భగవద్గీత పార్ట్ - 8
జ్ఞానకర్మాసన్న్యాసయోగః
ఓం శ్రీపరమాత్మనే నమః
అథ చతుర్థోపాధ్యాయః - జ్ఞానకర్మసన్న్యాస యోగః
శ్రీ భగవాన్ ఉవాచ :-
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ !
వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవేపాబ్రవీత్ !! 1
ఇమం - వివస్వతే - యోగం - ప్రోక్తవాన్ - అహం - అవ్యయం
వివస్వాన్ - మనవే - ప్రాహ - మనుః - ఇక్ష్వాకవే - అబ్రవీత్
అవ్యయం - అవినాశియైన, ఇమం యోగం - ఈ యోగమును, వివస్వతే - సూర్యునికొరకు, అహం - నేను, ప్రోక్తవాన్ - చెప్పితిని, వివస్వాన్ - సూర్యుడు, మనవే - మనువుకొరకు, ప్రాహ - చెప్పెను, మనుః - మనువు, ఇక్ష్వాకునికొరకు, అబ్రవీత్ - చెప్పెను.
శ్రీ భగవానుడు ఇట్లు పలికెను - నేను నిత్యసత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వతమనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు చెప్పెను.
ఏవం పరంపరా ప్రాప్తమ్ ఇమం రాజర్షయో విదుః !
స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప !! 2
ఏవం - పరంపరాప్రాప్తం - ఇమం - రాజర్షయః - విదుః
సః - కాలేన - ఇహ - మహతా - యోగః - నష్టః - పరంతప
పరంతప - అర్జునా, ఏవం - ఈ రీతిగ, పరంపరా ప్రాప్తం - పరంపరగా వచ్చిన, ఇమం - ఈ యోగమును, రాజర్షయః - రాజర్షులు, విదుః - తెలిసికొని యుండిరి, సః - ఆ, యోగః - యోగము, మహతా - చాలా, కాలేన - కాలమునకు, ఇహ - ఇప్పుడు, నష్టః - నశించినది.
ఓ పరంతపా ! ఈ విధముగా వచ్చిన ఈ యోగమును రాజర్షులు తెలిసికొనిరి. కాని అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు అగుపించుటలేదు.
స ఏవాయం మయా తేపాద్య యోగః ప్రోక్తః పురాతనః !
భక్తోపాసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ !! 3
సః - ఏవ - అయం - మయా - తే - అద్య - యోగః - ప్రోక్తః పురాతనః
భక్తః - అసి - మే - సఖా - చ - ఇతి - రహస్యం - హి - ఏతత్ - ఉత్తమం
పురాతనః - ప్రాచీనమైన, సః - ఆ, యోగః ఏవ - యోగమే, మే - నా యొక్క, భక్తః - భక్తుడవు, సఖా చ - సఖుడవును, అసి ఇతి - అయియున్నావని, తే - నీకు, అద్య - ఇప్పుడు, మయా - నాచేతను, అయం - ఇది, ప్రోక్తః - చెప్పబడినది, ఏతత్ - ఇది, ఉత్తమం - శ్రేష్ఠమైనది, రహస్యం హి - రహస్యమైనది గదా.
ఈ యోగము అతి ఉత్తమమైనది. రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు. ప్రియసఖుడవు. కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నీకు తెలిపితిని.
అర్జున ఉవాచ :-
అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః !
కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి !! 4
అపరం - భవతః - జన్మ - పరం - జన్మ - వివస్వతః
కథమేత ద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి !!
వివస్వతః - సూర్యునియొక్క, జన్మ - జన్మము, పరం - మొదటిది, భవతః - నీ యొక్క, జన్మ - జన్మము, అపరం - తరువాతది, ఆదౌ - ఆదియందు, త్వం - నీవు, ప్రోక్తవాన్ - చెప్పినవాడవు, ఇతి - అని, కథం - ఎటుల, ఏతత్ - దీనిని, నిజానీయాం - తెలియగలను.
అర్జునుడు పలికెను - కృష్ణా ! నీ జన్మ ఇటీవలిదే. సూర్యునిజన్మ కల్పాదియందు జరిగినది. అనగా అతి ప్రాచీనమైనది. కనుక నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును? దీనిని నేను ఏ విధముగా తెలుసుకోగలను.
శ్రీ భగవాన్ ఉవాచ :-
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున !
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప !! 5
బహూని - మే - వ్యతీతాని - జన్మాని - తవ - చ - అర్జున
తాని - అహం - వేద - స్వరాణి - న - త్వం - వేత్థ - పరంతప
అర్జున - అర్జునా, మే - నాయొక్కయు, తవ చ - నీ యొక్కయును, బహూని - అనేకములైన, జన్మాని - జన్మములు, వ్యతీతాని - గడచినవి, తాని - ఆ, సర్వాణి - అన్నిటిని, అహం - నేను, వేద - ఎరుగుదును, పరంతప - అర్జునా, త్వం - నీవు, న వేత్థ - తెలియజాలవు.
శ్రీ భగవానుడు తెలిపెను - ఓ పరంతపా ! అర్జునా ! నాకును నీకును అనేక జన్మలు గడచినవి. కాని వాటిని అన్నింటిని నేను ఎఱుంగుదును. నీ వెఱుగవు.
అజోపాపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపాపి సన్ !
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా !! 6
అజః - అపి - సన్ - అవ్యయాత్మా - భూతానాం - ఈశ్వరః - అపి - సన్
ప్రకృతిం - స్వాం - అధిష్ఠాయ - సంభవామి - ఆత్మమాయయా
అజః అపి సన్ - పుట్టుక లేనివాడనైనను, అవ్యయాత్మా - అవినాశియైనను, భూతానాం - ప్రాణులకు, ఈశ్వరః అపి సన్ - ప్రభువునయ్యును, స్వాం - స్వకీయమైన, ప్రకృతిం - స్వభావమును, అధిష్ఠాయ - ఆశ్రయించి, ఆత్మమాయయా - నా మాయ చేతనే, సంభవామి - పుట్టుచున్నాను.
నేను పుట్టుక లేనివాడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను. అయినను నా ప్రకృతిని అధీనములో నుంచుకొని, నా యోగమాయచే జన్మమెత్తుచున్నాను.
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత !
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ !! 7
యదా - యదా - హి - ధర్మస్య - గ్లానిః - భవతి - భారత
అభ్యుత్థానం - అధర్మస్య - తదా - ఆత్మానం - సృజామి - అహం
భారత - అర్జునా, యదాయదా - ఎప్పుడెప్పుడు, ధర్మస్య - ధర్మమునకు, గ్లానిః - హాని, అధర్మస్య - అధర్మమునకు, అభ్యుత్థానం - అభివృద్ధి, భవతి - కలుగుచున్నదో, తదా - అప్పుడు, ఆత్మానం - ఆత్మయైన నన్ను, అహం - నేను, సృజామి హి - సృజించుచున్నాను.
ఓ భారతా ! ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెచ్చుపెరిగిపోవుచున్నప్పుడును నన్ను నేను సృజించుకొందును. అనగా సాకారరూపముతో ఈ లోకమున అవతరింతును.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ !
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే !! 8
పరిత్రాణాయ - సాధూనాం - వినాశాయ - చ - దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ - సంభవామి - యుగే - యుగే
సాధూనాం - సాధువుల యొక్క, పరిత్రాణాయ - పరిరక్షణ కొరకు, దుష్కృతాం - దుర్మార్గుల యొక్క, వినాశాయచ - సంహారము కొరకు, ధర్మ సంస్థాపనార్థాయ - ధర్మమును స్థాపించుట కొరకు, యుగేయుగే - ప్రతియుగను నందును, సంభవామి - పుట్టుచుందును.
సజ్జనులను పరిరక్షించుటకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమును సుస్థిరమొనర్చుటకును నేను ప్రతియుగము నందును అవతరించుచుందును.
జన్మ కర్మ చ మే దివ్యమ్ ఏవం యో వేత్తి తత్త్వతః !
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోపార్జున !! 9
జన్మ - కర్మ - చ - మే - దివ్యం - ఏవం - యః వేత్తి - తత్త్వతః
త్యక్త్వా - దేహం - పునః - జన్మ - న - ఏతి - మాం - ఏతి సః - అర్జున
అర్జున - అర్జునా, యః - ఎవడు, దివ్యం - దివ్యమైన, మే - నా యొక్క, జన్మ - జన్మమును, కర్మచ - కర్మమును, ఏవం - ఈ విధముగ, తత్వతః - యథార్థముగా, వేత్తి - గ్రహించుచున్నాడో, సః - ఆ పురుషుడు, దేహం - దేహమును, త్యక్త్వా - విడిచి , పునః - తిరిగి, జన్మ - జన్మమును, న ఏతి - పొందడు, మాం - నన్నే, ఏతి - పొందును.
ఓ అర్జునా ! ఎవరు నా దివ్యమైన జన్మమును, కర్మమును గూర్చి యధార్థముగా తెలుసుకొనునో అట్టివాడు తనువును చాలించిన పిమ్మట మ రల జన్మింపడు సరికదా ! నన్నే పొందుచున్నాడు.
వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః !
బహానో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః !! 10
వీతరాగభాయక్రోధాః మన్మయా - మాం - ఉపాశ్రితాః
హవః - జ్ఞానతపసా - పూతాః - మద్భావం - ఆగతాః
వీతరాగభయక్రోధాః - విడిచిన అనురాగమును, భయమును, క్రోధమును గలవారును, మన్మయా - నాయందే భావన గలవారును, మాం - నన్ను, ఉపాశ్రితాః - ఆశ్రయించిన వారును నగు, బహవః - అనేకులు, జ్ఞానతపసా - జ్ఞానమనెడి తపస్సుచేత, పూతాః - పవిత్రులైన వారై, మద్భావం - నా స్వరూపమును, ఆగతాః - పొందిరి.
అనురాగము, భయము, క్రోథము వీడిన వారు, దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి గలిగి, నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞానతపస్సంపన్నులై పవిత్రులైన నా స్వరూపమును పొందియున్నారు.
యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్ !
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః !! 11
యే - యథా - మాం - ప్రపద్యంతే - తాన్ - తథా - ఏవ - భజామి - అహం
మమ - వర్త్మ - అనువర్తంతే - మనుష్యాః - పార్థ - సర్వశః
పార్థ - అర్జునా, యే - ఎవరు, యథా - ఎట్లు, మాం - నన్ను, ప్రపద్యంతే - భజింతురో, అహం - నేను, తాన్ - వారలను, తథైవ - అలాగుననే, భజామి - అనుగ్రహించున్నాను, మనుష్యాః - మనుజులు, సర్వశః - సర్వవిధముల, మమ - నాయొక్క, వర్త్మ - మార్గమును, అనువర్తంతే - అనుసరించుచున్నారు.
ఓ పార్థా ! భక్తులు నన్ను ఎవరు ఏవిధముగా సేవింతురో ఆ విధముగా నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరును వివిధరీతులలో నా మార్గమును అనుసరించుచున్నారు.
కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః !
క్షిప్రం హి మానుషేలోకే సిద్దిర్భవతి కర్మజా !! 12
కాంక్షంతః - కర్మణాం - సిద్ధిం - యజంతే - ఇహ - దేవతాః
క్షిప్రం - హి - మానుషే - లోకే - సిద్ధిః - భవతి - కర్మజా
ఇహ - ఈ లోకమునందు, కర్మణాం - కర్మలయొక్క, సిద్ధిం - ఫలసిద్ధిని, కాంక్షంతః - అభిలషించు జనులు, దేవతాః - ఇంద్రాదిదేవతలను, యజంతే - సేవించుచునాజ్నిరు, మానుషే - మానవ, లోకే - లోకమునందు, కర్మజా - కర్మవలన పుట్టిన, సిద్ధిః - ఫలప్రాప్తి, క్షిప్రం - శీఘ్రముగ, భవతి హి - కలుగుచున్నది కదా.
ఈ లోకమున కర్మఫలమును ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలనన అట్లు చేయుటచే కర్మలవలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా కలుగుచున్నది.
చాతుర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః !
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ !! 13
చాతుర్ణ్యం - మయా - స్పష్టం - గుణకర్మ - విభాగశః
తస్య - కర్తారం - అపి - మాం - విద్ధి - ఆకర్తారం - అవ్యయం
మయా - నాచేత, చాతుర్వర్ణ్యం - నాలుగు వర్ణములు, గుణకర్మవిభాగశః - గుణకర్మల విభజన చొప్పున, సృష్టం - సృజింపబడెను, తస్య - ఆ సృష్టి కర్మమునకు, కర్తారమపి - కర్తనైనను, మాం - నన్ను, ఆకర్తారం - ఆకర్తగను, అవ్యయం - అవ్యయునిగను, విద్ధి - తెలిసికొనుము.
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి గుణకర్మల ననుసరించి వేర్వేరుగా సృష్టించితిని. ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను, శాశ్వతుడను పరమేశ్వరుడను ఐన నన్ను వాస్తవముగ ఆకర్తనుగా తెలిసికొనుము.
న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా !
ఇతి మాం యోపాభిజానాతి కర్మభిర్న స బధ్యతే !! 14
న - మాం - కర్మాణి - లింపంతి - న - మే - కర్మఫలే - స్పృహా
ఇతి - మాం - యః - అభిజానాతి - కర్మభిః - న - సః - బధ్యతే
కర్మణి - కర్మములు, మాం - నన్ను, న లింపంతి - అంటావు, మే - నాకు, కర్మఫలే - కర్మఫల మందు, స్పృహా - కోరిక, న - లేదు, ఇతి - ఈ ప్రకారము, మాం - నన్ను, యః - ఎవడు, అభిజానాతి - తెలిసికొనుచున్నాడో, సః - వాడు, కర్మభిః - కర్మచేత, న - బద్ధ్యతే - బద్దుడు కాడు.
నాకు కర్మఫలాసక్తి లేదు. కావున కర్మలు నన్నంటవు. ఈ విధముగా నాతత్త్వమును తెలిసినవారు కర్మలచే బంధింపబడరు.
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః !
కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వంతరం కృతమ్ !! 15
ఏవం - జ్ఞాత్వా - కృతం - కర్మ - పూర్వైః - అపి - ముముక్షుభిః
కురు - కర్మ - ఏవ - తస్మాత్ - త్వం - పూర్వైః - పూర్వంతరం కృతం
ఏవం - ఈ ప్రకారముగ, జ్ఞాత్వా - తెలిసికొని, పూర్వైః - పూర్వీకులైన, ముముక్షుభిః అపి - ముముక్షువులచేత సయితము, కర్మ - కర్మము, కృతం - చేయబడెను, తస్మాత్ - ఆ కారణమువలన, త్వం - నీవు, పూర్వైః - పూర్వులైన వారిచేత, కృతం - చేయబడిన, పూర్వతరం - ప్రాచీనమైన, కర్మ ఏవ - కర్మమునే, కురు - చేయుము.
ఓ అర్జునా ! నా తత్త్వరహస్యమును తెలిసికొని కర్మల నాచరించిరి. కావున నీవును ఆ పూర్వులవలెనే నిష్కామ భావముతో కర్మల నాచరింపుము.
కిం కర్మ కిమకర్మేతి కవయోపాప్యాత్ర మోహితాః !
తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్ష్యసేపాశుభాత్ !! 16
కిం - కర్మ - కిం - అకర్మ - ఇతి కవయః - అపి - అత్ర - మోహితాః
తత్ - తే - కర్మ - ప్రవక్ష్యామి - యత్ - జ్ఞాత్వా - మోక్ష్యసే - అశుభాత్
కర్మ - కర్మము, కిం - ఎట్టిది, అకర్మ - అకర్మము, కిం - ఎట్టిది, ఇతి - ఇట్లని, అత్ర - ఈ విషయమున, కవయః అపి - బుద్ధిమంతులును, మోహితాః - మోహమును పొందిరి, యత్ - దేనిని, జ్ఞాత్వా - తెలిసి, ఆశుభాత్ - అశుభము నుండి, మోక్ష్యసే - ముక్తుడవు కాగలవో, తత్ - అట్టి, కర్మ - కర్మమును, తే - నీ కొరకు, ప్రవక్ష్యామి - చెప్పుదును.
కర్మ అనగా నేమి ? అకర్మ యనగా నేమి ? ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము తికమకపడుచున్నారు కావున కర్మతత్త్వమును నీకు చక్కగా విశదపరచెదను.
కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః !
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః !! 17
కర్మణః - హి - అపి - బోద్ధవ్యం - బోద్ధవ్యం - చ - వికర్మణః
అకర్మణః - చ - బోద్ధవ్యం - గహనా - కర్మణః - గతిః
కర్మణః అపి - కర్మయొక్క, (తత్త్వము), బోద్ధవ్యం - తెలిసికొనదగినది, వికర్మణః చ - వికర్మ యొక్కయును, బోద్ధవ్యం - తెలిసికొనదగినది, అకర్మణః చ - అకర్మము యొక్కయు, (తత్త్వము), కర్మణః - కర్మయొక్క, గతిః - తత్త్వము, గహనా హి - తెలియశక్యము కానిది కదా.
కర్మ తత్త్వమును తెలిసికొనవలెను. అట్లే అకర్మ స్వరూపమును గూడ ఎరుగవలెను.వికర్మ లక్షణములను కూడా తెలిసికొనుట చాల అవసరము. ఏలనన కర్మతత్త్వము చాల లోతైనది.
కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః !
స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ !! 18
కర్మణి - అకర్మ - యః - పశ్యేత్ - అకర్మణి - చ - కర్మ - యః
సః - బుద్ధిమాన్ - మనుష్యేషు - సః - యుక్తః - కృత్స్నకర్మకృత్
యః - ఎవడు, కర్మణి - కర్మమునందు, అకర్మ - అకర్మమును, యః ఎవడు, అకర్మణి - చ - అకర్మమునందు, కర్మ - కర్మమును, పశ్యేత్ - చూచునో, సః - వాడు, కృత్స్నకర్మకృత్ - సర్వకర్మములను చేసినవాడును, యుక్తః - యోగియును, బుద్ధిమాన్ - బుద్ధిమంతుడును.
కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో వివేకమయుడు. అతడు యోగి మఱియు సమస్తకర్మలు చేయువాడు.
యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః !
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః !! 19
యస్య - సర్వే - సమారంభాః - కామసంకల్పవర్జితాః
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం - తం - ఆహుః పండితం - బుధాః
యస్య - ఎవనియొక్క, సర్వే - సమస్తములైన, సమారంభాః - కర్మలు, కామసంకల్ప వర్జితాః - కామవాంఛలు లేకయుండునో, జ్ఞానాగ్ని - జ్ఞానమనేడి అగ్నిచేత, దగ్ధకర్మాణం - దహింపబడిన కర్మలు గల, తం - వానిని, పండితం - పండితుడని, బుధాః - జ్ఞానులు, ఆహుః పేర్కొనిరి.
ఎవని కర్మలన్నియును, శాస్త్రమ్మతములై, కామసంకల్ప వర్జితములై జరుగునో అట్లే ఎవని కర్మలన్నియును జ్ఞానాగ్నిచే భస్మమగునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని పేర్కొనిరి.
త్యక్త్వాకర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః !
కర్మణ్యభిప్రవృత్తోపాపి నైవ కించిత్ కరోతి సః !! 20
త్యక్త్వా - కర్మఫలాసంగం - నిత్యతృప్తః - నిరాశ్రయః
కర్మణి - అభిప్రవృత్తః - అపి - న - కించిత్ - కరోతి - సః
నిత్యతృప్తః - నిత్యతృప్తుడును, నిరాశ్రయః - ఆశ్రయము లేనివాడును, కర్మఫలాసంగం - కర్మఫలమునందలి ఆసక్తిని, త్యక్త్వా - విడిచి, కర్మణి - కర్మయందు, అభిప్రవృత్తః అపి - సంచరించుచున్నవాడైనను, సః - వాడు, కించిత్ - కొంచెమైనను, న కరోతి ఏవ - చేయుటయే లేదు.
ఎవడు కర్మఫలమందాసక్తిని విడనాడి నిరంతరము సంతృప్తి కలవాడై దేనిని ఆశ్రయించకనుండునో, అట్టివాడు వాస్తవముగా వాటికి కర్తకాడు.
నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః !
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ !! 21
నిరాశీః - యతచిత్తాత్మ - త్యక్త సర్వ పరిగ్రహః
శారీరం - కేవలం - కర్మ - కుర్వన్ - న - ఆప్నోత్ - కిల్బిషం
నిరాశీః - ఆశలేనివాడును, యతచిత్తాత్మ - అంతఃకరణను, దేహమును జయించిన వాడును, త్యక్తసర్వపరిగ్రహః - సకల పరిగ్రహములను విడిచినవాడును, శరీరం - శరీరమునకు సంబంధించిన, కర్మ - కర్మను, కేవలం - కేవలము, కుర్వన్ - చేయుచు, కిల్బిషం - పాపమును, న ఆప్నోతి - పొందడు.
అంతఃకరణమును, శరీరేంద్రియములను జయించినవాడు, సమస్త భోగసామగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడు ఐన సాంఖ్యయోగి కేవలము శారీరికకర్మలను ఆచరించుచును పాపములను పొందడు.