాడవుగను, పశ్యామి - చూచుచున్నాను.

నీవు అదిమధ్యాంతరహితుడవు. అపరిమితశక్తిశాలివి. అసంఖ్యాకములైన భుజములు గలవాడవు. సూర్యచంద్రులు నీ నేత్రములు. అగ్నివలె నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది. నీ తేజస్సుచేత ఈ జగత్తును తపింపజేయు చున్నావు. అట్టి నిన్ను నేను గాంచుచున్నాను.

ద్యావాపృథివ్యోరిదమంతరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః !
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ !! 20


ద్వావాపృథివ్యోః - ఇదం - అంతరం - హి -

వ్యాప్తం - త్వయా - ఏకేన - దిశః - చ - సర్వాః


దృష్ట్యా - అద్భుతం - రూపం - ఉగ్రం - తవ - ఇదం - ఈ, అంతరం - మధ్యప్రదేశము, సర్వాః - సమస్తమైన, దిశః చ - దిక్కులు, ఏకేన - ఒక్కడవైన, త్వయా - నీచేత, వ్యాప్తం హి - వ్యాపింపబడియున్నవికదా, తవ - నీయొక్క, అద్భుతం - అద్భుతమైన, ఉగ్రం - భయంకరమైన, ఇదం - ఈ, రూపం - రూపమును, దృష్ట్వా - చూచి, లోకత్రయం - మూడు లోకములు, ప్రవ్యథితం - భయపడినవి.

ఓ మహాత్మా ! దివి నుండి భువివరకుగల అంతరిక్షము నందంతటను అన్ని దిశలను నీవే పరిపూర్ణుడవై యున్నావు. అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి, ముల్లోకములును మిగుల భీతిని చెందిచున్నవి.

అమీ హి త్వాం సురసంఘా విశంతి
కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి !
స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసంఘాః
స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః !! 21

అమీ - హి - త్వాం - సురసంఘాః - విశంతి కేచిత్ - భీతాః - ప్రాంజలయః - గృణంతి
స్వస్తి - ఇతి - ఉక్త్వా - మహర్షి సిద్ధ సంఘాః - స్తువంతి - త్వాం - స్తుతిభిః - పుష్కలాభిః


అమీ - ఈ, సురసంఘా - దేవతాసమూహములు, త్వాం - నిన్ను, విశంతి - ప్రవేశించు చున్నవి, కేచిత్ - కొందరు, భీతాః - భయపడినవారై, ప్రాంజలయః - చేతులు జోడించిన వారై, గృణంతి - స్తుతించుచున్నారు, మహర్షి సిద్ధసంఘాః - మహర్షుల, సిద్ధపురుషుల సమూహము, స్వస్తి ఇతి - స్వస్తియని, ఉక్త్వా - పలుకుచు, పుష్కలాభిః - అనేకములైన, స్తుతిభిః - స్తోత్రముల చేత, త్వాం - నిన్ను, స్తువంతి హి - స్తుతించుచున్నారు.

ఇదిగో, ఆ దేవతలెల్లరును కీర్తించుచున్నారు. ప్రవేశించుచున్నారు. కొందఱు భయపడినవారై అంజలి ఘటించి, నీ నామగుణములను కీర్తించుచున్నారు. మహర్షులును, సిద్దులును స్వస్తివచనములతోడను, ఉత్తమోత్తమ స్తోత్రముల తోడను నిన్ను ప్రార్థించుచున్నారు.

రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యాః
విశ్వేశ్వినౌ మరుతశ్చోశ్మష్మపాశ్చ !
గంధర్వయక్షాసురసిద్ధసంఘాః
వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే !! 22

రుద్రాదిత్యాః - వసవః - యే - చ - సాధ్యాః - విశ్వే - అశ్వినౌ - మరుతః - చ - ఊష్మపాః - చ
గంధర్వయక్షాసురసిద్ధ సంఘాః - వీక్షంతే - త్వాం - విస్మితాః - చ - ఏవ - సర్వే


రుద్రాదిత్యాః - రుద్రులు, ఆదిత్యులు, వసవః - వసువులు, యే - ఎవరు, సాధ్యాః చ - సాధ్యులు, విశ్వే - విశ్వేదేవతలు, అశ్వినౌ - అశ్వినీదేవతలు, మరుతః చ - వాయుదేవతలు, ఊష్మపాః చ - పితృదేవతలు, గంధర్వ యక్షాసుర సిద్ధాసంఘాః - గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు మొదలగువారి సమూహములు, సర్వే - అందరును, విస్మితాః చ ఏవ - విస్మయమును పొందినవారలై, త్వాం - నిన్ను, వీక్షంతే - చూచుచున్నారు.

ఏకాదశరుద్రులును, ద్వాదశాదిత్యులును, అష్టవసువులును, సాధ్యులును, విశ్వేదేవతలును, అశ్వనీకుమారులును, మరుద్గణములును, పితరులును అట్లే గంధర్వయక్షాసురసిద్ధ సముదాయములును సంభ్రమాశ్చర్యములతో నిన్నే గాంచుచున్నారు.

రూపం మహత్తే బహువక్త్రనేత్రం
మహాబాహో బహుబాహూరూపాదమ్ !
బహూదరం బహుదంష్ట్రాకరాళం
దృష్ట్వాలోకాః ప్రవ్యథితాస్తథాహమ్ !!  23

రూపం - మహత్ - తే - బహువక్త్రనేత్రం - మహాబాహో - బహుబాహూరుపాదం
బహూదరం - బహుదంష్ట్రాకరాలం - దృష్ట్వా - లోకాః - ప్రవథితాః


తథా - అహం, మహాబాహో - కృష్ణా, బహువక్త్రనేత్రం - అనేకములైన ముఖములు, కన్నులు గలదియు, బహుబాహూరుపాదం - అనేకములైన బాహువులు, ఊరువులు, పాదములు గలదియు, బహూదరం - అనేక పొట్టలు గలదియు, బహుదంష్ట్రాకరాలం - అనేకములైన కోరలచేత భయంకరమైనదియు, మహత్ - గొప్పదియునైన, తే - నీ యొక్క, రూపం - రూపమును, దృష్ట్వా - చూచి, లోకాః - లోకములు, తథా - అటులనే, అహం - నేను, ప్రవ్యథితాః - భయమును పొందినవి.

హే మహాబాహో ! అసంఖ్యాకములైన వక్త్రములను, చేతులను, తొడలను, పాదములను, ఉదరములను, కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి, అందఱును భయకంపితులగుచున్నారు. నేనుకూడ అలాగే భయపడుచున్నాను.

నభఃస్పృశం దీప్తమనేకవర్ణం
వ్యత్తాననం దీప్తవిశాలనేత్రమ్ !
దృష్ట్వాహి త్వాం ప్రవ్యథితాంతరాత్మా
ధృతిం న విందామి శమం చ విష్ణో !! 24

నభః స్పృశం - దీప్తం - అనేకవర్ణం వ్యత్తాననం - దీప్త విశాలనేత్రం
దృష్ట్వా - హి - త్వాం - ప్రవ్యథితాంతరాత్మ - ధృతిం - న - విందామి - శమం - చ - విష్ణో


విష్ణో - కృష్ణా, స్పృశం - ఆకాశమును తాకెడివాడవు, దీప్తం - ప్రకాశమానుడవు, అనేకవర్ణం - ఎన్నో రంగులు గలవాడవు, వ్యాత్తాననం - తెరచిన నోళ్ళు గలవాడవు, దీప్తవిశాల నేత్రం - ప్రజ్వలించు విశాలనేత్రములు గలవాడవు అగు, త్వాం - నిన్ను, దృష్ట్వా - చూచి, ప్రవ్యథితాంతరాత్మా - భయపడిన అంతరాత్మ గలవాడనై, ధృతిం - ధైర్యమును, శమం చ - శాంతిని, న విందామి హి - పొందజాలకున్నాను గదా.

ఏలనన హే విష్ణో ! నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేకవర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజిమ్ముచున్న విశాలనేత్రములతో, విస్తరించిన ముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువలన నా ధైర్యము సడలినది. శాంతి పొందలేకయున్నాను.

దంష్ట్రాకరాళాని చ తే ముఖాని
దృష్ట్వైన కాలానల సన్నిభాని !
దిశోన జానే న లభే చ శర్మ
ప్రసీద దేవేశ జగన్నివాస !! 25

దంష్ట్రాకరాళాని - చ - తే - ముఖాని - దృష్ట్వా - ఏవ - కాలానల సన్నిభాని
దిశః - న - జానే - న - లభే - చ - శర్మ - ప్రసీద - దేవేశ - జగన్నివాస


దంష్ట్రాకరాళాని - కోరలచే భయంకరమైనవియు, కాలానల సన్నిభాని - ప్రళయాగ్నిని బోలిన, తే - నీయొక్క, ముఖాని - ముఖములను, దృష్ట్వా ఏవ - చూచియే, దిశః - దిక్కులను, న జానే - తెలిసికొనజాలకున్నాను, శర్మ - సుఖమును, న లభే చ - పొందజాలకున్నాను, దేవేశ - దేవదేవా, జగన్నివాస - జగదాశ్రయా, ప్రసీద - ప్రసన్నుడవగుము.

ఓ జగన్నివాసా ! భయంకరములైన కోరలతో ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్ని జ్వాలలవలె భీతిగోల్పుచున్నవి. వాటిని చూచిన నాకు దిక్కుతోచకున్నది. నెమ్మది శూన్యమైనది. ఓ దేవేశా! ప్రసన్నుడ వగుము.

అమీ చ త్వాం దృతరాష్ట్రస్య పుత్రాః
సర్వే సహైవావనిపాలసంఘైః
భీష్మద్రోణః సూతపుత్రస్తథాసౌ
సహాస్మదీయైరపి యోధముఖ్యైః !! 26

అమీ - చ - త్వాం - ధృతరాష్ట్రస్య - పుత్రాః - సర్వే - సహ - ఏవ - అవనిపాలసంఘైః
భీష్మః - ద్రోణః - సూతపుత్రః - తథా - అసౌ - సహ - అసదీయైః - అపి - యోధముఖ్యైః


అమీ - ఈ, ధృతరాష్ట్రస్య - ధృతరాష్ట్రుని యొక్క, పుత్రాః - కుమారులును, అవనిపాల సంఘైః సహ ఏవ - రాజసమూహముతో గూడి, తథా - అటులే, భీష్మః - భీష్ముడు, ద్రోణః - ద్రోణుడు, అసౌ - ఈ, సూతపుత్రః - సూతపుత్రుడు, అస్మదీయైః - మనవారైన, యోధముఖ్యైః సహ అపి - యుద్ధప్రముఖులతో కూడా, సర్వే చ - అందరును.

ఇచ్చట చేరియున్న ఈ ధృతరాష్ట్రపుత్రులు ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించు చున్నారు. భీష్మపితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి ప్రధానయోధులు అందఱును.

వక్త్రాణి తే త్వరమాణా విశంతి
దంష్ట్రాకరాళాని భయానకాని !
కేచిద్విలాగ్నా దశనంతారేషు
సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః !! 27

వక్త్రాణి - తే - త్వరమాణాః - విశంతి - దంష్ట్రాకరాలాని - భయానకాని
కేచిత్ - విలగ్నాః - దశనాంతరేషు - సందృశ్యంతే - చూర్నితైః - ఉత్తమాంగైః


త్వరమాణాః - తొందరపడుచున్నవారై, త్వాం -  నీలో, దంష్ట్రాకరాళాని - కోరలతో వికారమైన, భయానకాని - భయంకరమైన, తే - నీ యొక్క, వక్త్రాణి - ముఖములను, విశంతి - ప్రవేశించుచున్నారు, కేచిత్ - కొందరు, దశనాంతరేషు - దంతముల మధ్య, విలగ్నాః - చిక్కినవారై, చూర్ణితైః - పొడుము చేయబడిన వారై, ఉత్తమాంగైః - శిరములతో, సందృశ్యంతే - కనబడుచున్నారు.

భయంకరమైన కోరలతో గూడిన నీ ముఖములయందు అతివేగముగా పరుగులు దీయుచు ప్రవేశించుచున్నారు. కొందరి తలలు కోరల మధ్యబడి నుగ్గునుగ్గై పోవుచుండగా వారు దంతములలో చిక్కుకొని కనిపించుచున్నారు.

యథా నదీనాం బహవోంబువేగాః
సముద్రమేవాభిముఖా ద్రవంతి !
తథా తవామీ నరలోకవీరాః
విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి !! 28

యథా - నదీనాం - బహవః - అంబువేగాః - సముద్రం - ఏవ - అభిముఖాః - ద్రవంతి
తథా - తవ - అమీ - నరకలోక వీరాః - విశంతి - వక్త్రాణి - అభివిజ్వాలంతి


నదీనాం - నదులయొక్క, బహవః - బహువిధములైన, అంబువేగాః - నీటి ప్రవాహములు, యథా - ఏ రీతిని, సముద్రం ఏవ - సముద్రమునే, అభిముఖాః - ఎదుర్కొని, ద్రవంతి - ప్రవహించుచున్నవో, తథా - అట్లే, అమీ - ఈ, నరలోకవీరాః - రాజశ్రేష్ఠులు, తవ - నీయొక్క, అభివిజ్వలంతి - ప్రజల్వించుచున్న, వక్త్రాణి, - ముఖములను, విశంతి - ప్రవేశించుచున్నారు.

అనేకములైన నదీనదములప్రవాహములన్నియును సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు, ఈ శ్రేష్ఠులైన సమరయోధులు నరలోకవీరులు కూడా జ్వలించుచున్న నీకభిముఖులై ప్రవేశించుచున్నారు.