Read more!

భగవద్గీత పార్ట్ - 2

 

 

తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితౄనథ పితామహాన్ !
ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా !
శ్వరూరాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి !  26

తత్ర - అపశ్యత్ - స్థితాన్ - పార్థః - పిత్రూన్ - అథ - పితామహాన్
ఆచార్యాన్ - మాతులాన్ - భ్రాత్రూన్ - పుత్రూన్ - పౌత్రాన్ - సఖీన్ - తథా
శ్వశురాన్ - సహృదః - చ - ఏవ - సేనయోః - ఉభయోః - అపి

అథ - తరువాత, పార్థః - అర్జునుడు, తత్ర - అక్కడ, ఉభయోః - రెండైన, సేనయోః - సేనలందు, అపి - కూడా, స్థితాన్ - ఉన్నట్టి, పిత్రూన్ - తండ్రులను, పితామహాన్ - తాతలను, ఆచార్యాన్ - గురువులను, మాతులాన్ - మేనమామలను, భాత్రూన్ - సోదరులను, పుత్రాన్ - కుమారులను, పౌత్రాన్ - మనుమలను, సఖీన్ - మిత్రులను, తథా - మరియు, శ్వశురాన్ - మామలను, సుహృదః - సుహృదులను, చ - మరియు, ఏవ - కూడా, అపశ్యత్ - గాంచెను.

పిమ్మట అర్జునుడు యిరు సేనలయందును ఉన్న పెదతండ్రులను, పినతండ్రులను, తాతముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను హితులను, మామలను మున్నగు ఆత్మీయులను చూచెను.

తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ !
కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ !  27

తాన్ - సమీక్ష్య - సః - కౌతేయః - సర్వాన్ - బంధూన్ - అవస్థితాన్
కృపయా - పరయా - ఆవిష్టః - విషీదన్ - ఇదం - అబ్రవీత్

సః - ఆ. కౌంతేయః - అర్జునుడు, అవస్థితాన్ - సన్నద్ధులై యున్న, తాన్ - ఆ, సర్వాన్- సమస్తమైన, బంధూన్ - బంధువులను, సమీక్ష్య- చూచి, పరయా - అత్యంత, కృపయా - కరుణతో, ఆవిష్టః - కూడుకోన్నవాడై, విషీదన్ - శోకించుచు, ఇదం - ఈ విధముగ, అబ్రవీత్ - పలికెను.

కుంతీపుత్రుడైన అర్జునుడు యుద్ధసన్నద్ధులై వచ్చియున్న బంధువులను అందరిని చూచి, అత్యంత కరుణా సముచితుడై దుఃఖించుచు ఇట్లు పలికెను. 

దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్   28

సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి !
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ! 
29

దృష్ట్వా - ఇమం - స్వజనం - కృష్ణ - యుయుత్సు - సముపస్థితం
 సీదంతి - మమ - గాత్రాణి - ముఖం - చ - పరిశుష్యతి

వేపథుః - చ - శరీరే - మే - రోమహర్షః - చ - జాయతే

కృష్ణ - ఓ కృష్ణా, యుయుత్సుం - యుద్ధము చేయగోరి, సముస్థితం - కూడియున్న, ఇమం - ఈ , స్వజనం - బంధుజనములను, దృష్ట్వా - గాంచి, మమ - నాయొక్క, గాత్రాణి - అంగములు, సీదంతి - శిథిలములై పోవుచున్నవి. చ - మరియు,ముఖం - నోరు, పరుశుష్యతి - ఎండిపోవుచున్నది, చ - మరియు, మే నాయొక్క, శరీరే - దేహమునందు, వేపథుః - కంపనము, చ - మరియు, రోమహర్షః - గుగుర్పాటు, జాయతే - కలుగుచున్నది.

అర్జునుడు పలికెను- ఓ కృష్ణా ! సమరోత్సాహముతో రణరంగమున నిలిచియున్న ఈ స్వజనసమూహమును జూచి, నా అవయవములు పట్టుతప్పుచున్నవి. నోరు ఎండిపోవుచున్నది. శరీరమునందు వణుకు, గుగుర్పాటు కలుగుచున్నవి. ఒడలు పులకరించుచున్నది.

గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్వైవ పరిదహ్యతే !
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః !! 
30

గాండీవం - స్రసంతే - హస్తాత్ - త్వక్ - చ - ఏవ - పరిదహ్యతే
న - చ - శక్నోమి - అవస్థాతుం - భ్రమతి - ఇవ - చ - మే - మనః  

హస్తాత్ - చేతినుండి, గాండీవము, స్రసంతే - జారిపోవుచున్నది, చ - మరియు, త్వక్  - చర్మము, ఏవ - కూడా, పరిదహ్యతే - మండిపోవుచున్నది, చ - మరియు, అవస్థాతుం - నిలుచుటకు, న శక్నోమి - శక్తి లేక యున్నాను, చ - మరియు, మే - నాయొక్క, మనః - మనస్సు, భ్రమతీవ - భ్రమించుచున్నట్లున్నది.

గాండీవము చేతినుండి జారిపోవుచున్నది. చర్మము తపించిపోవుచున్నది. ఇక్కడ నిలబడుటకైనను శక్తిలేకున్నది. మనస్సు భ్రమించుచున్నట్లున్నది.

నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ !
న చ శ్రేయోపానుపశ్యామి హత్వా స్వజనమాహవే ! 
31

నిమిత్తాని - చ - పశ్యామి - విపరీతాని - కేశవ
న - చ - శ్రేయః - అనుపశ్యామి - హత్వా - స్వజనం - ఆహవే

కేశవ - కృష్ణా, చ - ఇంకను, విపరీతాని - విపరీతములైన, నిమిత్తాని - శకునములను, పశ్యామి - చూచుచున్నాను, ఆహవే - యుద్ధము నందు, స్వజనం - బంధువులను, హత్వా - వధించి, అను - అటు తర్వాత, శ్రేయః - శ్రియమును, న చ పశ్యామి - చూడలేకపోతున్నాను.

ఓ కేశవా ! పెక్కు అపశకునములు కనబడుచున్నవి. యుద్ధమున స్వజనసమూహమును చంపుటచే, నేను పొందు శుభమేమిటో తెలియలేకున్నాను.

న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ !
కిం  నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా !  
32

న - కాంక్షే - విజయం - కృష్ణ - చ - రాజ్యం - సఖాని - చ
కిం - నః - రాజ్యేన - గోవింద - కిం - భోగైః - జీవితేన - వా

కృష్ణ -  హే కృష్ణా, విజయం - విజయమును, కాంక్షే - కోరుట, న - లేదు, చ - మరియు, రాజ్యం - రాజ్యమును, చ - మరియు, సుఖాని - సుఖములను, న - లేదు, గోవింద - హే గోవిందా, నః - మాకు, రాజ్యేన - రాజ్యముతో, కిం - ఏమి లాభము, భోగైః - భోగములచేత గాని, జీవితేన వా - బ్రతుకుటచేత గాని, కిం - ఏమి లాభము?

ఓ కృష్ణా ! నేను విజయము గాని, రాజ్యము గాని, సుఖములు గాని కోరుకోవటం లేదు. గోవిందా ! ఈ రాజ్యము వలనగాని, ఈ భోగముల వలన గాని, ఈ జీవితము వలన గాని ఏమి ప్రయోజనము?

యేషామర్ధే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ !
త ఇమేపావస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వాధనాని చ  
33

యేషాం - అర్థే - కాంక్షితం - నః - రాజ్యం - భోగాః - సుఖాని - చ
తే - ఇమే - అవస్థితాః - యుద్ధే - ప్రాణాన్ - త్యక్త్వా - ధనాని - చ

యేషాం అర్థే - ఎవరికొరకు, నః - మావలన, రాజ్యం - రాజ్యము, భోగాః - భోగములు, చ - మరియు, సుఖాని - సౌఖ్యములు, కాంక్షితం - కోరబడినవో, తే - అట్టి, ఇమే - వీరు, యుద్ధే - యుద్ధమునందు, ప్రాణాన్ - ప్రాణములను, చ - ఇంకను, ధనాని - ధనములను, త్యక్త్వా - విడిచి, అవస్థితాః - నిలిచియున్నారు.

మనము ఎవరికై ఈ రాజ్యమును, భోగములను, సుఖములను కోరుకొనుచున్నామో, వారే ధనప్రాణముల యెడ ఆశలు వదులుకొని యుద్ధమునకు వచ్చినిలిచియున్నారు.

ఆచార్యః పితరః పుత్రాః తథైవ చ పితామహాః !
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధిన స్తథా !  34

ఆచార్యాః పితరః - పుత్రాః - తథా - ఏవ - చ - పితామహాః
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినః - తథా

ఆచార్యాః - గురువులు, పితరః - తండ్రులు, పుత్రాః - కుమారులు, తథా ఏవ చ - అలాగు ననే, పితామహాః - తాతలు, మాతులాః - మేనమామలు, శ్వశురాః - మామలు, పౌత్రాః - మనుమలు, శ్యాలాః - బావలు, తథా - అలాగుననే, సంభంధినః - చుట్టములు.

గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు, బావమఱదులు, ఇతర బంధువులు మొదలగు వారు అందరును ఇచ్చటికి వచ్చి యున్నారు.

ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపాపి మధుసూదన !
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే !  
35

ఏతాన్ - హన్తుం - ఇచ్ఛామి - ఘ్నతః - అపి - మధుసూదన
అపి - త్రైలోక్యరాజ్యస్య - హేతోః - కిం - ను - మహీకృతే

ఏతాన్ - వీరిని, ఘ్నతః అపి - చంపుతున్నవారైనను, హంతుం - వధించుటకై, త్రైలోక్య రాజ్యస్య - త్రిలోకాధిపత్యము, హేతోః అపి - కొరకుగాని, ఇచ్ఛామి - కొరుకుట, న - లేదు, మధుసూదన - హే మధుసూదనా, మహీకృతే - భూమి కొరకు, ను కిమ్ - ఎలా కోరను?

ఓ మధుసూదనా ! ముల్లోకాధిపత్యముకొరకైనను నేను ఎవ్వరినీ చంప ఇచ్చగింపను. ఇక ఈ భూమండల విషయమై చెప్పనేల? అట్లే వీరిలో ఎవ్వరైనను నన్ను చపబూనిననూ నేను మాత్రము వీరిని చంపలేను.

నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః సాజ్జనార్ధన !
పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః ! 
36

నిహత్య - ధార్తరాష్ట్రాన్ - నః - కా - ప్రీతిః - స్యాత్ - జనార్దన
పాపం - ఏవ - ఆశ్రయేత్ - అస్మాన్ - హత్వా - ఏతాన్ - ఆతతాయినః

జనార్దన - హే జనార్థనా!, ధార్తరాష్ట్రాన్ - దుర్యోధనాదులను, నిహత్య - చంపి, నః - మాకు, కా - ఏమి, ప్రీతిః  సంతోషము, స్యాత్ - కలుగును, అతతాయినః - దురాత్ములైన, ఏతాన్ - వీరిని, హత్వా - చంపి, అస్మాన్ - మమ్ములను, పాపమేవ - పాపమే, ఆశ్రయేత్ - కలుగును.

ఓ జనార్దనా ! ఈ దుర్యోధనాదులను చంపి, మనము బావుకొనునది ఏమి? (మనము మూట కొట్టుకొనునది యేమి?) దుర్మార్గులైన వీరిని చంపుటవలన మనకు పాపమే కలుగును.

తస్మాన్నార్హావయం హంతుం ధార్తారాష్ట్రాన్ స్వబాంధవాన్ !
స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ !  37

తస్మాత్ - న - అర్హాః - వయం - హంతుం - ధార్తరాష్ట్రాన్ - స్వబాంధవాన్
స్వజనం - హి - కథం - హత్వా - సుఖినః - స్యామ - మాధవ

మాధవ - కృష్ణా, తస్మాత్ - అందువలన, వయం - మేము, స్వబాంధవాన్ - బంధువులతో గూడిన, ధార్తరాష్ట్రాన్ - దుర్యోధనాదులను, హంతుం - చంపుటకు, అర్హా - అర్హులము, న - కాము, స్వజనం - స్వజనులను, హత్వా - చంపి, కథం - ఏవిధముగా, సుఖినః - సుఖ వంతులము, స్యామ హి - కాగలము

కనుక ఓ మాధవా ! మన బంధువులైన ఈ ధార్తారాష్ట్రులను చంపుటకు మేము అర్హులము కాము. స్వజనులను చంపి మేము ఎలా సుఖపడగలము?
      
యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః !
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ! 
38

యద్యపి - ఏతే - న - పశ్యంతి - లోభోపహత చేతసః
కులక్షయకృతం - దోషం - మిత్రద్రోహే - చ - పాతకం

లోభోపహత చేతసః - లోభముచేత చెదరగొట్టబడిన మనస్సు గల, ఏతే - వీరు, కులక్షయ కృతం - కులనాశమువలనకలుగు, దోషం - చెడును, చ - మరియు, మిత్రద్రోహే - మిత్రదోహము వలన కలుగు, పాతకం - పాపమును, పశ్యంతి - చూచుట, యద్యపిన - లేకపోయినను.

లోభకారణముగ భ్రష్టచిత్తులైన వీరు కులక్షయము వలన కలుగు దోషములను, మిత్రద్రోహము వలన సంభవించు పాపములను చూడకున్నచో

కథం న జ్ఞేయమ స్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ !
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్ధన ! 39

కథం - న - జ్ఞేయం - అస్మాభిః  పాపాత్ - అస్మాత్ - నివర్తితుం
కులక్షయకృతం - దోషం - ప్రపశ్యద్భిః  జనార్దన

జనార్దన - హే జనార్దనా, కులక్షయకృతం - కులనాశము వలన కలుగు, దోషం - దోషమును, ప్రపశ్యద్భిః  - చక్కగా గ్రహించిన, అస్మాభిః - మాచేత, అస్మాత్ - ఈ పాపాత్ - పాపము నుండి, నివర్తితుం - తొలగుటకు, కథం - ఎటుల, జ్ఞేయం - తెలియదగినది,న - కాదు.

జనార్దనా! కులనాశనము వలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండుటకు ఏల ప్రయత్నించకూడదు ?

కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః !
ధర్మే నష్టే కులం కృత్స్నమ్ అధర్మోపాభిభవత్యుత !   40

కులక్షయే - ప్రణశ్యంతి - కులధర్మాః - సనాతనాః
ధర్మే - నష్టే - కులం - కృత్స్నం - అధర్మః - అభిభవతి - ఉత

కులక్షయే - కులనాశము జరుగునప్పుడు, సనాతనాః - అనాదిగాయున్న, కులధర్మాః - కులధర్మములు, ప్రణశ్యంతి - సంపూర్ణముగా నశించునున, ధర్మే - ధర్మము, నష్టే - నశింపగా, కృత్స్నం - సకలమైన, కులం - కులమును, అధర్మః - అనాచారము, అభిభవేతి ఉత - వ్యాపించునుకదా.

కులక్షయమువలన సనాతనములైన కులధర్మములన్నియును నశించును. ధర్మము అంతరించిపోయినప్పుడు కులము నందు అంతటను పాపమే వ్యాపించును.
     
అధర్మాభిభవాత్ కృష్ణప్రదుష్యంతి కులస్త్రియః !
స్త్రీషు దుష్టాసు వార్ష్ణే య జాయతే వర్ణసంకరః ! 
41

అధర్మాభిభవాత్ - కృష్ణ - ప్రదుష్యంతి - కులస్త్రియః !
స్త్రీషు - దుష్టాసు వార్ష్ణే య జాయతే వర్ణసంకరః !

కృష్ణ - ఓ కృష్ణా, అధర్మాభిభవాత్ - అధర్మము వృద్ధినొందుట వలన, కులస్త్రియః - కులాంగనలు, ప్రదుష్యంతి - చెడిపోవుట వలన, వర్ణసంకరనః - వర్ణసంకరము, జాయతే - కలుగుచున్నది.

ఓ కృష్ణా ! అధర్మము పెచ్చుపెరిగి పోయినప్పుడు కుల స్త్రీలు మిక్కిలి చెడిపోవుదురు. స్త్రీలు చెడినచో వర్ణసాంకర్యము కలుగును.
సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ !
పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః !  42

సంకరః - నరకాయ - ఏవ - కులఘ్నానాం - కులస్య - చ
పతంతి - పితరః - హి - ఏషాం - లుప్త పిండోదకక్రియాః

సంకరః - వర్ణసంకరము, కులఘ్నానాం - కులమును చెడిపిన వారలకును, చ - మరియు, కులస్య - కులమునకు, నరకాయ ఏవ - నరకము కొరకే, ఏషాం - వీరియోక్క, పితరః - పితరులు, లుప్తపిండోదక క్రియాః - శ్రద్ధతర్పణ క్రియలు లేనివారై, పతంతిహి - పతనమగు చున్నారు.

వర్ణసాంకర్యము కులఘాతకులను, నరకము నందు పడవేయును. పిండోదకములు  (శ్రాద్ధతర్పణములు) లోపించినందువలన వారి పితరులును పతనమగుదురు.

దోషై రేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః !
ఉత్పాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః !   43

దోషైః - ఏతైః - కులఘ్నానాం - వర్ణసంకర కారకైః
ఉత్పాద్యంతే - జాతిధర్మాః - కులధర్మాః చ - శాశ్వతాః 

ఏతైః - ఈ, వర్ణసంకర కారకైః - వర్ణ సంకరమునకు కారణమైన, దోషైః - దోషములచేత, కూలఘ్నానాం - వర్ణసంకరమొనర్చిన వారి యొక్క, శాశ్వతాః - శాశ్వతములైన, జాతిధర్మాః - జాతి ధర్మములు, చ - మరియు, కులధర్మాః - కులధర్మములు, ఉత్పాద్యంతే - నశించు చున్నవి.

వర్ణసాంకర్యమునకు మూలములైన ఈ దోషము వలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మములు, జాతిధర్మములు నశించుచున్నవి. 

ఉత్పన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన !
నరకేపానియతం వాసో భవతీత్యనుశుశ్రుమ !   44

ఉత్పన్న కులధర్మాణాం - మనష్యాణాం - జనార్దన
నరకే - అనియతం - వాసః - భవతి - ఇతి - అనుశుశ్రుమ

జనార్దన - జనార్దనా, ఉత్పన్నకులధర్మాణాం - చెడిన కులాచారములుగల, మనుష్యాణాం - మనుజులకు, నరకే - నరకమందు, అనియతం - అనంతకాలము, వాసః - నివాసము, భవతి - కలుగుచున్నది, ఇతి - అని, అనుశుశ్రుమ - ఆలకించుచున్నాము.

ఓ జనార్ధనా ! కులధర్మములు నశించినవారికి శాశ్వతముగా నరకప్రాప్తి తప్పదని వినుచున్నాము.

అహో బత మహాత్ పాపం కర్తుం వ్యవసితా వయమ్ !
యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః !   45

అహో - బత - మహాత్పాపం - కర్తుం - వ్యవసితాః - వయం
యత్ - రాజ్యసుఖలోభేన - హంతుం స్వజనం - ఉద్యతాః

యత్ - ఏ కారణము వలన, రాజ్యసుఖలోభేన - రాజ్యసుఖమునందలి లోభము చేత, స్వజనం - బంధువులను, హంతుం - చంపుటకు, ఉద్యతాః - ఉద్యమించితిమో, మహత్ - గొప్పదైన, పాపం, పాపమును, కర్తుం - చేయుటకు, వయం - మేము, వ్యవసితాః - సమకట్టితిమి, ఆహోబత - అయ్యో ! ఎంత శోకము ?

రాజ్యసుఖ లోభముచేమనము బుద్ధిమంతులమైయుండియు స్వజనులను చంపుటకు ఉద్యుక్తులమై, ఈ ఘోరపాపకృత్యములను చేయుటకు సమకట్టితిమి గదా! అక్కటా!

యది మామప్రతీకారమ్ ఆశస్త్రం శస్త్రపాణయః !
ధార్తరాష్ట్రాన్ రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ !  46

యది - మాం - అప్రతీకారం - ఆశస్త్రం - శస్త్రపాణయః
ధార్తారాష్ట్రా - రణే - హన్యుః తత్ - మే - క్షేమతరం - భవేత్

అప్రతీకారం - ప్రతీకారము చేయని, ఆశస్త్రం - శస్త్రరహితమైన, మాం - నన్ను, శస్త్ర పాణయః - శస్త్రధారులైన, ధార్తారాష్ట్రాః - దుర్యోధనాదులు, రణస్త్ర - యుద్ధము నందు, హన్యుః యది - చంపుదురురేని, తత్ - అది, మే - నాకు, క్షేమతరం - శ్రేయస్కరము, భవేత్ - అగును.

ఆయుధములు పట్టక ఎదిరింపని నన్ను శస్త్రములను చేబూని దుర్యోధనాదులు యుద్ధమున వధించినను, అది నాకు క్షేమకరమే యగును.
సంజయ ఉవాచ:-
ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశాత్ !
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః !  47

ఏవం - ఉక్త్వా - అర్జునః - సంఖ్యే - రథోపస్థే - ఉపావిశత్
విసృజ్య - సశరం - చాపం - శోకసంవిగ్నమానసః

అర్జునః - అర్జునుడు, ఏవం - ఈ విధముగ, ఉక్త్వా - పలికి, శోకసంవిగ్న మానసః - దుఃఖము చేత చలించిన మనస్సు కలవాడై, సశరం - శరయుక్తమైన, చాపం - ధనుస్సును, విసృజ్య - విడిచి, సంఖ్యే - రణరంగమునందు, రథోపస్టే - రథముమీద, ఉపావిశత్ కూర్చొనేను.
         

సంజయుడు పలికెను - అర్జునుడు ఈ విధముగా పలికి శోకముచే కలతచెందిన మనస్సుకలవాడై, యుద్ధభూమియందు ధనుర్బాణములను విడిచి, రథము వెనుక భాగమున చతికిలబడెను.


                             ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు
                           బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
                          అర్జునవిషాదయోదయోగోనామ ప్రథమోపాధ్యాయః