భగవద్గీత చాప్టర్ - 4 - పార్ట్ - B

 యాదృచ్ఛాలాభాసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః !
సమః సిద్ధా వసిద్దౌ చ కృత్వాపి న నిబధ్యతే !!  22

యాదృచ్ఛాలాభససంతుష్టః - ద్వంద్వాతీతః - విమత్సరః
సమః - సిద్దౌ - అసిద్దౌ - చ - కృత్వా - అపి - న - నిబధ్యతే


యాదృచ్ఛాలాభసంతుష్ఠః - అయాచితముగ లభించినదానితో తృప్తి చెందువాడును, ద్వంద్వాతీతః - ద్వంద్వాతీతుడును, విమత్సరః - మాత్సర్యము లేనివాడును, సిద్దౌ - సిద్ధించిన విషయములందును, అసిద్దౌ చ - సిద్ధించని విషయములందును, సమః - సమబుద్ధి గలవాడును, కృత్వా - అపి - కర్మలు చేసినను, న నిబధ్యతే - బంధింపడడు.

అప్రయత్నముగా అమరిన లాభములతో సంతుష్టుడైనవాడు, అసూయలేనివాడు, హర్షశోకాదిద్వంద్వములకు అతీతుడు అయినవాడు సిద్ధియందును, అసిద్ధియందును సమదృష్టి కలిగియుండును. అట్టి కర్మయోగి కర్మలనాచరించుచున్నను వాటిచేత బంధింపబడడు.

గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః !
యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే !!  23

గతసంగస్య - ముక్తస్య - జ్ఞానావస్థిత చేతసః
యజ్ఞాయ - ఆచరతః - కర్మ - సమగ్రం - ప్రవిలీయతే 


గతసంగస్య - ఆసక్తిలేనివాడును, ముక్తస్య - జీవన్ముక్తుడును, జ్ఞానావస్థిత చేతసః - జ్ఞానమునందు నిలిచిన చిత్తము గలవాడును, యజ్ఞాయ - యజ్ఞము కొరకు, ఆచరతః - ఆచరించువాని యొక్క, కర్మ - కర్మము, సమగ్రం - సంపూర్ణముగ, ప్రవిలీయతే - నశించుపోవుచున్నది.

ఏలనన ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏ మాత్రమూ లేనివాడును, పరమాత్మజ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమొనర్చినవాడును, కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని యొక్క కర్మలన్నియును పూర్తిగా విలీనములగును. అనగా నశించిపోవును.

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణా హుతమ్ !
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా !!  24

బ్రహ్మ - అర్పణం - బ్రహ్మ - హవిః - బ్రహ్మాగ్నౌ - బ్రాహ్మణా - హుతం
బ్రహ్మ - ఏవ - తేన - గంతవ్యం - బ్రాహ్మకర్మ సమాధినా

అర్పణం - హోమసాధనములు, బ్రహ్మ - బ్రహ్మమే, హవిః - హవిస్సు, బ్రహ్మ - బ్రహ్మమే, బ్రహ్మగ్నౌ - బ్రహ్మమనెడి అగ్నియందు, బ్రాహ్మణా - బ్రహ్మస్వరూపునిచేత, హుతం - హోమం చేయబడినదియును, బ్రహ్మకర్మ సమాధినా - బ్రహ్మకర్మ సమాధి నిష్ఠుడయిన, తేన - అతనిచేత, గంతవ్యం - పొందదగిన ఫలము, బ్రహ్మైన - బ్రహ్మమే.

యజ్ఞాకార్యములందు ఉపయుక్తమగు సృవాదిసాధనములు బ్రహ్మము. హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము. అగ్నియు బ్రహ్మము. యజ్ఞము నాచరించు కర్తయు బ్రహ్మము. హవనక్రియయు బ్రహ్మము. ఈ బ్రహ్మకర్మయందు స్థితుడైయుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞఫలము గూడ బ్రహ్మమే అయిచున్నది.

దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే  !
బ్రహ్మగ్నావపరే యజ్ఞేనైవోపజుహ్వతి  !!  25

దైవం - ఏవ - అపరే - యజ్ఞం - యోగినః - పర్యుపాసతే
బ్రహ్మగ్నౌ - అపరే - అపరే - యజ్ఞ - యజ్ఞేన - ఏవ - ఉపజుహ్వతి


అపరే - కొందరు, యోగినః - యోగులు, దైవం - దేవతా సంబంధమైన, యజ్ఞం ఏవ - యజ్ఞమునే, పర్యుపాసతే - ఉపాసించుచున్నారు. అపరే - మరికొందరు, బ్రహ్మాగ్నౌ - బ్రహ్మమను అగ్నియందు, యజ్ఞం - యజ్ఞమును, యజ్ఞేన ఏవ - యజ్ఞముచేతనే, ఉపజుహ్వతి - హోమము చేయుచున్నారు.

కొందఱు యోగులు దైవపూజారూపయజ్ఞమును చక్కగా అనుష్ఠింతురు. మరికొందరు యోగులు జీవబ్రహ్మైక్యభావనచే జీవుని పరబ్రహ్మమును అగ్నియందు హోమము చేయచున్నారు.

శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి  !
శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి  !!  26

శ్రోత్రాదీని - ఇంద్రియాణి - అన్యే - సంయామాగ్నిషు - జుహ్వతి
శబ్దాదీన్ - విషయాన్ - అన్యే - ఇంద్రియాగ్నిషు - జుహ్వతి 


అన్యే - కొందరు, శ్రోత్రాదేని - శ్రోత్రము మొదలయిన, ఇంద్రియాణి - ఇంద్రియములను, సంయామాగ్నిషు - సంయమమనెడి అగ్నియందు, జుహ్వతి - హోమము చేయుచున్నారు, అన్యే మరికొందరు, శబ్దాదీన్ - శబ్దము మొదలైన, విషయాన్ - విషయములను, ఇంద్రియాగ్నిషు - ఇంద్రియములనెడి అగ్నియందు, జుహ్వతి హోమము చేయుచున్నారు.

కొందరు యోగులు మనోనిగ్రహము ద్వారా శ్రోత్రాద్రి ఇంద్రియములను అదుపు చేయుదురు. తత్ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏ మాత్రమూ ఉండదు.

సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే  !
ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే  !!  27

సర్వాణి - ఇంద్రియకర్మాణి - ప్రాణకర్మాణి - చ - అపరే
ఆత్మ సంయమ యోగాగ్నౌ - జుహ్వతి - జ్ఞానదీపితే


అపరే - మరికొందరు, సర్వాణి - సమస్తములైన, ఇంద్రియ కర్మాణి - ఇంద్రియ చేష్టలను, ప్రాణకర్మాణి చ - ప్రాణవ్యాపారములను, జ్ఞానదీపితే - జ్ఞానములచేత వెలిగింప బడిన, ఆత్మసంయమ యోగాగ్నౌ - ఆత్మసంయమయోగమనెడి అగ్నియందు, జుహ్వతి - హోమము చేయుచున్నారు.

కొందరు ఇంద్రియముల పంచప్రాణముల వ్యాపారములను జ్ఞానదీప్తమైన ఆత్మ సంయమయోగమనెడి అగ్నియందు హోమము చేయుచున్నారు.

ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాస్తపోయ్జ్ఞా యోగయజ్ఞాస్తథాపరే  !
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః  !!  28

ద్రవ్యయజ్ఞాః తపోయజ్ఞాః - తథా - అపరే
స్వాధ్యాయ జ్ఞానయజ్ఞా - చ - యతయః - సంశితవ్రతాః


అపరే - కొందరు, ద్రవ్యయజ్ఞాః - ద్రవ్యయజ్ఞము గలవారును, తపోయజ్ఞాః - తపస్సనెడి యజ్ఞము గలవారును, యోగయజ్ఞాః - యోగమనెడి యజ్ఞము గలవారును, తథా - ఆరీతినే, స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాః చ - స్వాధ్యాయ జ్ఞానరూపములైన యజ్ఞములు గలవారును, యతయః - ప్రయత్నము చేయువారును, సంశితవ్రతాః - దృఢవ్రతము గలవారై యున్నారు.

