భగవద్గీత పార్ట్ - 11

 

ఆత్మసంయమయోగః
శ్రీపరమాత్మనే నమః
అథ షష్ఠోపాధ్యాయః - ఆత్మసంయమయోగః

శ్రీభగవాన్ ఉవాచ
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః !
స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః  1

అనాశ్రితః - కర్మఫలం - కార్యం - కర్మ - కరోతి - యః
సః - సంన్యాసీ - చ - యోగీ - చ - న - నిరగ్నిః - న - చ - అక్రియః


యః - ఎవ్వడు, కార్యం - చేయదగిన, కర్మ - కర్మమును, కర్మఫలం - కర్మఫలమును, అనాశ్రితః - ఆశించనివాడై, కరోతి - చేయునో, సః - అతడు, సంన్యాసీ చ - సంయాసీయును, యోగీ చ - యోగియును, నిరగ్నిః అగ్నిహోత్రాదులు వదిలినవాడును, అక్రియః చ - కర్మలు చేయనివాడును, న - కాడు.

శ్రీభగవానుడు పలికెను - కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్యకర్మలను ఆచరించువాడే నిజమైన సన్న్యాసి, నిజమైన యోగి. కాని కేవలము అగ్ని కార్యములను త్యజించినంత మాత్రమున సన్న్యాసియుకాడు.

యం సన్న్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ !
న హ్యసన్న్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన  2

యం - సంన్యాసం - ఇతి - ప్రాహుః - యోగం - తం - విద్ధి - పాండవ
న - హి - అసంన్యస్తసంకల్పః - యోగీ - భవతి - కశ్చన 


పాండవ - అర్జునా, యం - దేనిని, సంన్యాసం ఇతి - సన్న్యాసమని, ప్రాహుః - చెప్పుదురో, తం - దానిని, యోగం - యోగముగా, విద్ధి - తెలిసికొనుము, అసంన్యస్తసంకల్పః - విడువబడని సంకల్పములు గలవాడు, కశ్చన - ఎవడును, యోగీ - యోగి, న భవతి హి - కాడుగదా.

ఓ అర్జునా ! సన్న్యాసము అని పిలువబడునదియే యోగము అని తెలిసికొనుము. సంకల్పత్యాగము చేయనివాడెవ్వడును యోగి కానేరడు.

ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే !
యోగారూఢస్య తస్స్యైవ శమః కారణముచ్యతే !!  3

ఆరురుక్షో - మునేః - యోగం - కర్మ - కారణం - ఉచ్యతే
యోగారూఢస్య - తస్య - ఏవ - శమః - కారణం - ఉచ్యతే


యోగం - యోగమును, ఆరురుక్షోః - పొందదలచిన, మునేః మునికి, కర్మ - కర్మము, కారణం - సాధనమని, ఉచ్యతే - చెప్పబడుచున్నది, యోగారూఢస్య - యోగమును పొందిన, తస్య - వానికి, శమః ఏవ - శమమే, కారణం - కారణమని, ఉచ్యతే - చెప్పబడుచున్నది.

యోగారూఢస్థితినిపొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామకర్మాచరణమువలననే యోగప్రాప్తి కలుగును. యోగారూఢుడైన పురుషునకు సర్వసంకల్పరాహిత్యమే మోక్షప్రాప్తికి మూలము.

యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే !
సర్వసంకల్పసన్న్యాసీ యోగారూఢస్తదోచ్యతే !  4

యదా - హి - న - ఇంద్రియార్థేషు - న - కర్మసు - అనుషజ్జతే
సర్వ సంకల్ప సంన్యాసీ - యోగారూఢః - తదా - ఉచ్యతే


యదాహి - ఎప్పుడయితే, ఇంద్రియార్థేషు - శబ్దాది విషయములందు, కర్మసు - కర్మలయందు, న అనుషజ్జతే - ఆసక్తినుంచడో, సర్వసంకల్పసంన్న్యాసీ - సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యెగారూఢుడని, ఉచ్యతే - చెప్పబడుచున్నాడు.

ఇంద్రియభోగములయందును, కర్మలయందును ఆసక్తినుంచక సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడనబడును.

ఉద్ధరేదానాత్మానం నాత్మానమవసాదయేత్  !
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః !  5

ఉద్ధరేత్ - ఆత్మనా - ఆత్మానం - న - ఆత్మానం - అవసాదయేత్
ఆత్మా - ఏవ - హి - ఆత్మనః - బంధుః - ఆత్మా - ఏవ - రిపుః - ఆత్మనః


ఆత్మానం - తనను, ఆత్మనా - ఆత్మచేతను, ఉద్ధరేత్ - ఉద్దరించుకొనవలెను, ఆత్మానం - ఆత్మను, న - అవసాదయేత్ - అధోగతి కానీయకూడదు, ఆత్మనః - తనకు, ఆత్మా ఏవ - ఆత్మయే, బంధుః హి - బంధువుగదా, ఆత్మనః - ఆత్మకు, ఆత్మాఏవ - ఆత్మయే, రిపుః - శత్రువు గదా.

మనుజులు ఈ సంసారసాగరము నుండి తమను తామే ఉద్ధరించు కొనవలెను. తమకుతామే అధోగతిపాలుకారాదు. లోకములో వాస్తవముగ తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు.

బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః !
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ !  6

బంధుః - ఆత్మా - ఆత్మనః - తస్య - యేన - ఆత్మా - ఏవ - ఆత్మానా - జితః
అనాత్మనః - తు - శత్రుత్వే - వర్తేత - ఆత్మా - ఏవ - శత్రువత్ 


యేన - ఎవనిచేత, ఆత్మా - ఆత్మ, ఆత్మనా ఏవ - ఆత్మచేతనే, జితః - జయింపబడినదో, ఆత్మనః - ఆత్మయోగియైన, తస్య - వానికి, ఆత్మా - ఆత్మ, బంధుః - బంధువు, అనాత్మనః తు - ఆత్మజ్ఞానము లేనివానికి, ఆత్మాఏవ - ఆత్మయే, శత్రువత్ - శత్రువువలె, శత్రుత్వే - శత్రుభావమునందు, వర్తత - ప్రవర్తించును.

ఎవరు తన మనస్సును జయించునో అట్టి వాని మనస్సు బంధువులా ఉపకారిలా వుండును. మనస్సును జయింపనిచో అది శత్రువై అపకారము చేయును.

జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః !
శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానావమానయోః !  7

జితాత్మనః - ప్రశాంతస్య - పరమాత్మా - సమాహితః
శీతోష్ణసుఖదుఃఖేషు - తథా - మానాపమానయోః


శీతోష్ణసుఖదుఃఖేషు - శీతోష్ణసుఖదుఃఖములులందు, తథా - అటులే, మానాప మానయోః  - మానాపమనములయందు, ప్రశాంతస్య - ప్రశాంతస్వభావము గలవానికి, జితాత్మనః - జయింపబడిన ఆత్మ గలవానికి, పరమాత్మ, సమాహితః - సమాహితుడగుచున్నాడు.

శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానావమానములు మున్నగు ద్వంద్వములయందు అంతఃకరణవృత్తులు నిశ్చలముగా ఉండి, స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు పరమాత్మ చక్కగా స్థితుడై యుండును.

జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః !
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః !  8

జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా - కూటస్థః - విజితేంద్రియః
యుక్తః - ఇతి - ఉచ్యతే - యోగీ - సమలోష్టాశ్మకాంచనః


జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా - జ్ఞానవిజ్ఞానములచేత తృప్తి చెందినవాడు, కూటస్థః  - కూటస్థుడు, విజితేంద్రియః - జయింపబడిన ఇంద్రియములు గలవాడు, యుక్తః ఇతి - యుక్తుడని, ఉచ్యతే - చెప్పబడుచున్నాడు, యోగీ - అట్టి యోగి, సమలోష్టాశ్మకాంచనః - మట్టిని, రాతిని, బంగారమును సమముగా జూచువాడు.

యోగియొక్క అంతఃకరణము నందు జ్ఞానవిజ్ఞానములు నిండియుండును. అతడు వికారరహితుడు. ఇంద్రియాదులను పూర్తిగా వశపరచుకొనిన వాడు. అతడు మట్టిని, రాతిని, బంగారమును సమానముగా చూచును.

సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు !
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధి ర్విశిష్యతే !  9

సుహృత్ - మిత్ర - అరి - ఉదాసీన - మధ్యస్థ - ద్వేష్యబంధుషు
సాధుషు - అపి - చ - పాపేషు - సమబుద్ధిః - విశిష్యతే


సుహృత్ - మంచి హృదయము గలవారియందును, మిత్ర - మిత్రుల యందును, అరి - శత్రువుల యందును, ఉదాసీన - తతస్థులయందును, మధ్యస్థ - మధ్యవర్తుల యందును, ద్వేష్య - అప్రియులయందును, బంధుషు - బంధువులయందును, సాధుషు - మంచివారి యందును, పాపేషు అపిచ - పాపులయందును, సమబుద్ధిః - సమభావము గలవాడు, విశిష్యతే - శ్రేష్ఠుడగుచున్నాడు.

సుహృదులయందును, మిత్రులయందును, శత్రువుల యందును, ఉదాసీనులయందును, మధ్యస్థులయందును, ద్వేషింపదగినవారి యందును, బంధువులయందును, ధర్మాత్ములయందును, పాపులయందును సమబుద్ధి కలిగియుండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు.

యోగీ యుంజీత సతతమ్ ఆత్మానం రహసి స్థితః !
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః ! 10

యోగీ - యుంజీత - సతతం - ఆత్మానం - రహసి - స్థితః
ఏకాకీ - యతచిత్తాత్మా - నిరాశీః - అపరిగ్రహః


యోగీ - యోగి, రహసి - రహస్య ప్రదేశమునందు, స్థితః - ఉన్నవాడై, ఏకాకీ - ఏకాంతముగ నుండువాడు, యతచిత్తాత్మా - వశీకృతమైన దేహేంద్రియాదులు గలవాడు, నిరాశీః - ఆశలేనివాడు, అపరిగ్రహః - అన్యులనుండి ఏమియు గ్రహించనివాడు, సతతం - నిరంతరము, ఆత్మానం - తనను, యుంజీత - ధ్యాననిష్ఠయందుంచవలెను.

శరీరేంద్రియమనస్సులను స్వాధీనపరచుకొనినవాడు, ఆశారహితుడు, వ్రతుడు అయిన యోగి ఒంటరి ప్రదేశమున కూర్చొని, ఆత్మను నిరంతరము పరమాత్మయందే ఉంచవలెను.

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః !
నాత్యుచ్చ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ ! 11

శుచౌ - దేశే - ప్రతిష్ఠాప్య - స్థిరం - ఆసనం - ఆత్మనః
న - అత్యుచ్చ్రితం - న - అతినీచం - చైలాజినకుశోత్తరం


శుచౌ - శిచితయైన, దేశే - ప్రదేశమునందు, న అత్యుచ్చ్రితం - మిక్కిలి ఎత్తుగానిదియు, న అతినీచం - మిక్కిలి క్రిందిగానుండనిదియు, చేలాజీనకుశోత్తరం - వస్త్రము, చర్మము, దర్భలును ఒకదానిపై నొకటిగ గలదియు, స్థిరం - స్థిరమైనదియు, ఆత్మనః - తనయొక్క, ఆసనం - పీఠమును, ప్రతిష్ఠాప్య - నిలిపి.

పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా ధర్భాసనమును, జింకచర్మమును, వస్త్రమును ఒకదానిపై ఒకటి పఱచి అంత ఎక్కువగాకాని, తక్కువగాకాని కాకుండ సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును  ఏర్పరచుకొనవలెను.

తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః  !
ఉపవిశ్వసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధతే ! 12

తత్ర - ఏకాగ్రం - మనః - కృత్వా - యతచిత్తేంద్రియక్రియః
ఉపనిశ్య - ఆసనే - యుంజ్యాత్ - యోగం - ఆత్మవిశుద్ధయే


యతచిత్తేందరియా క్రియః - స్వాధీనమైన ఇంద్రియ, మనోవ్యాపారములు గలవాడై, మనః - మనస్సును, ఏకాగ్రం - ఏకవిషయము నందున్న దానినిగను, కృత్వా - చేసి, తత్ర - ఆ, ఆసనే - పీఠమునందు, ఉపనిశ్య - కూర్చుండి, ఆత్మశుద్ధయే - ఆత్మ శుద్ధికొరకు, యోగం - ఆత్మయోగమును, యుంజ్యాత్ - అభ్యాసము చేయవలెను.

