భగవద్గీత పార్ట్ - 13

 

జ్ఞానవిజ్ఞానయోగః
అథ సప్తమోపాధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః


శ్రీభగవాన్ ఉవాచ :-
మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః !
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు !  1

మయి - ఆసక్తమనాః - పార్థ - యోగం - యుంజన్ - మదాశ్రయః
అసంశయం - సమగ్రం - మాం - యథా - జ్ఞాస్యసి - తత్ - శృణు


పార్థ - అర్జునా, మయి - నాయందు, ఆసక్తమనాః - ఆసక్తి గల మనస్సు కలవాడవును, యోగం - యోగమును, యుంజన్ - ఆచరించుచున్న వాడవును, మదాశ్రయః - నన్ను ఆశ్రయించినవాడవు నగుచు, అసంశయం - సందేహము లేకుండా, సమగ్రం - పూర్తిగా, మాం - నన్ను, యథా - ఎటుల, జ్ఞాస్యసి - తెలిసికొనగలవో, తత్ - దానిని, శృణు - వినుము.

శ్రీ భగవానుడు పలికెను - ఓ పార్థా ! అనన్యభక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగినవాడవై, అనన్య భావముతో మత్పరాయణుడవై, సంపూర్ణవిభూతిబల - ఐశ్వర్యాదిగుణ యుక్తుడవై, సర్వప్రాణులకును ఆత్మస్వరూపుడను ఐన నన్ను నిస్సందేహముగా తెలిసికొనగలవో ఆ విధమును వినుము.

జ్ఞానం తేపాహం సవిజ్ఞానమ్ ఇదం వక్ష్యామ్యశేషతః !
యద్జ్ఞాత్వా నేహ భూయోపాన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే !!  2

జ్ఞానం - తే - అహం - సవిజ్ఞానం - ఇదం - వక్ష్యామి - అశేషతః
యత్ - జ్ఞాత్వా - న - ఇహ - భూయః - అన్యత్ - జ్ఞాతవ్యం - అవశిష్యతే 


యత్ - దేనిని, జ్ఞాత్వా - తెలిసికొనిన పిదప, ఇహ - ఈ లోకమున, జ్ఞాతవ్యం - తెలియదగినది, భూయః - తిరిగి, అన్యత్ - వేరొకటి, న అవశిష్యతే - మిగిలియుండునో, సవిజ్ఞానం - విజ్ఞానసహితమైన, ఇదం - ఈ, జ్ఞానం - జ్ఞానము, అశేషతః - నిశ్శేషముగా, అహం - నేను, తే - నీకొరకు, వక్ష్యామి - చెప్పుచున్నాను.

నేను నీకు విజ్ఞానసహితముగా తత్త్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలిసికొనవలసినది ఏదియు మిగులదు.

మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే !
యతతామపి సిద్దానాం కశ్చిన్మాం వేత్తితత్త్వతః  !! 3

మనుష్యాణాం - సహస్రేషు - కశ్చిత్ - యతతి - సిద్ధయే
యతతాం - అపి - సిద్దానాం - కశ్చిత్ - మాం - వేత్తి - తత్త్వతః


మనుష్యాణాం - మనుష్యులలో, సహస్రేషు - వేయిమందిలో, కశ్చిత్ - ఒకానొకడు, సిద్ధయే - సిద్దత్వమునకు, యతతి - యత్నించుచున్నాడు, యతతాం - యత్నించెడి, సిద్ధానాం అపి - సిద్దులలో కూడ, కశ్చిత్ - ఒకానొకడు, మాం - నన్ను, తత్త్వతః - యథార్థముగ, వేత్తి - తెలిసికొనుచున్నాడు.

వేలకొలది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలిసికొనుటకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో గూడ ఒకానొకడు మాత్రమే యదార్థ తత్త్వమును ఎరుంగును.