కొందఱు ద్రవ్యసంబంధ యజ్ఞములను మరికొందరు తపోరూపయజ్ఞములను, కొందఱు యోగరూపయజ్ఞాములను చేయుదురు. మరికొందరు స్వాధ్యాయ యజ్ఞములను జ్ఞానయజ్ఞములను ఆచరించుచున్నారు.

అపానేజుహ్వతి ప్రాణం ప్రాణేపాపానం తథాపరే !
ప్రాణాపానగాతీ రుధ్వాప్రాణాయామపరాయణాః !! 29

అపానే - జుహ్వాతి - ప్రాణం - ప్రాణే - అపానం - తథా - అపరే
ప్రాణాపానగతీ - రుద్ధ్వా - ప్రాణాయామ పరాయణాః

తథా - అటులనే, అపరే - మరికొందరు, ప్రాణాయామపరాయణాః - ప్రాణాయామ పరాయణులైనవారు, ప్రాణాపానగాతీ - ప్రాణాపానగతులను, రుద్ధ్వా - అడ్డగించి, అపానే - అపాయమునందు, ప్రాణం - ప్రాణవాయువును, ప్రాణే - ప్రాణవాయువు నందు, అపానం - అపాన వాయువును, జుహ్వతి - హోమము చేయుచున్నారు.

కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువు నందు అపానవాయువును హవనము చేయుదురు.

అపరే నియతాహారాః ప్రాణేన్ ప్రాణేషు జుహ్వతి !
సర్వేపాప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషః !! 30

అపరే - నియతాహారాః - ప్రాణాన్ - ప్రాణేషు - జుహ్వతి
సర్వే - అపి - ఏతే - యజ్ఞవిదః - యజ్ఞక్షపిత - కల్మషాః


అపరే - మరికొందరు, నియతాహారాః - ఆహారనియమము గలవారై, ప్రాణాన్ - ప్రాణములను, ప్రాణేషు - ప్రాణములందు, జుహ్వతి - హోమము చేయుచున్నారు, ఏతే - ఈ, సర్వేఅపి - అందరును కూడా, యజ్ఞావిదః - యజ్ఞము నెరిగినవారు, యజ్ఞక్షపిత కల్మషాః - యజ్ఞములచేత కల్మషము నశించినవారు.

ఇంకను కొందఱు నియమితాహార నిష్టితులై, ప్రాణయామ పరాయణులైనవారు ప్రాణాపాన గమనములను నిలిపి, ప్రాణములను ప్రాణముల యందే హవనము చేయుదురు. యజ్ఞవిదులైన వీరందరు యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు.

యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ !
నాయం లోకోపాస్త్యయజ్ఞస్య కుతోపాన్యః కురుసత్తమ  !!  31

యజ్ఞశిష్టామృతభుజః - యాంతి - బ్రహ్మ - సనాతనం
న - అయం - లోకః - అస్తి - అయజ్ఞస్య - కుతః - అన్యః - కురుసత్తమ 

కురుసత్తమ - అర్జునా, యజ్ఞశిష్టామృతభుజః - యజ్ఞశేషమైన అమృతమును భుజించువారు, సనాతనం - అనాదియైన, బ్రహ్మ - బ్రహ్మమును, యాంతి - పొందుచున్నారు, అయజ్ఞస్య - యజ్ఞము చేయనివానికి, అయం - ఈ, లోకః - లోకము, న అస్తి - లేదు, అన్యః - ఇతర లోకము, కుతః - ఎక్కడిది ? 

ఓ కురుసత్తమా ! యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును, పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయనివారికి ఈమర్త్యలోకమే సుఖప్రదము కాదు. ఇంక పరలోక మెక్కడిది ?

ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రాహ్మణో ముఖే !
కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే !!  32

ఏవం - బహువిధాః - యజ్ఞాః - వితతాః - బ్రాహ్మణః - ముఖే
కర్మజాన్ - విద్ధి - తాన్ - సర్వాన్ ఏవం - జ్ఞాత్వా - విమోక్ష్యసే


ఏవం - ఈ ప్రకారముగ, బహువిధాః - అనేకవిధములైన, యజ్ఞాః - యజ్ఞములు, బ్రాహ్మణః - బ్రహ్మము యొక్క, ముఖే - ముఖము నందు, వితతాః - విస్తరింపబడినవి, తాన్ సర్వాన్ - వానినన్నింటిని, కర్మజాన్ - కర్ణము నుండి పుట్టిన వానినిగ, విద్ధి - తెలిసికొనుము, ఏవం - ఇటుల, జ్ఞాత్వా - తెలిసికొని, విమోక్ష్యసే - విముక్తుడవు కాగలవు.

ఈ ప్రకారముగనే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో సవివరముగా వివరింపబడినవి. ఈ యజ్ఞముల నన్నింటిని త్రికరణశుద్ధిగా ఆచరించినప్పుడే అవి సుసంపంనములగునని తెలిసికొనుము. ఇట్లు ఈ కర్మతత్త్వమును తెలిసికొనుము, అనుష్ఠానము వలన నీవు ప్రాపంచిక బంధములనుండి సర్వథా విముక్తుడయ్యేదవు.

శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప !
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే  !!  33

శ్రేయాన్ - ద్రవ్యమయాత్ - యజ్ఞాత్ - జ్ఞానయజ్ఞః - పరంతప
సర్వం - కర్మ - అఖిలం - పార్థ - జ్ఞానే - పరిసమాప్యతే


పరంతప - అర్జునా, ద్రవ్యమయాత్ - ద్రవ్యమువలన సాధింపబడు, యజ్ఞాత్ - యజ్ఞము కంటెను, జ్ఞానయజ్ఞః - జ్ఞానయజ్ఞము, శ్రేయాన్ - శ్రేష్ఠమైనది, పార్థ - అర్జునా, సర్వం - సమస్తమైన, కర్మ -  కర్మము, అఖిలం - సకలముగా, జ్ఞానే - జ్ఞానమునందు, పరిసమాప్యతే - ముగియుచున్నది.

ఓ పరంతపా ! అర్జునా ! ద్రవ్యమయయజ్ఞము కంటెను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్ఠమైనది. కర్మలన్నియును జ్ఞానమునందే పరసమాప్తమగును.

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా !
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః  !!  34

తత్ - విద్ధి - ప్రణిపాతేన - పరిప్రశ్నేన - సేవయా
ఉపదేక్ష్యంతి - తే - జ్ఞానం - జ్ఞానినః - తత్త్యదర్శినః


తత్ జ్ఞానం - ఆ జ్ఞానమును, ప్రణిపాతేన - సాష్టాంగ నమస్కారము చేతను, పరి ప్రశ్నేన - నిష్కపట భావముతో ప్రశ్నించుటచేతను, సేవయా - సేవచేతను, తత్త్వదర్శినః - తత్త్వమును దర్శించిన, జ్ఞానినః - జ్ఞానుల్, తే - నీకు, ఉపదేక్ష్యంతి - ఉపదేశింపగలరు.

అట్టి జ్ఞానము, తత్త్వవేత్తలగు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారమొనర్చి, సమయము చూచి, వినయముగా ప్రశ్నించి, సేవచేసియు వారి వలన నెఱుంగము. వారు తప్పక నీకు పదేశింతురు.

యద్ జ్ఞాత్వా న పునర్మోహమ్ ఏవం యాస్యపి పాండవ !
యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యోథోమయి  !! 35

యత్ - జ్ఞాత్వా - న - పునః - మోహం - ఏవం - యాస్యసి - పాండవ
యేన - భూతాని - అశేషణ - ద్రక్ష్యసి - ఆత్మని - అథో - మయి


పాండవ - అర్జునా, యత్ జ్ఞాత్వా - ఏది తెలిసికొని, పునః - తిరిగి, ఏవం - ఇట్లు, మోహం - మోహమును, న యాస్యసి - పొందవో, యేన - దేనిచేత, భూతాని - భూతములను, అశేషేణ - సాకల్యముగా, ఆత్మని - నీ యందు, అథో - పిమ్మటను, మయి - నా యందును, ద్రక్ష్యసి - చూడగలవో.