ఆ ఆసనముపై కూర్చొని, చిత్తేంద్రియవ్యాపారములను వశము నందుంచుకొని, ఏకాగ్రతగల మనస్సుతో అంతఃకరణశుద్ధికై యోగాభ్యాసమును సాధనచేయవలెను.

సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః !
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ! 13

సమం - కాయశిరోగ్రీవం - ధారయన్ - అచలం - స్థిరః
సంప్రేక్ష్య - నాసికాగ్రం - స్వం - దిశః - చ - అనవలోకయన్


యుక్తః - యోగయుక్తుడు, కాయశిరోగ్రీవం - దేహమును, శిరమును, కంఠమును, అచలం - కదలకుండ, సమం - సమముగను, ధారయన్ - ధరించుచు, స్థిరః - స్థిరుడై, దిశఃచ - దిక్కులను, ఆనవలోకయన్ - చూడనివాడై, స్వం - తనదైన, నాసికాగ్రం - ముక్కు చివరను, సంప్రేక్ష్య - చూచును.

శరీరమును మెడను శిరస్సును నిటారుగ నిశ్చలముగా స్థిరముగా నుంచి, దిక్కులను చూడక తననాసికాగ్రభాగమునందే దృష్టిని నిలుపవలెను.

ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతేస్థితః !
మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః ! 14

ప్రశాంతాత్మా - విగతభీః - బ్రహ్మచారి వ్రతే - స్థితః
మనః - సంయమ్య - మచ్చిత్తః - యుక్తః - ఆసీత - మత్పరః


మనః - మనస్సును, సంయమ్య - నిగ్రహించి, ప్రశాంతాత్మా - ప్రశాంతచిత్తుడై, విగతభీః - భయము లేనివాడై, బ్రహ్మచారివ్రతే - బ్రహ్మచారివ్రతమునందు,స్థితః - ఉండి, మచ్చిత్త - నాయందే చిత్తమును నిలిపి, మత్పరః - నా భక్తుడై, ఆసీత - ఉండవలెను.

ధ్యానయోగి  ప్రశాంతాత్ముడై, భయరహితుడై, బ్రహ్మచర్యవ్రతమును పాటించుచు, మనోనిగ్రహముతో నాయందు చిత్తము గలవాడై, నన్నే పరమ గతిగ నమ్మి నిశ్చలుడైయుండవలెను.

యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః !
శాంతి నిర్వాణపరమాం మత్సంస్థా మధిగచ్ఛతి !  15

యుంజన్ - ఏవం - సదా - ఆత్మానం - యోగీ - నియతమానసః 
శాంతి - నిర్వాణపరమాం - మత్సంస్థాం - అధిగచ్చతి


యోగీ - యోగి, నియతమానసః - నియమింపబడిన మనస్సు గలవాడై, సదా - నిరంతరము, ఏవం - ఈ రీతిగా, ఆత్మానం - తనను, యుంజన్ - యోగమునందు నిలిపినవాడై, నిర్వాణపరమాం - ఉత్తమ మోక్షము, మత్సంస్థాం - నా స్థితియొక్క, శాంతిం - శాంతిని, అధిగచ్ఛతి - పొందుచున్నాడు.

మనోనిగ్రహశాలియైన యోగి నిరంతరము పరమేశ్వరుడనైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా లగ్నమొనర్చి, నా యందున్న పరమానందమునకు పరాకాష్ఠరూపమైన శాంతిని పొందుచున్నాడు.

నాత్యశ్నతస్తు యోగోపాస్తి న చైకాంతమనశ్నతః !
న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున !  16

న - అతి - అశ్నతః - తు - యోగః - అస్తి - న - చ - ఏకాంతం - అన్నశ్నతః
న - చ - అతి - స్వప్నశీలస్య - జాగ్రతః - న - ఏవ - చ - అర్జున


అర్జున - అర్జునా, యోగః - యోగము, అతి అశ్నతః తు - విశేషముగా తినెడివానికి, న అస్తి - లేదు, ఏకాంతం - మిక్కిలి, అనశ్నతః చ - తిననివానికి, న - లేదు, అతిస్వప్నశీలస్య చ - ఎక్కువ నిద్రించువానికి, న - లేదు, జాగ్రతః ఏవ చ - మేలుకొని యుండువానికి, న - లేదు.

