భగవద్గీత పార్ట్ - 17
వేదానాం సామవేదోపాస్మి దేవానామస్మి వాసవః !
ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా !! 22
వేదానాం - సామవేదః - అస్మి - దేవానాం - అస్మి - వాసవః
ఇంద్రియాణాం - మనః - చ - అస్మి - భూతానాం - అస్మి - చేతనా
వేదానాం - వేదములలో, సామవేదః - సామవేదము, అస్మి - అయియున్నాను, దేవానాం - దేవతలలో, వాసవః - ఇంద్రుడను, అస్మి - అయియున్నాను, ఇంద్రియాణాం - ఇంద్రియములలో, మనః - మనస్సును, అస్మి - అయియున్నాను, భూతానాం - భూతములలో, చేతనా చ - చైతన్యమును, అస్మి - అయియున్నాను.
వేదములలో నేను సామవేదమును, దేవతలలో ఇంద్రుడను నేనే. ఇంద్రియములలో నేను మనస్సును. ప్రాణులలో చైతన్యమును నేనై యున్నాను.
రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్ !
వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్ !! 23
రుద్రాణాం - శంకరః - చ - అస్మి - విత్తేశః - యక్షరక్షసాం
వసూనాం - పావకః - చ - అస్మి - మేరుః - శిఖరిణాం - అహం
రుద్రాణాం - రుద్రులలో, శంకరః చ - శంకరుడు, అస్మి - అగుచున్నాను, యక్షరక్షసాం - యక్షులలోను రాక్షసులలోను, విత్తేశః - కుబేరుడను, వసూనాం - వసువులలో, పావకః చ - అగ్నిహోత్రుడను, శిఖరిణాం - శిఖరములు గల కొండలలో, మేరుః - మేరు పర్వతమును, అహం - నేను, అస్మి - అగుచున్నాను.
ఏకాదశరుద్రులలో శంకరుడు నేను. యక్షరాక్షసులలో ధనాధిపతియైన కుబేరుడను నేను. అష్టవసువులలో అగ్నిని నేను. పర్వతములలో సుమేరు పర్వతమునై యున్నాను.
పురోధసాం చ ముఖ్యం మాం విద్ది పార్థ బృహస్పతిమ్ !
సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః !! 24
పురోధసాం - చ - ముఖ్యం - మాం - విద్ధి - పార్థ - బృహస్పతిం
సేనానీనాం - అహం - స్కందః - సరసాం - అస్మి సాగరః
పార్థ - అర్జునా, పురోధసాం - రాజపురోహితులలో, ముఖ్యం - ముఖ్యుడైన, బృహస్పతిం - బృహస్పతినిగ, మాం - నన్ను, విద్ధి - తెలిసికొనుము, సేనానీనాం - సైన్యాధిపతులలో, స్కందః - కుమారస్వామిని, చ - మరియు, సరసాం - సరస్సులలో, సాగరః - సాగరుడు, అహం - నేను, అస్మి - అయియున్నాను.
పార్థా ! పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే. సేనాపతులలో కుమారస్వామిని నేను. జలాశయములలో నేను సముద్రుడను.
మహర్షిణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్ !
యజ్ఞానాం జపయజ్ఞోపాస్మి స్థావరాణాం హిమాలయః !! 25
మహర్షీణాం - భృగుః - అహం - గిరాం - అస్మి - ఏకం - అక్షరం
యజ్ఞానాం - జపయజ్ఞః - అస్మి - స్థావరాణాం - హిమాలయః
అహం - నేను, మహర్షీణాం - మహర్షులలో, భృగుః - భృగుమహర్షిని, గిరాం - మాటలలో, ఏకం - ఒకటేయగు, అక్షరం - అక్షరమును, అస్మి - అయియున్నాను, యజ్ఞానాం - యజ్ఞములలో, జపయజ్ఞః - జపయజ్ఞమును, స్థావరాణాం - స్థావరములలో, హిమాలయః - హిమాలయమును, అస్మి - అయియున్నాను.
మహర్షులలో భృగువును నేను. శబ్దములలో ఏకాక్షరమును అనగా ఓంకారమును నేను. యజ్ఞములయందు జపయజ్ఞమును నేను. స్థావరములలో హిమాలయమును నేనైయున్నాను.
అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః !
గంధర్వాణాం చిత్రరథః సిద్దానాం కపిలో మునిః !! 26
అశ్వత్థః - సర్వవృక్షాణాం - దేవర్షీణాం - చ - నారదః
గంధర్వాణాం - చిత్రరథః - సిద్దానాం - కపిలః - మునిః
సర్వవృక్షాణాం - సర్వవృక్షములలో, అశ్వత్థః - రావిచెట్టును, దేవర్షీణాం చ - దేవర్షులలో, నారదః - నారదుడను, గంధర్వాణాం - గంధర్వులలో, చిత్రరథః - చిత్రరథః - సిద్ధానాం - సిద్దులలో, కపిలః మునిః - కపిలమునిని
వృక్షములలో నేను అశ్వత్థమును. దేవర్షులలో నారదుడను నేను. గంధర్వులలో నేను చిత్రరథుడను. సిద్ధులలో నేను కపిలమునిని.
ఉచ్చైః శ్రవసమాశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ !
ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్ !! 27
ఉచ్చైః శ్రవసం - అశ్వానాం - విద్ధి - మాం - అమృతోద్భవం
ఐరావతం - గజేంద్రాణాం - నరాణాం - చ - నరాధిపం
అశ్వానాం - గుఱ్ఱములలలో, అమృతోద్భవం - అమృతముతో పుట్టిన, ఉచ్చైః శ్రవమునుగా, గజేంద్రాణాం - ఏనుగులతో, ఐరావతం - ఐరావతముగాను, నరాణాం చ - నరులలో, నరాధిపం - రాజుగాను, మాం - నన్ను, విద్ధి - తెలుసుకో.
అశ్వములలో పాలసముద్రము నుండి అమృతముతో పుట్టిన ఉచ్చైఃశ్రవమును నేను. భద్రగజములలో ఐరావతమును నేను. మనుష్యులలో నన్ను రాజుగను తెలిసికొనుము.
ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ !
ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః !! 28
ఆయుధానాం - అహం - వజ్రం - ధేనూనాం - అస్మి - కామధుక్
ప్రజనః - చ - అస్మి - కందర్పః - సర్పాణాం - అస్మి - వాసుకిః
అహం - నేను, ఆయుధానాం - ఆయుధములలో, వజ్రం - వజ్రాయుధమును, ధేనూనాం - ఆవులలో, కామధుక్ - కామధేనువును, అస్మి - అయియున్నాను, ప్రజనః చ - పుట్టించునట్టి, కందర్పః - మన్మథుడను,అస్మి - అయియున్నాను, సర్పాణాం - సర్పములలో, వాసుకిః - వాసుకిని, అస్మి - అయియున్నాను.
ఆయుధములలో వజ్రాయుధమును నేను. పాడిఆవులలో కామదేనువును నేను. శాస్త్రవిహితరీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మథుడను నేను. సర్పములలో వాసుకిని నేనే.
అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ !
పితౄ ణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్ !! 29
అనంతః - చ - అస్మి - నాగానాం - వరుణః - యాదసాం - అహం
పిత్రూణాం - అర్యమా - చ - అస్మి - యమః - సంయమతాం - అహం
అహం - నేను, నాగానాం - నాగులలో, అనంతః చ - అనంతుడను, యాదసాం - జలచరములలో, వరుణః - వరుణుడను, అస్మి - అయియున్నాను, అహం - నేను, పిత్రూణాం - పితృదేవతలలో, అర్యమా చ - అర్యముడను, సంయమతాం - సంయమనము చేయువారిలో, యమః - యముడను, అస్మి - అయియున్నాను.
నాగజాతివారిలో ఆదిశేషుడను నేను. జలచరములకు అధిపతియైన వరుణుడను నేను. పితరులలో అర్యముడను నేను. శాసకులలో నేను యముడను.
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ !
మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణామ్ !! 30
ప్రహ్లాదః - చ - అస్మి - దైత్యానాం - కాలః - కలయతాం - అహం
మృగాణాం - చ - మృగేంద్రః - అహం - వైనతేయః - చ - పక్షిణాం
అహం - నేను, దైత్యానాం - దైత్యులలో, ప్రహ్లాదః చ - ప్రహ్లాదుడను, కలయతాం - గణిత శాస్త్రజ్ఞులలో, కాలః - కాలమును, మృగాణాం చ - మృగములలో, మృగేంద్రః - సింహమును, పక్షిణాం - పక్షులలో, వైనతేయః చ - గరుత్మంతుడను, అస్మి - అయి యున్నాను.
దైత్యులలో నేను ప్రహ్లాదుడను. గణించువారిలో (గణకులలో) నేను కాలమును. మృగములలో మృగరాజు ఐన సింహమును నేను. పక్షులలో నేను గరుత్మంతుడను.
పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ !
ఝుషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ !! 31
పవనః - పవతాం - అస్మి - రామః - శాస్త్రభృతాం - అహం
ఝుషాణాం - మకరః - చ - అస్మి - స్రోతసాం - అస్మి - జాహ్నవీ
అహం - నేను, పవతాం - పవిత్రము - చేసెడివానిలో, పవనః - వాయువును, శస్త్రభృతాం - ఆయుధధారులలో, రామః - శ్రీరాముడను, అస్మి - అయియున్నాను. ఝుషాణాం - చేపలలో, మకరః - మొసలిని, అస్మి - అయియున్నాను, చ - మరియు, స్రోతసాం - నదులలో, జాహ్నవీ - గంగానదిని, అస్మి - అయియున్నాను.
పవిత్రమొనర్చు వానిలో వాయువును నేను, శస్త్రధారులలో శ్రీరామచంద్రుడను నేను. మత్స్యములలో మొసలిని నేను. నదులలో గంగానది నేనై యున్నాను.
సర్గణామాదితంతశ్చ మధ్యం చైవాహమర్జున !
అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్ !! 32
సర్గాణాం - ఆదిః - అంతః - చ - మధ్యం - చ - ఏవ - అహం - అర్జున
అధ్యాత్మవిద్యా - విద్యానాం - వాదః - ప్రవదతాం - అహం
అర్జున - అర్జునా, సర్గాణాం - సృష్టులలో, ఆదిః - ఆదిసృష్టియు, అంతః చ - అంతమును, మధ్యం చ - స్థితియును, అహం ఏవ - నేనే, విద్యానాం - విద్యలలో, అధ్యాత్మవిద్యా - ఆత్మ విద్యయు, ప్రవదతాం - వాదించువారిలో, వాదః - వాదమును, అహం - నేనే.
ఓ అర్జునా ! సృష్టికి ఆదిమధ్యాంతములు నేను. విద్యలలో అధ్యాత్మవిద్యను అనగా బ్రహ్మవిద్యను నేను. వాదించు వారిలో నేను వాదమును.
అక్షరణామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ !
అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః !! 33
అక్షరాణాం - అకారః - అస్మి - ద్వంద్వః - సామాసికస్య - చ
అహం - ఏవ - అక్షయః - కాలః - ధాతా - అహం - విశ్వతోముఖః
అక్షరాణాం - అక్షరములలో, అకారః - అకారమును, అస్మి - అగుచున్నాను, సామాసికస్య - సమాసములలో, ద్వంద్వః చ - ద్వంద్వసమాసమును, అస్మి - అయియున్నాను, అక్షయః - నశించని, కాలః - కాలము, అహం ఏవ, - నేనే, విశ్వతోముఖః - సర్వత్రముఖములు గల, ధాతా - ధాతను, అహం - నేనే
అక్షరములలో అకారమును నేను. సమాసములలో ద్వంద్వ సమాసమును నేను. అక్షయకాలము అనగా మహాకాలమును నేను. అనంత ముఖములు గల ధాతను నేనైయున్నాను.
మృత్యుః సర్వహరశ్చాహమ్ ఉద్భవశ్చ భవిష్యాతామ్ !
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా !! 34
మృత్యుః సర్వహరః - చ - అహం - ఉద్భవః - చ - భవిష్యతాం
కీర్తిః - శ్రీః - వాక్ - చ - నారీణాం - స్మృతీః - మేధా - ధృతిః - క్షమా
అహం - నేను, సర్వహరః - సర్వసంహారకరుడైన, మృత్యుః చ - మృత్యువును, భవిష్యాతాం - పుట్టగలవారి, ఉద్భవః చ - పుట్టుకయు, నారీణాం - స్త్రీలలో, కీర్తి, శ్రీః - లక్ష్మియు, వాక్ చ - వాక్కు, స్మృతిః - జ్ఞాపకశక్తి, మేధా - బుద్ధియు, ధృతిః - ధైర్యము, క్షమా - ఓర్పు.
అన్నిప్రాణములను హరించు మృత్యువును నేనే. సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును గూడ నేనే. స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధా, ధృతి, ఓర్పును నేనే.
బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ !
మాసానాం మార్గశీర్షోహమ్ ఋతూనాం కుసుమాకరః !! 35
బృహత్సామ - తథా - సామ్నాం - గాయత్రీ - ఛందసాం - అహం
మాసానాం - మార్గశీర్షః - అహం - ఋతూనాం - కుసుమాకరః
తథా - అలాగుననే, అహం - నేను, సామ్నాం - సామృక్కులలో, బృహత్సామ - బృహత్సామ మును, ఛందసాం - ఛందస్సులలో, గాయత్రీ - గాయత్రీ చంధస్సును, మాసానాం - మాసములలో, మార్గశీర్షః - మార్గశిరమాసమును, ఋతూనాం - ఋతువులలో, కుసుమాకరః - వసంతమును, అహం - నేను.
గానముచేయుటకు అనువైన శ్రుతులలో బృహత్సామమును నేను. చందస్సులలో గాయత్రీఛందస్సును నేను. మాసములలో మార్గశీరమును ఋతువులలో వసంతఋతువును నేనే.
ద్యూతం ఛల యతామస్మి తేజ స్తేజస్వినామహమ్ !
జయోస్మి వ్యవసాయోస్మి సత్త్వం సత్త్వవతామహమ్ !! 36
ద్యూతం - ఛలయతాం - అస్మి - తేజః - తేజస్వినాం - అహం
జయః - అస్మి - వ్యవసాయః - అస్మి - సత్త్వం - సత్త్వవతాం - అహం
అహం - నేను, ఛలయతాం - మోసము చేయువారిలో, ద్యూతం - జూదమును, తేజస్వినాం - తేజశ్శాలుల యొక్క, తేజః - తేజస్సును, జయః - జయమును, అస్మి - అయియున్నాను, వ్యవసాయః - వ్యవసాయము, అస్మి - అయియున్నాను, అహం - నేను, సత్త్వవతాం - సాత్త్వికుల యొక్క, సత్త్వం - సత్త్వగుణమును, అస్మి - అయియున్నాను.
వంచకులలో జూదమును నేనే. ప్రభావశాలురలోని ప్రభావమును నేను. విజేతలలో జయమును నేను. నిశ్చయాత్మకులలో నిశ్చయమును, సాత్త్విక పురుషులలో సత్త్వగుణమును నేనే.
వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః !
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః !! 37
వృష్ణీనాం - వాసుదేవః - అస్మి - పాండవానాం - ధనంజయః
మునీనాం - అపి - అహం - వ్యాసః - కవీనాం - ఉశనా - కవిః
అహం - నేను, వృష్ణీనాం - యాదవులలో, వాసుదేవః - వాసుదేవుడను, పాండవానాం - పాండవులలో, ధనంజయః - ధనంజయుడను, మునీవాం - మునులలో, వ్యాసః - వ్యాసుడను, కవీనాం - కవులలో, ఉశనాకవిః అపి - శుక్రాచార్యుడను, అస్మి - అయియున్నాను.
వృష్ణి వంశజులలో వాసుదేవుడను నేను. పాండవులలో ధనంజయుడను నేను. అనగా నీవే నేను. మునులలో వేదవ్యాసుడను నేను. కవులలో శుక్రాచార్యుడను నేనే.
దండో దమయతామస్మి నీతిర్మసి జిగీషతామ్ !
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ !! 38
దండః - దమయతాం - అస్మి - నీతిః - అస్మి - జిగీషతాం
మౌనం - చ - ఏవ - అస్మి - గుహ్యానాం - జ్ఞానం - జ్ఞానవతాం - అహం
అహం - నేను, దమయతాం - దండించెడివారలలో, దండః - దండమును, అస్మి - అయియున్నాను, జిగీషతాం - జయింపగోరు వారి యొక్క, నీతిః - నీతిని, అస్మి - అయియున్నాను, గుహ్యానాం - రహస్యములలో, మౌనం చ ఏవ - మౌనమును, జ్ఞానవతాం - జ్ఞానముగల వారిలో,జ్ఞానం - జ్ఞానమును, అస్మి - అయియున్నాను.
శిక్షించువారిలో దండమును అనగా దమనశక్తిని నేనే. జయేచ్చకలవారి నీతిని నేనే. గోప్యవిషయ రక్షణమున మౌనమును నేను. జ్ఞానవంతులలో నేను జ్ఞానమునై యున్నాను.
యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున !
న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరమ్ !! 39
యత్ - చ - అపి - సర్వభూతానాం - బీజం - తత్ - అహం - అర్జున
న - తత్ - అస్తి - వినా - యత్ - స్యాత్ - మయా - భూతం - చరాచరం
అర్జున - అర్జునా, సర్వభూతానాం - సకలభూతములకును, యత్ - ఏది, బీజం - ఉత్పత్తి కారణమో, తత్ అపి చ - అదియును, అహం - నేనే, యత్ - ఏ, చరాచరం - చరాచరరూపమైన, భూతం - భూతసమూహము, మయావినా - నేను లేకుండా, స్యాత్ - అగునో, తత్ - అట్టిది, న అస్తి - లేదు.
ఓ అర్జునా ! సర్వప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఈ చరాచర భూత ప్రపంచమున నేను కానిది ఏదియును లేదు.
నాంతోస్మి మమ దివ్యానాం విభూతీనాం పరంతప !
ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా !! 40
న - అంతః - అస్తి - మమ - దివ్యానాం - విభూతీనాం - పరంతప
ఏషః - తు - ఉద్దేశతః - ప్రోక్తః - విభూతేః - విస్తరః - మయా
పరంతప - అర్జునా, మమ - నాయొక్క, దివ్యానాం - దివ్యములైన, విభూతీనాం - విభూతులకు, అంతః - అంతము, న అస్తి - లేదు, ఏష తు - ఇది, మయా - నా చేత, విభూతేః - విభూతియొక్క, విస్తరః - వివరణము, ఉద్దేశతః - సంక్షేపముగ, ప్రోక్తః - చెప్పబడినది.
ఓ పరంతపా ! నా దివ్యవిభూతులకు అంతమే లేదు. నా విభూతులవిస్తృతిని గూర్చి నేను నీకు చాలా సంక్షిప్తముగా చెప్పబడినది.
యద్యద్విభూతిమత్ సత్త్వం శ్రీమదూర్జితమేవ వా !
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంశసంభవమ్ !! 41
యత్ - యత్ - విభూతిమత్ - సత్త్వం - శ్రీమత్ - ఊర్జితం - ఏవ - వా
తత్ - తత్ - ఏవ - అవగచ్ఛ - త్వం - మమ - తేజోంశ సంభవం
విభూతిమత్ - విభూతియుక్తమైనదియు, శ్రీమత్ -కాంతియుతమును, ఊర్జితం ఏవ వా - ఉత్సాహముతో గూడినదియునగు, యత్ యత్ - ఏయే, సత్త్వం - సత్త్వము, తత్ తత్ - అది అంతయును, మమ - నాయొక్క, తేజోంశసంభవం, ఏవ - తేజస్సు యొక్క అంశము వలన కలిగిన దానినిగనే, త్వం - నీవు, అవగచ్ఛ - తెలిసికొనుము.
విభూతియుక్తము అనగా ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తము ఐన వస్తువేదైనను నా తేజస్సుయొక్క అంశము నుండియే కలిగినదని ఎరుగుము.
అథవా బహునైతేన కిం జ్ఞానేత తవార్జున !
విష్ణభ్యాహమిదం కృత్స్నమ్ ఏకాంశేన స్థితో జగత్ !! 42
అథవా - బహునా - ఏతేన - కిం - జ్ఞాతేన - తవ - అర్జున
విష్టభ్య - అహం - ఇదం - కృత్స్నం - ఏకాంశేన - స్థితః - జగత్
అర్జున - అర్జునా, అథవా - ఇంతేగాక, బహునా - విశేషమైన, ఏతేన - ఈ, జాతేన - తెలియుటచేత, తవ - నీవు, కిం - ఏమి లాభము, అహం - నేను, ఇదం - ఈ, కృత్స్నం - సమస్తమైన, జగత్ - జగత్తును, ఏకాంశేన - ఏకభాగముచేత, విష్టభ్య - వ్యాపించి, స్థితః - ఉన్నాను.
అథవా ! ఓ అర్జునా ! ఇంతకంటెను విపులముగా తెలిసికొని ప్రయోజన మేమి ? ఈ సంపూర్ణజగత్తును కేవలము నా యోగశక్తి యొక్క ఒక్క అంశముతోడనే నేను వ్యాపించియున్నాను.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జునసంవాదే విభూతియోగోనామ
దశమోధ్యాయః