భూమిరాపోపానలోవాయుః ఖం మనో బుద్ధిరేవ చ !
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా !!  4

భూమిః - అపః - అనలః - వాయుః - ఖం - మనః - బుద్ధిం - ఏవ - చ
ఆహంకారః - ఇతి - ఇయం -  మే - భిన్నా - ప్రకృతిః - అష్టధా 


భూమిః - భూమి, ఆపః - జలము, అనలః - అగ్ని, వాయుః - గాలి, ఖం - ఆకాశము, మనః - మనస్సు, బుద్ధి, ఏవ చ - బుద్ధియును, ఆహంకారః - అహంకారమును, ఇతి - ఇటుల, మే - నాయొక్క, ఇయం - ఈ, ప్రకృతిః - ప్రకృతి, అష్టధా - ఎనిమిది విధములుగ, భిన్నా - భేదమును కలిగియున్నది.

ఓ మాహాబాహో ! భూమి, నీరు, అగ్నివాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, అని నా ప్రకృతి ఎనిమిది విధములుగా కలదు. ఎనిమిది భేదములు గల ఈ ప్రకృతిని అపరా లేక జడ ప్రకృతి అనియందురు.

అపరేయమిస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ !
జీవభూతాం మాహాబాహో యయేదం ధార్యతే జగత్ !!  5

అపరా - ఇయం - ఇతః - తు - అన్యాం - ప్రకృతిం - విద్ధి - మే - పరాం
జీవభూతాం - మహాబాహో - యయా - ఇదం - ధార్యతే - జగత్


మాహాబాహో - అర్జునా, ఇయం - ఈ ప్రకృతి, అపరా - నికృష్టమైనది, ఇతః తు - దీనికంటెను, అన్యాం - వేరైనది, జీవభూతాం - ప్రాణాధారమైనదియు, పరాం - ఉత్కృష్టమైనదియు, యయా - దేనిచేత, ఇదం - ఈ, జగత్ - జగత్తు, ధార్యతే - ధరింపబడుచున్నదో, మే - నా యొక్క, ప్రకృతిం - అట్టి ప్రకృతిని, విద్ధి - తెలియము.

ఇదిగాక ఈ సంపూర్ణ జగత్తును దరించునట్టి మఱియొక ప్రకృతి కలదు. అదియే నా జీవరూప పరాకృతి లేక చేతన ప్రకృతి అని తెలిసికొనుము.

ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ !
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా !!  6

ఏతద్యోనీని - భూతాని - సర్వాణి - ఇతి - ఉపధారయ
అహం - కృత్స్నస్య - జగతః - ప్రభవః - ప్రలయః - తథా 


సర్వాణి - సమస్తములై, భూతాని - ప్రాణులను, ఏతద్యోనీవి ఇతి - ఈ అపరా, పరా ప్రకృతులవలన బుట్టినవని, ఉపధారాయ - తెలిసికొనుము, తథా - అట్లే, కృత్స్నస్య - సమస్తమైన, జగతః - జగత్తుయొక్క, ప్రభవః - పుట్టుకకు కారకుడును, ప్రళయః - లయకారకుడును, అహం - నేనే

ఓ అర్జునా ! సమస్తప్రాణులును ఈ రెండువిధములైన ప్రకృతుల నుండియే పుట్టుచున్నవి. ఈ జగత్తు యొక్క పుట్టుకయూ వినాశనము నావలననే జరుగుచున్నవి. అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే కారకుడను.

మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ !
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ !!  7

మత్తః - పరతరం - న - అన్యత్ - కించిత్ - అస్తి - ధనంజయ
మయి - సర్వం - ఇదం - ప్రోతం - సూత్రే - మణిగణాః - ఇవ


ధనంజయ - అర్జునా, మత్తః - నా కంటెను,మణిగణాః ఇవ - రత్నసమూహముల వలెనే, మయూ - నా యందు, ఇదం - ఈ, సర్వం - సమస్త ప్రపంచమును, ప్రోతం - గ్రుచ్ఛబడినది.

ఓ ధనంజయా ! నాకంటెను పరమమైనది ఏదియును లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నియును సూత్రమున సూత్రమణులవలె నాయందే కూర్పబడియున్నవి.

రసోపాహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః !
ప్రణవఃసర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు !!  8

రసః - అహం - అప్సు - కౌంతేయ - ప్రభా - అస్మి - శశిసూర్యయోః
ప్రణవః - సర్వవేదేషు - శబ్దః - ఖే - పౌరుషం - నృషు


కౌంతేయ - అర్జునా, అప్సు - నీటియందు, రసః - ద్రవపదార్థమును, శశిసూర్యయోః - చంద్రసూర్యులయందు, ప్రభా - ప్రకాశమును, సర్వవేదేషు - సర్వవేదములయందును, ప్రణవః - ఓంకారమును, ఖే - ఆకాశము నందు, శబ్దః - శబ్దమును, నృషు - మనుష్యులయందు, పౌరుషం - పురుష లక్షణమును, అహం - నేను, అస్మి - అయియున్నాను.

ఓ అర్జునా ! జలములో రసతన్మాత్రను నేనే. సూర్యచంద్రులలో కాంతిని నేనే. వేదములన్నింటిలోను ఓంకారమును, ఆకాశము నందు శబ్దమును, మానవులయందు పౌరుషమును నేనే అయియున్నాను.

పుణ్యోగంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ !
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు !! 9

పుణ్యః - గంధః - పృథివ్యాం - చ - తేజః - చ - అస్మి - విభావసౌ
జీవనం - సర్వభూతేషు - తపః - చ - అస్మి - తపస్విషు


పృథివ్యాం - భూమియందు, పుణ్యః - విచిత్రమైన, గంధః చ - వాసనయు, విభావసౌ - అగ్నియందు, తేజః చ - తేజస్సును, తపస్సుగలవారియందు, తపః చ - తపస్సును, అస్మి - నేనే అయియున్నాను.

పృథ్వియందు పవిత్రగంధము, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని తాపసులలో తపస్సును నేనే.

బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ !
బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్తేజస్వినామహమ్ !!   10

బీజం - మాం - సర్వభూతానాం - విద్ధి - పార్థ - సనాతనం
బుద్ధిః - బుద్ధిమతాం - అస్మి - తేజః - తేజస్వినాం - అహం


పార్థ అర్జునా, సనాతనం - నిత్యుడనగు, మాం - నన్ను, సర్వభూతానాం - సర్వభూతములకు, బీజం - మూలముగ, విద్ధి - తెలిసికొనుము, అహం - నేను, బుద్ధిమతాం - బుద్ధిమంతులయొక్క, బుద్ధిః - బుద్ధి, తేజస్వినాం - ధీరులయొక్క, తేజః - తేజము, అస్మి - అయియున్నాను.

ఓ పార్థా ! సమస్త భూతములకును నన్ను శాశ్వతమైన బీజముగా ఏరుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే.

బలం బలవతాం చాహం కామరాగావివర్జితమ్ !
ధర్మావిరుద్దో భూతేషు కామోస్మి భరతర్షభ !!  11

బలం - బలవతాం - చ - అహం - కామరాగవివర్జితం
ధర్మావిరుద్ధః - భూతేషు - కామః - అస్మి - భరతర్షభ


భరతర్షభ - అర్జునా, అహం - నేను, బలవతాం - బలవంతులయొక్క, కామరాగ వివర్జితం - ఆశ, రాగము లేని, బలం - బలమును, అస్మి - అయియున్నాను, భూతేషు చ - ప్రాణులయందు, ధర్మా విరుద్ధః - ధర్మమనకు విరుద్ధముగాని, కామః - కామమును, అస్మి - అయియున్నాను.

ఓ భరతశ్రేష్ఠా ! బలవంతులలో కామరాగరహితమైన బలమును నేను, సమస్తప్రాణుల యందున ధర్మమునకు విరుద్ధముగాని, కామః - కామమును, అస్మి - అయియున్నాను.


యే చైవ సాత్త్విక భావా రాజసాస్తామసాశ్చ యే !
మత్త ఏవేతి తాన్ విద్ధి న త్వహం తేషు తే మయి !!  12


యే - చ - ఏవ - సాత్త్వికాః - భావాః - రాజసాః - తామసాః - చ - యే
మత్తః - ఏవ - ఇతి - తాన్ - విద్ధి - న - తు - అహం - తేషు - తే - మయి


సాత్త్వికాః - సాత్త్వికమైన, భావాః - భావములు, యే చ - ఏవియో, రాజసాః - రజోగుణ సంబంధములైనవి, యే - ఏవియో, తామసాః చ ఏవ - తామసికమైనవి, యే - ఏవియో, తాన్ - వానిని, మత్తః ఏవ ఇతి - నా వలననే యని, విద్ధి, - తెలిసికొనుము, తేషు - ఆ భావముల యందు, అహం తు - నేను, న - లేను, తే - అవి, మయి - నాయందు ఉన్నవి.

సాత్త్విక, రాజస, తామస భావములన్నియును నా నుండియే కలుగుచున్నవని తెలిసికొనుము. కాని! యథార్థముగా వాటిలో నేను గాని, నాలో అవిగాని లేవు. అనగా నేను త్రిగుణాతీతుడను.

త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ !
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్ !! 13

త్రిభిః - గుణమయైః - భావైః - ఏభిః - సర్వం - ఇదం - జగత్
మోహితం - న - అభిజానాతి - మాం - ఏభ్యః - పరం - అవ్యయం


త్ర్రిభిః - మూడువిధములైన, గుణమయైః - గుణవికారములైన, ఏభిః - ఈ, భావైః - భావములచేత, సర్వం - సమస్తమైన, ఇదం - ఈ, జగత్ - ప్రపంచము, మోహితం - మోహింపజేయబడిననదియై, ఏభ్యః - ఈ త్రిగుణముల కంటెను, పరం - విలక్షణుడను, అవ్యయం - అవినాశియైన, మాం - నన్ను, న అభిజానాతి - తిలిసికొనలేక యున్నది.

ఈ జగత్తు అనగా ప్రాణిసముదాయము అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్త్విక, రాజస, తామసములు అను త్రివిధ భావములచే మోహితమగు చున్నది. కనుక త్రిగుణములకు అతీతుడను శాశ్వతుడను ఐన నన్ను ఆ ప్రాణులు తెలిసికొనలేకున్నవి.

దైవీ హ్యేషా గుణమయీ మమ మయా దురత్యయా !
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే !!  14

దైవీ - హి - ఏషా - గుణమయీ - మమ - మాయా - దురత్యయా
మాం - ఏవ - యే - ప్రపద్యంతే - మాయాం - ఏతాం - తరంతి - తే


దైవీ - దైవసంబంధమైనది, గుణమయా - త్రిగుణస్వరూపమునగు, ఏషా - ఈ, మమ - నా యొక్క, మాయా - ప్రకృతి, దురత్యయా హి - దాటశక్యముకానిదియే, యే - ఎవరు, మాం ఏవ - నన్నే, ప్రపద్యంతే - శరణు పొందుచున్నారో, తే - వారు, ఏతాం - ఈ, మాయాం - మాయను, తరంతి - దాటుచున్నారు.

నా మాయ త్రిగుణాత్మకమైనది. అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కాని కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈమాయను దాటుచున్నారు.

న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నారాధమాః !
మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః !! 15

న - మాం - దుష్కృతినః - మూఢాః - ప్రపద్యంతే - నరాధమాః
మాయయా - అపహృతజ్ఞానాః - ఆసురం - భాం - ఆశ్రితాః


దుష్కృతినః - దుష్టులను, మూఢాః - మూఢులను, మాయయా - మాయచేతను, అపహృత జ్ఞానాః - అపహరింపబడిన జ్ఞానము కలవారై, అసురం - రాక్షస సంబంధమైన, భావం - భావమును, ఆశ్రితాః - ఆశ్రయించిన వారును అగు, నరాధమాః - నీచమానవులు, మాం - నన్ను, న ప్రపద్యంతే - శరణుపొందరు.

మాయలో చిక్కుపడుటవలన విపరీత జ్ఞానమునకు లోనైన వారును, రాక్షస ప్రవృత్తిగలవారును, నరాధములును, మూఢులును, దుష్కర్మలను ఆచరించువారును నన్ను భజింపరు.

చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోపార్జున !
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ !! 16

చాతుర్విధాః - భజంతే - మాం - జనాః - సుకృతినః - అర్జున
ఆర్తః - జిజ్ఞాసుః - ఆర్థార్థీ - జ్ఞానీ - చ - భరతర్షభ


భరతర్షభ - భరతవంశశ్రేష్ఠుడా, అర్జున - అర్జునా, ఆర్తః - ఆర్తుడును, జిజ్ఞాసుః - జిజ్ఞాసువును, అర్థార్థీ - ధనమును గోరువాడును, జ్ఞానీ చ - జ్ఞానియును, చతుర్విధాః - సేవించుచున్నారు.