అర్జునా ! అతిగా భుజించువానికిని, ఏ మాత్రము భుజింపనివానికిని, అతిగా నిద్రించువానికిని, ఎల్లప్పుడు మేల్కొని యుండువానికిని ఈ యోగసిద్ధి కలుగును.

యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు !
యుక్తస్వప్నావబోధస్య - యోగః - భవతి - దుఃఖహా !  17

యుక్తాహార - విహారస్య - యుక్త - చేష్టస్య - కర్మసు
యుక్త - స్వప్నావ - బోధస్య - యోగః - భవతి - దుఃఖహా


యుక్తాహార విహారస్య - ఉచితమైన ఆహార విహారములు గలవానికి, కర్మసు - కర్మలయందు, యుక్తచేష్టస్య - ఉచితరీతిని చరించువానికి, యుక్తస్వప్నావబోధస్య - యుక్తమైన నిదుర, మెలకువ గలవానికిం యోగః - ఈ యోగము, దుఃఖహా - దుఃఖహారము, భవతి - అగుచున్నది.

మితాహారము, కర్మలందు మితమైన ప్రవర్తన గలవాడును, మితమైన నిద్రగల మనుజునకు యోగము దుఃఖములను బొగొట్టునదిగ అగుచున్నది.

యదా వినియతం చిత్తమ్ ఆత్మన్యేవావతిష్ఠతే !
నిఃస్పృహః - సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా !  18

యదా - వినియతం - చిత్తం - ఆత్మని - ఏవ - అవతిష్ఠతే
నిఃస్పృహః - సర్వకామేభ్యః - యుక్తః - ఇతి - ఉచ్యతే - తదా   


యదా - ఎప్పుడు, వినియుతం - నియమింపబడిన, చిత్తం - మనస్సు, ఆత్మని ఏవ - ఆత్మయందే, అవతిష్ఠతే - నిలిచియుండునో, తదా - అప్పుడు, సర్వకామేభ్యః - సమస్త కామముల నుండి, నిఃస్పృహ - కోరికలేనివాడై, యుక్తః ఇతి - యుక్తుడని, ఉచ్యతే - చెప్పబడుచున్నాడు.

చిత్తమునడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపముననున్న నన్ను భజించును. అట్టి యోగి సర్వథా సర్వవ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను నా యందే ప్రవర్తించుచుండును.

యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా !
యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః !  19

యథా - దీపః - నివాతస్థః - న - ఇంగతే - సా - ఉపమా - స్మ తా
యోగినః - యతచిత్తస్య - యుంజతః - యోగం - ఆత్మనః


నివాతస్థః - గాలిలేనిచోటనున్న, దీపః దీపము, యథా - ఎటుల, న ఇంగతే - కదలకుండునో, సా - అది, ఆత్మనః - ఆత్మయొక్క, యోగం - యోగమును, యుంజుతః - అభ్యసించుచున్న, యోగినః - యోగియొక్క, యతచిత్తస్య - నియమితచిత్తమునకు, ఉపమా - దృష్టాంతముగ, స్మతా - చెప్పబడుచున్నది.

వాయుప్రసారములేని చోట నిశ్చలముగా నుండు దీపమువలె యోగికి వశమైయున్న చిత్తము పరమాత్మధ్యానమున నిర్వికారముగా నిశ్చలముగా నుండును.

యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా !
యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి !  20

యత్ర - ఉపరమతే - చిత్తం - నిరుద్ధం - యోగసేవయా
యత్ర - చ - ఏవ - ఆత్మనా - ఆత్మానం - పశ్యన్ - ఆత్మని - తుష్యతి


యోగసేవయా - యోగము యొక్క సేవచే, నిరుద్ధం - నియమింపబడిన, చిత్తం - చిత్తము, యత్ర - ఎచ్చట, ఉపరమతే - శాంతిని పొండుచున్నాదో, ఆత్మని - ఆత్మయందు, ఆత్మానం - ఆత్మను, ఆత్మనా - ఆత్మచేత, పశ్యన్ - దర్శించుచు, యత్ర చ ఏవ ఏస్థితియందుండుట వలన, తుష్యతి - ఆనందమును బొందుచున్నదో.

