భగవద్గీత పార్ట్ - 7
యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః !
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః !! 23
యది - హి - అహం - న - వర్తేయం - జాతు - కర్మణి - అతంద్రితః
మమ - వర్త్మ - అనువర్తన్తే - మనుష్యాః - పార్థ - సర్వశః
పార్థ - అర్జునా, అహం - నేను, జాతు - ఒకవేళ, అతంద్రితః - అప్రమత్తుడనై, కర్మణి - కర్మయందు, న వర్తేయం యది -
ప్రవర్తింపకుందునేని, మనుష్యాః - మనుజులు, సర్వశః - సర్వవిధములను, మమ - నా యొక్క, వర్త్మ - మార్గమును, అనువర్తంతే హి - అనుసరించి ప్రవర్తింతురు గదా.
ఓ పార్థా ! ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్పహాని వాటిల్లును. ఎందుకనగా మనుష్యులందరును సర్వ విధముల నా మార్గమునే అనుసరించుచున్నారు.
ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్ !
సంకరస్య చ కర్తా స్యామ్ ఉపహన్యామిమాః ప్రజాః !! 24
ఉత్సీదేయుః - ఇమే - లోకాః - న - కుర్యాం - కర్మ - చేత్ - అహం
సంకరస్య - చ - కర్తా - స్యాం - ఉపహన్యాం - ఇమాః - ప్రజాః
అహం - నేను, కర్మ - కర్మమును, న - కుర్యాం, చేత్ - చేయనిచో, ఇమే - ఈ, లోకాః - లోకములు, ఉత్సీదేయుః - నశించును, సంకరస్య చ - వర్ణసంకరమునకు, కర్తా - కర్తను, స్యాం - అగుదును, ఇమాః - ఈ, ప్రజాః - జనులను, ఉపహన్యాం - చెడగొట్టిన వాడనగుదును.
నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నియును నశించును. అంతేగాదు. లోకములందు అల్లకల్లోలములు ఏర్పడును. ప్రజానష్టము వాటిల్లును. అప్పుడు అందులకు నేనే కారకుడనయ్యెదను.
సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత !
కుర్యాద్విద్వాంస్తథాసక్తః చికీర్షుర్లోకసంగ్రహమ్ !! 25
సక్తాః - కర్మణి - అవిద్వాంసః - యథా - కుర్వంతి - భారత
కుర్యాత్ - విద్వాన్ - తథా - అసక్తః - చికీర్షుః - లోకసంగ్రహం
భారత - అర్జునా, అవిద్వాంసః - పామరుడు, కర్మణి - కర్మయందు, సక్తాః - ఫలాపేక్ష కలిగి, యథా - ఎటుల, కుర్వంతి -
చేయుచున్నారో, తథా - అట్లే, విద్వాన్ - జ్ఞాని, లోకసంగ్రహం - లోకసంగ్రహమును, చికీర్షుః - చేయగోరినవాడై, ఆసక్తః - ఫలాపేక్ష లేక, కుర్వాత్ - చేయవలెను.
ఓ అర్జునా ! అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా జ్ఞాని కూడా లోకహితార్థమై ఫలాపేక్ష లేక కర్మలను చేయవలెను.
న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినామ్ !
జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ !! 26
న - బుద్ధిభేదం - జనయేత్ - అజ్ఞానాం - కర్మసంగినాం
జోషయేత్ - సర్వకర్మాణి - విద్వాన్ - యుక్తః - సమాచరన్
కర్మసంగినాం - కర్మఫలాసక్తులైన, అజ్ఞానాం - పామరులకు, బుద్ధిభేదం - బుద్ధిసంశయమును, న జనయేత్ - పుట్టింపగూడదు, యుక్తః - యోగయుక్తుడైన, విద్వాన్ - జ్ఞాని, సర్వకర్మాణి - సమస్త కర్మములను, సమాచరన్ - చక్కగా ఆచరించుచున్నవాడై, జోషయేత్ - చేయింపవలయును.
పరమాత్మ స్వరూపము నందు నిశ్చలస్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఫలాసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకులోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తానుకూడ శాస్త్రవిహితములైన సమస్తకర్మలను చక్కగా చేయుచు వారితోగూడ అట్లే చేయింపవలెను.
ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః !
అహంకారవిమూఢాత్మా కర్తాపాహమితి మన్యతే !! 27
ప్రకృతేః - క్రియమాణాని - గుణైః - కర్మాణి - సర్వశః
అహంకార విమూఢాత్మా - కర్తా - అహం - ఇతి - మన్యతే
ప్రకృతేః - ప్రకృతియొక్క, గుణైః - గుణములచేత, సర్వశః - నానా - విధములుగను, క్రియమాణాని - చేయబడుచున్న, కర్మాణి - కర్మలను, అహం - నేను, కర్తా ఇతి - చేయువాడనని, అహంకార విమూఢాత్మా - అహంకారముచేత వివేకమును కోల్పోయినవాడు, మన్యతే - తలచుచున్నాడు.
వాస్తవముగా కర్మలన్నియును అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు ఈ కర్మలకు నేనే కర్తను అని భావింపుచుచున్నాడు.
తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః !
గుణా గుణేషు వర్తంత ఇతి ముత్వాన సజ్జతే !! 28
తత్త్వవిత్ - తు - మహాబాహో - గుణకర్మ విభాగయోః
గుణాః - గుణేషు - వర్తంతే - ఇతి - మత్వా - న - సజ్జతే
మహాబాహో - అర్జునా, గుణకర్మ విభాగయోః - గుణకర్మముల విభజనయొక్క, తత్వవిత్ తు - జ్ఞాని, గుణాః - గుణములు, గుణేషు - ఇంద్రియ విషయములందు, వర్తంతే ఇతి - ప్రవర్తించుచున్నవని, మత్వా - తలచి, న సజ్జతే - ఆసక్తి నొందడు.
ఓ మహాబాహో ! అర్జునా ! గుణవిభాగతత్త్వమును, కర్మవిభాగ తత్త్వమును తెలిసికొన్న జ్ఞానయోగి గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించి, వాటియందు ఆసక్తి నొందడు.
ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు !
తానకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్ !! 29
ప్రకృతేః - గుణసమ్మూఢాః - సజ్జంతే - గుణకర్మసు
తాన్ - అకృత్స్నవిదః - మందాన్ - కృత్స్నవిత్ - న - విచాలయేత్
ప్రకృతేః - ప్రకృతియొక్క, గుణసమ్మూఢాః - గుణములచే సమ్మోహమును బొందినవారలై, గుణకర్మసు - గుణకర్మములయందు, సజ్జంతే - ఆసక్తులగుచున్నారు, ఆకృత్స్నవిదః - విజ్ఞులుకాని, మందాన్ - మందమతులైన, తాన్ - వారిని, కృత్స్నవిత్ - విజ్ఞుడు, న విచాలయేత్ - చలింపజేయగూడదు.
ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల యందును, కర్మలయందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి కర్మసంగులను అల్పజ్ఞులను, మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞానియైనవాడు భ్రమకు గురిచేయరాదు.
మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మచేతసా !
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః !! 30
మయి - సర్వాణి - కర్మాణి - సంన్యస్య - అధ్యాత్మ చేతసా
నిరాశీః - నిర్మమః - భూత్వా - యుధ్యస్వ - విగతజ్వరః
సర్వాణి - సమస్తమైన, కర్మాణి - కర్మములను, మయి - నాయందు, అధ్యాత్మచేతసా - ధ్యానచిత్తముతో, సంన్యస్య - ఉంచి, నిరాశీః - ఆశాలేనివాడవును, నిర్మమః - మమకారము లేనివాడవును, విగతజ్వరః - సంతాపరహితుడవును, భూత్వా - అయి, యుధ్యస్వ - యుద్ధము చేయుము.
సమస్త కర్మలు నా యందు సమర్పించి, ఆశగాని, మమకారము గాని లేనివాడవై నిర్భయముగా యుద్ధము చేయుము.
యే మే మతమిదం నిత్యమ్ అనుతిష్ఠంతి మానవాః !
శ్రద్ధావంతోపానసూయంతో ముచ్యంతే తేపాపి కర్మభిః !! 31
యే - మే - మతం - ఇదం - నిత్యం - అనుతిష్ఠంతి - మానవాః
శ్రద్ధావంతః - అనసూయంతః - ముచ్యంతే - అపి - కర్మభిః
శ్రద్ధావంతః - శ్రద్ధగలవారును, అనసూయంతః - అసూయలేనివారును, ఏమానవాః - ఏ మనుజులు, మే - నాయొక్క, ఇదం మతం - ఈ అభిప్రాయమును, నిత్యం - సదా, అనుతిష్ఠంతి - అనుసరించుచున్నారో, తే అపి - వారుగూడ, కర్మభిః - కర్మలచేతను, ముచ్యంతే - విడువబడుచున్నారు.