ఓ అర్జునా ! ఈ తత్త్వజ్ఞానమునెఱింగినచో మఱల ఇట్టి వ్యామోహములో చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రభావముతో సమస్తప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. 

అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః  !
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి !!  36

అపి - చేత్ - అసి - పాపేభ్యః - సర్వేభ్యః - పాపకృత్తమః
సర్వం - జ్ఞానప్లవేన - ఏన - వృజినం - సంతరిష్యమి


పాపేభ్యః సర్వేభ్యః - పాపులందరి కంటెను, పాపకృత్తమః - ఎక్కువ పాపములు చేసిన వాడవు. అపి చేత్ అసి - అయినను, సర్వం - వృజినం - సమస్తపాపమును, జ్ఞానప్లవేన ఏవ - జ్ఞానమనెడి తెప్పచేతనే, సంతరిష్యసి - దాటగలవు.

ఒకవేళ పాపాత్ములందఱి కంటెను నీవు ఒక మహాపాపిని అయినచో, జ్ఞానమనే తెప్ప సహాయముతో పాపసముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా దాటివేయగలవు. 

యథైధాంసి సమిద్ధోపాగ్నిః  భస్మసాత్కురుతేపార్జున  !
జ్ఞానాగ్నిః  సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా  !! 37

యథా - ఏధాంసి - సమిద్ధః - అగ్నిః  - భస్మసాత్ - కురుతే - తథా

జ్ఞానాగ్నిః - సర్వకర్మాణి - భస్మసాత్ - కురుతే - తథా 

అర్జున - అర్జునా, సమిద్ధః - మండుచున్న, అగ్నిః  నిప్పు, యథా - ఎటుల, ఏధాంసి - కట్టెలను, భస్మసాత్ కురుతే - భస్మముగా జేయునో, తథా - అటుల, జ్ఞానాగ్నిః  - జ్ఞానమనెడి అగ్ని, సర్వకర్మాణి - సమస్తకర్మలను, భస్మసాత్ కురుతే - భస్మముగా చేయుచున్నది.

ఓ అర్జునా ! ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మము చేసినట్లు జ్ఞానమను అగ్ని కర్మలను భస్మమొనరించును.

న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే !
తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విదంతి !!  38

న - హి - జ్ఞానేన - సదృశం - పవిత్రం - ఇహ - విద్యతే
తత్ - స్వయం - యోగసంసిద్ధః - కాలేన - ఆత్మని - విదంతి


జ్ఞానేన సదృశం - జ్ఞానమువలె, పవిత్రం - పావన మొనర్చునది, ఇహ - ఈ లోకమునందు, న విద్యతే హి - లేదు, కాలేన - కాలక్రమమున, యోగసంసిద్ధః - సమత్వ యోగబుద్ధి ద్వారా సిద్ధి పొందినవాడు, తత్ - ఆ జ్ఞానమును, స్వయం - స్వయముగ, ఆత్మని - ఆత్మయందే, విదంతి - పొందుచున్నాడు.

ప్రపంచమున జ్ఞానముతో సమానముగ పవిత్రమైనది మరియొకటి లేనేలేదు. శుద్దాంతఃకరణముగల సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణము చేసి, ఆత్మయందు అదే జ్ఞానమును తనంతటతానే పొందుచున్నాడు.

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః !
జ్ఞానం లబ్ధ్వాపరామ్ శాంతిమ్ అచిరేణాధి గచ్ఛతి  !! 39

శ్రద్ధవాన్ - లభతే - జ్ఞానం - తత్పరః - సంయతేంద్రియః
జ్ఞానం - లబ్ధ్వా - పరాం - శాంతిం - అచిరేణ - అధిగచ్ఛతి

శ్రద్ధావాన్ - శ్రద్ధావంతుడును, తత్పరః - తత్పరుడైనవాడును, సంయతేంద్రియః - ఇంద్రియ నిగ్రహము గలవాడును, జ్ఞానం - ఆత్మజ్ఞానమును, లభతే - పొందుచున్నాడు, జ్ఞానం - జ్ఞానమును, లబ్ధ్వాః - పొంది, పరాం - పరమైన, శాంతిం - శాంతిని, అచిరేణ - శీఘ్రముగ, అధిగచ్ఛతి - పొందుచున్నాడు.

