భగవద్గీత పార్ట్ - 16
అథ దశమోధ్యాయః - విభూతియోగః
శ్రీభగవాన్ ఉవాచ :-
భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః !
యత్తేహం ప్రీయామాణాయ వక్ష్యామి హితకామ్యయా !! 1
భూయః - ఏవ - మహాబాహో - శృణు - మే - పరమం - వచః
యత్ - తే - అహం - ప్రీయమాణాయ - వక్ష్యామి - హితకామ్యయా
మహాబాహో - అర్జునా, ప్రీయమాణాయ - ప్రీతినొందుచున్న, తే - నీకొరకు, హిత కామ్యయా - హితమును గోరుటచేతను, అహం - నేను, యత్ - ఏ, వచః - వాక్యమును, భూయః ఏవ - మరలా, వక్ష్యామి - చెప్పుదునో, తత్ - ఆ, పరమం - ఉత్తమమైన, మే - నాయొక్క, వచః - వాక్కును, శృణు - ఆలకించుము.
శ్రీ భగవానుడు పలికెను హేమహాబాహో ! నీవు నా మీద ప్రేమ గలవాడవు. కావున నీ మేలుగోరి నేను మరల చెప్పుచున్న వచనములను ఆలకింపుము.
న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః !
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః !! 2
న - మే - విదుః - సురగణాః - ప్రభవం - న - మహర్షయః
అహం - ఆదిః - హి - దేవానాం - మహర్షీణాం - చ - సర్వశః
మే - నాయొక్క, ప్రభవం - పుట్టుకను, సురగణాః - దేవతాసమూహములు, న విదుః - ఎరుగను, మహర్షయః - మహర్షులును, న - ఎరుగరు, అహం - నేను, దేవానాం - దేవతలకు, మహార్షీణాం చ - మహర్షులకును, సర్వశః - సర్వవిధములు, ఆదిః హి - మూల కారణమును గదా !
నా ఉత్పత్తిని అనగా నా లీలావతారవిశేషములను దేవతలు గాని మహర్షులు గాని తెలిసికొనజాలరు. ఏలనన నేను అన్ని విధములుగా ఆ దేవతలకును, ఈ మహర్షులకును మూలకారణమైనవాడను నేనేగదా!
యో మమజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ !
అసమ్మూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే !! 3
యః - మాం - అజం - అనాదిం - చ - వేత్తి - లోకమహేశ్వరం
అసమ్మూఢః - సః - మర్త్యేషు - సర్వపాపైః - ప్రముచ్యతే
యః - ఎవడు, అజం - పుట్టుకలేని వానిని, అనాదిం - ఆదిలేనివానిని, లోకమహేశ్వరం చ - లోకనియంతను అగు, మాం - నన్ను, వేత్తి - తెలిసికొనుచున్నాడో, సః - వాడు, మర్త్యేషు - మానవుల యందు, అసమ్మూఢః - అజ్ఞానము లేనివాడై, సర్వపాపైః - సమస్త పాపముల చేత, ప్రముచ్యతే - విడువబడుచున్నాడు.
నన్ను యథార్థముగా జన్మరహితునిగను, అనాదియైన వానినిగను సకలలోక మహేశ్వరునిగను తెలిసికొనువాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు సర్వపాపముల నుండియు విడివడుచున్నాడు.
బుద్ధిః జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః !
సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ !! 4
బుద్ధిః - జ్ఞానం - అసమ్మోహః - క్షమా - సత్యం - దుమః - శమః
సుఖం - దుఃఖం - భవః - అభావః - భయం - చ - అభయం - ఏవ - చ
బుద్ధిః - నిశ్చయజ్ఞానము, జ్ఞానం - తత్త్వజ్ఞానము, అసమ్మోహః - అప్రమత్తతయు, క్షమా - సహనము, సత్యం - సత్యము, దమః - బాహ్యేంద్రియ నిగ్రహము, శమః - అంతరింద్రియ నిగ్రహము, శమః - అంతరింద్రియ నిగ్రహము, సుఖం - సుఖము, దుఃఖం - దుఃఖము, భవః - ఉండుట, అభావః - లేకపోవుట, భయం చ - భయమును, అభయం ఏవ చ - అభయమును.
నిశ్చయాత్మకశక్తి, యథార్థజ్ఞానము, మోహరాహిత్యము, క్షమ, సత్యము, దమము, శమము, సుఖదుఃఖములు, ఉత్పత్తి ప్రళయములు, భయము, అభయము.
అహింసా సమతా తుష్టిః తపో దానం యశోయశః !
