Read more!

భగవద్గీత పార్ట్ - 12

 

సంకల్పప్రభవాన్ కామాన్ త్యక్త్వాసర్వానశేషతః !
మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః !! 24

సంకల్పప్రభవాన్ - కామాన్ - త్యక్త్వా - సర్వాన్ - అశేషతః
మనసా - ఏవ - ఇంద్రియగ్రామం - వినియమ్య - సమంతతః

సంకల్ప ప్రభవాన్ - సంకల్పము వలన బుట్టెడి, సర్వాన్ - సమస్తమైన, కామాన్ - కోరికలను, అశేషతః - నిశ్శేషముగా, త్యక్త్వా - విడిచి, మనసా ఏవ - మనస్సుచేతనే, ఇంద్రియగ్రామం - ఇంద్రియ సమూహమును, సమంతతః - సమస్త విషయముల నుండియు, వినియమ్య - మరల్చి.

సంకల్పముల వలన కలిగిన కోరికలనన్నింటిని నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగ మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను.

శనైః శనైరుపరమేత్ బుద్ధ్యాధృతిగృహీతయా !
ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ !  25


శనైః - శనైః  - ఉపరమేత్ - బుద్ధ్యా - ధృతిగృహీతయా
ఆత్మసంస్థం - మనః - కృత్వా - న - కించిత్ - అపి - చింతయేత్


ధృతి గృహీతయా - దైర్యముచే గ్రహింపబడిన, బుద్ధ్యా - బుద్ధిచేతను, మనః - మనస్సును, ఆత్మసంస్థం - ఆత్మయందుండు దానినిగను, కృత్వా - చేసి, శనైః  శనైః  - మెల్లమెల్లగా, ఉపరమేత్ - బాహ్య విషయముల నుండి మరలింపవలెను. కించిత్ అపి - కొంచెమైనను, న చింతయేత్ - చింతింపగూడదు.

క్రమక్రమముగా సాధనచేయుచు ఉపరతిని పొందవలెను. దైర్యముతో బుద్ధిబలముతో మనస్సును పరమాత్మయందు స్థిరమొనర్చి, పరమాత్మనుతప్ప మరి ఏ ఇతర విషయమును ఏ మాత్రమూ చింతనచేయరాదు.

యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ !
తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ !  26

యతః - యతః - నిశ్చరతి - మనః - చంచలం - అస్థిరం
తతః - తతః - నియమ్య - ఏతత్ - ఆత్మని - ఏవ - వశం - నయేత్


యతః యతః - ఏయే విషయములందు, చంచలం - చంచలమైనదియును, అస్థిరం - నిలకడ లేనిదియునగు, మనః - మనస్సు, నిశ్చరతి - నిరంతరమును సంచరించుచున్నదో, తతః తతః - ఆయా విషయముల నుండి, ఏతత్ - ఈ మనస్సును, నియమ్య - మరలించి, ఆత్మని ఏవ - ఆత్మయందే, వశం - వశమును, నయేత్ - పొందింపవలయును.

సహజముగా నిలుకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించు చుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి, దానిని, పరమాత్మ యందే స్థిరముగా నిలుపవలయును.

ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమ్ !
ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతకల్మషమ్ !  27

ప్రశాంతమనసం - హి - ఏనం - యోగినం - సుఖం - ఉత్తమం
ఉపైతి - శాంతరజసం - బ్రహ్మభూతం - ఆకల్మశం


ప్రశాంత మనసం - ప్రశాంతచిత్తుడును, శాంతరజసం - శాంతినిబొందిన రజోగుణము గలవాడు, బ్రహ్మభూతం బ్రహ్మభూతుడు, అకల్మషం - పాపరహితుడగును, ఏనం - ఈ, యోగినం - యోగి, ఉత్తమం - శ్రేష్ఠమైన, సుఖం - సుఖము, ఉపైతి హి - పొందుచున్నది గదా.

ప్రశాంతమైన మనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైనవాడును, అనగా ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగినవాడును, పరమాత్మయందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందుచున్నాడు.

యంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః !
సుఖేన బ్రహ్మాసంస్పర్శమ్ అత్యంతం సుఖమశ్నుతే !  28

యుంజన్ - ఏవం - సదా - ఆత్మానం - యోగీ - విగతకల్మషః
సుఖేన - బ్రహ్మసంస్పర్శం - అత్యంతం - సుఖం - ఆశ్నుతే


ఏవం - ఈ విధముగ, సదా - ఎల్లప్పుడు, ఆత్మానం - తనను, యుంజన్ - ఆత్మయందు నిలుపని, విగత కల్మషః - పాపరహితమైన, యోగీ - యోగి, సుఖేన - సులభము గాను, బ్రహ్మ సంస్పర్శం - బ్రహ్మానుభవరూపమగు, అత్యంతం - నిరతిశయమగు, సుఖం - ఆనందమును, ఆశ్నుతే - పొందుచున్నాడు.

పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్తరీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నమొనర్చుచు, పరబ్రహ్మపరమాత్మ ప్రాప్తిరూపమైన అపరిమితమైన ఆనందమును హాయిగా అనుభవించును. 

సర్వభూతస్థం ఆత్మానంసర్వభూతాని చ ఆత్మని !
ఈక్షతే  యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః !  29

సర్వభూతస్థం - ఆత్మానం - సర్వభూతాని - చ - ఆత్మని
ఈక్షతే - యోగయుక్తాత్మా - సర్వత్ర - సమదర్శనః 



యోగయుక్తాత్మా - యోగయుక్తుడు, సర్వత్ర - అంతట, సమదర్శనః - సమబుద్ధి కలిగి, ఆత్మానం - తన ఆత్మను, సర్వభూతస్థం - సకలభూతముల యందున్న వానినిగను, సర్వభూతాని - సర్వభూతములను, ఆత్మని చ - తన యందును, ఈక్షతే - దర్శించుచున్నాడు.

సర్వవ్యాప్తమైన అనంతచైతన్యము నందు ఏకీభావస్థితిరూప యోగ యుక్తమైన ఆత్మగలవాడును, అంతటను అన్నింటిని సమభావముతో చూచువాడును అగు యోగి తనయాత్మను సర్వప్రాణులయందు స్థితమైయున్నట్లుగను, ప్రాణులన్నింటిని తన ఆత్మయందు కల్పితములుగను చూచును.

యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి !
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి !  30

యః - మాం - పశ్యతి - సర్వత్ర - సర్వం - చ - మయి - పశ్యతి
తస్య - అహం - న - ప్రణశ్యామి - సః - చ - మే - న - ప్రణశ్యతి


యః - ఎవడు, మాం - నన్ను, సర్వత్ర - సర్వభూతముల యందును, పశ్యతి - గాంచుచున్నాడో, తస్య - వానికి, అహం - నేను, న ప్రణశ్యామి - అదృశ్యముకాను, సః చ - అతడును, మే - నాకుం న ప్రణశ్యతి - కనబడకపోడు.

ఎవరు సమస్త ప్రాణులందు నన్ను చూచునో అట్టివానికి నేను కనబడకపోను. నాకతడు కనబడకపోడు.

సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః !
సర్వథా వర్థమానోపాపి స యోగీ మయి వర్తతే !  31

సర్వభూతస్థితం - యః - మాం - భజతి - ఏకత్వం - ఆస్థితః
సర్వథా - వర్తమానః - అపి - సః - యోగీ - మయి - వర్తతే


సర్వభూతస్థితం - సర్వభూతముల యందున్న, మాం - నన్ను, ఏకత్వం - ఏకీభావమును, ఆస్థితః - పొందినవాడై, యః - ఎవడు, భజతి - భజించుచున్నాడో, సః - ఆ, యోగీ - యోగి, సర్వథా - సర్వవిధముల, వర్తమానః అపి - వర్తించుచున్నను, మయి - నాయందు, వర్తతే - ప్రవర్తించుచున్నాడు.

భగవంతునియందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపముననున్న నన్ను భజించును. అట్టి యోగి సర్వథా సర్వవ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను నా యందే ప్రవర్తించుచుండును.

ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోపార్జున !
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః !  32

ఆత్మౌపమ్యేన - సర్వత్ర - సమం - పశ్యతి - యః - అర్జున
సుఖం - వా - యది - వా - దుఃఖం - సః - యోగీ - పరమః - మతః


అర్జున - అర్జునా, సర్వత్ర - సర్వత్రమునందును, సుఖం వా - సుఖమునుగాని, దుఃఖం - యది నా - దుఃఖమును గాని, ఆత్మౌపమ్యేన - ఆత్మసాదృశ్యము చేత, సమం - సమానముగా, యః - ఎవ్వడు, పశ్యతి - చూచుచున్నాడో, సః - ఆ, యోగీ - యోగి, పరమః మతః - శ్రేష్ఠుడని చెప్పబడుచున్నాడు.

ఓ అర్జునా ! సర్వప్రాణులను తనతో సమానముగా చూచు వాడును, సుఖమునుగాని, దుఃఖమునుగాని సమముగా సమానముగ చూచువాడును ఇతరుల సుఖ దుఃఖములను తన సుఖదుఃఖములుగా భావించువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు అని చెప్పడుచున్నాడు.

అర్జునవాచ :-
యోపాయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన !
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరామ్ !  33

యః - అయం - యోగః - త్వయా - ప్రోక్తః - సామ్యేన - మధుసూదన
ఏతస్య - అహం - న - పశ్యామి - చంచలత్వాత్ - స్థితిం - స్థిరాం


మధుసూదన - శ్రీకృష్ణా, సామ్యేన - సమత్వభావము చేతను, యః అయం యోగః - ఈ యోగము ఏదయితే, త్వయా నీచేత, ప్రోక్తః - చెప్పబడినదో, ఏతస్య - ఈ యోగము ఏదయితే, త్వయా - నీచేత, ప్రోక్తః - చెప్పబడినదో, ఏతస్య - ఈ యోగము యొక్క, స్థిరాం - చలింపని, స్థితిం - స్థితిని, చంచలత్వాత్ - చంచలస్వభావము వలన, అహం - నేను, న పశ్యామి - కనుగొనకున్నాను.

అర్జునుడు పలికెను ఓ మధుసూదనా! సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగముయొక్క స్థిరస్థితిని మనశ్చాంచల్యకారణమున తెలిసికొనలేకున్నాను.

చంచలం హి మనః కృష్ణప్రమాథి బలవద్దృఢమ్ !
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ !  34

చంచలం - హి - మనః - కృష్ణ - ప్రమాథి - బలవత్ - దృఢం
తస్య - అహం - నిగ్రహం - మన్యే - వయోః - ఇవ - సుదుష్కరం


కృష్ణ - కృష్ణా, మనః - మనస్సు, చంచలం - చంచలమైనదియు, ప్రమాథి - మోహమును కలిగించునదియు, బలవత్ - బలముగలదియు, దృడం - దృడమైనదియు, హి - కదా, తస్య - అట్టి మనస్సుయొక్క, నిగ్రహం - నిగ్రహము, వాయోః ఇవ - గాలివలె, సుదుష్కరం - దుస్సాధ్యముగా, అహం - నేను, మన్యే - తలంచుచున్నాను.

ఓ కృష్ణా ! ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, బాగుగా మధించు స్వభావము గలది. దృఢమైనది. మిక్కిలి బలీయమైనది. కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుటనువలె మిక్కిలి దుష్కరమని నాకు తోచుచున్నది.

శ్రీభగవాన్ ఉవాచ :-
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ !
అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే !  35

అసంశయం - మహాబాహో - మనః - దుర్నిగ్రహం - చలం 
అభ్యాసేన - తు - కౌంతేయ - వైరాగ్యేణ - చ - గృహ్యతే


మహాబాహో - అర్జునా, మనః - మనస్సు, దుర్నిగ్రహం - నిగ్రహింప - నిగ్రహింపరానిది, చలం - చంచలమైనది, అసంశయం - సంశయం లేదు, కౌంతేయ - అర్జునా, అభ్యాసేనతు - అభ్యాసము చేత, వైరాగ్యేణ చ - వైరాగ్యముచేత, గృహ్యతే - నిగ్రహింపబడుచున్నది.

శ్రీ భగవానుడు పలికెను హే మహాబాహో! నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే. దానిని వశపరచుకొనుట మిక్కిలి కష్టము. కౌంతేయా! అభ్యాసవైరాగ్యములద్వారా మనసు నిగ్రహింపబడుచున్నది.

అసంయతాత్మనా యోగో దుష్ప్రాన ఇతి మే మతిః  !
వశ్యాత్మనా తు యతతా శక్యోపావాప్తుముపాయతః !  36

అసంయతాత్మనా - యోగః - దుష్ప్రాపః - ఇతి - మే - మతిః
వశ్యాత్మనా - తు - యతతా - శక్యః - అవాప్తుం - ఉపాయతః


అసంయాతత్మనా - మనోనిగ్రహము లేనివానిచేత, యోగః - యోగము, దుష్ప్రాపః ఇతి - పొందశక్యము కానిది అని, మే - నాయొక్క, మతిః  - అభిప్రాయము, యతతా - ప్రయత్నించునట్టి, వశ్యాత్మనా తు - స్వాధీనమైన మనస్సు గలవానిచేత, ఉపాయతః - ఉపాయము వలన, అవాప్తుం - పొందుటకు, శక్యః - సాధ్యము.

మనస్సును వశపరచుకొనని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము. కాని మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధనద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయము.

అర్జున ఉవాచ :-
అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః !
అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణగచ్ఛతి !  37

అయతిః - శ్రద్ధయా - ఉపేతః - యోగాత్ - చలితమానసః
అప్రాప్య - యోగసంసిద్ధిం - కాం - గతిం - కృష్ణ - గచ్ఛతి


కృష్ణ - కృష్ణా, అయతిః - ప్రయత్నరహితుడును, శ్రద్ధయా ఉపేతః - శ్రద్ధతో గూడినవాడు, యోగాత్ - యోగమునుండి, చలితమానసః - చలింపజేయబడిన మనస్సు గలవాడు, యోగసంసిద్ధిం - యోగసిద్ధిని, అప్రాప్య - పొందక, కాం గతిం - ఏమిగతిని, గచ్ఛతి - పొందుచున్నాడు.

అర్జునుడు పలికెను ! ఓ కృష్ణా ! యోగమునందు శ్రద్ధతో యోగసాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసానదశలో మనస్సు చలించి, ఆత్మసాక్షాత్కారమును పొందకయే మరణించిన సాధకుని గతియేమగును? 

కచ్ఛిన్నోభయవిభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి !
అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి !  38

కచ్చిత్ - న - ఉభయ విభ్రష్టః - ఛిన్నాభ్రం - ఇవ - నశ్యతి
అప్రతిష్ఠః - మహాబాహో - విమూఢః - బ్రహ్మణః - పథి 


మహాబాహో - శ్రీకృష్ణా, ఉభయ విభ్రష్టః - రెండింటికిని చెడినవాడై, బ్రహ్మణః పథి - బ్రహ్మజ్ఞాన మార్గమునందు, విమూఢః - మూఢుడును, అప్రతిష్ఠః - ఆధారము లేనివాడగుచు, ఛిన్నాభ్రమిన - చెదిరిన మబ్బువలె, న నశ్యతి కచ్చిత్ - చెడిపోడు కదా.

హే మహాబాహో ! శ్రీక్రుష్టా ! అతడు యోగభ్రష్టుడు భగవత్ర్పాప్తి మార్గమునుండి జారినవాడై, ఆశ్రయరహితుడై, ఉభయభ్రష్టుడై, ఛిన్నాభిన్నమైన మేఘమువలె నశింపడు గదా ! 

ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః !
త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే !  39

ఏతత్ - మే - సంశయం - కృష్ణ - ఛేత్తుం - అర్హసి - అశేషతః
త్వదన్యః - సంశయస్య - అస్య - ఛేత్తా - న - హి - ఉపపద్యతే


కృష్ణ - కృష్ణా, మే - నాయొక్క, ఏతత్ - ఈ, సంశయం - సందేహమును, అశేషతః - నిశ్శేషముగా, ఛేత్తుం - నివారించుటకు, అర్హసి - తగుదువు, అస్య - ఈ, సంశయస్య - సందేహమును, ఛేత్తా- తీర్చెడివాడు, త్వదన్యః - నిన్నుమించినవాడు, న ఉపపద్యతే హి - ఉండడు కదా.

కృష్ణా ! ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తిచేయుట నీకే చెల్లును. ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికిని శక్యము కాదు.

శ్రీభగవాన్ ఉవాచ :-
పార్ధ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే !
న హి కల్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్ఛతి !  40

పార్థ - న - ఏవ - ఇహ - న - అముత్ర - వినాశః - తస్య - విద్యతే
న - హి - కల్యాణకృత్ - కశ్చిత్ - దుర్గతిం - తాత - గచ్ఛతి


పార్థ - అర్జునా, తస్య - వానికి, ఇహ - ఈలోకమునందు, వినాశః - నాశము, న విద్యతే ఏవ - కలుగదు, అముత్ర - పరలోకము నందును, న - కలుగదు, తాత - వత్సా, కల్యాణకృత్ - పుణ్యాత్ముడు, కశ్చిత్ - ఎవడును, దుర్గతిం - చెడు గతిని, న గచ్ఛతి హి - పొందడు గదా.

శ్రీభగవానుడు పలికెను ఓ పార్థా! అట్టి పురుషుడు ఈ లోకమున గాని, పరలోకమున గాని అధోగతిపాలుపాడు. ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ప్రాప్తికై కర్తవ్యకర్మలను ఆచరించు వాడెవ్వడును దుర్గతి పాలుగాడు గదా! 

ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వాశాశ్వతీః సమాః !
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోపాభిజాయతే !  41

ప్రాప్య - పుణ్యకృతాం - లోకాన్ - ఉషిత్వా - శాశ్వతీః - సమాః
శుచీనాం - శ్రీమతాం - గేహే - యోగభ్రష్టః - అభిజాయతే


యోగభ్రష్టః - యోగభ్రష్టుడు, పుణ్యకృతాం - పుణ్యాత్ముల, లోకాన్ - లోకములను, ప్రాప్య - పొంది, శాశ్వతీః - అనేకములైన, సమాః - ఏండ్లు, ఉషిత్వా - ఉండి, శుచీనాం - సదాచార వంతులైన, శ్రీమతాం - సంపన్నులైన, గేహే - గృహమునందు, అభిజాయతే - పుట్టుచున్నాడు.

యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది - ఉత్తమ లోకములను పొంది, ఆయాలోకములలో పెక్కు సంవత్సరములు గడిపిన తర్వాత పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును.

అథవా యోగినామేవ కులే భవతి ధీమాతామ్ !
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశ్యమ్ !  42

అథవా - యోగినాం - ఏవ - కులే - భవతి - ధీమతాం
ఏతత్ - హి - దుర్లభతరం - లోకే - జన్మ - యత్ - ఈదృశం


అథవా - లేనిచో, ధీమతాం - జ్ఞానవంతులైన, యోగినాం - యోగులయొక్క, కులే ఏవ - కులమందే, భవతి - జన్మించుచున్నాడు, లోకే - లోకమునందు, ఈదృశం - ఇట్టి, జన్మ - పుట్టుక, యత్ - ఏదిగలదో, ఏతత్ - ఇట్టిది, దుర్లభతరం హి - మిక్కిలి దుర్లభము గదా.

లేనిచో విరాగియైన పురుషుడు ఆపుణ్య లోకములకు పోకుండగనే జ్ఞానులైన యోగుల కుటుంబంలోనే జన్మించును. కాని లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము గదా.

తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదైహికమ్ !
యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన !  43

తత్ర - తం - బుద్ధిసంయోగం - లభతే - పౌర్వదేహికం
యతతే - చ - తతః - భూయః - సంసిద్ధౌ - కురునందన


కురునందన - అర్జునా, తత్ర - ఆ యోగికులమునందు, పౌర్వదేహికం - పూర్వ దేహసంబంధమైన, తం - ఆ, బుద్ధి సంయోగం - బుద్ధి సంయోగమును, లభతే - పొందుచున్నాడు, తతః - ఆ సంస్కారము వలన, భూయః - మరల, సంసిద్ధౌ - ఆత్మయోగ సిద్ధికొరకు, యతతే చ - ప్రయత్నించుచున్నాడు.

అచట యోగి కుటుంబమున పుట్టిన పిదప పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధిరూపయోగ సంస్కారములను అతడు సులభముగనే పొందును. ఓ కురునందనా ! ఆబుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరల పరమాత్మప్రాప్తి సిద్ధించుటకై మనుపటి కంటెను అధికముగా సాధన చేయుచున్నాడు.

పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపాపి సః !
జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే !  44

పూర్వాభ్యాసేన - తేన - ఏన - హ్రియతే - హి - అవశః - అపి - సః
జిజ్ఞాసుః  - అపి - యోగస్య - శబ్దబ్రహ్మ - అతివర్తతే


సః - వాడు, అవశః అపి - ప్రయత్నము లేకున్నను, తేన - ఆ, పూర్వాభ్యాసము చేతనే, హ్రియతే - ఆకర్షింపబడుచున్నాడు, యోగస్య - యోగమును, జిజ్ఞాసుః  అపి - ఎరుగదలచిన వాడు సైతము, శబ్దబ్రహ్మ - శబ్దబ్రహ్మమును, అతివర్తతే హి - అతిక్రమించుచున్నాడు గదా.

శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పూర్వసాధనప్రభావమున నిస్సందేహముగ భగవంతునివైపు ఆకర్షితుడగును. అట్లే సమబుద్ధిరూపయోగ జిజ్ఞాసువుగూడ వేదములలో తెల్పబడిన సకామకర్మల ఫలమును అతిక్రమించుచు గదా !.

ప్రయత్నాద్యమానస్తు యోగీ సంశుద్దకిల్బిషః !
అనేకజన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిమ్ !  45

ప్రయత్నాత్ - యతమానః - తు - యోగీ - సంశుద్ధ కిల్బిషః
అనేకజన్మ సంసిద్ధః - తతః - యాతి - పరాం - గతిం


ప్రయత్నాత్ - ప్రయత్న పూర్వకముగ, యతమానః తు - యత్నించుచున్న వాడైన, యోగీ - యోగి, సంశుద్ధకిల్బిషః - పాపరహితుడై, అనేకజన్మసమిసిద్ధః - అనేకజన్మల సంస్కారము వలన ప్రాప్తినొంది, తతః - తదనంతరము, పరాం - పారలౌకికమైన, గతిం - సిద్ధిని, యాతి పొందుచున్నాడు.

కాని, ప్రయత్నపూర్వకముగ యోగసాధనచేయు యోగి అనేక జన్మలసంస్కారముల ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది, సంపూర్ణముగా పాపరహితుడై, తత్ క్షణమే పరమ పదమును పొందును.

తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపాపి మతోపాధికః !
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున !  46

తపస్విభ్యః - అధికః - యోగీ - జ్ఞానీభ్యః - అపి - మతః - అధికః
కర్మిభ్యః - చ - అధికః - యోగీ - తస్మాత్ - యోగీ - భవ - అర్జున


అర్జున - అర్జునా, యోగీ - యోగి, తపస్విభ్యః - తప్పస్సు చేయువారి కంటెను, అధికః - అధికుడు, జ్ఞానిభ్యః అపి - జ్ఞానులకంటెను గూడ, అధికః - అధికుడుగ, మతః - పెర్కొనబడుచున్నాడు, యోగీ - యోగి, కర్మిభ్యః చ - కర్మిష్టుల కంటెను, అధికః - అధికుడు, తస్మాత్ - అందువలన, యోగీ - యోగిని, భవ - ఆగుము.

యోగితాపసులకంటెను శ్రేష్ఠుడు. జ్ఞానుల కంటెను శ్రేష్ఠుడు.సకామకర్మలను ఆచరించువారికంటెను శ్రేష్ఠుడని భావింపబడును. కావున ఓ అర్జునా ! నీవు యోగివి కమ్ము.

యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా !
శ్రద్ధావాన్ భజతే యో మాం స మే యుక్తతయో మతః !  47

యోగినాం - అపి - సర్వేషాం - మద్గతేన - అంతరాత్మనా
శ్రద్ధావాన్ - భజతే - యః - మాం - సః - మే - యుక్తతమః - మతః


సర్వేషాం - సమస్తమైన, యోగినాం అపి - యోగులలోనుగూడ, యః - ఎవడు, మద్గతేన - నన్నుపొందిన, అంతరాత్మనా - అంతఃకరణముతో, శ్రద్ధావాన్ - శ్రద్ధవంతుడై, మాం - నన్ను, భజతే - సేవించుచున్నాడో, సః - అతడు, మే - నాచేత, యుక్తతమః - ఉత్తమయోగిగా, మతః - తలంబడుచున్నాడు.


యోగులందరిలోను శ్రద్ధాళువై, అంతరాత్మను నాయందే లగ్నమొనర్చి, అనగా భక్తివిశ్వాసములతో నిశ్చలమైన, దృఢమైన అనన్య భావముతో నా యందే స్థిరమైయున్న మనోబుద్ధిరూప అంతఃకరణమును గలిగి, నిరంతరము నన్నే భజించువాడు ఉత్తముడు అని నా యభిప్రాయము.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే 
శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగోనామ