Read more!

భగవద్గీత పార్ట్ - 6

 

కర్మయోగః
ఓం శ్రీ పరమాత్మనే నమః
అథ తృతీయోపాధ్యాయః - కర్మయోగః

 

అర్జున ఉవాచ :-
జ్యాయసీచేత కర్మణస్తే మతా బుద్ధిర్జనార్ధన !
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ !  1

జ్యాయసీ - చేత్ - కర్మణః - తే - మతా - బుద్ధిః - జనార్దన
తత్ - కిం - కర్మణి - ఘోరే - మాం - నియోజయసి - కేశవ


జనార్ధన - కృష్ణా, బుద్ధిః - జ్ఞానము, కర్మణః - కర్మకంటెను, జ్యాయసీ - మేలైనది, తే - నీ, మతా చేత్ - అభిప్రాయములో, కేశవ - శ్రీకృష్ణా, తత్ - అప్పుడు, ఘోరే - భయంకరమైన, కర్మణి - కర్మయందు, మాం - నన్ను, కిం - నియోజయసి - ఏల నియోగించితివి? 

అర్జునుడు పలికెను - ఓ కృష్ణా ! నీ అభిప్రాయమును బట్టి కర్మకంటెను జ్ఞానమే శ్రేష్ఠమైనచో, భయంకరమైన ఈ యుద్ధకార్యమందు నన్నేల నియోగించుచున్నావు.

వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే !
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోపాహమాప్నుయామ్ !  2

వ్యామిశ్రేణ - ఇవ - వాక్యేన - బుద్ధిం - మోహయాసి - ఇవ - మే
తత్ - ఏకం - వద - నిశ్చిత్య - యేన - శ్రేయః - అహం - ఆప్నుయాం


వ్యామిశ్రేణ ఇవ - కలిసిపోయినట్లున్న, వాక్యేన - మాటలలో, మే - నా, బుద్ధిం - బుద్ధిని, మోహయసి ఇవ - భ్రమింపచేయుచున్నావు, అహం - నేను, యేన - దేనిచేత, శ్రేయః - శ్రేయమును, ఆప్నుయాం - పొందుదునో, తత్ - అట్టి, ఏకం - ఒక్కదానిని, నిశ్చిత్య - నిశ్చయించి, వద - చెప్పుము.

కలగాపులగమువంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు. కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా చెప్పుము.

శ్రీభగవాన్ ఉవాచ :-
లోకేపాస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానషు !
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మాయోగేన యోగినామ్ !  3

లోకే - అస్మిన్ - ద్వివిధా - నిష్ఠా - పురా - ప్రోక్తా - మయా - అనఘ
జ్ఞానయోగేన - సాంఖ్యానాం - కర్మయోగేన - యోగినాం


అనఘ - పాపరహితుడవగు అర్జునా, అస్మిన్ - ఈ, లోకే - లోకమునందు, పురా - పూర్వము, మయా - నాచే, సాంఖ్యానాం - సాంఖ్యులకు, జ్ఞానయోగేన - జ్ఞానయోగము చేతను, యోగినాం - యోగులకు, కర్మయోగేన - కర్మయోగము చేతను, ద్వివిధా - రెండు విధములగు, నిష్ఠా - నిష్ఠ, ప్రోక్తా - చెప్పబడినది.

శ్రీభగవానుడు పలికెను - ఓ పాపరహితుడవైన అర్జునా ! ఈ లోకమున రెండు నిష్ఠలు గలవు. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా యోగులకు కర్మయోగము ద్వారా నిష్ఠ కలుగును.

న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోపాశ్నుతే !
న చ సన్న్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి !
4

న - కర్మణాం - అనారంభాత్ - నైష్కర్మ్యం - పురుషః - అశ్నుతే
న - చ - సంన్యసనాత్ - ఏవ - సిద్ధిం - సమధిగచ్ఛతి


పురుషః - మనుజుడు, కర్మణాం - కర్మలయొక్క, అనారంభాత్ - చేయకపోవుటవలన, నైష్కర్మ్యం - నైష్కర్మ్యమును, న అశ్నుతే - పొందడు, సంన్యసనాత్ ఏవ - కర్మలను మాత్రము త్యజించుట వలననే, సిద్ధిం -  సిద్ధిని, న సమధిగచ్ఛతి చ - పొందుటయను లేదు.

మనుష్యుడు కర్మలను చేయకపోవుట వలన యోగనిష్ఠాసిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్ఠను అతడు పొందడు.

న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ !
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః   !  5

న - హి - కశ్చిత్ - క్షణం - అపి - జాతు - తిష్ఠతి - అకర్మకృత్
కార్యతే - హి - అవశః - కర్మ - సర్వః - ప్రకృతిజైః - గుణైః


కశ్చిత్ - ఎవడును, జాతు - ఒకప్పుడును, క్షణమపి - క్షణమైనను, అకర్మకృత్ - కర్మచేయని వాడై, న తిష్ఠతి హి - ఉండలేడు, ప్రకృతి జైః  - ప్రకృతి వలన బుట్టిన, గుణైః - గుణముల చేత, సర్వః ప్రతివాడును, అవశః - అవశుడై, కర్మ - కర్మమును, కార్యతే హి - చేయింపబడుచున్నాడు.

ఎవడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రముగూడ కర్మను ఆచరింపకుండ ఉండలేడు. మనుష్యులందరును ప్రకృతినిత్యలైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతివ్యక్తియు అస్వతంత్రుడై కర్మను ఆచరింపవలసియే యుండును.

కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ !
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే !  6

కర్మేంద్రియాణి - సంయమ్య - యః - ఆస్తే - మనసా - స్మరన్
ఇంద్రియార్థాన్ - విమూఢాత్మా - మిథ్యాచారః - సః - ఉచ్యతే


యః - ఎవడు, కర్మేంద్రియాణి - కర్మేంద్రియములను, సంయమ్య - బిగబట్టి, మనసా - మనస్సుచేతను, ఇంద్రియార్థాన్ - శబ్దాది విషయములను, స్మరన్ - స్మరించుచు, ఆస్తే - ఉండునో, సః - వాడు, విమూఢాత్మా - వివేకములేనివాడు, మిథ్యాచారః - కపటియును అని, ఉచ్యతే - చెప్పబడుచున్నాడు.

బలవంతముగా, బాహ్యముగా ఇంద్రియవ్యాపారములను నిగ్రహించి, మానసికముగా ఇంద్రియవిషయములను చింతించునట్టి మూఢుని డంభాచారి అని కపటుడు అని అంటారు.

యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేపార్జున  !
కర్మేంద్రియైః కర్మయోగమ్ అసక్తః స విశిష్యతే  !  7

యః - తు - ఇంద్రియాణి - మనసా - నియమ్య - ఆరభతే - అర్జున 
కర్మేంద్రియైః - కర్మయోగం - అసక్తః - సః - విశిష్యతే


అర్జున - అర్జునా, యః తు - ఎవడయితే, ఇంద్రియాణి - ఇంద్రియములను, మనసా - మనస్సుచేత, నియమ్య - నియమించి, కర్మేంద్రియైః - కర్మేంద్రియములచేత, కర్మయోగం - కర్మయోగమును, అసక్తః - ఆసక్తిలేనివాడై, ఆరభతే - చేయునో, సః - వాడు, విశిష్యతే - అధికుడగుచున్నాడు.

అర్జునా ! మనస్సుతో ఇంద్రియములను వశపరచుకొని , అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచారణమును కావించు పురుషుడుత్తముడు.

నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యరకర్మణః !
శరీరయాత్రాపాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః !  8

నియతం - కురు - కర్మ - త్వం - కర్మ - జ్యాయః - హి - అకర్మణః
శరీరయాత్రా - అపి - చ - తే - న - ప్రసిద్ద్యేత్ - అకర్మణః


త్వం - నీవు, నియతం - నియతమైన, కర్మ - కర్మను, కురు - చేయుము, అకర్మణః - కర్మచేయకుండుటకంటెను, కర్మ - కర్మ, జ్యాయః హి - శ్రేష్ఠముకదా, అకర్మణః - కర్మచేయని, తే - నీకు, శరీరయాత్రా అపి చ - శరీరయాత్రమును, న ప్రసిద్ధ్యేత్ - సిద్ధింపదు.

నీవు శాస్త్రవిహితకర్తవ్యకర్మలను ఆచరింపుము. ఏలనన కర్మలను చేయకుండుటకంటెను చేయుటయే మేలుగదా! కర్మలను ఆచరింపనిచో నీ శరీరయాత్ర గూడ సిద్ధింపదు.

యజ్ఞార్థాత్ కర్మణోపాన్యత్ర లోకేపాయం కర్మబంధనః !
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచార !  9

యజ్ఞార్థాత్ - కర్మణః - అన్యత్ర - లోకః - అయం - కర్మబంధనః
తదర్థం - కర్మ - కౌంతేయ - ముక్తసంగః - సమాచార


కౌంతేయ - అర్జునా, యజ్ఞార్థాత్ - యజ్ఞార్థమైన, కర్మణః - కర్మకంటెను, అన్యత్ర - అన్యమగు కర్మల వలనను, అయం - ఈ, లోకః - లోకము, కర్మబంధనః - కర్మమే బంధముగా గలది, తదర్థం - యజ్ఞము కొరకు, ముక్తసంగః - సంగమును విడిచినవాడై, కర్మ - కర్మమును, సమాచర - చక్కగా ఆచరింపుము.

ఓ అర్జునా ! యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మలయందు నిమగ్నులగుటవలన మనుష్యులు కర్మ బంధములలో చిక్కుపడుదురు. కనుక ఆసక్తిరహితుడవై యజ్ఞార్థమే కర్తవ్యకర్మలను చక్కగా ఆచరింపుము.

సహాయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః
అనేన ప్రసవిష్యధ్వమ్ ఏషవోపాస్త్విష్టకామధుక్ ! 10 

సహయజ్ఞాః - ప్రజాః సృష్ట్వా - పురా - ఉవాచ - ప్రజాపతిః
అనేన - ప్రసవిష్యధ్వం - ఏషః - వః - అస్తు - ఇష్టకామధుక్


ప్రజాపతిః - బ్రహ్మ, పురా - పూర్వము, సహయజ్ఞాః - యజ్ఞములతో గూడిన, ప్రజాః - ప్రజలను, సృష్ట్వా - సృజించి, ఉవాచ - పలికెను, అనేన - దీనిచేతను, ప్రసవిష్యధ్వం - వృద్ధిచెందుడు, ఏషః - ఈ యజ్ఞము, వః - మీకు, ఇష్టకామధుక్ - ఇష్టములను ఇచ్చునది, అస్తు - అగుగాక.

కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగ ప్రజలను సృష్టించి, మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధిచెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోర్కెల నెల్ల తీర్చునది అగుగాక.

దేవాన్ భావయతా నేన తే దేవా భావయంతు వః !
పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ !  11

దేవాన్ - భావయత - అనేన - తే - దేవాః - భావయంతు - వః
పరస్పరం - భావయంతః - శ్రేయః - పరం - అవాప్స్యథ


అనేన - వీనిద్వారా, దేవాన్ - దేవతలను, భావయత - భావింపుడు, తే దేవాః - దేవతలు, వః - మిమ్ము, భావయంతు - భావింతురు గాక, పరస్పరం - ఒకరినొకరు, భావయంతః - భావించుచున్నవారలై, పరం - శ్రేష్ఠమైన, శ్రేయః - శ్రేయమును, అవాప్స్యథ - పొందగలరు.

ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపఱచుడు. మఱియు ఆ దేవతలు మిమ్మలను అనుగ్రహింతురు. నిష్వార్థభావముతో మీరు పరస్పరము సంతృప్తిపఱచుకోనుచు పరమశ్రేయస్సును పొందగలరు.

ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః !
తైర్ధత్తానప్రదాయైభ్యో యోభుంక్తే స్తేన ఏవ సః !  12

ఇష్టాన్ - భోగాన్ - హి - వః - దేవాః - దాస్యంతే - యజ్ఞభావితాః
తైః దత్తాన్ - అప్రదాయ - ఏభ్యః - యః - భుంక్తే - స్తేనః - ఏవ - సః


యజ్ఞభావితాః - యజ్ఞములచేత సంభావింపబడినట్టి, దేవాః - దేవతలు, వః - మీకొరకు, ఇష్టాన్ - ఇష్టములైన, భోగాన్ - భోగములను, దాస్యంతేహి - ఇవ్వగలరు, తైః - వారిచేత, దత్తాన్ - ఇవ్వబడిన వానిని, ఏభ్యః - వీరికొరకు, అప్రదాయ - ఇవ్వక, యః - ఎవడు, భుంక్తే - భుజించునో, సః - వాడు, స్తేన ఏవ - చోరుడే 

యజ్ఞముల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మానవులకు ఆయాచితముగనే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగ దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదనచేయక తానే అనుభవించు వాడు నిజముగా చోరుడగును.

యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః !
భుజంతే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్ !  13

యజ్ఞశిష్టాశినః - సంతః - ముచ్యంతే - సర్వకిల్బిషైః
భుజంతే - తేతు - అఘం - పాపాః - యే - పచంతి - ఆత్మకారణాత్


యే తు - ఎవరైతే, ఆత్మ కారణాత్ - తమ శరీరపోషణార్థము, పచంతి - పచనము చేయుచున్నారో, పాపాః - పాపులైన, తే - వారు, అఘం - పాపమును, భుజంతే - భుజించు చున్నారు, సంతః - సత్పురుషులు, యజశిషాశినః - యజశేషమును  అనుభవించుచు, సర్వకిల్బిషైః - సమస్త పాపముల నుండి, ముచ్యంతే - విముక్తులగుచున్నారు.

యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠపురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. తమ శరీరపోషణ కొఱకే ఆహారమును సిద్ధపరచుకొను పాపులు పాపమునారగించినవారైవున్నారు.

అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః !
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః !  14

అన్నాత్ - భవంతి - భూతాని - పర్జన్యాత్ - అన్నసంభవః
యజ్ఞాత్ - భవతి - పర్జన్యః - యజ్ఞః - కర్మసముద్భవః


అన్నాత్ - అన్నమువలన, భూతాని - ప్రాణులు, భవంతి - కలుగుచున్నవి, పర్జన్యాత్ - మేఘమువలన, అన్నసంభవః - అన్నము కలుగుచున్నది, యజ్ఞాత్ - యజ్ఞమువలన, పర్జన్యః - మేఘుడు, భవతి  - కలుగుచున్నాడు, యజ్ఞః - యజ్ఞము, కర్మసముద్భవః - కర్మమువలన కలుగుచున్నది.

ప్రాణులన్నియు అన్నము నుండి జన్మించును. అన్నోత్పత్తి మేఘముల వలన ఏర్పడును. మేఘము యజ్ఞముల వలన కలుగుతోంది.