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః !! 5
అహింసా - సమతా - తుష్టిః - తపః - దానం - యశః - అయశః
భవంతి - భావాః - భూతానాం - మత్తః - ఏవ - పృథగ్విధాః
అహింసా - అహింసయు, సమతా - సమతయు, తుష్టిః - తృప్తి, తపః - తపస్సు, దానం - దానము, యశః - కీర్తి, అయశః - అపకీర్తి, భూతానాం - భూతముల యొక్క, పృథగ్విధాః - వివిధములైన, భావాః - భావములు, మత్తః ఏవ - నావలననే, భవంతి - కలుగుచున్నవి.
అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, అనునవి ప్రాణులకు నావలననే కలుగుచున్నవి.
మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా !
మద్భావా మనసా జాతా యేషాం లోక ఇమాః ప్రజా !! 6
మహర్షయః - సప్త - పూర్వే - చత్వారః - మనవః - తథా
మద్భావాః - మానసాః - జాతాః - యేషాం - లోకే - ఇమాః - ప్రజాః
లోకే - లోకమందలి, ఇమాః - ఈ, ప్రజాః - ప్రజలు, యేషాం - ఎవరికి, జాతాః - పుట్టినారో, తే - ఆ, సప్త - ఎడుగురైన, మహర్షయః - మహర్షులును, తథా - అటులే, పూర్వే - పూర్వులైన, చత్వారః - నలుగురు (సనకాది దేవర్షులు), మనవః - మనువులు, మద్భావాః - నా భావము గలవారై, మానసాః - మనస్సునందు, జాతాః - పుట్టిరి.
సప్తమహర్షులును, వారికంటెను పూర్వులైన సనకాది మహామునులు నలుగురును, స్వాయంభువాది చతుర్థశ మనువులును మొదలగు వీరందఱును నా భక్తులే. అందరూ నాయెడ సద్భావముగలవారే. వీరు నా సంకల్పమువలననే నా మానస పుత్రులై జన్మించిరి.
ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః !
సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః !! 7
ఏతాం - విభూతిం - యోగం - చ - మమ - యః - వేత్తి - తత్త్వతః
సః - అవికంపేన - యోగేన - యుజ్యతే - న - అత్ర - సంశయః
మమ - నా యొక్క, ఏతాం - ఈ, విభూతిం - మహిమను, యోగం చ - యోగమును, తత్త్వతః - యథార్థముగా, యః - ఎవడు, వేత్తి - తెలిసికొనునో, సః - వాడు, అవికంపేన - చలింపని, యోగేనః - యోగము చేత, యుజ్యతే - కూడినవాడగుచున్నాడు, అత్ర - ఈ విషయము నందు, సంశయః - సంశయము, న - లేదు.
ఈ నా పరమేశ్వర్యరూపవిభూతిని, యోగశక్తి యొక్క తత్త్వమును తెలిసికొన్నవాడు నిశ్చలభక్తియుక్తుడగును. ఇందు ఏ మాత్రమూ సందేహము లేదు.
అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే !
ఇతి మాత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః !! 8
అహం - సర్వస్య - ప్రభవః - మత్తః - సర్వం - ప్రవర్తతే
ఇతి - మత్వా - భజంతే - మాం - బుధాః - భావసమన్వితాః
అహం - నేను, సర్వస్య - సమస్తమునకు, ప్రభవః - ఉత్పత్తికారకుడను, మత్తః - నావలన, సర్వం - సమస్తము, ప్రవర్తతే - ప్రవర్తించుచున్నది, ఇతి - అని, మత్వా - తలచి, భావసమన్వితాః - పరమార్థభావము గలవారై, బుధాః - జ్ఞానులు, మాం - నన్ను, భజంతే - సేవించుచున్నారు.
ఈ సమస్తజగత్తు యొక్క ఉత్పత్తికి నేనే మూలకారణము. నావలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయమును బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు భక్తిశ్రద్దలతో నిరంతరము నన్నే సేవించుచున్నారు.
మచ్చిత్తా మద్గతప్రాణాః బోధయంతః పరస్పరమ్ !
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ !! 9
మచ్చిత్తాః - మద్గతప్రాణాః - బోధయంతః - పరస్పరం
కథయంతః - చ - మాం - నిత్యం - తుష్యంతి - చ - రమంతి - చ
మచ్చిత్తాః - నాయందే చిత్తము గలవారును, మద్గత ప్రాణాః - నన్ను పొందిన ప్రాణముగలవారును, పరస్పరం - ఒకరినొకరు, మాం - నన్నుగూర్చి, బోధయంతః - బోధించు కొనుచున్నవారు, కథయంతః చ - చెప్పుకొనువారై, నిత్యం - ఎల్లప్పుడు, తుష్యంతి చ - సంతసించుచున్నారు. రమంతి చ - రమించుచున్నారు.
