భగవద్గీత పార్ట్ - 3

 

అథ ద్వితీయోపాధ్యాయః - సాంఖ్యయోగః
 


సంజయ ఉవాచ :-
తం తథా కృపయావిష్టమ్ అశ్రుపూర్ణాకులేక్షణమ్ !
విషీదంతమిదం వాక్యంమ్ ఉవాచ మధుసూదనః !  1


తం - తథా - కృపయా - ఆ విష్టం - అశ్రుపూర్ణాకులేక్షణం
విషీదంతం - ఇదం - వాక్యం - ఉవాచ - మధుసూదనః


తథా - ఆవిధముగా, కృపయా - కరుణచే, ఆ విష్టం - నిండియున్న వాడును, అశ్రు పూర్ణాకు లేక్షణం - కన్నీరు నిండిన వ్యాకులమైన నేత్రములు గలవాడును, విషీదంతం - శోకించు చున్నవాడును అగు, తం - అట్టి అర్జునుని, మధుసూదనః - శ్రీకృష్ణుడు, ఇదం - ఈ, వాక్యం - వచనమును, ఉవాచ - అనెను.


సంజయుడు పలికెను - ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన కనులలో అశ్రువులు నిండియున్న అర్జునునితో శ్రీకృష్ణభగవానుడు ఇట్లనెను.
           
శ్రీ భగవాన్ ఉవాచ :-
కుతస్త్వాకశ్మలమిదం విషమే సముపస్థితమ్ !
అనార్యజుష్టమస్వర్గ్యమ్ అకీర్తికర మర్జున !  
2

కుతః - త్వా - కశ్మలం - ఇదం - విషమే - సముపస్థితం
అనార్యజుష్టం - అస్వర్గ్యం - అకీర్తికరం - అర్జున


అర్జున - హే అర్జునా, అనార్యజుష్టం - శ్రేష్టులగువారికి తగనిదియు, అస్వర్గ్యం - స్వర్గమునకు అనర్హమైనదియు, అకీర్తికరం - అపకీర్తి నొనగూర్చునదియు, ఇదం - ఈ, కశ్మలం - అజ్ఞానము, విషమే - విషమ సమయము నందు, త్వా - నిన్ను, కుతః - ఎచ్చటనుండి, సముపస్థితం - దాపురించినది.

శ్రీభగవానుడు చెప్పెను - ఓ అర్జునా ! పామరులకు కలిగే, స్వర్గ పాప్తి ఇవ్వనిది, అపకీర్తి కలుగచేసే ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది?

క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే !
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ట పరంతప !  
3

క్లైబ్యం - మా స్మ గమః - పార్థ - న - ఏతత్ - త్వయి - ఉపపద్యతే
క్షుద్రం - హృదయదౌర్బల్యం - త్యక్త్వా - ఉత్తిష్ఠ - పరంతప

పార్థ - హే అర్జునా, క్లైబ్యం - నపుంసకత్వంమును, మా స్మ గమః - పొందకుము, ఏతత్ - ఇది, త్వయి - నీ విషయమున, న ఉపపద్యతే - తగదు, పరంతప - హే పరంతపా, క్షుద్రం - తుచ్చమైన, హృదయదౌర్భల్యం - హృదయ దుర్బలత్వమును, త్యక్త్వా - విడిచిపెట్టి, ఉత్తిష్ఠ - లెమ్ము 

కావున ఓ అర్జునా ! పిరికితనమునకు లోనుకావద్దు. నీకిది ఉచితము కాదు. ఓ పరంతపా ! తుచ్ఛమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి, యుద్దముచేయుము.

అర్జున ఉవాచ :-
కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన !
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన    4

కథం - భీష్మం - అహం - సంఖ్యే - ద్రోణం - చ - మధుసూదన
ఇషుభిః - ప్రతి - యోత్స్యామి - పూజార్హి - అరిసూదన

 
మధుసూదన - హే కృష్ణా, అహం - నేను, పూజార్హౌ - పూజింపదగిన, భీష్మం - భీష్మపితా మహిని, చ - మరియు, ద్రోణం - ద్రోణాచార్యుని, సంఖ్యే - యుద్ధమునందు, అరిసూదన - శ్రీకృష్ణ,ఇషుభిః - శరీరములతో, కథం - ఏ విధముగ, ప్రతియోత్యామి - ఎదురించి పోరాడగలను.

అర్జునుడు పలికెను - ఓ మధుసూదనా ! పూజ్యులైన భీష్మపితామహుని, ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు ఎదురించి పోరాడగలను.


గురూనహత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్యమహీహ లోకే !
హత్వార్థకామాంస్తు గురూనిహైవ
భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్    5

గురూన్ - అహత్వా - హి - మహానుభావాన్ - శ్రేయః - భోక్తుం - భైక్ష్యం - అపి - ఇహ - లోకేహత్వా -అర్థకామాన్ - తు - గురూన్ - ఇహ -ఏవ - భుంజీయ - భోగాన్ - రుధిరప్రదిగ్ధాన్
 
మహానుభావాన్ - మహానుభావులైన, గురూన్ - గురువులను, అహత్వా - చంపక, ఇహలోకే - ఈ లోకమునందు  భైక్ష్యమపి - భిక్షాన్నమైనను, భోక్తుం - భుజించుట, శ్రేయః హి - శ్రేయస్కరము గదా, గురూన్ - గురువులను, హత్వా తు - చంపి, ఇహ ఏవ - ఈ లోకమునందే, రుధిర ప్రదిగ్ధాన్ - రక్తసిక్తమైన, అర్థకామాన్ - అర్థకామములనే, భోగాన్ - భోగములను, భుంజీయ - అనుభవింతును.

మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొని యైనను ఈ లోకమున జీవించుట శుభదాయకము. ఏలనన ఈ గురుజనులను చంపినను, రక్తసిక్తములైన రాజ్యసంపదలను, భోగములను మాత్రమే నేను అనుభవింతును గదా !

న చైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వాజయేమ యది వా నోజయేయుః !
యానేవ హత్వా న జిజీవిషామః
తెపావస్థితాః ప్రముఖే ధార్తారాష్ట్రాః !    6

న - చ - ఏతత్ - విద్మః - కతరత్ - నః - గరీయః - యత్ - వా - జయేమ - యది - నః - జయేయుః
యాన్ - ఏవ - హత్వా - చంపి, న జిజీవిషామః - జీవింపగోరమో, తే - అట్టి, ధార్త రాష్ట్రాః


యాన్ - ఎవరిని, హత్వా - చంపి, న జిజీవిషామః - జీవింపగోరమో, తే - అట్టి, ధార్త రాష్ట్రాః - ధృతరాష్ట్ర సంబంధులు, ప్రముఖే - ఎదుట, అవస్థితాః ఏవ - ఉన్నారు గదా, జయేమ యద్వా - మనము జయించినను, నః - మమ్ములను, జయేయుఃయది వా - వారే గెలిచినాను, ఏతత్ - చ - ఈ విషయమును కూడా, నః - మాకు, కతరత్ - ఏది, గరీయః - శ్రేష్టమో, న విద్యః - మేమెరుగము.

ఈ యుద్ధము చేయుట శ్రేష్ఠమా ? లేక చేయకుండుట శ్రేష్ఠమా ? అనునది ఎరుగము. యుద్ధమున వారిని మనము జయింతుమా? లేక మనలను వారు జయింతురా? అను విషయమును గూడ ఎరుగము. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇచట మనలను ఎదిరించి యుద్ధముచేయ నిలిచి యున్నారు.

కార్పణ్య దోషాపహతస్వభావః
అప్పచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః
యచ్చ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేపా హంశాధి మాం త్వాం ప్రపన్నమ్   7

కార్పణ్య దోషాపహత స్వభావః - పృచ్ఛామి - త్వాం - ధర్మసమ్మూఢ చేతాః
యత్ - శ్రేయః - స్యాత్ - నిశ్చితం - బ్రూహి - తత్ - మే - శిష్యః - తే - అహం - శాధి - మాం - త్వాం - ప్రపన్నం


కార్పణ్య - కృపణత్వమనెడి, దోష - దోషముచేత, ఉపహత - కొట్టబడిన, స్వభావః - ప్రకృతి గలవాడనై, ధర్మ సమ్మూఢచేతాః - ధర్మవిచక్షణ చేయలేని చిత్తముగలవాడనై, త్వాం - నిన్ను, పృచ్ఛామి - అడుగుచున్నాను, యత్ - ఏది, నిశ్చితం - నిర్ణయింపబడి, మే - నాకు, శ్రేయః - శ్రేయము, స్యాత్ - అగునో, తత్ - అద్దానిని, బ్రూహి - చెప్పుము, అహం - నేను, తే - నీకు, శిష్యః - శిష్యుడును, త్వాం - నిన్ను, ప్రపన్నం - శరణుపొందిన, మాం - నన్ను, శాధి - శాసింపుము.

కార్పణ్య దోషము పిరికితనమునకు నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా  కర్తవ్యమును నిర్ణయించు కొనలేకున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను. శరణాగతుడను, శాసింపుము.

నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్
యచ్ఛోకముచ్ఛోషనమింద్రియాణామ్ !
అవాప్య భూమావసపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్    8

న - హి - ప్రపశ్యామి - మమ - అపనుద్యాత్ - యత్ - శోకం - ఉచ్చోషణం - ఇన్ద్రియాణాం
అవాప్య - భూమౌ - అసపత్నం - ఋద్ధం - రాజ్యం - సురాణాం - అపి - చ - ఆధిపత్యం


భూమౌ - భూమియందు, అసపత్నం - తిరుగులేని, ఋద్ధం - సమృద్ధమైన, రాజ్యం - రాజ్యమును, సురాణాం - దేవతల యొక్క, ఆధిపత్యం - తిరుగులేని, ఋద్ధం - సమృద్ధమైన, రాజ్యం - రాజ్యమును, సురాణాం - దేవతల యొక్క, ఆధిపత్యం చ అపి - ఆధిపత్యమునూ అవాప్య - పొందియును, ఇంద్రియాణాం - ఇంద్రియములను, ఉచ్చోషణం - శోషింప జేయు, మమ - నా యొక్క, శోకం - దుఃఖమును, యత్ - ఏది, అపనుద్యాత్ - పోగొట్టునో, ప్రపశ్యామి హి - తెల్సుకోలేకున్నాను.

ఈ శోకము నా ఇంద్రియములను దహించివేయు చున్నది. సిరిసంపదలతో గూడిన శత్రువులు లేని రాజ్యము లభించునను, కడకు సురాధిపత్యము ప్రాప్తించినను ఈ శోకదాహము చల్లారునుపాయమును తెలిసికోలేకున్నాను.

సంజయ ఉవాచ :-
ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప !
న యోత్స్య ఇతి గోవిందమ్ ఉక్త్వా తూష్ణీం బభూవ హ  9

ఏవం - ఉక్త్వా - హృషీకేశం - గుడాకేశః - పరంతపః
న - యోత్స్యే - ఇతి - గోవిందం - ఉక్త్వా - తూష్ణీం - బభూవ - హ


పరంతపః - శత్రువులను తపింపజేసెడి, గుడాకేశః - అర్జునుడు, హృషీకేశం - హృషీకేశుని, గోవిందం - గోవిందునితో, ఏవం - ఈ విధముగా, ఉక్త్వా - పలికి, న యోత్స్యే - యుద్ధము చేయును, ఇతి - అని, ఉక్త్వా - పలికి, తూష్ణీం బభూవ హ - మౌనముగా వుండెను.

సంజయుడు పలికెను - ఓ రాజా! ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామియైన శ్రీకృష్ణునితో అర్జునుడు, నేను యుద్ధము చేయనే చేయను అని స్పష్టముగా చెప్పి, మౌనము వహించెను.

తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత !
సేనయోరుభాయోర్మధ్యే విశీదంతమిదం వచః !  10

తం - ఉవాచ - హృషీకేశః - ప్రహసన్ - ఇవ - భారత
సేనయోః - ఉభయోః - మధ్యే - విషీదంతం - ఇదం - వచః 


భారత - భరతవంశజుడవైన ద్రుతరాష్ట్రా, ఉభయోః - రెండైన, సేనయోః  సేనలయొక్క, మధ్యే - నడుమ, విషీదంతం - శోకించుచున్న, తం - ఆ అర్జునుని గూర్చి, హృషీకేశః - శ్రీ కృష్ణుడు, ప్రహసన్ ఇవ - నవ్వుచున్నవానివలె, ఇదం - ఈ వాక్యమును, ఉవాచ - పలికెను.

ఓ ధృతరాష్ట్రా ! ఇరుసేనల మధ్య శోకితుడైన అర్జునుని జూచి, శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇట్లు పలికెను.

అశోచ్యానన్వ శోచాస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే !
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః !  11

అశోచ్యాన్ - అన్వశోచః - త్వం - ప్రజ్ఞావాదాన్- చ - భాషసే
గతాసూన్ - అగతాసూన్ - చ - న - అనుశోచంతి - పండితాః


త్వం - నీవు, అశోచ్యాన్ - శోకింపదగనివారిని గూర్చి, అన్వశోచః - శోకించుచున్నావు, ప్రజ్ఞావాదాన్ చ - పండిత వచనములను, భాషసే - భాషించుచున్నావు, గతాసూన్ - ప్రాణము పోయినవారిని గూర్చిగాని, అగతాసూన్ - ప్రాణము పోనివారిని గూర్చిగాని, పండితాః - పండితజనులు, న అనుశోచంతి - శోకింపరు.

శ్రీభగవానుడు పలికెను - ఓ అర్జునా! శోకింపదగని వారికొరకై నీవు శోకించుచున్నావు. పైగా జ్ఞాని వలే మాట్లాడుచున్నావు. జ్ఞానులైనవారు ప్రాణములు పోయిన వారిని గూర్చిగాని, ప్రాణములు పోని వారిని గుఱించి గాని శోకింపరు.

న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః !
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ !  12

న - తు - ఏవ - అహం - జాతు - న - ఆసం - న - త్వం - న - ఇమే - జనాధిపాః
న - చ - ఏవ - న - భవిష్యామః - సర్వే - వయం - అతః - పరం


అహం - నేను, జాతు - ఒకప్పుడు, న ఆసం - లేను, త్వం - నీవు, న - లేవు, ఇమే - ఈ, జనాధిపాః - రాజులును, న - లేరు అనునది, న తు ఏవ - లేనేలేదు, అతఃపరం - ఇకపిమ్మట, వయం సర్వే - మనమంతా, న భవిష్యామః - లేకపోవుట అనునది యును, న చ ఏవ - లేనేలేదు.

నీవుగాని, నేనుగాని, ఈ రాజులుగాని ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడ మనము ఉండము అనుమాటయే లేదు. (అన్ని కాలములలోను మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతము, అది అన్ని  కాలముల యందును ఉండును. శరీరపతనముతో అది నశించునది కాదు.)

దేహినోపాస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా!
తథా దేహాంతరప్రాప్తిః  ధీరస్తత్ర న ముహ్యతి   13

దేహినః - అస్మిన్ - యథా - దేహే - కౌమారం - యౌవనం - జరా
తథా - దేహాంతరప్రాప్తిః  ధీరః - తత్ర - న - ముహ్యతి


దేహినః - జీవునకు, అస్మిన్ - ఈ, దేహే - దేహమునందు, కౌమారం - బాల్యమును, యౌవనం - యౌవనమును, జరా - ముసలితనమును, యథా - ఏవిధముగా కలుగునో, తథా - అలాగుననే, దేహాంతరప్రాప్తిః  - మరణము మరొక శరీరమును పొందుట, తత్ర - ఆ విషయమున, ధీరః - ధీరపురుషుడు, న ముహ్యతి - మోహము నొందడు.

జీవునకు ఈ దేహమునందు కౌమారము, యౌవనము, వార్ధక్యము ఉన్నట్లే మరణాంతరమున మఱియొక దేహప్రాప్తియు కలుగును. ధీరుడైనవాడు ఈ విషయమున మోహమునొందడు.

మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః !
ఆగమాపాయినోపానిత్యాః తాంస్తితిక్షస్వ భారత !  14

మాత్రా స్పర్శాః - తు - కౌంతేయ - శీతోష్ణసుఖదుఃఖదాః
ఆగమాపాయినః - అనిత్యాః - తాన్ - తితిక్షస్వ - భారత


కౌంతేయ - కుంతీకుమారా, మాత్రా స్పర్శాః - శోత్రాదీంద్రియములు, శబ్దాది విషయముల సంయోగము, తు - అయితే, శీతోష్ణసుఖదుఃఖదాః - శీతోష్ణ సుఖదుఃఖములనున కల్గించు నవియును, ఆగమాపాయినః - క్షణభంగురము లైనవియును, అనిత్యాః - అనిత్యమైనవి, భారత - హే అర్జునా, తాన్ - వీనిని, తితిక్షస్వ - సహించుము.

ఓ కౌంతేయా ! విషయేంద్రియసంయోగామువలన శీతోష్ణములు సుఖదుఃఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు. అనిత్యములు. కనుక భారతా ! వాటిని సాహింపుము.(పట్టించుకొనకుము)

యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ !
సమదుఃఖసుఖం ధీరం సోపామృతత్వాయ కల్పతే   15

యం - హి - న - వ్యథయంతి - ఏతే - పురుషం - పురుషర్షభ
సమదుఃఖ సుఖం - ధీరం - సః - అమృతత్వాయ - కల్పతే


పురుషర్భభ - ఓ పురుషశ్రేష్ఠా, ఏతే - ఈ మాత్రాస్పర్శములు, సమదుఃఖసుఖం - సుఖ దుఃఖముల యందు సమానబుద్ధి కలిగిన, ధీరః - ధీరుడైన, యం - పురుషం - ఏ పురుషుని, న వ్యథయంతి - చలింపజేయువు, సః హి - అట్టివాడు కదా, అమృతత్వాయ - అమృతత్వమును పొందుటకు, కల్పతే - అర్హుడు.

అర్జునా ! ఓ పురుషశ్రేష్ఠా ! ధీరుడైన వానికి సుఖదుఃఖములు సమానముగా తోచును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపజేయజాలవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు.

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః !
ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తాత్త్వదర్శిభిః  !  16

న - అసతః - విద్యతే - భావః - న - అభావః - విద్యతే - సతః
ఉభయోః - అపి - దృష్టః - అంతః - తు - అనయోః  - తత్త్వదర్శిభిః 


అసతః - అనిత్యమైనడానికి, భావః - ఉనికి, న విద్యతే - లేదు, సతః - సత్యమైన దానికి, అభావః - లేకపోవుట, న విద్యతే - లేదు, అనయోః - ఈ, ఉభయోః అపి - రెండింటియొక్క, అంతుః  తు - నిర్ణయము, తత్త్వదర్శిభిః  తత్వజ్ఞులచేత, దృష్టః - దర్శించబడినది

అనిత్యమైనడానికి ఉనికియే లేదు. సత్యమైన ఆత్మకులేమి అనునదిలేదు. ఈ విధముగ ఈ రెండింటి యొక్క వాస్తవ రూపములను తత్త్వజ్ఞానియైనవాడే దర్శించును.

అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ !
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి !  17

అవినాశి - తు - తత్ - విద్ధి - యేన - సర్వం - ఇదం - తతం
వినాశం - అవ్యయస్య - అస్య - న - కశ్చిత్ - కర్తుం - అర్హతి


యేన - దేనిచేత, ఇదం - ఈ, సర్వం - సర్వమును, తతం - వ్యాపించి యున్నదో, తత్ తు - అది, అవినాశి - నాశారహితమైనదిగ, విద్ధి - తెలిసికొనుము, కశ్చిత్ - ఎవడును, అవ్యయస్య - నశించని, అస్య - దీనికి, వినాశం - నాశనము, కర్తుం - చేయుటకు, న అర్హతి - అర్హుడు కాడు.

నాశరహితమైన పరమాత్మ తత్త్వము జగత్తునందు అంతటను వ్యాపించియున్నదని యెరుంగము. శాశ్వతమైన దానినెవ్వరును నశింపజేయజాలరు.

అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శారీరిణః !
అనాశినోపాప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత ! 18

అంత వంత - ఇమే - దేహాః - నిత్యస్య - ఉక్త్వాః - శారీరిణః
అనాశినః - అప్రమేయస్య - తస్మాత్ - యుధ్యస్వ - భారత 


నిత్యస్వ - నిత్యుడను, అనాశివః - అవినాశియు, అప్రమేయస్య - అప్రమేయుడును, శరీరిణః - దేహి యొక్క, ఇమే - ఈ, దేహాః - దేహములు, అంతవంతః - నాశము కలవని, ఉక్త్వాః - చెప్పబడినవి, తస్మాత్ - అందుచేత, భారత - అర్జునా, యుధ్యస్య - యుద్ధము చేయుము.

ఓ అర్జునా ! ఈ శరీరములు అన్నియును నశింపచునవియే. కాని జీవాత్మ నాశరహితము కనుక నీవు యుద్ధము చేయుము.

య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్ !
ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే !   19

యః ఏనం - వేత్తి - హంతారం - యః - చ - ఏనం - మన్యతే - హతం
ఉభౌ - తౌ - న - నిజానీతః - న - అయం - హంతి - న - హన్యతే


యః - ఎవ్వడు, ఏనం - ఈ ఆత్మను, హంతారం - చంపుదానినిగ, మన్యతే - భావించునో, తౌ - ఆ, ఉభౌ - ఇరువురును, న విజానీతః - అజ్ఞానులే, అయం - ఈ ఆత్మ, న హంతి - చంపదు, న హన్యతే - చంపబడేది గాదు.

ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, ఆత్మ ఇతరులచే చంపడునని భావించువాడును, ఆ ఇద్దఱును అజ్ఞానులే. ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరిచేతను చంపబడేది కాదు.

న జాయతే మ్రియతే వా కదాచిత్
నాయం భూత్వా భవితా వా న భూయః !
అజోనిత్యః శాశ్వతోపాయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే !    20

న - జాయతే - మ్రియతే - వా - కదాచిత్ - న - అయం - భూత్వా - భవితా - వా - న - భూయః
అజః - నిత్యః - శాశ్వతః - అయం - పురాణః న - హన్యతే - హన్యమానే - శరీరే


అయం - ఈ ఆత్మ, కదాచిత్ - ఎప్పుడును, న జాయతే - పుట్టదు, న మ్రియతే వా - మృతినొందదు, న భూత్వా - లేకనే, భూయః - మరల, భవితా న - ఉండునదియు కాదు, అయం - ఈ ఆత్మ, అజః - పుట్టుక లేనిది, నిత్యః - స్థిరమైనది, శాశ్వతః - నిత్యమైనది, పురాణః - అనాదియైనది, శరీరే - శరీరము, హన్యమానే - చంపబడుచున్నను, న హన్యతే - చావదు.

ఆత్మకు చావుపుట్టుకలు లేవు. ఇది జన్మ లేనిది. నిత్యము, శాశ్వతము, పురాతనము, శరీరము చంపబడినను ఇది చావదు.

వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ !
కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ !   21

వేద అవినాశినం - నిత్యం - యః - ఏనం - అజం - అవ్యయం
కథం - సః పురుషః - పార్థ - కం - ఘాతయతి - హంతి - కం


పార్థ - హే పార్థా, యః - ఎవడు, ఏనం - ఈ ఆత్మను, నిత్యం - ఎల్లప్పుడు ఉండు నదిగను, అవినాశినం - నాశనములేని దానినిగను, అజం - పుట్టుకలేని దానినిగను, అవ్యయం - అక్షయమైన దానినిగను , వేద - తెలిసికొనచున్నాడో, సః - పురుషః - పురుషుడు, కం - ఎవనిని, కథం - ఎట్లు, ఘాతయతి - చంపించును, కం - ఎవనిని, హంతి - చంపును

ఓ పార్థా! ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు, జననమరణములు లేనిదనియు,మార్పులేనిదనియు తెలిసికొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును? ఎవరిని ఎట్లు చంపును?

వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపాపరాణి  !
తథా శరీరాణి విహాయ జీర్ణా
న్యన్యాని సంయాతి నవాని దేహీ !  22

వాసాంసి జీర్ణాని - యథా - విహాయ - నవాని - గృహ్ణాతి - నరః - అపరాణి
తథా - శరీరాణి - విహాయ - జీర్ణాని - అన్యాని - సంయాతి - నవాని - దేహీ


యథా - ఏప్రకారము, నరః - మనుష్యుడు, జీర్ణాని - చినిగిన, వాసాంసి - వస్త్రములను, విహాయ - విడిచి, అపరాణి - అన్యమైన, నవాని - నూతనమైన వానిని, గృహ్ణాతి - ధరించినట్లు, తథా - అలాగుననే, దేహీ - జీవుడు, జీర్ణాని - శిథిలములైన, శరీరాణి - శరీరములను, విహాయ - విడిచి, నవాని - నూతనమైన, అన్యాని - అన్యములైన శరీరములను, సంయాతి - ధరించుచున్నాడు.

మానవుడు చిరిగినా పాతబట్టలను వదిలి, కొత్తబట్టలను ధరించినట్లు జీవాత్మపాతశరీరములను వీడి నూతన శరీరములను పొందుతోంది.

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః !
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః !  23

న - ఏనం - ఛిందంతి - శస్త్రాణి - న - ఏనం - దహతి - పావకః
న - చ - ఏనం - క్లేదయంతి - ఆపః - న - శోషయతి - మారుతః !


ఏనం - ఈ ఆత్మను, శస్త్రాణి - శస్త్రములు, న ఛిందంతి - చేదింపజాలవు, ఏనం - ఈ ఆత్మను, పావకః - అగ్ని, న దహతి - దహింపజాలదు, చ - మరియు, ఏనం - ఈ ఆత్మను, ఆపః - నీరు, నక్లేదయంతి - తడుపలేదు, మారుతః - గాలి, న శోషయతి - ఎండింపజాలదు.

ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు, నీరు తడుపుజాలదు. వాయువు ఎండింపజాలదు.

అచ్ఛేద్యోపాయమదాహ్యోపాయమ్ అక్లేద్యోపాశోష్య ఏవ చ !
నిత్యః సర్వగతః స్థాణుః అచలోపాయం సనాతనః !   24

అచ్ఛేద్యః - అయం - అదాహ్యః - అయం - అక్లేద్యః - అశోష్యః - ఏవ - చ
నిత్యః - సర్వగతః - స్థాణుః - ఆచలః - అయం - సనాతనః


అయం - ఈ ఆత్మ, అచ్ఛేద్యః - ఛేదింపరానిది, అయం - ఈ ఆత్మ, ఆదాహ్యః - దహింపరానిది, అక్లేద్యః - తడుపరానిది, అశోష్యః ఏవ చ - శోషింపసాధ్యము కానిది. అయం - ఇది, నిత్యః - నిత్యమైనది, సర్వగతః - అంతటను వ్యాపించినది, స్థాణుః - స్థిరమైనది, అచలః - చలనములేనిది, సనాతనః - శాశ్వతమైనది.

ఈ ఆత్మ ఛేదించరానిది, దహింపరానిది, తడుపుటకును, శోషింపజేయుటకును సాధ్యము కానిది. ఆత్మ నిత్యమైనది. సర్వవ్యాప్తిచెందినది, చలింపనిది స్థిరమైనది సనాతనమైనది.

అవ్యక్తోపాయమచింత్యోపాయమ్ అవికార్యోపాయముచ్యతే !
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి !   25

అవ్యక్తః - అయం - అచింత్యః - అయం - అవికార్యః - అయం - ఉచ్యతే
తస్మాత్ - ఏవం - విదిత్వా - ఏనం - న - అనుశోచితుం - అర్హసి


అయం - ఈ ఆత్మ, అవ్యక్తః - వ్యక్తము కానిది, అయం - ఇది, అచింత్యః - మనస్సునకు అందనిది, అయం - ఈ ఆత్మ, అవికార్యః - వికారము లేనిదిగా, ఉచ్యతే - చెప్పబడుచున్నది. తస్మాత్ - అందువలన, ఏనం - ఈ ఆత్మను, ఏవం - ఇట్లు, విదిత్వా - తెలిసికొని, అనుశోచితుం - విలపించుటకు, న అర్హసి - తగవు

ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరముగానిది. మనస్సునకును అందనిది. వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలిసికొనుము. కనుక ఓ అర్జునా ! నీవు దీనికి శోకింపదగవు.

అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ !
తథాపి త్వం మహాబాహో నైవంశోచితుమర్హసి !   26

అథ - చ - ఏనం - నిత్యజాతం - నిత్యం - వా - మన్యసే - మృతం
తథాపి - త్వం - మహాబాహో - న - ఏవం - శోచితుం - అర్హసి


మహాబాహో - అర్జునా, త్వం - నీవు, ఏనం - ఈ ఆత్మను, నిత్యజాతం - నిత్యము పుట్టుచున్న దానినిగను, నిత్యం - నిత్యమును, మృతం వా - నశించుచున్న దానినిగను, అథ మన్యసే చ - భావించినప్పటికిని, తథాపి - అట్లయినను, ఏవం - ఈ విధముగ, శోచితుం - శోకింప, న అర్హసి - తగవు.

ఓ అర్జునా ఒక వేళ ! ఈ ఆత్మకు జననమరణములు కలవని నీవు భావించినప్పటికిని దీనికై నీవు శోకింపదగదు.

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్యచ !
తస్మాదపరిహార్యేపార్ధే న త్వం శోచితుమర్హసి !   27

జాతస్య - హి - ధ్రువః - మృత్యుః - ధ్రువం - జన్మ - మృతస్య - చ
తస్మాత్ - అపరిహర్యే - అర్థే - న - త్వం - శోచితుం - అర్హసి 


జాతస్య - పుట్టినప్రతి వానికి, మృత్యుః - చావు, ధ్రువః హి - తప్పదు, మృతస్య - మృతి చెందిన వానికి, జన్మచ - పుట్టుకయు, ధ్రువం - తప్పదు, తస్మాత్ - అందువలన, అపరిహార్యే - అనివార్యమగు, అర్థే - విషయము నందు, త్వం - నీవు, శోచితుం - శోకింప, న అర్హసి - తగవు.

పుట్టిన ప్రతివానికి మరణము తప్పదు. మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక తప్పనిసరియైన ఈ విషముల యందు నీవు శోకింపదగదు.

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత !
అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా!   28

అవ్యక్తాదీని - భూతాని - వ్యక్తమధ్యాని - భారత
అవ్యక్త నిధనాని - ఏవ - తత్ర - కా - పరిదేవనా 


భారత - అర్జునా, భూతాని - ప్రాణులు, అవ్యక్తాదీని - పుట్టుటకుముందు గోచరించనినియు, వ్యక్తమధ్యాని - మధ్యన గోచరించుననియు, అవ్యక్త నిధనాని ఏవ - మరణానంతరము కూడ అవి అగోచరములే, తత్ర - అట్టి విషయమున, పరిదేవనా - దుఃఖము, కా - ఏల?

ఓ అర్జునా ! ప్రాణులన్నియును పుట్టుకకుముందు ఇంద్రియ గోచరములు గావు - మరణానంతరము గూడ అని అగోచరముల మధ్యకాలము నందు మాత్రమే అవి గోచరములు అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట వలన ప్రయోజనము లేదు.

ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమ్
ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః !
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ !  29

ఆశ్చర్యవత్ - పశ్యతి - కశ్చిత్ - ఏనం - ఆశ్చర్యవత్ - వదతి - తథా - ఏవ - చ - అన్యః
ఆశ్చర్యవత్ - చ - ఏనం - అన్యః - శృణోతి - శ్రుత్వా - అపి - ఏనం - వేద - న - చ - ఏవ - కశ్చిత్


కశ్చిత్ - ఒకానొకడు, ఏనం - ఈ ఆత్మను, ఆశ్చర్యవత్ - ఆశ్చర్యమైన దానినివలె, పశ్యతి - గాంచుచున్నాడు, తథా ఏవ - అలాగుననే, అన్యః చ - మరియొకడు, ఏనం - ఈ ఆత్మను, ఆశ్చర్యవత్ - ఆశ్చర్యమైన దానివలె, వదతి - పలుకుచున్నాడు, అన్యః చ వేరొకడు, ఏనం - ఈ ఆత్మను, ఆశ్చర్యవత్ - ఆశ్చర్యమైన దానివలె, శృణోతి - ఆలకించుచున్నాడు, శృత్వా - వినియును, కశ్చిత్ అపి చ - ఎవ్వడును, ఏనం - ఈ ఆత్మను, న వేద ఏవ - ఎరుగరు.

ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక మహాత్ముడు దీని తత్త్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో, చూచినవారిలో కూడ కొందరు దీనిని గూర్చి ఏమియు పూర్తిగా ఎరుగరు.

దేహీ నిత్యమవధ్యోపాయం దేహే సర్వస్య భారత !
తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి !    30

దేహీ - నిత్యం - అవధ్యః - అయం - దేహే - సర్వస్య - భారత
తస్మాత్ - సర్వాణి - భూతాని - న - త్వం - శోచితుం - అర్హసి


భారత - అర్జునా, సర్వస్య - ప్రతివాని యొక్క, దేహే - దేహమునందు, అయం - ఈ, దేహీ - ఆత్మ, నిత్యం - నిత్యమును, అవధ్యః - వధించబడనిది, తస్మాత్ - అందుచేత,సర్వాణి - సమస్తమైన, భూతాని - ప్రాణులకొరకు, త్వం - నీవు, శోచితుం - శోకించుటకు,న అర్హసి - తగవు.

ఓ అర్జునా ! ప్రతిదేహమునందు ఉండెడి ఈ ఆత్మచంప వీలుకానిది. కనుక ఏ ప్రాణిని గూర్చియైనను నీవు శికింపదగదు.

స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి !
ధర్మ్యాద్ది యుద్ధాచ్చ్రేయోపాన్యత్ క్షత్రియస్య న విద్యతే !   31

స్వ ధర్మం - అపి - చ - అవేక్ష్య - న - వికంపితుం - అర్హసి
ధర్మ్యాత్ - హి - యుద్ధాత్ - శ్రేయః - అన్యత్ - క్షత్రియస్య - న - విద్యతే


స్వధర్మం అపి - స్వధర్మమునైనను; అవేక్ష్య చ - గాంచి, వికంపితుం - చలించుటకు, న అర్హసి - తగవు, క్షత్రియస్య - క్షత్రియునకు, ధర్మ్యాత్ - ధర్మయుతమైన, యుద్ధాత్ - యుద్ధము కంటే, అన్యత్ - అన్యమైన, శ్రేయః - శ్రేయస్సు, న విద్యతే హి - ఏదియును లేదు.

అంతేగాక స్వధర్మమును బట్టియు నీవు భయపడనక్కర లేదు. ఏలననగా క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మఱియొక విషయము ఏదియును లేదు.

యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ !
సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్దమీదృశమ్ !   32

యదృచ్ఛయా - చ - ఉపపన్నం - స్వర్గద్వారం - అపావృతం
సుఖినః - క్షత్రియాః - పార్థ - లభంతే - యుద్ధం - ఈదృశం


పార్థ - అర్జునా, యదృచ్ఛయా - అనుకోకుండా, ఉపపన్నం - లభించినదియు, అపావృతం - తెరువబడినదియైన, స్వర్గద్వారం - స్వర్గద్వారము గలదియు, ఈ దృశం చ - ఇటువంటిదియైన, యుద్ధం - యుద్ధమును, సుఖినః - సుఖవంతులైన, క్షత్రియాః - క్షత్రియులు, లభంతే - లభించును.

అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమును తెఱచిన ద్వారము వంటిది.

అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి !
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి !    33
 
అథః - చేత్ - త్వం - ఇమం - ధర్మ్యం - సంగ్రామం - న - కరిష్యసి
తతః - స్వధర్మం - కీర్తిం - చ - హిత్వా - పాపం - అవాప్స్యసి


అథ - మరియు, త్వం - నీవు, ధర్మ్యం - ధర్మయుతమైన, ఇమం - ఈ, సంగ్రామం - యుద్ధమును, న కరిష్యసి చేత్ - ఆచరింపకున్నచో, తతః - అందువలన, స్వధర్మం - స్వధర్మమును, కీర్తించ - కీర్తిని, హిత్వా - పోగొట్టుకొని, పాపం - పాపమును, అవాప్స్యసి - చేసినవాడవగుదువు.

ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పాఱిపోయినవాడవు అగుదువు. దానివలన నీవు కీర్తిని కోల్పోయి, పాపము చేసినవాడవగుదువు.

అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేపావ్యయామ్ !
సంభావితస్య చాకీర్తిః  మరణాదతిరిచ్యతే !    34

అకీర్తిం - చ - అపి - భూతాని - కథయిష్యంతి - తే - అవ్యయాం
సంభావితస్య - చ - అకీర్తిః - మరణాత్ - అతిరిచ్యతే


చ - మరియు, అపి - కూడా, భూతాని - లోకులు, తే - నీ యొక్క, అవ్యయాం - శాశ్వతమైన, అకీర్తిం - అపకీర్తిని, కథయిష్యంతి - చిలువలుపలువలుగా చెప్పుకొందురు. సంభావితస్య - మాననీయునకు, అకీర్తిః  - అపకీర్తి, మరణాత్ చ - మరణము కంటెను, అతిరిచ్యతే - మేలు.

లోకులెల్లరును బహుకాలమువఱకును నీ అపకీర్తిని గూర్చి చిలువలు పలువలుగా చెప్పి కొందరు మాన్యుడైన పురుషునకు అపకీర్తి కన్నను మరణమే మేలు.

భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః !
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘువమ్ !  35

భయాత్ - రణాత్ - ఉపతరం - మంస్యంతే - త్వాం - మహారథాః
యేషాం - చ - త్వం - బహుమతః - భూత్వా - యాస్యసి - లాఘవం


యేషాం - ఎవరికి, త్వం - నీవు, బహుమతః - మాననీయుడవు, భూత్వా - అయి, లాఘవం - చులకన, యాస్యసిచ - పొందగలనో, మహారథాః - మహారథులు, త్వాం - నిన్ను, భయాత్ - భయమువలన, రణాత్ - రణరంగమునుండి, ఉపరతం - పారిపోయినట్లు, మంస్యంతే - పోయుదురు.

ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు. యుద్ధవిముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యేదవు. అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు తలపోయుదురు.

అవాచ్యవాదంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః !
నిందంతస్తవ సామర్థ్యంతతో దుఃఖతరం ను కిమ్ !  36

అవాచ్యవాదాన్ - చ - బహూన్ - వదిష్యంతి - తవ - అహితాః
నిందంతః - తవ - సామర్థ్యం - తతః - దుఃఖతరం - ను - కి  


తవ - నీయొక్క, అహితాః - శత్రువులు, తవ - నీ యొక్క, సామర్థ్యం - సామర్థ్యమును, నిందంతః - నిందించుచు, బహూన్ - అనేక విధములుగ, అవాచ్యవాదాన్ చ - అనరాని మాటలును, వదిష్యంతి - అందురు. తతః - అంతకంటెను, దుఃఖతరం - మించిన దుఃఖము, కిం ను - ఏముంటుంది.

శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అందురు. అంతకంటె దుఃఖ మేముంటుంది?