శ్రద్ధాయుక్తులై అసూయలేనివారై నా ఈ మతమును అనుసరించు మానవులు గూడ సమస్త కర్మబంధముల నుండి విడివడుచున్నారు.
యే త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతమ్ !
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతసః !! 32
యే - తు - ఏతత్ - అభ్యసూయంతః - న - అనుతిష్ఠంతిః - మే - మతం
సర్వజ్ఞాన విమూఢాన్ - తాన్ - విద్ధి - నష్టాన్ - అచేతసః
యేతు - ఎవరయితే, మే - నాయొక్క, ఏతత్ మతం - ఈ అభిప్రాయమును, అభ్యసూయంతః - అసూయగాలవారై, న అనుతిష్ఠంతి - అనుసరింపరో, అచేతసః - మూర్ఖులను, సర్వజ్ఞానవిమూఢాన్ - సర్వజ్ఞానశూన్యులను అగు, తాన్ - వారిని, నష్ఠాన్ - భ్రష్టులుగను, విద్ధి - గ్రహించుము.
ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త ప్రాపంచిక విషయముల యందును మోహితులై భ్రష్టులై, కష్టనష్టముల పాలయ్యెదరని గ్రహింపుము.
సదృశ్యం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి !
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి !! 33
సదృశ్యం - చేష్టతే - స్వస్యాః - జ్ఞానవాన్ - అపి
ప్రకృతిం - యాంతి - భూతాని - నిగ్రహః - కిం - కరిష్యతి
జ్ఞానవాన్ అపి - జ్ఞానవంతుడు కూడా, స్వస్యాః - తనయొక్క, ప్రకృతేః - ప్రకృతికి, సదృశ్యం - సమానమగునటుల, చేష్టతే -
నడుచుకొనుచున్నాడు, భూతాని - ప్రాణులు, ప్రకృతిం - ప్రకృతిని, యాంతి - పొందుచున్నవి, నిగ్రహః - నిగ్రహము, కిం - ఏమి, కరిష్యతి - చేయగలదు.
సమస్త ప్రాణులును తమతమ ప్రకృతులను అనుసరించి స్వభావములకు లోబడి కర్మలు చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని అనుసరించియే క్రియలను ఆచరించును. కావున నిగ్రహమేమిచేయగలదు.
ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ !
తయోర్న వశమాగచ్ఛేత్ తౌహ్యస్య పరిపంథినౌ !! 34
ఇంద్రియస్య - ఇంద్రియస్య - అర్థే - రాగద్వేషౌ - వ్యవస్థితౌ
తయోః - న - వశం - ఆగచ్ఛేత్ - తౌ - హి - అస్య - పరిపంథినౌ
ఇంద్రియస్య - ఇంద్రియమునకు, ఇంద్రియస్య అర్థే - ఇంద్రియ విషయము నందు, రాగద్వేషా - రాగద్వేషములు, వ్యవస్థితౌ - ఏర్పడియున్నవి, తయోః - ఆ రాగద్వేశాములకు, వశం - వశమును, న ఆగచ్ఛేత్ - పొందగూడదు, తౌ - ఆరాగద్వేషములు, అస్య - ఈ జ్ఞానికి, పరిపంథినౌ హి - శత్రువులు గదా.
ప్రతి ఇంద్రియార్థము నందును రాగద్వేషములు దాగియున్నవి. మనుష్యుడు ఈ రెండింటికిని వశముకాకూడదు. ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు, ప్రబలశత్రువులు గదా.
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ !
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః !! 35
శ్రేయాన్ - స్వధర్మః - విగుణః - పరధర్మాత్ - స్వనుష్ఠితాత్
స్వధర్మే - నిధనం - శ్రేయః - పరధర్మః - భయావహః
స్వనుష్ఠితాత్ - బాగుగా ఆచరింపబడిన, పరధర్మాత్ - పరధర్మము కంటెను, విగుణః - గుణరహితమైన, స్వధర్మః - తన ధర్మము, శ్రేయాన్ - మేలైనది, స్వధర్మే - స్వధర్మము నందు, నిధనం - చావు, శ్రేయః - మంచిది, పరధర్మః - అన్యమైన ధర్మము, భయావహః - భయంకరమైనది.
పరధర్మము నందు ఎన్నో సుగుణములు ఉన్నను స్వధర్మము నందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటెను స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే. పరధర్మాచరణము భయంకరమైనది.
అర్జున ఉవాచ :-
అథ కేన ప్రయుక్తోపాయం పాపం చరతి పూరుషః !
అనిచ్ఛన్నపి వార్ష్ణ య బలాదివ నియోజితః !! 36
అథ - కేన - ప్రయుక్తః - అయం - పాపం - చరతి - పూరుషః
అనిచ్ఛన్ - అపి - వార్ష్ణేయ - బలాత్ - ఇవ - నియోజితః
వార్ష్ణేయ - కృష్ణా, అథ - అట్లైన, అయం - ఈ, పూరుషః - పురుషుడు, అనిచ్ఛన్ అని - ఇష్టములేనివాడైనను, బలాత్ -
బలవంతముగను, నియోజితః ఇవ - నియమింపబడిన వానివలె, కేన - దేనిచేత, ప్రయుక్తః - ప్రేరేపింపబడినవాడగుచు, పాపం - పాపమును, చరతి - చేయుచున్నాడు.
అర్జునుడు పలికెను - ఓ కృష్ణా! మానవుడు తనకు ఇష్టము లేకున్నను బలాత్కారముగా దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను చేయుచున్నాడు?
శ్రీభగవాన్ ఉవాచ :-
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః !
మహాశనో మహాపాప్మా విద్ద్యేనమిహ వైరిణమ్ !! 37
కామః - ఏషః - క్రోధః - ఏషః - రజోగుణ సముద్భవహ
మహాశనః - మహాపాప్మా - విద్ధి - ఏనం - ఇహ - వైరిణం
ఏషః - ఇది, రజోగుణసముద్భవః - రజోగుణము వలన గలిగిన, కామః - కామము, ఏషః - ఇది, క్రోధః - క్రోధము, మహాశనః - తృప్తినొందనిది, మహాపాప్మా - గొప్ప పాపముగలది, ఏనం - దీనిని, ఇహ - ఈ యోగమునందు, వైరిణం - శత్రువుగా, విద్ధి - తెలిసికొనుము.
శ్రీ భగవానుడు పలికెను రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము. ఇదియే క్రోధరూపముగా మారును. ఇది తృప్తిలేనిది. పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇదియే ప్రేరకము. కనుక ఈ కామము మోక్షమునకు పరమశత్రువుగా ఎరుంగుము.
ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ !
యథో ల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతమ్ !! 38
ధూమేన - ఆవ్రియతే - వహ్నిః - యథా - ఆదర్శః - మలేన - చ
యథా - ఉల్బేన - ఆవృతః - గర్భః - తథా - తేన - ఇదం - ఆవృతం
యథా - ఏవిధముగా, ధూమేన - పొగచేత, వహ్నిః - అగ్ని, ఆవ్రియతే - కప్పబడుచున్నదో, యథా - ఏవిధముగా, ఆదర్శః చ - అద్దము, మలేన - మాలిన్యము చేత, ఉల్బేన - మావిచేత, గర్భః - శిశువు, ఆవృతః - కప్పబడుచున్నదో, తథా - ఆ రీతిగనే తేన - దానిచేత, ఇదం - ఇది, ఆవృతం - కప్పబడినది.
పొగచే అగ్నియు,మురికిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడునట్లు, జ్ఞానము కామముచే కప్పుబడి యుండును.
ఆవృతం జ్ఞామేతేన జ్ఞానినో నిత్యవైరిణా !
కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ !! 39
ఆవృతం - జ్ఞానం - ఏతేన - జ్ఞానినః - నిత్యవైరిణా
కామరూపేణ - కౌంతేయ - దుష్పూరేణ - అనలేన - చ
కౌంతేయ - అర్జునా, దుష్పూరేణ - నింపశక్యము కానిదియును, అనలేన చ - అగ్ని వంటిదియును, కామరూపేణ -
కామరూపమైనదియును, జ్ఞానినః - జ్ఞానికి, నిత్యవైరిణా - నిత్యశత్రువును అగు, ఏతేన - దీనిచేతను, జ్ఞానం - జ్ఞానము, ఆవృతం - కప్పబడియున్నది.
ఓ అర్జునా ! కామము అగ్నితో సమానమైనది. అది ఎన్నటికిని చల్లారదు. జ్ఞానులకు అది నిత్య శత్రువు. అది మనుష్యుని జ్ఞానమును వేయనున్నది.
ఇంద్రియాణి మనో బుద్ధిః అస్యాధిష్ఠానముచ్యతే !
ఏతైర్విమోహయత్యేషజ్ఞానమావృత్య దేహినమ్ !! 40
ఇంద్రియాణి - మనః - బుద్ధిః - అస్య - అధిష్ఠానం - ఉచ్యతే
ఏతైః - విమోహయతి - ఏషః - జ్ఞానం - ఆవృతం - దేహినం
అస్య - ఈ కామమునకు, ఇంద్రియాణి - ఇంద్రియములు, మనః - మనస్సు, బుద్ధిః - బుద్ధియును, అధిష్ఠానం - ఆధారముగా, ఉత్యతే - చెప్పబడుచున్నది, ఏషః - ఇది, ఏతైః - వీనిచేత, జ్ఞానం - జ్ఞానమును, ఆవృత్య - కప్పి, దేహినం - పురుషుని, విమోహయతి - మోహపెట్టుచున్నది.
కామమునకు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి నివాసస్థానములు. ఈ కామము మనో బుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి, జీవాత్మను మోహితునిగా చేయును.
తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ !
పాప్మానం ప్రజహి హేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్ !! 41
తస్మాత్ - త్వం - ఇంద్రియాణి - ఆదౌ - నియమ్య - భరతర్షభ
పాప్మానం - ప్రజహి - హి - ఏనం - జ్ఞాన - విజ్ఞాన నాశనం
భరతర్షభ - అర్జునా, తస్మాత్ - అందువలన, త్వం - నీవు, ఆదౌ - మొదట, ఇంద్రియాణి - ఇంద్రియములను, నియమ్య - నియమించి, జ్ఞాన విజ్ఞాన నాశనం - జ్ఞానవిజ్ఞానములను నాశనము చేయునట్టి, పాప్మానం - పాపవంతమునైన, ఏనం - దీనిని, ప్రజహి హి - విడుపుము.
కావున ఓ అర్జునా ! మొదట ఇంద్రియములను వశపరచకొనుము. పిదప జ్ఞానవిజ్ఞానములను నశింపజేయునట్టి మహాపాపియైన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తుల నొడ్డి పూర్తిగా విడుపుము.
ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః !
మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః !! 42
ఇంద్రియాణి - పరాణి - ఆహుః ఇంద్రియేభ్యః - పరం - మనః
మనసః - తు - పరా - బుద్ధిః - యః - బుద్ధేః - పరతః - తు - సః
ఇంద్రియాణి - ఇంద్రియములు, పరాణి - గొప్పవి, ఇంద్రియేభ్యః - ఇంద్రియముల కంటెను, మనః - మనస్సు, పరం - గొప్పది, మనసః తు - మనస్సుకంటెను, బుద్ధిః - బుద్ధి, పరా - గొప్పది, యః తు - ఎవడయితే, బుద్ధేః - బుద్ధికంటెను, పరతః - గొప్పవాడో, సః - వాడేయని, ఆహుః - చెప్పుదురు.
స్థూలశరీరము కంటెను ఇంద్రియములు గొప్పవి. ఇంద్రియముల కంటెను మనస్సు, దానికంటేను బుద్ధి గొప్పది, ఆ బుద్ధి కంటెను మిక్కిలి గొప్పది, సూక్ష్మమైనది ఆత్మ.
ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మానా !
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్ !! 43
ఏవం - బుద్ధేః - పరం - బుద్ధ్యా - సంస్తభ్య - ఆత్మనా
జహి - శత్రుం - మహాబాహో - కామరూపం దురాసదం
మహాబాహో - అర్జునా, ఏవం - ఈవిధముగా, బుద్ధేః - బుద్ధికంటెను, పరం - శ్రేష్ఠమైన దానిని, బుద్ధ్వా - తెలుసుకొని, ఆత్మానం - తనను, ఆత్మనా - ఆత్మచేతను, సంస్తభ్య - నియమించి, కామరూపం - కామస్వరూపమైన, దురాసదం - జయింపశక్యముగాని, శత్రుం - శత్రువును, జహి - సహరింపుము.
ఈ విధముగా బుద్ధికంటెను ఆత్మ అతీతమైనదని తెలిసికొని, ఓ మహాబాహో ! బుద్ధిద్వారా మనస్సును వశపరచుకొని,
జయింపశక్యముకాని శత్రువైన కామమును సంహరింపుము.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జునసంవాదే కర్మయోగో నామ
తృతీయోపాధ్యాయః