నా భక్తులు నా యందే తమ మనస్సులను లగ్నమొనర్తురు. తమ ప్రాణములను, తమ కర్మలన్నింటిని, తమ సర్వస్వమును నాకే అంకిత మొనర్తురు. వారు పరస్పర చర్చల ద్వారా నా మహత్త్వమును గూర్చి ఒకరికొకరు తెలుపుకొనుచు, కథలు కథలుగా చెప్పికొనుచు, నిరంతరము సంతుష్టులగు చుందురు.
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ !
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే !! 10
తేషాం - సతతయుక్తానాం - భజతాం - ప్రీతిపూర్వకం
దదామి - బుద్ధియోగం - తం - యేన - మాం - ఉపయాంతి - తే
సతతయుక్తానాం - సదా నా యందు మనస్సుగలవారై, ప్రీతిపూర్వకం - ప్రీతితో, భజతాం - సేవించెడి వారైన, తేషాం - వారికి, యేన - ఏయోగము చేత, తే - వారు, మాం - నన్ను, ఉపయాంతి - పొందగలుగుదురో, తం - ఆ, బుద్ధియోగం - బుద్ధియోగమును, దదామి - ప్రసాదించుచున్నాను.
అట్లు నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే లగ్నమనస్కులై భక్తిశ్రద్ధలతో నన్నే భజించువారికి నేను బుద్ధియోగమును అనగా తత్త్వజ్ఞాన రూపయోగమును అనుగ్రహించుచున్నాను.
తేషామేవానుకంపార్థమ్ అహమజ్ఞానజం తమః !
నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా !! 11
తేషాం - ఏవ - అనుకంపార్థం - అహం - అజ్ఞానజం - తమః
నాశయామి - ఆత్మభావస్థః - జ్ఞానదీపేన - భాస్వతా
అహం - నేను, తేషాం - వారియొక్క, అనుకంపార్థం ఏవ - అనుగ్రహము కొరకే, ఆత్మభావస్థః - ఆత్మభావము నందున్న వాడనై, భాస్వతా - స్వయం ప్రకాశము గల, జ్ఞానదీపేన - జ్ఞాన ప్రకాశముచేత, అజ్ఞానజం - అవివేకము వలన గలిగిన, తమః చీకటిని, నాశయామి - నశింపజేయుచున్నాను.
ఓ అర్జునా ! వారి యంతః కరణముల యందు స్థితుడనై యున్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్త్వజ్ఞానరూప దీపమును (జ్యోతిని) వెలిగించి, వారి అజ్ఞానాంధకారమును పోగొట్టుచున్నాను.
అర్జున ఉవాచ :-
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ !
పురుషం శాశ్వతం దివ్యమ్ ఆదిదేవమజం విభుమ్ !! 12
పరం - బ్రహ్మ - పరం - ధామ - పవిత్రం - పరమం - భవాన్
పురుషం - శాశ్వతం - దివ్యం - ఆదిదేవం - అజం - విభుం
భవాన్ - నీవు, పరం బ్రహ్మ - పరబ్రహ్మవు, పరం ధామ - పరమ తేజస్స్వరూపుడవు, పరమం పవిత్రం - పరమపవిత్రుడవు, త్వాం - నిన్ను, శాశ్వతం - నిత్యునిగను, దివ్యం - దివ్యమైన, పురుషం - పురుషునిగను, ఆదిదేవం - ఆదిదేవునిగను, అజం - పుట్టుక లేనివానినిగను, విభుం - ప్రభువుగను.
అర్జునుడు పలికెను - నీవు పరబ్రహ్మవు. పరంధాముడవు. పరమపవిత్రుడవు. మహర్షులు నిన్ను శాశ్వతుడవు, దివ్యమైనవాడవు, ఆదిదేవుడు, వ్యాసుడు,ప్రభువుగను పల్కెను.
ఆహుస్త్వామ్ ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా !
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే !! 13
ఆహుః - త్వాం - ఋషయః - సర్వే - దేవర్షిః - నారదః - తథా
అసితః - దేవలః - వ్యాసః - స్వయం - చ - ఏవ - బ్రవీషి - మే
సర్వే - సమస్తమైన, ఋషయః - మహర్షులు, దేవర్షిః - దేవర్షియైన, నారదః - నారదుడు, తథా - అలాగే, అసితః - అసితుడు, దేవలః - దేవలుడు, వ్యాసః - వ్యాసుడు, ఆహుః - తెలిసియుండిరి, స్వయం చ ఏవ - స్వయముగనే, మే - నా కొరకు, బ్రవీషి - చెప్పుచున్నాను.
దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసమహర్షియు, సుత్తింతురు. నీవును నాకు ఆ విధముగనే చెప్పుచుంటివి.
సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ !
న హి తే భగవాన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః !! 14
సర్వం - ఏతత్ - ఋతం - మన్యే - యత్ - మాం - వదసి - కేశవ
న - హి - తే - భగవన్ - వ్యక్తిం - విదుః - దేవాః - న - దానవాః
కేశవః - కృష్ణా, యత్ - ఏవిషయమును, మాం - నన్ను గూర్చి, వదసి - చెప్పుచున్నాజ్నివో, ఏతత్ - ఈ, సర్వం - సమస్తమును, ఋతం - సత్యమని, మన్యే - తలంచుచున్నాను, భగవాన్ - భగవంతుడా, తే - నీ యొక్క, వ్యక్తిం - స్వరూపమును, దేవాః - దేవతలు, న విదుః - ఎరుగరు, దానవాః - దానవులును, న హి విదుః - ఎరుగరు కదా.
ఓ కేశవా ! నీవు చెప్పుచున్నది అంతయును సత్యమే. హే భగవాన్ ! నీ లీలామయస్వరూపమును దేవతలు గాని దానవులు గాని తెలియలేరు.
స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ !
భూతభావన భూతేష దేవదేవ జగత్పతే !! 15
స్వయం - ఏవ - ఆత్మనా - ఆత్మానం - వేత్థ - త్వం - పురుషోత్తమ
భూతభావన - భూతేశ - దేవదేవ - జగత్పతే
పురుషోత్తమ - పురుషశ్రేష్ఠుడా, భూతభావన - భూతములను కలుగజేసినవాడా, భూతేశ - భూతప్రభువా, దేవదేవ - దేవతలకు దేవుడా, జగత్పతే - జగత్ప్రభువా, త్వం - నీవు, ఆత్మానం - నిన్ను, స్వయం ఏవ - స్వయముగనే, ఆత్మనా - నీ చేతనే, వేత్థ - తెలిసికొనుచున్నావు.
ఓ జగదుత్పత్తికారకా ! ఓ సర్వభూతేశా ! ఓ దేవాదిదేవా ! ఓ జగన్నాథా ! ఓ పురుషోత్తమా ! నీ తత్త్వమును నీవే ఎరుగుదువు.
వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యత్మవిభూతయః !
యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వంవ్యాప్య తిష్ఠసి !! 16
వక్తుం - అర్హసి - అశేషణ - దివ్యాః - హి - ఆత్మవిభూతయః
యాభిః - విభూతిభిః - లోకాన్ - ఇమాన్ - త్వం - వ్యాప్య - తిష్ఠసి
త్వం - నీవు, యాభిః - ఏ, విభూతిభిః - విభూతులచేత, ఇమాన్ - ఈ, లోకాన్ - లోకములను, వ్యాప్య - వ్యాపించి, తిష్ఠసి - ఉన్నావో, దివ్యాః హి - దివ్యములైన, ఆత్మవిభూతయః - ఆ ఆత్మవిభూతులను, అశేషేణ - నిశ్శేషముగా, వక్తుం - చెప్పుటకు, అర్హసి - తగుదువు.
సమస్తలోకములయందును నీ దివ్యవిభూతుల ద్వారా వ్యాపించి, స్థితుడవై యున్నాను. మహామహితములైన ఆ దివ్యవిభూతులను సంపూర్ణముగా తెల్పుటకు నీవే తగుదువు.
కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ !
కేషు కేషు చ భావేషు చింత్యో సి భగవన్ మయా !! 17
కథం - విద్యాం - అహం - యోగిన్ - త్వాం - సదా - పరిచింతయన్
కేషు - కేషు - చ - భావేషు - చింత్యః - అసి - భగవన్ - మయా
యోగిన్ - యోగీశ్వరా, అహం - నేను, త్వాం - నిన్ను, సదా - ఎల్లప్పుడును, పరిచింతయన్ - ధ్యానముచేయుచు, కథం - ఎటుల, విద్యాం - తెలిసికొందును, భగవన్ - భగవంతా, కేషు కేషు చ - ఏయే, భావేషు - భావములయందు, మయా - నాచేత, చింత్యః - చింతించ దగినవాడవు, అసి - అగుదువు.