ఇంద్రియ నిగ్రహము కలవానికి, తదేక నిష్ఠకలవానికి, శ్రద్ధాళువైన మనుజునకు ఈ భగవత్తత్త్వజ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే అతడు భగవత్తత్త్వ రూపమైన పరమశాంతిని పొందుచున్నాడు.

అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి !
నాయం లోకోపాస్తి న పరో న సుఖం సంశయాత్మనః  !!  40

అజ్ఞః - చ - అశ్రద్ధధానః - చ - సంశయాత్మా - వినశ్యతి
న - అయం - లోకః - అస్తి - న - పరః - న - సుఖం - సంశయాత్మనః 


అజ్ఞశ్చ - జ్ఞానశూన్యుడును, అశ్రద్ధధానశ్చ - శ్రద్ధలేనివాడును, సంశయాత్మా - శంకితుడును, వినశ్యతి - నశించుచున్నాడు, సంశయాత్మనః - సంశయాత్మునకు, అయం - ఈ, లోకః - లోకము, న అస్తి - లేదు, పరః - పరలోకమును, న - లేదు, సుఖం - సుఖమును, న - లేదు.

అవివేకియు, శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టుడేయగును. అట్టి సంశయచిత్తునకు ఈ లోకమునందుగాని, పరలోకమునందుగాని ఎట్టి సుఖమూ ఉండదు.

యోగసన్న్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్నసంశయమ్ !
ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ  !!  41

యోగసంన్యస్త కర్మాణం - జ్ఞానసంఛిన్న సంశయం
ఆత్మవంతం - న - కర్మాణి - నిబధ్నంతి - ధనంజయ 

ధనంజయా - అర్జునా, యోగసంన్యస్త కర్మాణం - యోగముచేత విడువబడిన కర్మలు గలవానిని, జ్ఞాన సంఛిన్న సంశయం - జ్ఞానముచేత పోగొట్టబడిన సందేహములు గలవానిని, ఆత్మవంతం - ఆత్మవంతుని, కర్మాణి - కర్మములు, న నిబధ్నంతి - బందింపవు.

ఓ ధనంజయా ! విధిపూర్వకముగ కర్మలను ఆచరించుచు, కర్మ ఫలములను అన్నింటిని భగవదర్పణము చేయుచు, వివేకముద్వారా సంశయములనన్నింటిని తొలగించుకొనుచు, అంతఃకరణమును వశమునందుచుకొనిన వానిని కర్మలు బంధింపవు.

తస్మాదజ్ఞానసంభూతం హృత్ స్థం జ్ఞానాసినాత్మనః !
ఛిత్వైనం సంశయం యోగమ్ ఆతిష్ఠోత్తిష్ఠ భారత  !!  42

తస్మాత్ - అజ్ఞాన సంభూతం - హృత్స్థం - జ్ఞానాసినా - ఆత్మనః
చిత్త్వా - ఏనం - సంశయం - యోగం - ఆతిష్ఠ - ఉత్తిష్ఠ - భారత

భారత - అర్జునా, తస్మాత్ - అందువలన, హృత్స్థం - హృదయము నందున్నట్టిదియు, అజ్ఞాన సంభూతం - అజ్ఞానమువలన పుట్టినదియునైన, ఆత్మనః - నీయొక్క, ఏనం - ఈ, సంశయం - సందేహమును. జ్ఞానాసినా - జ్ఞానమనెడి కత్తిచేత, - ఛిత్త్వా - నరికి, యోగం - యోగమును, ఆతిష్ఠ - ఆచరింపుము, ఉత్తిష్ఠ - లెమ్ము.

కావున ఓ భారతా ! (అర్జునా!) నీ హృదయమునందు గల అజ్ఞానము వలన పుట్టిన ఈ సంశయమును వివేకజ్ఞానమను ఖడ్గముతో రూపుమాపి, సమత్వరూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవగుము లెమ్ము.

ఓం శ్రీ పరమాత్మనే నమః
అథ చతుర్థోపాధ్యాయః - జ్ఞానకర్మసన్న్యాస యోగః
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు