భగవద్గీత చాప్టర్ - 5

 

కర్మసన్న్యాసయోగః
అథ పంచమోపాధ్యాయః - కర్మసన్న్యాసయోగః

అర్జున ఉవాచ :-
సన్న్యాసం కర్మణాం కృష్ణపునర్యోగం చ శంససి !
యచ్చ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ !! 
1

సంన్యాసం - కర్మణాం - కృష్ణ - పునః - యోగం - చ - శంససి
యత్ - శ్రేయః - ఏతయోః - ఏకం - తత్ - మే - బ్రూహి - సునిశ్చితం


కృష్ణ - కృష్ణా, కర్మణాం - కర్మలయొక్క, సంన్యాసం - సన్యాసమును, పునః - తిరిగి, యోగం చ - కర్మయోగమును, శంససి చెప్పుచున్నావు, ఏతాయోః - ఈ రెంటిలోను, యత్ - ఏది, శ్రేయః - శ్రేయస్కరమూ, సునిశ్చితం - సునిశ్చితముగా, ఏకం తత్ - ఆ ఒక్క దానినే, మే - నాకు, బ్రూహి - చెప్పుము.

అర్జునుడు పలికెను - ఓ కృష్ణా ! ఒక్కసారి కర్మసన్న్యాసమును, మరియొకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో తెలియజేయుము.

శ్రీభగవాన్ ఉవాచ :-
సన్న్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ  !
తయోస్తు కర్మసన్న్యాససాత్ కర్మయోగో విశిష్యతే !!  2

సంన్యాసః - కర్మయోగః - చ - నిఃశ్రేయసకరౌ - ఉభౌ
తయోః - తు - కర్మసంన్యాసాత్ - కర్మయోగః - విశిష్యతే

సంన్యాసః - సన్యాసమును, కర్మయోగః చ - కర్మయోగమును, ఉభౌ - రెండును, నిఃశ్రేయస కరౌ - మోక్షసాధనములు, తయోః తు - ఆ రెండింటిలోను, కర్మసంన్యాసాత్ - కర్మ సన్యాసము కంటెను, కర్మయోగః - కర్మయోగమే, విశిష్యతే - శ్రేష్టమైనది.


శ్రీకృష్ణ భగవానుడు పలికెను - కర్మసన్న్యాసము, కర్మయోగము అను ఈ రెండును మోక్షమును కలుగచేయును. కాని ఈ రెండింటిలోను
కర్మసన్న్యాసము కంటెను కర్మయోగమే శ్రేష్ఠమైనది.

జ్ఞేయః స నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టిన కాంక్షతి !
నిర్ద్వోంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే !!  3

జ్ఞేయః - సః - నిత్యసంన్యాసీ - యః - న - ద్వేష్టి - న - కాంక్షతి
నిర్ద్విన్ద్యః - హి - మహాబాహో - సుఖం - బంధాత్ - ప్రముచ్యతే   


మహాబాహో - అర్జునా, యః - వడు, న ద్వేష్టి - ద్వేషింపడో, కాంక్షతి - కోరడో, సః - వాడు, నిత్యసంన్యాసీ - సదాసన్యాసిగా, జ్ఞేయః తెలియదగినవాడు, నిర్ద్వంద్వః - ద్వంద్వములను విడిచినవాడు, సుఖం - సుఖముగా, బంధాత్ - సంసారబంధము నుండి,  ప్రముచ్యతే హి - విముక్తుడగును.

ఓ మహాబాహో ! ఎవ్వరినీ ద్వేషింపని, దేనినీ కాంక్షింపని కర్మయోగిని నిత్యసన్న్యాసిగా ఎఱుంగవలెను. ఏలనన రాగద్వేషాది ద్వంద్వములు లేనివాడు అవలీలగా సంసారబంధముల నుండి విముక్తుడగును.

సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః !
ఏకమ ప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలమ్  !!   4

సాంఖ్యయోగౌ - పృథక్ - బాలాః - ప్రవదంతి - న - పండితాః
ఏకం - అపి - ఆస్థితః - సమ్యక్ - ఉభయోః - విదంతే - ఫలం 

సాంఖ్యయోగా - జ్ఞానకర్మములు, పృథక్ - వేరని, బాలాః - అవివేకులు, ప్రవదంతి - చెబుతున్నారు, పండితాః - పండితులు,  న - చెప్పరు, ఏకమపి - (రెంటిలో) ఒకదానినైనను, సమ్యక్ - లెస్సగాను, ఆస్థితఃథ - ఆచరించువాడు, ఉభయోః - రెండింటి యొక్క, ఫలం - ప్రయోజనమును, విదంతే - పొందుచున్నాడు.

సాంఖ్య, కర్మయోగములు వేర్వేరు ఫలములను ఇచ్చునని అవివేకులు పలికెదరు. పండితులట్లు పలుకరు. ఆ రెండింటిలో ఏ ఒక్క దానినైనను బాగుగా ఆచరించిన వాడు ఈ రెండింటికి ఫలస్వరూపమైన  పరమాత్మను పొందుచున్నాడు.

యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే !
ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి !!  5

యత్ - సాంఖ్యైః - ప్రాప్యతే - స్థానం - తత్ - యోగైః - అపి - గమ్యతే
ఏకం - సాంఖ్యం - చ - యోగం - చ - యః - పశ్యతి - సః - పశ్యతి

సాంఖ్యైః - జ్ఞానయోగులచేత, యత్ స్థానం - ఏస్థానం, ప్రాప్యతే - పొందబడుచున్నదో, తత్ - అది, యోగైః అపి - యోగులచేతను గూడ, గమ్యతే - పొందబడు చున్నది. సాంఖ్యం చ - జ్ఞానయోగమును, యోగం చ - కర్మయోగమును, ఏకం - ఒక్కటిగను, యః - ఎవడు, పశ్యతి - చూచున్నాడో, సః - వాడు, పశ్యతి - చూచుచున్నాడు. 

జ్ఞానయోగులు పొందు మోక్షమునే కర్మయోగులును పొందుదురు. జ్ఞానయోగఫలమును, కర్మయోగఫలమును ఒక్కటిగా చూచువాడే
నిజమును గ్రహించినవాడగును.

సన్న్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః  !
యోగయుక్తోమునిర్ర్బహ్మ నచిరేణాధిగచ్ఛతి !!   6

సంన్యాసః - తు - మహాబాహో - దుఃఖం - ఆప్తుం - అయోగతః
యోగయుక్తః - మునిః - బ్రహ్మ - నచిరేణ - అధిగచ్ఛతి


మహాబాహో - అర్జునా, సంన్యాసః తు - సంన్యాసమన్నను, అయోగతః - యోగము లేకుండా, ఆప్తుం - పొందుట, దుఃఖం - దుఃఖముతోకూడినది, యోగయుక్తః - యోగయుక్తుడు, మునిః - మననశీలుడు, బ్రహ్మ - బ్రహ్మమును, నచిరేణ - త్వరగా, అధిగచ్ఛతి
- పొందుచున్నాడు.


గొప్ప బాహువులు కల ఓ అర్జునా ! కర్మయోగమును అనుష్ఠింపకసన్న్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్తృత్వమును త్యజించుట కష్టము.

యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః !
సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిష్యతే  !!   7

యోగయుక్తః - విశుద్ధాత్మా - విజితాత్మా - జితేంద్రియః
సర్వభూతాత్మ భూతాత్మా - కుర్వన్ - అపి - న - లిష్యతే


యోగయుక్తః - యోగయుక్తుడు, విశుద్ధాత్మా - పరిశుద్ధమైన అంతఃకరణ  గలవాడును, విజితాత్మా - తననుతాను వశపరచుకుకొన్నవాడును, జితేంద్రియః - జితేంద్రియుడును, సర్వభూతాత్మ భూతాత్మా - సర్వ ఆత్మలు తన ఆత్మగా తెలుసుకొనినవాడు, కుర్వన్ అపి - కర్మలను జేసినను, న లిష్యతే - అంటబడడు.

కర్మయోగము నాచరించువాడు మనస్సును వశమునందుంచుకొనినవాడు, జితేంద్రియుడు, అంతఃకరణశుద్ధి కలవాడు, సర్వప్రాణులలో
ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవానికి కర్మలను ఆచరించుచున్నను వాటిచేత అంటబడడు.

నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్ !
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్నశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్  !!  8

ప్రలపన్ విసృజన్ గృహ్ణన్నున్మిషన్నున్మిషన్ నిమిషన్నపి !
ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్  !!  9


న - ఏవ - కించిత్ - కరోమి - ఇతి - యుక్తః - మన్యేత - తత్త్వవిత్

పశ్యన్ - శృణ్వన్ - స్పృశన్ - జిఘ్రన్ - అశ్నన్ - గచ్ఛన్ - స్వపన్ - శ్వసన్
ప్రలపన్ - విసృజన్ - గృహ్ణన్ - ఉన్మిషన్ - నిమిషన్ - అపి
ఇంద్రియాణి - ఇంద్రియార్థేషు - వర్తంతే - ఇతి - ధారయన్

తత్త్వవిత్ - తత్త్వమునెరిగిన, యుక్తః - యోగయుక్తుడు, పశ్యన్ - చూచుచు, శృణ్వన్ - వినుచు, స్పృశన్ - తాకుచు, జిఘ్రన్ - వాసన చూచుచు, అశ్నన్ - తినుచు, గచ్చన్ - నడచుచు, స్వపన్ - నిద్రించుచు, శ్వసన్ - శ్వాసించుచు, ప్రలపన్ - పలుకుచు, విసృజన్ - విడుచుచు, గృహ్ణాన్ - తీసికొనుచు, ఉన్మిషన్నిమిషన్నపి - కనులు తెరుచుచు మూయుచున్నను, ఇంద్రియాణి - ఇంద్రియములు, ఇంద్రియార్థేషు - శబ్దాది విషయములందు, వర్తంతే ఇతి - వర్తించుచున్నవని, ధారయన్ - నిశ్చయించిన వాడై, కించిత్ - కొంచెమును, న కరోమి ఏవ ఇతి - నేను ఏమీ చేయుటలేదని, మన్యేత - తలంచును.

పరమార్ధతత్వము నెఱిగిన సాంఖ్యయోగి చూచుచు, వినుచు, స్పృశించుచు, ఆఘ్రణించుచు, భుజించుచు, నడుచుచు, నిద్రించుచు, శ్వాస క్రియలను నడుపుచు, భాషించుచు, త్యజించుచు, గ్రహించుచు, కనులను తెరుచుచు, మూయుచు ఉన్నను ఇంద్రియములు తమతమవిషయముల యందు వర్తించుచున్నవనియు, తానేమియు చేయుటలేదనియే తలంచును.

బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః !
లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా ! 10

బ్రహ్మణి - ఆధాయ - కర్మాణి - సంగం - త్యక్త్వా - కరోతి - యః
లిప్యతే - న - సః - పాపేన - పద్మపత్రం - ఇవ - అంభసా

యః - ఎవడు, కర్మాణి - కర్మలను, బ్రహ్మణీ - పరబ్రహ్మము నందు, ఆధాయ - ఉంచి, సంగం - ఆసక్తినిం త్యక్త్వా - విడిచి, కరోతి - చేయుచున్నాడో, సః - వాడు, అంభసా - నీటి చేతను, పద్మపత్రం ఇవ - తామరాకువలెను, పాపేన - పాపముచేత, న లిప్యతే - అంటబడడు.

కర్మలన్నింటిని భగవదర్పణము గావించి, ఫలాసక్తిరహితముగ కర్మలనాచారింహు వానిని తామరాకుపై నీటిబిందువుల వలె పాపముచేత అంటబడడు.

కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి !
యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే  !! 11

కాయేన - మనసా - బుద్ధ్యా - కేవలైః - ఇంద్రియైః - అపి
యోగినః - కర్మ - కుర్వంతి - సంగం - త్యక్త్వా - ఆత్మశుద్ధయే


కాయేన - దేహము చేతను, మనసా - మనస్సుచేతను, బుద్ధ్యా - బుద్ధిచేతను, కేవలైః - ఆసక్తిలేనట్టి, ఇంద్రియైః అపి - ఇంద్రియముల
చేతను, ఆత్మశుద్ధయే - చిత్తశుద్ధి కొరకు, యోగినః - యోగులు, సంగం త్యక్త్వా - సంగత్వము వీడి, కర్మ - కర్మమును, కుర్వంతి - చేయుచున్నారు.


కర్మయోగులు ఫలాసక్తిరహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణశుద్ధికై కర్మలను ఆచరించుచున్నారు.

యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీమ్ !
అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే !!   12

యుక్తః - కర్మఫలం - త్యక్త్వా - శాంతిం - ఆప్నోతి - నైష్ఠికీం
అయుక్తః - కామకారేణ - ఫలే - సక్తః - నిబధ్యతే


యుక్తః - ఆత్మయోగారూఢుడు, కర్మఫలం - ఫలమున, త్యక్త్వా - విడిచి, నైష్ఠికీం - భగవత్ప్రాప్తి రూపమైన, శాంతిం - శాంతిని, ఆప్నోతి - పొందుచున్నాడు, అయుక్తః - యోగయుక్తుడు కానివాడు, కామకారేణ - కామప్రేరేపణ చేత, ఫలే - కర్మఫలమునందు, సక్తః - ఆసక్తుడై, నిబధ్యతే - బంధింపబడుచున్నాడు.

నిష్కామకర్మయోగి కర్మఫలములను త్యజించి, భగత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలనాచారించి బద్ధుడగు చున్నాడు.

సర్వకర్మాణి మనసా సంన్యస్యాస్తే సుఖం వశీ !
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్ న కారయన్ !  13

సర్వకర్మాణి - మనసా - సంన్యస్య - ఆస్తే - సుఖం - వశీ
నవద్వారే - పురే - దేహీ - న - ఏవ - కుర్వన్ - న - కారయన్


వశీ - ఇంద్రియ నిగ్రహము గలవాడు, మనసా - మనస్సుచేత, సర్వకర్మాణి - సమస్తకర్మలను, సంన్యస్య - విడిచిపెట్టి, నవద్వారే -
తొమ్మిది ద్వారములు గల, పురే - పురమున, దేహీ - పురుషుడు, న ఏవ కుర్వన్ - చేయనివాడై, న కారయన్ - చేయింపని వాడై, సుఖం - సుఖముగ, ఆస్తే - ఉంటున్నాడు. 

ఇంద్రియ నిగ్రహముతో నవద్వారములు గల శరీరమునందు సమస్తకర్మలను మానసికముగా త్యజించి, పరమాత్మస్వరూపమున స్థితుడై, ఆనందమును అనుభవించు చున్నాడు.

న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః !
న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే !! 14

న - కర్తృత్వం - న - కర్మాణి - లోకస్య - సృజతి - ప్రభుః
న - కర్మఫల సంయోగం - స్వభావః - తు - ప్రవర్తతే


ప్రభుః - ప్రభువు, లోకస్య - లోకమున, కర్తృత్వం - కర్తృత్వమును, కర్మాణి - కర్మలను, కర్మఫల సంబంధమును, న సృజతి - సృజియింపడు, స్వభావః తు - స్వభావమే, ప్రవర్తతే - ప్రవర్తించుచున్నది.

భగవంతుడు జీవుల యొక్క కర్తృత్వమును గాని, వారి కర్మలనుగాని, కర్మఫల సంయోగమును గాని సృజింపడు. ఈ యన్నింటిలో
ప్రకృతియే ప్రవర్తించుచున్నది.


నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః  !
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః !! 15

న - ఆదత్తే - కస్యచిత్ - పాపం - న - చ - ఏవ - సుకృతం - విభుః
అజ్ఞానేన - ఆవృతం - జ్ఞానం - తేన - ముహ్యంతి - జంతవః


విభుః - ప్రభువు, కస్యచిత్ - ఎవని యొక్కయు, పాపం - పాపమును, సుకృతం చ ఏవ - పుణ్యమును కూడ, న ఆదత్తే - గ్రహింపడు,
అజ్ఞానేన - అజ్ఞానము చేత, జ్ఞానం - జ్ఞానము, ఆవృతం - కప్పబడెను, తేన - అట్టి అజ్ఞానము చేత, జంతవః - జంతువులు, ముహ్యంతి - మోహమును చెందుచున్నవి.

సర్వవ్యాపియైన భగవంతుడు ప్రాణుల పుణ్యపాపకర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి యుండుట వలన
ప్రాణులు భ్రమకి లోనగుచున్నారు.


జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః !
తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్ !! 16

జ్ఞానేన - తు - తత్ - అజ్ఞానం - యేషాం - నాశితం - ఆత్మనః
తేషాం - ఆదిత్యవత్ - జ్ఞానం - ప్రకాశయతి - తత్పరం


ఆత్మనః - ఆత్మయొక్క, జ్ఞానేన - జ్ఞానముచేత, యేషాం - ఎవరియొక్క, తత్ అజ్ఞానం తు - ఆ అజ్ఞానము, నాశితం - నశింపజేయబడినదో, తేషాం - వారియొక్క, జ్ఞానం - జ్ఞానము, ఆదిత్యవత్ - సూర్యునివలెను, తత్పరం - ఆ పరమాత్మను, ప్రకాశయతి - ప్రకాశింపజేయుచున్నది.

అజ్ఞానము పరమాత్మతత్త్వ జ్ఞానప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు ఆ జ్ఞానము వారికి పరమాత్మను సూర్యుని వలె ప్రకాశింపజేయుచున్నది.

తద్బుద్దయస్తదాత్మానః తన్నిష్ఠా స్తత్పరాయణాః  !
గచ్ఛంత్యపునరావృత్తిం జ్ఞానని ర్దూతకల్మషాః !! 17

తద్బుద్ధయః - తదాత్మానః - తన్నిష్ఠాః - తత్పరాయణాః
గచ్ఛంతి - అపునరావృత్తిం - జ్ఞాన నిర్ధూత కల్మషాః

తద్బుద్ధయః - ఆబ్రహ్మము నందే బుద్ధిగలవారును, తదాత్మానః - తద్రూపమైనవారును, తన్నిష్ఠాః - ఆత్మ నిష్టులగువారును, తత్పరాయణాః - బ్రహ్మపరాయణులును, జ్ఞాననిర్ధూతకల్మషాః జ్ఞానముచేత పొగొట్టబడిన పాపము గలవారునై, ఆపునరావృత్తిం - జన్మరహితమైన మోక్షమును, గచ్ఛంతి - పొందుచున్నారు.

పరమాత్మయందే నిరంతరము ఏకీభావములో స్థితులై, తత్పరాయణులైన పురుషులు జ్ఞానసాధనతో పాపరహితులై, పునరావృత్తి
రహితమైన శాశ్వత పరమగతిని పొందుచున్నారు.


విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని !
శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః !! 18

విద్యావినయసంపన్నే - బ్రాహ్మణే - గవి - హస్తిని
శుని - చ - ఏవ - శ్వపాకే - చ - పండితాః - సమదర్శినః


విద్యావినయసంపన్నే - విద్యయును, వినయమును గల, బ్రాహ్మణే - బ్రాహ్మణుని యందును, గవి - గోవుయందును, హస్తిని - ఏనుగునందును, శుని చ - కుక్క యందును, శ్వపాకే చ ఏవ - చండాలుని యందును కూడ, పండితాః - పండితులు, సమదర్శినః - సమాభావము గలవారు.

విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణునియందును, గోవు, ఏనుగు, కుక్క మొదలగు వానియందును, చండాలుని యందును సమదృష్టిని గలవానినే జ్ఞాని అందురు.

ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః !
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మిణి తే స్థితాః !! 19

ఇహ - ఏవ - తైః - జితః - సర్గః - యేషాం - సామ్యే - స్థితం - మనః
నిర్దోషిం - హి - సమం - బ్రహ్మ - తస్మాత్ - బ్రహ్మిణి - తే - స్థితాః


యేషాం - ఎవరియొక్క, మనః - మనస్సు, సామ్యే - సమభావమునందు, స్థితం - స్థిరముగ నుండునో, తైః - వారి చేతను, ఇహ ఏవ - ఈ లోకమునందే, సర్గః - జన్మము, జితః - జయింపబడెను, బ్రహ్మ - బ్రహ్మము, నిర్దోషం - దోషములేనిది, సమం హి - సమస్తము నందును సమముగా నున్నదిగదా, తస్మాత్ - అందువలన, తే - వారు, బ్రహ్మిణి - బ్రహ్మము నందును సమముగా నున్నదిగదా, తస్మాత్ - అందువలన, తే - వారు, బ్రహ్మిణి - బ్రహ్మము నందు, స్థితాః - ఉన్నవారు.

ఎవరి మనస్సు సమభావమందు స్థిరమై యున్నదో అట్టివారు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు. అనగా
ప్రాపంచిక విషయాతీతస్థితికి చేరుదురు. పరమాత్మ దోషరహితుడు, సముడు, అందువలన సమభావస్థిత మనస్కులైన బ్రహ్మమునందున్న వారేయగుదురు. 

న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియమ్ !
స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః !!  20

న - ప్రహృష్యేత్ - ప్రియం - ప్రాప్య - న - ఉద్విజేత్ - ప్రాప్య - చ - అప్రియం
స్థిరబుద్ధిః - అసమ్మూఢః - బ్రహ్మవిత్ - బ్రహ్మణి - స్థితః


స్థిరబుద్ధిః - స్థిరబుద్ధి గలవాడును, అసమ్మూఢః - మోహరహితుడును, బ్రహ్మవిత్ - బ్రహ్మజ్ఞాని, బ్రహ్మణి స్థితః - బ్రహ్మసమాధియందున్నవాడై, ప్రియం - ఇష్టమును, ప్రాప్య చ - పొందియును, ప్రహృష్యేత్ - సంతసించుట, న - లేదు, అప్రియం - అయిష్టమును, ప్రాప్య - పొందినను, న ఉద్విజేత్ - శోకింపడు.

స్థిరమైన బుద్ధిగలవాడును, మోహవివశుడు కానివాడును అయిన బ్రహ్మవేత్త ఇష్టమైన దానిని పొందినపుడు సంతోషముగాని, అనిష్టమైన దానిని పొందినప్పుడు దుఃఖముగాని పొందడు.

బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖమ్ !
స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే !!  21

బాహ్యస్పర్శేషు - అసక్తాత్మా - విదంతి - ఆత్మని - యత్ - సుఖం
సః - బ్రహ్మ - యోగయుక్తాత్మా - సుఖం - అక్షయం - ఆశ్నుతే

బాహ్యస్పర్శేషు - బాహ్య విషయములందు, అసక్తాత్మా - అనాసక్తుడు, ఆత్మని - తనయందు, యత్ - ఎట్టి, సుఖం - సుఖమును, విదంతి - పొందునో, సః - వాడు, బ్రహ్మ యోగాయుక్తాత్మా - బ్రహ్మయోగమునందు కూడినవాడై, అక్షయం - నాశములేని, సుఖం - శాంతిని, అశ్నుతే - పొందుచున్నాడు.

ప్రాపంచిక విషయములయందు అనాసక్తమైన అంతః కరణముగల సాధకుడు ఆత్మస్థితధ్యానజనితమైన సాత్త్వికాత్మానందమును పొందును. పిదప అతడు బ్రహ్మనిష్ఠయను సమాధితో గూడుకొనినవాడై, అక్షయమును పొందుచున్నాడు.

యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే !
ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః  !!  22

యే - హి - సంస్పర్శజాః - భోగాః - దుఃఖయోనయః - ఏవ - తే
ఆద్యంతవంతః - కౌంతేయ - న - తేషు - రమతే - బుధః  


కౌంతేయ - అర్జునా, సంస్పర్శజాః - విషయేంద్రియ - సంయోగము వలన కలుగు. భోగాః - భోగములు, యే - ఏవి కలవో, తే - అవి, దుఃఖయోనయః ఏవ - దుఃఖహేతువులే, ఆద్యంతవంతః - ఆద్యంతములు గలవి, తేషు - వానియందు, బుధః - జ్ఞాని, న రమతే హి - రమించడు గదా.

ఓ అర్జునా ! విషయేంద్రియసంయోగము వలన ఉత్పన్నములగు భోగములన్నియును భోగలాలసులకు సుఖములుగా భాసించినను అవినిస్సందేహముగా దుఃఖహేతువులే. ఆద్యంతములు గలవి. అనగా అనిత్యములు. వివేకి వాటియందు ఆసక్తుడు కాడు.

శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్ శరీరవిమోక్షణాత్ !
కామక్రోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః  !!  23

శక్నోతి - ఇహ - ఏవ - యః - సోఢుం - ప్రాక్ - శరీరవిమోక్షణాత్
కామక్రోధోద్భవం - వేగం - సః - యుక్తః - సః - సుఖీ - నర


యః - ఏ, నరః - నరుడు, శరీరవిమోక్షణాత్ - శరీరమును విడుచుటకంటె, ప్రాక్ - పూర్వము, ఇహ ఏవ - ఈ లోకము నందే, కామక్రోధోద్భవం - కామక్రోధము వలన బుట్టిన, వేగం - వేగమును, సోఢుం - సహించుటకు, శక్నోతి - సమర్థుడగుచున్నాడో, సః - వాడు, యుక్తః - యోగి, సః - అతడే, సుఖీ - ఆత్మానందము గలవాడు.

ఎవరు ఈ శరీరమును విడువకముందే అనగా జీవించి యుండగనే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో నుంచుకొనునో అతడే
నిజమైన ఆత్మానంద యోగి.  పాంతః

సుఖోపాంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః  !
స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోపాధిగచ్ఛతి  !!  24

యః - అంతః - సుఖః - అంతరారామః - తథా - అంతర్జ్యోతిః - ఏవ - యః
సః - యోగీ - బ్రహ్మనిర్వాణం - బ్రహ్మభూతః - అధిగచ్ఛతి

యః - ఎవడు, అంతస్సుఖః - అంతరంగిక సుఖముగలవాడును, అంతరారామః - ఆత్మరతిననుభవించువాడును, తథా - అట్లే, యః - ఎవరైతే, అంతర్జ్యోతిః ఏవ - ఆత్మ ప్రకాశము గలవాడునగు, సః - ఆ, యోగీ - యోగి, బ్రహ్మ భూతః - బ్రహ్మభూతుడై, బ్రహ్మనిర్వాణం - మోక్షమును, అధిగచ్ఛతి - పొందుచున్నాడు.

ఎవరు అంతరాత్మయందే సుఖించుచు, ఆత్మయందే రమించునో అట్టి ఆత్మజ్ఞానియైన సాంఖ్యయోగి, పరబ్రహ్మ పరమాత్మయందు
ఏకీభావస్థితుడై, బ్రహ్మ సాక్షాత్కారమును పొందును.


లభంతే బ్రహ్మనిర్వాణమ్ ఋషయః క్షీణకల్మషాః !
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః !!  25

లభంతే - బ్రహ్మనిర్వాణం - ఋషయః - క్షీణకల్మషాః
ఛిన్నద్వైధాః - యతాత్మానః - సర్వభూతహితే - రతాః


క్షీణకల్మషాః - నశించిన పాపములు  గలవారును, ఛిన్నద్వైధాః - చేధింపబడిన సంశయములు గలవారు, యతాత్మానః - నియమింపబడిన దేహేంద్రియాదులు గలవారు, సర్వభూతహితే - సకల ప్రాణులకు హితము చేయుట నందును, రతాః - ఆసక్తి గలవారునగు, ఋషయః - జ్ఞానులు, బ్రహ్మ నిర్వాణం - బ్రహ్మనందమును, లభంతే - పొందుచున్నారు.

పాపరహితులును, జ్ఞానప్రభావమున సమస్తసంశయముల నివృత్తిని సాధించినవారును, సర్వప్రాణులహితమునుగోరుఋషులు,
బ్రహ్మనిర్వాణమును పొందుచున్నారు.


కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసామ్ !
అభితో బ్రహ్మనిర్వాణం  వర్తతే విదితాత్మనామ్ !!  26

కామక్రోధ వియుక్తానాం - యతీనాం - యతచేతసాం
అభితః - బ్రహ్మనిర్వాణం - వర్తతే - విదితాత్మనాం


కామక్రోధవియుక్తానాం - కామక్రోధములచేత విడువబడిన వారును, యతచేతసాం - నియమింపబడిన చిత్తము గలవారు, విదితాత్మనాం - తెలియబడిన ఆత్మ గలవారును అగు, యతీనాం - యుతులకు, బ్రహ్మనిర్వాణం - బ్రహ్మానందము, అభితః - అంతటను, వర్తతే - ఉన్నది.

కామక్రోధములు లేనివారు, మనోనిగ్రహము కలవారును అయి, పరబ్రహ్మపరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను
పరబ్రహ్మపరమాత్మయే గోచరించును.


స్పర్శాన్ కృతత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః !
ప్రాణాప్రానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ  !!   27

యంతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః !
విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః !! 
28

స్పర్శాన్ - కృత్వా - బహిః - బాహ్యాన్ - చక్షుః - చ - ఏవ - అంతరే - భ్రువోః
ప్రాణాపానౌ - సమా - కృత్వా - నాసాభ్యంతర చారిణౌ
యంతేంద్రియమనోబుద్ధిః - మునిః - మోక్షపరాయణః
విగతేచ్ఛాభయక్రోధః - యః - సదా - ముక్తః - ఏవ - సః

యః - ఎవడు, బాహ్యాన్ - వెలుపలివైన, స్పర్శాన్ - శబ్దాది విషయములను, బహిః ఏవ - వెలుపలనే, కృత్వా - చేసి, చ - మరియు, చక్షుః - దృష్టిని, భ్రువోః - కనుబొమ్మల యొక్క, అంతరే - నడుమ, కృత్వా - నిలిపి, ప్రాణాపానౌ - ప్రాణాపానవాయువులను, సమౌ - సమానముగా, నాసాభ్యంతరచారిణౌ - ముక్కులోపల సంచరించునట్లు, యతేంద్రియ మనోబుద్ధిః - నియమింపబడిన ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, విగతేచ్ఛాయభయక్రోధః - కోరికను, భయమును, క్రోధమును విడిచినవాడై, మోక్షపరాయణః - మోక్షపరాయణుడై, మునిః - ముని అయి, (వర్తతే - ఉంటున్నాడో), సః - అతడు, సదా - ఎల్లపుడును, ముక్తః ఏవ - ముక్తుడే.


బాహ్య విషయభోగములను చింతనచేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భ్రూమధ్యమునందును స్థిరముగా ఉంచవలెను. నాసికయందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడుపవలెను. ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాధనల వలన మోక్షపరాయణుడైన సాధకుడు ఇచ్ఛాభయక్రోధరహితుడై ఎల్లప్పుడు ముక్తుడగును.

భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ !
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతిమృచ్ఛతి  !! 29

భోక్తారం - యజ్ఞతపసాం - సర్వలోక మహేశ్వరం
సుహృదం - సర్వభూతానాం - జ్ఞాత్వా - మాం - శాంతిం - ఋచ్ఛతి


యజ్ఞతపసాం - యజ్ఞతపస్సులకు , భోక్తారం - భోక్తగను, సర్వలోకమహేశ్వరం - సర్వలోకములకు ప్రభువును, సర్వభూతానం - సర్వభూతములకు, సుహృదం - మిత్రునిగను, మాం - నన్ను, జ్ఞాత్వా - తెలిసికొని, శాంతిం - శాంతిని, ఋచ్ఛతి - పొందుచున్నాడు.

భగవంతుడు యజ్ఞములకును, తపస్సులకును భోక్త. సమస్తలోకములకును లోకేశ్వరులకును అధిపతి. సమస్త ప్రాణులకును ఆత్మీయుడు. పరమ ప్రేమస్వరూపుడు. ఇట్టి భగవత్తత్త్వమును ఎరిగిన భక్తునకు పరమశాంతి లభించును.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జునసంవాదే కర్మసన్న్యాసయోగోనామ
పంచమోపాధ్యాయః