ఓ యోగీశ్వరా ! నిరంతరము చింతనచేయుచూ నినన్ను ఏ విధముగా తెలిసికొనగలను? హే భగవన్ ! ఏ యే భావములతో నా ద్వారా చింతన చేయదగినవాడవు ? నిన్ను నేను ఎట్లు ధ్యానింపవలెను.
విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్థన !
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేమృతమ్ !! 18
విస్తరేణ - ఆత్మనః - యోగం - విభూతిం - చ - జనార్దన
భూయః - కథయ - తృప్తిః - హి - శృణ్వతః - న - అస్తి - మే - అమృతం
జనార్దన - కృష్ణా, ఆత్మనః - నీ యొక్క, యోగం - యోగమును, విభూతిం చ - విభూతిని, విస్తరేణ - విస్తారముగాను, భూయః - మరల, కథయ - చెప్పుము, అమృతం - జ్ఞానామృతమును, శృణవ్తః - వినుచున్న, మే - నాకు, తృప్తిః - సంతృప్తి, న అస్తి హి - లేదుగదా.
ఓ జనార్ధనా! నీ యోగశక్తిని గూర్చియు, నీ విభూతి వైభవములను గురించియు విస్తృతముగా ఇంకను తెలుపుము. ఏలనన నీ అమృతమయవచనములను ఎంతగా విన్నను తనివితీరకున్నది.
శ్రీభగవాన్ ఉవాచ :-
హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః !
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠనాస్త్యంతో విస్తరస్య మే !! 19
హంత - తే - కథయిష్యామి - దివ్యాః - హి - ఆత్మవిభూతయః
ప్రాధాన్యతః - కురుశ్రేష్ఠ - న - అస్తి - అంతః - విస్తరస్య - మే
హంత - అహో, తే - నీ కొరకు, దివ్యాః - దివ్యమైన, ఆత్మవిభూతయః - నావిభూతులను,ప్రాధాన్యతః - ముఖ్యముగ, కథయిష్యామి - చెప్పుచున్నాను, కురుశ్రేష్ఠ - అర్జునా, మే - నాయొక్క, విస్తరస్య - విభూతి విస్తారమునకు, అంతః - అంతము, న అస్తి హి - లేదుగదా.
శ్రీభగవానుడు పలికెను ఓ అర్జునా! నీవు లెస్సగా పలికితివి. నా దివ్యవిభూతుల విస్తృతికి అంతమే లేదు. వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రము నీకు చెప్పెదను.
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః !
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ !! 20
అహం - ఆత్మా - గుడాకేశ - సర్వభూతాశయస్థితః
అహం - ఆదిః - చ - మధ్యం - చ - భూతానాం - అంతః - ఏవ - చ
గుడాకేశ - అర్జునా, సర్వభూతాశయస్థితః - సర్వప్రాణులయొక్క అంతర్హృదయము నందున్న, ఆత్మా - ఆత్మను, అహం - నేను, భూతానాం - భూతములకు, ఆదిః చ - ఆదియును, మధ్యం చ - స్థితియును, అంతః చ - లయమును, అహం ఏవ - నేనే.
ఓ అర్జునా ! సమస్తప్రాణులహృదయములయందున్న ఆత్మను నేనే. సకల భూతముల ఆదియు, మధ్యస్థితియు అంతము నేనే.
ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ !
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ !! 21
ఆదిత్యానాం - అహం - విష్ణుః - జ్యోతిషాం - రవిః - అంశుమాన్
మరీచిః - మరుతాం - అస్మి - నక్షత్రాణాం - అహం - శశీ
అహం - నేను, ఆదిత్యానాం - ద్వాదశాదిత్యులలో, విష్ణుః - విష్ణువును, జ్యోతిషాం - జ్యోతులలో, అంశుమాన్ - కిరణములు గల, రవిః - సూర్యుడను, మరుతాం - మరత్తులలో, మరీచిః - మరీచిని, నక్షత్రాణాం - నక్షత్రములలో, శశీ - చంద్రుడను, అహం - నేను, అస్మి - అయియున్నాను.
అదితియొక్క ద్వాదశపుత్రులైన ఆదిత్యులలో విష్ణువును నేను. జ్యోతిర్మయ స్వరూపులలో నేను సూర్యుడను. 49 మంది వాయుదేవతలలోని తేజమును నేను. తారలయందు చంద్రుడను నేను.