ధ్యానయోగసాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది, పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మబుద్ధితో, ఆ భగవానుని సాక్షాత్కరింపజేసికొని, యోగి ఆ పరమాత్మయందే సంతుష్టుడగుచున్నాడు.

సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియమ్ !
వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః !  21

సుఖం - ఆత్యంతికం - యత్ - తత్ - బుద్ధిగ్రాహ్యం - అతీంద్రియం
వేత్తి - యత్ర - న - చ - ఏవ - అయం - స్థితః - చలతి - తత్త్వతః


యత్ - ఏది, అతీంద్రియం - ఇంద్రియ గ్రాహ్యము కానిదియు, బుద్ధిగ్రాహ్యం - బుద్ధికే గ్రాహ్యమైనదియు, తత్ - ఆ, ఆత్యంతికం - పరమమైన, సుఖం - సుఖమును, యత్ర - ఏ స్థితియందు, వేత్తి - తెలిసికొనుచున్నాడో, (తత్ర - ఆ స్థితియందు) స్థితః - ఉన్నవాడైన, అయం - ఈయోగి, తత్త్వతః - తత్త్వము నుండి, న చ చలతి ఏవ - చలింపకయే యుండును.

బ్రహ్మానందానుభము ఇంద్రియాతీతమైనది. పవిత్రమైన సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దానియందే స్థితుడైయున్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏ మాత్రమూ చలింపడు.

యం లబ్ధ్వాచాపరం లాభం మన్యతే నాధికం తతః !
యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే !!  22

యం - లబ్ధ్వా - చ - అపరం - లాభం - మన్యతే - న - అధికం - తతః
యస్మిన్ - స్థితః - న - దుఃఖేన - గురుణా - అపి - విచాల్యతే


యం చ - దేనిని, లబ్ధ్వా - పొంది, తతః - అంతకంటే, అపరం - ఇతరమైన, లాభం - లాభమును, అధికం - విశేషముగ, న మన్యతే - తలంపడో, యస్మిన్ - దేనియందు, స్థితః - ఉన్నవాడై, గురుణా - గొప్పదైన, దుఃఖేన అపి - దుఃఖముచేత గూడ, న విచాల్యతే - చలింపజేయబడడో.

పరమాత్మాప్రాప్తిరూపలాభమును పొందినవాడు, ఏయితర లాభమును గూడ దానికంటె అధికమైన దానినిగా తలంపడు. బ్రహ్మానందానుభవస్థితిలోనున్న యోగిని ఎట్టి బలవద్దుఃఖ ములును చలింపజేయజాలవు.

తం విద్యాద్దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్ !
స నిశ్చయేన యోక్తవ్యో యోగోపానిర్విణ్ణచేతసా !  23

తం - విద్వాత్ - దుఖఃసంయోగ వియోగం - యోగసంజ్ఞితమ్
సః - నిశ్చయేన - యోక్తవ్యః - యోగః - అనిర్విణ్ణచేతసా


దుఃఖ సంయోగ వియోగం - దుఃఖ సంబంధమును దూరము చేయు, తం - దానిని, యోగ సంజ్ఞితం - యోగమనబడు దానినిగ, విద్యాత్ - తెలుసుకొనవలయును, అనిర్విణ్ణ  చేతసా - విసుగులేని మనస్సుగల వానిచేత, సః - అటువంటి, యోగః - యోగము, నిశ్చయేన - నిశ్చయేన - నిశ్చయ బుద్ధితో, యోక్తవ్యః - అభ్యసింపదగినది.


దుఃఖరూపసంసారబంధముల నుండి విముక్తిని కలిగించు ఈ భగవత్సాక్షాత్కారరూపస్థితిని యోగము అని తెలియవలెను. అట్టి యోగమును దృఢమైన, ఉత్సాహపూరితమైన విసుగులేని చిత్తముతో నిశ్చయముగా అభ్యాసము చేయవలెను.