భగవద్గీత పార్ట్ - 4
హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీమ్ !
తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః ! 37
హతః - వా - ప్రాప్స్యసి - స్వర్గం - జిత్వా - వా - భోక్ష్యసే - మహీం
తస్మాత్ - ఉత్తిష్ఠ - కౌంతేయ - యుద్ధాయ - కృతనిశ్చయః
కౌంతేయ - అర్జునా, హతో వా - చంపబడితివా, స్వర్గం - స్వర్గమును, ప్రాప్స్యసి - పొందగలవు, జిత్వావా - జయించితివా, మహీం - రాజభోగములను. భోక్ష్యసే - అనుభవించగలవు, తస్మాత్ - ఈ కారణముచే, కృతనిశ్చయః - ధృడనిశ్చయము కలవాడవై, యుద్ధాయ - యుద్ధమునకు, ఉత్తిష్ఠ - సంసిద్ధుడవు కమ్ము.
ఓ కౌంతేయా ! రణరంగమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు. యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము.
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ !
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ! 38
సుఖదుఃఖే - సమ్మే - కృత్వా - లాభాలాభౌ - జయాజయౌ
తతః - యుద్ధాయ - యుజ్యస్వ - న - ఏవం - పాపం - అవాప్స్యసి
సుఖదుఃఖే - సుఖదుఃఖములను, లాభాలాభౌ - లాభనష్టములను, జయాజయౌ - జయాప జయములను, సమే - సమానముగ, కృత్వా - తలంచి, తతః - పిమ్మట, యుద్ధాయ - యుద్ధమునకు, యుజ్యస్వ - సిద్ధముకమ్ము, ఏవం - ఇట్లు చేసితివేని, పాపం - పాపమును, న అవాప్స్యసి - అంటవు.
జయాపజయములను, లాభనష్టములను, సుఖదుఃఖములను సమానముగా తలంచి, యుద్ధసన్నద్దుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు.
ఏషా తేపాభిహితా సంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు !
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యాసి ! 39
ఏషా - తే - అభిహితా - సాంఖ్యే - బుద్ధిః - యోగే - తు - ఇమాం - శృణు
బుద్ధ్యా - యుక్తః - యయా - పార్థ - కర్మబంధం - ప్రహాస్యాసి
పార్థ - అర్జునా, సాంఖ్యే - జ్ఞానయోగవిషయమున, ఏషా - ఇంతవరకు చెప్పిన, బుద్ధిః - వివేకము, తే - నీకొరకు, అభిహితా - చెప్పబడినది, ఇమాం - దీనినే, యోగే తు - యోగ విషయమున, శృణు - వినుము, యయా - ఏ, బుద్ధ్యా - బుద్ధిచే, యుక్తిః - కూడినవాడవై, కర్మబంధం - కర్మబంధమును, ప్రహాస్యసి - ముక్తుడవుతావు.
ఓ పార్థా ! సాంఖ్య శాస్త్రమున చెప్పబడిన ఈ సమత్వ బుద్ధిని గురించి తెల్పితిని. ఇప్పుడు దానినే కర్మయోగదృక్పథముతో వివరించెదను, వినుము. దానిని ఆకళింపు చేసికొని, ఆచరించినచో కర్మబంధముల నుండి నీవు ముక్తుడవయ్యెదవు.
నేహాభిక్రమనాశోపాస్తి ప్రత్యవాయో న విద్యతే !
స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ! 40
న - ఇహ - అభిక్రమనాశః - అస్తి - ప్రత్యవాయః - న - విద్యతే
స్వల్పం - అపి - అస్య - ధర్మస్య - త్రాయతే - మహతః - భయాత్
ఇహ - ఇందు, అభిక్రమనాశః - ప్రారంభనాశము, న అస్తి - లేదు, ప్రత్యవాయః - ప్రత్యవాయ దోషము, న విద్యతే - ఉండదు, అస్య - ఈ, ధర్మస్య - ధర్మము యొక్క, స్వల్పమపి - కొంచెమైనను, మహతః - గొప్పదైన, భయాత్ - భయము నుండి, త్రాయతే - కాపాడును.
ఈ నిష్కామకర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికిని బీజనాశము లేదు. దీనికి విపరీత ఫలితములే యుండవు. పైగా ఈ (నిష్కామ) కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మమృత్యురూప మహాభయము నుండి కాపాడును.
వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన !
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోపావ్యవసాయినామ్ ! 41
వ్యవసాయత్మికా – బుద్ధిః – ఏకా – ఇహ – కురునందన
బహుశాఖాః – హి – అనంతాః – చ – బుద్ధయః – అవ్యవసాయినాం
కురునందన – అర్జునా, ఇహ – దీనియందు, వ్యవసాయాత్మికా – నిశ్చయాత్మకమైన, బుద్ధిః – బుద్ధి, ఏకా – ఒక్కటే, అవ్యవసాయినాం – నిశ్చయాత్మకబుద్ధి లేనివారల, బుద్ధయః – బుద్ధులు, బహుశాఖాః – అనేక భేదములు గలవియు, అనంతాః చ హి – అనంతములుగా వుంటాయి.
ఓ అర్జునా! ఈ (నిష్కామ) కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే యుండును. కాని భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై, ఒకదారీ తెన్నూ లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయుచూ అనంతములుగా వుంటాయి.
యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యంవిపశ్చితః !
వేదవాదరాతః పార్థ నాన్యదస్తీతి వాదినః ! 42
యాం – ఇమాం – పుష్పితాం – వాచం – ప్రవదంతి – అవిపశ్చితః
వేదవాదరాతః – పార్థ – న – అన్యత్ – అస్తి – ఇతి – వాదినః
పార్థ – అర్జునా, వేదవాదరతాః – వేదముల యందు మించువారును, అన్యత్ – మరియొకటి, అస్తి – ఉండుట, న – లేదు, ఇతి – అని, వాదినః – వాదించువారును, అనిపశ్చితః – అవివేకులు, పుష్పితాం – వికసిత లతవలె రమణీయమమగు, ఇమాం – ఇట్టి, యాం వాచం – ఈమాటలను, ప్రవదంతి – చెబుతున్నారో.
అర్జునా ! వేదవాదములందు రమించువారు, కామ్య కర్మలే అధికమని వాదించువారు, స్వర్గమే ఉన్నతమైనది భావించి ఇలా అంటారు.
కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ !
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి ! 43
కామాత్మానః – స్వర్గపరాః – జన్మకర్మఫలప్రదాం
క్రియావిశేషబహులాం – భోగైశ్వర్య గతిం – ప్రతి
కామత్మానః – కోరికలతో నిండినవారును, స్వర్గాపరాః – స్వర్గమే పరమమైనది యని భావించువారును, జన్మకర్మఫలప్రదాం – జన్మమును, కర్మఫలము నొసంగునదియు, క్రియా విశేష బహులాం – బహుళమైన కార్యకాలాపములతో నిండినదియు, భోగైశ్వర్య గతిం ప్రతి – భోగముల యొక్క, ఐశ్వర్యముల యొక్క ప్రాప్తిని గురించినదియు కోరికలతో కూడినవారు, స్వర్గాభిలాషులును, జన్మమును, కర్మఫలము నొసగునట్టిదియును, భోగైశ్వర్యముల నిచ్చునదియు.
భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్ !
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ! 44
భోగైశ్వర్య ప్రసక్తానాం - తయా - అపహృత చేతసాం
వ్యవసాయాత్మికా - బుద్ధిః - సమాధౌ - న -విధీయతే
భోగైశ్వర్య ప్రసక్తానాం - భోగైశ్వర్యములయందు ఆసక్తికలవారికి, తయా - అట్టి మాటలచే, అపహృత చేతసాం - అపహరించబడిన మనస్సు కలవారికి, వ్యవసాయాత్మికా -నిశ్చయాత్మక మైన, బుద్ధిః - బుద్ధి, సమాధౌ - సమబుద్ధి యందు, న విధీయతే - స్థిరముగా ఉండదు.
భోగైశ్వర్య ప్రసక్తికల వారలకు నిశ్చితమైన బుద్ధి ఉండదు.
త్రైగుణ్యవిషయా వేదా నిస్ర్రైగుణ్యో భవార్జున !
నిర్ద్వంద్వోనిత్యసత్త్వస్థోనిర్యోగక్షేమ ఆత్మవాన్ ! 45
త్రైగుణ్యవిషయాః - వేదాః - నిస్త్రై గుణ్యఃభవ - అర్జున
నిర్ద్వంద్వః - నిత్యసత్త్వస్థః - నిర్యోగక్షేమః - ఆత్మవాన్
అర్జున - అర్జునా, వేదాః - వేదములు, త్రైగుణ్యవిషయాః - త్రిగుణములు విషయములుగా గలవి, త్వం - నీవు,
నిస్త్రైగుణ్యః - త్రిగుణరహితుడవు, నిర్ద్వంద్వః - ద్వంద్వరహితుడవు, నిత్యసత్వస్థః - శుద్ధసత్త్వ రూపుడవు, నిర్యోగక్షేమః - యోగక్షేమలుల కొరకు ఆరాటం లేనివాడు, ఆత్మవాన్ - ఆత్మవిదుడవు, భవ - అగుము.
ఓ అర్జునా ! వేదములు సత్త్వరజస్తమోగుణములకార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు, వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును. ప్రతి నీవు ఆ భోగముల యెడలను వాటి సాధనలయందును ఆసక్తిని త్యజింపుము. సుఖదుఖాదిద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మయందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొఱకై ఆరాటపడవద్దు. అంతఃకరణమును వశమనందుంచుకొనుము.
యావానర్ధ ఉదాపానే సర్వతః సంప్లుతోదకే !
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ! 46
యావాన్ - అర్థః - ఉదపానే - సర్వతః - సంప్లుతోదకే
తావాన్ - సర్వేషు - వేదేషు - బ్రాహ్మణస్య - విజానతః
సర్వతః - అంతటను, సంప్లుతోదకే - జలముతో నిండియున్న, ఉదపానే - జలాశయము నందు, యావాన్ - ఎంతగా, అర్థః - లాభముండునో, విజానతః - జ్ఞానియైన, బ్రాహ్మణస్య - బ్రాహ్మణునకు, సర్వేషు - సర్వములైన, వేదుషు - వేదములవలన, తావాన్ - అంతియే వుంటుంది.
అన్నివైపులా జలములతో నిండియున్న మహాజలాశయము అందుబాటులో నున్న వానికి చిన్న చిన్న జలాశయము వలన ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తినంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికే వేదముల వలన అంతియే ప్రయోజనము వుంటుంది.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన !
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోపాస్త్వకర్మణి ! 47
కర్మణి - ఏవ - అధికారః - తే - మా - ఫలేషు - కదాచన
మా - కర్మఫల హేతుః - భూః - మా - తే - సంగః - అస్తు - అకర్మణి
తే - నీకు, కర్మణి ఏవ - కర్మలయందే, అధికారః - అధికారము, ఫలేషు - ఫలములయందు, కదాచన - ఎన్నటికిని, మా - లేదు, తే - నీకు, కర్మఫల హేతుః - కర్మఫలమునకు నీవు హేతువు, మా భూః - కాకుము, అకర్మణి - కర్మచేయక పోవుటయందు, సంగః - సంగత్వము, మా అస్తు - కలుగకూడదు.
కర్తవ్యకర్మము నాచారించుట యందే నీకు అధికారము గలదు కాని ఎన్నాటికినీ దాని ఫలముల యందులేదు. కర్మఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుటయందు నీవు ఆసక్తుడవు కావలదు. అనగా ఫలాపేక్షరహితుడై కర్తవ్యబుద్ధితో కర్మలనాచరింపుము.
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ !
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ! 48
యోగస్థః - కురు - కర్మాణి - సంగం - త్యక్త్వా - ధనంజయ
సిద్ధ్యసిద్ధ్యోః - సమః - భూత్వా - సమత్వం - యోగః - ఉచ్యతే
ధనంజయ - అర్జునా, సంగం - సంగమును, త్యక్త్వా - విడిచి, సిద్ధ్యసిద్ధ్యోః - సిద్ధిని పిలించినను పలించినను పలించకున్నను, సమః - సమానుడవు, భూత్వా - అయి, యోగస్థః - యోగమునందున్నవాడవై, కర్మాణి - కర్మలను, కురు - చేయుము, సమత్వం - సమబుద్ధి, యోగః - యోగముగా, ఉచ్యతే - చెప్పబడుచున్నది.
ఓ ధనంజయా ! యోగస్థితుడవై ఆసక్తిని వీడి, కార్యములు ఫలించినను ఫలించుకున్నను సమత్వ భావమును కలిగియుండి, కర్తవ్యకర్మలను ఆచరింపుము. ఈ సమత్వభావమునే యోగమందురు.
దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్దనంజయ !
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ! 49
దూరేణ - హి - అవరం - కర్మ - బుద్ధియోగాత్ - ధనంజయ
బుద్ధౌ - శరణం - అన్విచ్ఛ - కృపణాః - ఫలహేతవః
ధనంజయ - ధనుంజయా, బుద్ధియోగాత్ - బుద్ధియోగము కంటెను, కర్మ - కామ్యకర్మ, దూరేణ - మిక్కిలి, అవరం హి - తుచ్ఛమైనదికదా, ఫలహేతవః - ఫలము నాశించువారు, కృపణాః - కృపణులు, బుద్ధౌ - జ్ఞానము నందు, శరణం - ఆశ్రయమును, అన్విచ్ఛ - ఆశ్రయింపుము.
ఓ అర్జునా! ఈ సమత్వబుద్ధితో కూడిన నిష్కమ కర్మకంటే ప్రతిపలాపేక్షతో కూడిన సకామకర్మ తక్కువైనది. కాబట్టి నీవు సమత్వబుద్ధి యోగమునే ఆశ్రయింపుము. ఏలనన ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంతదీనులు, కృపణులు.
బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే !
తస్మాద్యోగాయ యుజ్యస్య యోగః కర్మసు కౌశలమ్ ! 50
బుద్ధియుక్తః - జహాతి - ఇహ - ఉభే - సుకృతదుష్కృతే
తస్మాత్ - యోగాయ - యుజ్యస్వ - యోగః - కర్మసు - కౌశలం
బుద్ధియుక్తః - సమత్వ బుద్ధియుక్తుడు, సుకృతదుష్కృతే ఉభే - పుణ్యపాపముల రెండింటిని, ఇహ - ఈ లోకమునందు, జహాతి - విడుచుచున్నాడు, తస్మాత్ - కనుక యోగాయ - యోగము కొరకు, యుజ్యస్వ - సిద్ధము కమ్ము, కర్మసు - కర్మలయందు, కౌశలం - కౌశలము, యోగః - యోగము.
సమస్త బుద్ధియుక్తుడైనవాడు పుణ్యపాపములను రెండింటిని ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వబుద్ధి రూపయోగమును అశ్రయింపుము. ఇదియే కర్మాచరణము నందు కౌశలము. ఇదియే యోగము.
కర్మజం బుద్ధియుక్తా ఫలం త్యక్త్వామనీషిణః !
జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయమ్ ! 51
కర్మజం - బుద్ధియుక్తాః - హి - త్యక్త్వా - మనీషిణః
జన్మబంధ - వినిర్ముక్తాః - పదం - గచ్చంతి - అనామయం
బుద్ధియుక్తాః - సమబుద్ధియుక్తలైన జ్ఞానులు, మనీషిణః - ఉత్తములు, కర్మజం - కర్మవలన పుట్టిన, ఫలం - ఫలితమును, త్యక్త్వా - విడిచి, జన్మబంధ వినిర్ముక్తాః - జన్మమనేడి బంధము నుండి విడువబడినవారై, అనామయం - దుఃఖరహితమైన, పదం - పదమును, గచ్చంతి హి - పొందుదురు.
ఏలనన సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి, జనన మరణబంధముల నుండి ముక్తులయ్యెదరు. అంతేగాక వారు నిర్వికారమైన మోక్షపదమును పొందుదురు.
యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి !
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ! 52
యదా - తే - మోహకలిలం - బుద్ధిః - వ్యతితరిష్యతి
తదా - గంతాసి - నిర్వేదం - శ్రోతవ్యస్య - శ్రుతస్య - చ
యదా - ఎప్పుడు, తే - నీయొక్క, బుద్ధిః - బుద్ధి, మోహకలిలం - మోహమనెడి మాలిన్యము నుండి, వ్యతితరిష్యతి - దాటగలదో, తదా - అప్పుడు, శ్రోతవ్యస్య - వినదగిన దానికిని, శ్రుతస్య చ - వినినదానికిని, నిర్వేదం - వైరాగ్యమును, గంతాసి - పొందగలవు.
మోహమనెడి మాలిన్యము నుండి పూర్తిగా బయటబడినప్పుడే నీవు వినిన, వినబోవు ఇహపరలోకసంబంధమైన సమస్తభోగములనుండి వైరాగ్యమును పొందగలవు.
శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా !
సమాధా వచలా బుద్ధిః తదా యోగమవాప్స్యాసి ! 53
శ్రుతివిప్రతిపన్నా - తే - యదా - స్థాస్యతి - నిశ్చలా
సమాధౌ - అచలా - బుద్ధిః - తదా - యోగం - అవాప్స్యసి
శ్రుతివిప్రతిపన్నా - నానావిధములైన మాటలను వినుటవలన, తే - నీ యొక్క, బుద్ధిః - బుద్ధి, నిశ్చలా - చలనములేనిదియై, అచలా - స్థిరముగా, సమాధౌ - సమాధియందు, యదా - ఎప్పుడు, స్థాస్యతి - స్వస్థత నొందియుండునో, తదా - అప్పుడు, యోగం - యోగమును, అవాప్స్యసి - ఏర్పడును.
నానా విధములైన మాటలను వినుటవలన విచలితమైన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా నిలిచి ఉన్నప్పుడే నీకు ఈ యోగము ఏర్పడును.
అర్జున ఉవాచ :-
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ !
స్థితధీః కిం ప్రభాపేత కిమాసీత వ్రజేత కిమ్ ! 54
స్థితప్రజ్ఞస్య - కా - భాషా - సమాధిస్థస్య - కేశవ
స్థితధీః - కిం - ప్రభాషేత - కిం - ఆసీత - వ్రజేత - కిం
కేశవ - కృష్ణా, సమాధిస్థస్య - సమాధిస్థతుడై, స్థితప్రజ్ఞస్య - స్థితప్రజ్ఞుని యొక్క భాషా - వాచకము, కా - ఏది, స్థితధీః - స్థిరబుద్ధిగల అట్టి పురుషుడు, కిం - ఏమి, ప్రభాషేత - భాషించును, కిం - ఎటుల, ఆసీత - కూర్చొనును. కిం - ఎటుల, వ్రజేత - నడుచును.
అర్జునుడు పలికెను - ఓ కేశవా ! సమాధిస్థితుడై పరమాత్మ ప్రాప్తినందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షనములేవ్వి? అతడు ఎట్లు భాషించును? ఎట్లు కూర్చొనును? ఎట్లు నడుచును?
శ్రీభగవాన్ ఉవాచ :-
ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ !
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ! 55
ప్రజహాతి - యదా - కామాన్ - సర్వాన్ - పార్థ - మనోగతాన్
ఆత్మని - ఏవ - ఆత్మనా - తుష్టః - స్థితప్రజ్ఞః - తదా - ఉచ్యతే
పార్థ - అర్జునా, యదా - ఎప్పుడు, మనోగతాన్ - మనస్సునందలి, సర్వాన్ - సమస్తమైన, కామాన్ - కోరికలను, ప్రజహాతి - విడచునో, ఆత్మనా - ఆత్మచేత, ఆత్మని ఏవ - ఆత్మ యందే, తుష్టః - సంతుష్టుడైనవానిని, తదా - అప్పుడు, స్థిజ్థిప్రజ్ఞః - స్థిత ప్రజ్ఞుడణి, ఉచ్యతే - అందరు.
శ్రీ భగవానుడు పలికెను ఓ అర్జునా ! మనస్సునందలి కోరికలన్నియును పూర్తిగా తొలగిపోయి, ఆత్మద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వానిని, అనగా పరమాత్మ సంయోగమువలన ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞుడని యందురు.
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః !
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ! 56
దుఃఖేషు - అనుద్విగ్నమనాః - సుఖేషు - విగతస్పృహః
వీతరాగభయక్రోధః - స్థితధీః - మునిః ఉచ్యతే
దుఃఖేషు - దుఃఖము ప్రాప్తించునపుడు, అనుద్విగ్నమనాః - కలతచెందని మనస్సు కల వాడును, సుఖేషు - సుఖము ప్రాప్తించినపుడు, విగత స్పృహః ఆశలేనివాడును, వీతరాగ భయక్రోధః - అనురాగము, భయము, క్రోధము వీడినవాడును అగు, మునిః - మనన శీలుడు, స్థితధీః - స్థితప్రజ్నుడని, ఉచ్యతే - అనబడును.
దుఃఖములకు క్రుంగిపోనివాడును, సుఖములకు పొంగిపోనివాడును, ఆసక్తిని, భయక్రోధములను వీడినవాడును ఐనట్టి మననశీలుడు (ముని) స్థితప్రజ్ఞుడన బడును.
యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ !
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠతా ! 57
యః - సర్వత్ర - అనభిస్నేహః - తత్ - తత్ - ప్రాప్య - శుభాశుభం
న - అభినందతి - న - ద్వేష్టి - తస్య - ప్రజ్ఞా - ప్రతిష్ఠితా
యః - ఎప్పుడు, సర్వత్ర - అంతటను, అనభిస్నేహః - మమతాసక్తులు లేనివాడును తత్ తత్ - ఆయా, శుభాశుభం - మంచిచెడులను, ప్రాప్య - పొంది, న - అభినందతి - సంతోషింపడో, న ద్వేష్టి - ద్వేషింపడో, తస్య - అట్టివాని యొక్క, ప్రజ్ఞా - బుద్ధి, ప్రతిష్ఠితా - స్థిరమైనది.
దేనియందును మమతాసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితులయందు ద్వేషము మొదలగు వికారములకు లోనుగాని వాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును.
యదా సంహరతే చాయం కూర్మోపాంగానీవ సర్వశః !
ఇంద్రియాణీం ద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ! 58
యదా - సంహరతే - చ - అయం - కూర్మః - అంగాని - ఇవ - సర్వశః
ఇంద్రియాణి - ఇంద్రియార్థేభ్యః - తస్య - ప్రజ్ఞా - ప్రతిష్ఠితా
యదా - ఎప్పుడు, అయం - ఇతడు, కూర్మః - తాబేలు, సర్వశః - అన్నివైపుల నుండి, అంగానీవ - అంగములను వలెనే, ఇంద్రియార్థేభ్యః - శబ్దాది విషయముల నుండి, ఇంద్రియాణి - ఇంద్రియములను, సంహరతే - ఉపసంహరించుకున్నాడో, తస్య - అతని, ప్రజ్ఞా - బుద్ధి, ప్రతిష్ఠితా - స్థిరమైనది.
తాబేలు తన అంగములను అన్నివైపుల నుండి లోనికి ముడుచుకొనునట్లుగా, ఇంద్రియములను విషయాదుల నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను.
విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః !
రసవర్జం రసోపాప్యస్య పరం దృష్ట్వానివర్తతే ! 59
విషయా - వినివర్తంతే - నిరాహారస్య - దేహినః
రసవర్జం - రసః - అపి - అస్య - పరం - దృష్ట్వా - నివర్తతే
నిరాహారస్య - విషయములను గ్రహించని, దేహినః - పురుషునకు, రసవర్జం - రాగరహితము గాకుండా, విషయాః - విషయములు, వినివర్తంతే - వైదొలగును, అస్య - ఇతనికి, పరం - పరమును, దృష్ట్వా - సాక్షాత్కారము అయినందువలన, రసః - రాగము, అపి - కూడా, నివర్తతే - తొలగిపోవును.
ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వానినుండి ఇంద్రి యార్థములు మాత్రము వైదొలగును. కాని వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందు వలన వాని నుండి ఆ ఆసక్తిగూడ తొలగిపోవును.
యతతో హ్యపీ కౌంతేయ పురుషస్య విపశ్చితః !
ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః ! 60
యతతః - హి - అపి - కౌంతేయ - పురుషస్య - విపశ్చితః
ఇంద్రియాణి - ప్రమాథీని - హరంతి - ప్రసభం - మనః
కౌంతేయ - అర్జునా, యతతః అపి - ప్రయత్నించినను, విపశ్చితః - వివేకియైన, పురుషస్య - పురుషుని యొక్క, మనః - మనస్సును, ప్రమాథీని - ప్రమాదమును కలిగించు, ఇంద్రియాణి - ఇంద్రియములు, ప్రసభం - బలవంతముగ, హరంతి హి - లాగికొని పోవుచునే యుండును.
కౌంతేయ - అర్జునా ! ఇంద్రియములు మహాశక్తి కలవి, మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను, ఆసక్తి తొలగిపోనంతవరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతంముగా లాగికొనిపోవుచునే యుండును.