ఓ భరతశ్రేష్ఠా ! అర్జునా ! శుభకర్మలను చేయుచుచరించుచు సుఖసంపదలను కోరుకొనువారు, శారీరక మానసిక సంతాపములకు గురియైన ఆర్తులు, ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మతత్త్వ  జ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు జిజ్ఞాసువులు, పరమాత్మప్రాప్తినందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు.

తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే !
ప్రియో హి జ్ఞానినోపాత్యర్థమ్ అహం స చ మమ ప్రియః !! 17

తేషాం - జ్ఞానీ - నిత్యయుక్తః - ఏకభక్తిః - విశిష్యతే
ప్రియః - హి - జ్ఞానినః - అత్యర్థం - అహం - సః - చ - మమ - ప్రియః 


తేషాం - వారిలోను, నిత్యయుక్తః - నిత్యయోగియు, ఏకభక్తిః - ఏకాంత భక్తి గలవాడును అగు, జ్ఞానీ - బ్రహ్మజ్ఞాని, విశిష్యతే - శ్రేష్ఠుడు గా నున్నాడు, జ్ఞానినః - ఆత్మజ్ఞానికి, అహం - నేను, అత్యర్థం - మిక్కిలి, ప్రియః - ప్రియుడును, సః చ - వాడును, మమ - నాకు, ప్రియః హి - ప్రియుడైనవాడు గదా.

ఈ చతుర్విధభక్తులలో నిరంతరము నాయందే ఏకీభావ స్థితుడై, అనన్య భక్తియుతుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగ నాతత్త్వమును తెలిసికొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను. అతడును నాకు అత్యంత ప్రియుడైయున్నాడు.

ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ !
ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ !! 18

ఉదారాః - సర్వే - ఏవ - ఏతే - జ్ఞానీ - తు - ఆత్మా - ఏవ - మే - మతం
ఆస్థితః - సః - హి - యుక్తాత్మా - మాం - ఏవ - అనుత్తమాం - గతి


ఏతే - ఈ, సర్వే - అందరును, ఉదారాః ఏవ - గొప్పవారే, జ్ఞానీ తు - జ్ఞానియున్ననో, ఆత్మా ఏవ - నేనేయని, మే - నాయొక్క, మతం - అభిప్రాయము, సః - వాడు, యుక్తాత్మా - ఆత్మయోగపరుడై, మాం ఏవ - నన్నే, అనుత్తమాం - అత్త్యుత్తమమైన, గతిం - గమ్యస్థానమును, ఆస్థితః హి - పొందినవాడై యున్నాడు గదా.

ఈ చతుర్విధభక్తులందరును ఉదారులే. కాని జ్ఞానియైన వాడు నా స్వరూపమే. ఇది నా అభిప్రాయము. ఏలనన అట్టి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే ఉన్నతగతి స్వరూపునిగా భావించును. ఈ విధముగా అతడు యందే స్థిరముగావున్నాడు.

బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే !
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుడుర్లభః !! 19

బహూనాం - జన్మనాం - అంతే - జ్ఞానవాన్ - మాం - ప్రపద్యతే
వాసుదేవః - సర్వం - ఇతి - సః - మహాత్మా - సుదుర్లభః


బహూనాం - అనేకములైన, జన్మనాం - జన్మలయొక్క, అంతే - చివర, జ్ఞానవాన్ - జ్ఞానవంతుడు, సర్వం - అంతయును,వాసుదేవః ఇతి - వాసుదేవుడేయని, మాం - నన్ను, ప్రపద్యతే - భజించుచున్నాడు, సః - అట్టి, మహాత్మా - మహాత్ముడు, దుర్లభః- మిక్కిలి దుర్లభము.

అనేకజన్మలపిదప భగవత్తత్వమును ఎరిగిన వాడు సర్వమూ వాసుదేవమయమే యని భావించి, నన్ను శరణుపొందును. అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదుగ నుండును.

కామై స్తైర్హృ తాజ్ఞానాః ప్రపద్యంతేపాన్యదేవతాః !
తం తం నియమమాస్థాయ ప్రకృత్యానియతాః స్వయాః !!  20

కామైః - తైః - తైః - హృతజ్ఞానాః - ప్రపద్యంతే - అన్యదేవతాః
తం - తం - నియమం - ఆస్థాయ - ప్రకృత్యా - నియతాః - స్వయా


స్వయా - తమదైన, ప్రకృత్యా - ప్రకృతిచేత, నియతాః - నియమింపబడినవారు, తైః తైః కామైః - ఆయా విషయవాంఛలచేత, హృతజ్ఞానాః - పోయిన వివేకము గలవారై, తం తం నియమం - ఆయా కోరికలకు తగిన నియమమును, ఆస్థాయ - ఆశ్రయించి, అన్యదేవతాః - ఇతర దేవతలను, ప్రపద్యంతే - సేవించుచున్నారు.

అనేకవిధములైన భోగవాంఛలలో కూరుకొనిపోయినవారి జ్ఞానము అంతరించిపోవును. వారు తమతమస్వభావములకు అనుగుణముగా వారివారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచుందురు.

యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి !
తస్య తస్యాచలాం శ్రద్దాం తామేన విదధామ్యహమ్ !!  21

యః - యః - యాం - యాం - తనుం - భక్తః - శ్రద్ధయా - అర్చితుం - ఇచ్ఛతి
తస్య - తస్య - అచలాం - శ్రద్దాం - తాం - ఏవ - విదధామి - అహం.

 
యః యః - ఏయే, భక్తః - భక్తుడు, యాం యాం తనుం - ఏయే దేవతారూపమును, శ్రద్ధయా - శ్రద్ధతో, అర్చితుం - ఆరాధించుటకు, ఇచ్ఛతి - కోరుచున్నాడో, తస్య తస్య - వానివానికి, అహం - నేను, తాం అచలాం - చలనములేని, శ్రద్దాం ఏవ - శ్రద్ధరూమునే, విదధామి - చేయుచున్నాను.

భక్తుడు ఏదేవతాస్వరూపములను భక్తిశ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొనునో ఆ భక్తునకు దేవతలయందే భక్తిశ్రద్ధలను స్థిరముగా నేనే కలుగజేయుచున్నాను.

స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే !
లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తాన్ !!  22

సః - తయా - శ్రద్ధయా - యుక్తః - తస్య - ఆరాధనం - ఈహతే
లభతే - చ - తతః - కామాన్ - మయా - ఏవ - విహితాన్ - హి - తాన్


సః - వాడు, తయా - అట్టి, శ్రద్ధయా - శ్రద్ధతో, యుక్తః - కూడినవాడై, తస్య - ఆ దేవత యొక్క, ఆరాధనం - పూజను, ఈహతే - చేయుచున్నాడు, తతః చ - అనంతరము, మయా ఏవ - నాచేతనే, విహితాన్ - నిర్ణయింపబడిన, తాన్ - ఆ, కామాన్ - కోరికలను, లభతే హి - పొందుచున్నాడు.

అట్టి భక్తుడు తగిన భక్తిశ్రద్దలతో ఆ దేవతనే అరాధించును. తత్ఫలితముగ నా అనుగ్రహమువలననే ఆ దేవత ద్వారా ఫలములను అతడు పొందుచున్నాడు.

అంతవత్తు ఫలం తేషాం తద్భావత్యల్పమేధసామ్ !
దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి !!  23

అంతవత్ - తు - ఫలం - తేషాం - తత్ - భవతి - అల్పమేధసాం
దేవాన్ - దేవయజః - యాంతి - మద్భక్తాః - యాంతి - మాం - అపి


దేవయజః - దేవతలను పూజించువారు, దేవాన్ - దేవతలను, యాంతి - పొందుచున్నారు, అల్పమేధసాం - స్వల్పబుద్ధిగల, తేషాం - వారి యొక్క, తత్ ఫలం - లభించేడి ఆ ఫలము, అంతవత్ తు - అంతము గలది, భవతి - అగుచున్నది, మద్భక్తాః అపి - నా భక్తులన్ననో, మాం - నన్ను, యాంతి - పొందుచున్నారు.

అల్పబుద్ధిలగు భక్తులు పొందెడి ఫలములు గూడ అల్పములు. ఇతరదేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు. నా భక్తులు ఎ విధముగా ఆరాధించిను చివరకు నన్నే పొందుచున్నారు.

అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః !
పరం భవమజానంతో మమావ్యయమనుత్తమమ్ !!  24

అవ్యక్తం - వ్యక్తిం - ఆపన్నం - మన్యంతే - మాం - అబుద్ధయః
పరం - భావం - అజానంతః - మమ - అవ్యయం - అనుత్తమం


అవ్యయం - అవ్యయమైనదియు, అనుత్తమం - సర్వోత్తమమైనదియు, పరం - పరమమైనదియు, మమ - నా యొక్క, భావం - స్వభావమును, అజానంతః - ఎరుగని, అబుద్ధయః - అవివేకులు, అవ్యక్తం - అవ్యక్తమైన, మాం - నన్ను, వ్యక్తిం - వ్యక్తిగాను, ఆపన్నం - ఆపదను బొందిన వానినిగను, మన్యంతే - తలంచుచున్నారు.

నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకును, మనస్సునకును కనుపడనివాడను. నా పరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక, ఇట్టి నన్ను సాధారణమనుష్యునిగా తలంచుచున్నారు.

నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః !
మూఢోపాయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్ !!  25

న - అహం - ప్రకాశః - సర్వస్య - యోగమాయా సమావృతః
మూఢః - అయం - న - అభిజానాతి - లోకః - మాం - అజం - అవ్యయం 


అహం - నేను, యోగామయా సమావృతః - యోగమాయచే ఆవరించబడి, సర్వస్య - అందరికిని, ప్రకాశః న - కనబడువాడునుకాను, మూఢః - వివేకశూన్యుడగు, అయం - ఈ, లోకః - లోకము, మాం - నన్ను, అజం - పుట్టుకలేని వానినిగను, అవ్యయం - అవ్యయునిగను, న అభిజానాతి - ఎరుగదు.

నా యోగమాయ వలన నేను అందరికిని గోచరింపను. కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా, శాశ్వతునిగా, పరమేశ్వరునిగా తెలుసుకొనలేరు.

వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున !
భవిష్యాణి చ భూతాని మాం తు వేదన కశ్చన !!  26

వేద - అహం - సమతీతాని - వర్తమానాని - చ - అర్జున
భవిష్యాణి - చ - భూతాని - మాం - తు - వేద - న - కశ్చన


అర్జున - అర్జునా, అహం - నేను, సమతీతాని - నశించినవియును, వర్తమానాని చ - ప్రస్తుతము ఉన్నవియును, భవిష్యాణి చ - ఇక రాబోవునవియును అగు, భూతాని - జీవులను, వేద - ఎరుగుదును, మాం తు - మరి నన్ను, కశ్చన - ఒక్కడును, న వేద - ఎరుగడు.

ఓ అర్జునా ! గతించినకాలమునకు చెందినట్టివియు, ప్రస్తుత కాలమునందున్నట్టివియు ఐన చరాచర ప్రాణులన్నింటిని నేను ఎరుగుదును. అంతేకాదు రాబోవు కాలమున జన్మించు ప్రాణులను గూర్చియు నేను ఎరుగుదును. కాని నాయందు భక్తిశ్రద్ధులు గలవారు తప్ప వెరేవ్వరును నన్ను ఎరుగరు. అయితే నాయందు శ్రద్ధలేనివాడు నన్ను ఎరుంగడు.

ఇచ్చాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత !
సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప !!  27

ఇచ్ఛాద్వేష సముత్థేన - ద్వంద్వమోహేన - భారత
సర్వభూతాని - సమ్మోహం - సర్గే - యాంతి - పరంతప 


భారత - అర్జునా, సర్గే - పుట్టుకయందు, ఇచ్ఛాద్వేష సముత్థేన - ఇష్టానిష్టముల వలన బుట్టిన, ద్వంద్వమోహేన - సుఖదుఃఖ స్వరూపమయిన ద్వంద్వమోహేన - సుఖదుఃఖ స్వరూపమయిన ద్వంద్వమోహములచేత, సర్వభూతాని - సర్వప్రాణులను, సమ్మోహం - సమ్మోహమును, యాంతి - పొండుచున్నవి, పరంతప - అర్జునా.

భరతవంశీ ! ఓ అర్జునా ! జగత్తునందు ప్రాణులన్నియును రాగద్వేషముల వలన కలిగిన సుఖదుఃఖాదిద్వంద్వముల ప్రభావము వలన అంతులేని మోహములో పడిపోవుచున్నవి.

యేషాం త్వతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం !
తే - ద్వంద్వమోహ నిర్ముక్తాః - భజంతే - మాం - దృఢవ్రతాః  !!  28

యేషాం - తు - అంతగతం - పాపం - జననాం - పుణ్యకర్మణాం
తే - ద్వంద్వమోహ నిర్ముక్తాః - భజంతే - మాం - దృఢవ్రతాః


పుణ్యకర్మణాం - సత్కర్మలను జేయు, యేషాం - ఏ, జనానాం - జనులయొక్క, పాపం తు - పాపము, అంతగతం - పరిహరింపబడినదో, తే - వారు, ద్వంద్వ మోహనిర్ముక్తాః - ద్వంద్వమోహము చేత విడువబడినవారై, దృఢవ్రతాః - ధృఢవ్రతులై, మాం - నన్ను, భజంతే - సేవించుచున్నారు.

కాని నిష్కామభావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు నశించును అట్టివారు రాగద్వేషజనితములైన సుఖదుఃఖాది రూపమోహముల నుండి విముక్తులయ్యెదరు. ధృఢనిశ్చయము గల్గిన     అట్టి భక్తులు అన్నివిధముల నన్నే భజింతురు.

జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే !
తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమ్ అధ్యాత్మం కర్మ చాఖిలమ్ !!  29

జరామరణ మోక్షాయ - మాం - ఆశ్రిత్య - యతంతి - మే
తే - బ్రహ్మ - తత్ - విదుః - కృత్స్నం - అధ్యాత్మం - కర్మ - చ - అఖిలం


యే - ఎవరు, మాం - నన్ను, ఆశ్రిత్య - ఆశ్రయించి, జరామరణ మోక్షాయ - జరామరణములు పోగొట్టుకొనుటకు, యతంతి - యత్నించుచున్నారో, తే - వారు, తత్ బ్రహ్మ - ఆ పరబ్రహ్మమును, కృత్స్నం - సమస్తమయిన, అధ్యాత్మం - ప్రత్యగాత్మను, అఖిలం - సమస్తమయిన, కర్మ చ - కర్మమును, విదుః - ఎరుగుదురు.

నన్ను శరణుపొంది జరామరణవిముక్తికై ప్రయత్నించు వారు ఆ పరబ్రహ్మను, సంపూర్ణ - ఆధ్యాత్మమును, సంపూర్ణ కర్మను తెలిసికొందురు.

సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః !
ప్రయాణకాలేపాపి చ మాం తే విదుర్యుక్తచేతసః !! 30

సాధిభూతాధిదైవం - మాం - సాదియజ్ఞం - చ - యే - విదుః
ప్రయాణకాలే - అపి - చ - మాం - తే - విదుః - యుక్తచేతసః


యే - ఎవ్వరు, మాం - నన్ను, సాధిభూతాధిదైవం - అదిభూత అధిదైవతములతో గూడినవానినిగను, సాధియజ్ఞం చ - అధియజ్ఞముతో గూడిన వానినిగను, విదుః - తెలిసికొనుచున్నారో, తే - వారు, ప్రయాణకాలే అపి చ - మరణకాలము నందును, యుక్తచేతసః - యోగయుక్తులై, మాం - నన్ను, విదుః - తెలియుదురు.

అధిభూత, అధిదైవ, అధియజ్ఞములతోపాటు అందరికినీ ఆత్మరూపుడనైన నన్ను అంత్యకాలమునందైనను తెలిసికొనువారు నిశ్చలబుద్ధితో నన్నే చేరుదురు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జునసంవాదే జ్ఞానవిజ్ఞాన యోగో నామ
సప్తమోపాధ్యాయః