కర్మ బ్రహ్మోద్భవం విద్ది బ్రహ్మాక్షరసముద్భవమ్ !
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ !  15

కర్మ - బ్రహ్మోద్భవం - విద్ధి - బ్రహ్మ - అక్షరసముద్భవం
తస్మాత్ - సర్వగతం - బ్రహ్మ - నిత్యం - యజ్ఞే - ప్రతిష్ఠితం


కర్మ - కర్మము, బ్రహ్మోద్భవం - వేదము వలన ఉత్పన్నమైనదిగను, బ్రహ్మ - బ్రహ్మము, అక్షర సముద్భవం - అక్షర స్వరూపుని నుండి ఉత్పన్నమైనదిగను, విద్ధి - తెలిసికొనుము, తస్మాత్ - అందువలన, సర్వగతం - సర్వవ్యాపకమైన, బ్రహ్మ - బ్రహ్మము, నిత్యం - సదా, యజ్ఞే - యజ్ఞమునందు, ప్రతిష్ఠితం - ప్రతిష్ఠితమై యున్నది.

సత్కర్ములు యజ్ఞములకు మూలములు. వేదములు సత్కర్మలకు మూలములు. వేదములు పరబ్రహ్మ నుండి ఉద్భవించినవని తెలిసికొనుము. అందువలన సర్వావ్యాపకమగు పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై యున్నాడు.

ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః !
అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి ! 16

ఏవం - ప్రవర్తితం - చక్రం - న - అనువర్తయతి - ఇహ - యః
అఘాయుః - ఇంద్రియారామః - మోఘం - పార్థ - సః - జీవతి


పార్థ - అర్జునా, ఏవం - ఈ విధముగ, ప్రవర్తితం - ప్రవర్తింపబడిన, చక్రం - సృష్టి చక్రమును, ఇహ - ఈ లోకమునందు, యః - ఎవడు, న అనువర్తయతి - అనుసరించి జీవించడో,సః - వాడు, అఘాయుః - పాపమే ఆయువుగా గలవాడును, ఇంద్రియారామః - ఇంద్రియ విషయాసక్తుడునై, మోఘం - వ్యర్థముగా, జీవతి - జీవించుచున్నాడు.

ఓ అర్జునా ! ఈ ప్రకారముగా కొనసాగుతున్న సృష్టిచక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియసుఖలోలుడైన వాడు పాపి. అట్టి వాని జీవితము వ్యర్థము.

యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః !
ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే !!  17

యః - తు - ఆత్మరతిః - ఏవ - స్యాత్ - ఆత్మతృప్తః - చ - మానవః
ఆత్మని - ఏవ - చ - సంతుష్టః - తస్య - కార్యం - న - విద్యతే


యః మానవః తు - ఎవడయితే, ఆత్మరతిః ఏవ - ఆత్మయందే ప్రీతిగలవాడు, ఆత్మతృప్తః చ - ఆత్మచేతనే తృప్తిని బొందువాడును, ఆత్మని ఏవ - ఆత్మయందే, సంతుష్టః  చ - సంతోషపడువాడు, స్యాత్ - అగునో, తస్య - వానికి, కార్యం - కావలసిన పని, న విద్యతే - లేదు.

ఎవడు కేవలము ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే సంతుష్టుడై యుండునో, అట్టి జ్ఞానికి చేయదగిన కార్యమేదియు లేదు.

నైన తస్య కృతేనార్ధోనాకృతేనేహ కశ్చన !
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్ధవ్యపాశ్రయః !! 18

న - ఏవ - తస్య - కృతేన - అర్థః - న - అకృతేన - ఇహ - కశ్చన
న - చ - అస్య - సర్వభూతేషు - కశ్చిత్ - అర్థ్యపాశ్రయః


తస్య - అట్టివానికి, ఇహ - ఈ లోకమునందు, కృతేన - కర్మము చేయుటచేత, అర్థః - ప్రయోజనము, న ఏవ - లేనేలేదు, అకృతే న - కర్మము చేయకపోవుటచేత, కశ్చన - ఏమియును, న - లేదు, చ - మరియు, అస్య - ఇతనికి, సర్వభూతేషు - సర్వభూతముల యందును, అర్థవ్యపాశ్రయః - ప్రయోజనమును గోరిన ఆశ్రయము, కశ్చిత్ - ఒకటియును, న - లేదు.

అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుటవలన ప్రయోజనముగాని, చేయకుండుట వలనను దోషముగాని ఉండదు. అనగా సర్వప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగను లేదు.

తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచార !
అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః !!  19

తస్మాత్ - ఆసక్తః - సతతం - కార్యం - కర్మ - సమాచార
ఆసక్తః - హి - ఆచరన్ - కర్మ - పరం - ఆప్నోతి - పూరుషః


తస్మాత్ - అందువలన, అసక్తః - ఫలాసక్తి లేనివాడవై, సతతం - ఎల్లప్పుడును, కార్యం - చేయదగిన, కర్మ - కర్మమును, సమాచార - లెస్సగా జేయుము, అసక్తతః - సంగత్వము లేనివాడై, కర్మ - కర్మమును, ఆచరన్ - చేయుచున్న, పూరుషః - పురుషుడు, పరం - మోక్షమును, ఆప్నోతి హి - పొందుచున్నాడు గదా.

అందువలన నీవు నిరంతరము ఫలాపేక్ష లేనివాడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఫలాపేక్ష వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును.

కర్మణైవ హి సంసిద్ధిమ్ ఆస్థితా జనకాదయః !
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి !!  20

కర్మణా - ఏవ - హి - సంసిద్ధిం - ఆస్థితాః - జనకాదయః 
లోకసంగ్రహం - ఏవ - అపి - సంపశ్యం - కర్తుం అర్హసి


జనకాదయః - జనకుడు మొదలగువారు, కర్మణా ఏవ - కర్మద్వారానే, సంసిద్ధిం - సంసిద్ధిని, ఆస్థితాః హి - పొందిరిగదా, లోకసంగ్రహం ఏవ అపి - లోకకళ్యాణమునే, సంపశ్యన్ - లెస్సగా విచారించువాడవై, కర్తుం - కర్మచేయుటకు, అర్హసి - తగియున్నావు. 

జనకుడు మున్నగువారు ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించుటవలననే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్థమై కర్మలను చేయవలయును.

యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః !
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే !!  21

యత్ - యత్  - ఆచరతి - శ్రేష్ఠః - తత్ - తత్ - ఏవ - తరః - జనః
సః - యత్ - ప్రమాణం - కురుతే - లోకః - తత్ - అనువర్తతే


యత్ యత్ - ఎద్దానిని, శ్రేష్ఠః - ఆచరతి - ఆచరించునో, తత్ తత్ ఏవ - అద్దానినే, ఇతరః - ఇతరమైన, జనః - జనము, (చేయును), సః - అతడు, యత్ - ఏది, ప్రమాణం - ప్రమాణముగ, కురుతే - చేయునో, లోకః - లోకము, తత్ - దానిని, అనువర్తతే - అనుసరించుచున్నది.

శ్రేష్ఠుడైన పురుషుడు ఏది ఆచరించునో ఇతరులును దానిని అనుసరింతురు. అనగా ఏ ప్రమాణము అతడు నిల్పినో ఇతరులు గ్రహింతురు.

న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన !
నానవాప్తమవాప్తవ్యం  వర్త ఏవ చ కర్మణి !!  22

న - మే - పార్థ - ఆస్థి - కర్తవ్యం - త్రిషు - లోకేషు - కించన
న అనవాప్తం - అవాప్తవ్యం - వర్తే - ఏవ  - చ - కర్మేణి


పార్థ - అర్జునా, మే - నాకు, త్రిషు లోకేషు - ముల్లోకముల యందును, కర్తవ్యం - చేయదగినది, కించన - కొంచమైనను, న అస్తి - లేదు, అనవాప్తం - పొందబడినదియు, అవాప్తవ్యం - పొందవలసినదియు, న - లేదు, కర్మణి  - కర్మము నందే, వర్తే ఏవ చ - ఉన్నాను గదా.

ఓ అర్జునా ! ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యము అనునదియే లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిదియును లేదు. ఐనను నేను కర్మలను చేయుచునే ఉన్నాను.