ధర్మానికి మార్గదర్శకుడు శ్రీకృష్ణుడు!

 

ధర్మానికి మార్గదర్శకుడు శ్రీకృష్ణుడు!

కృష్ణుడు అష్టమినాడు పుట్టాడు. అందుకే జన్మాష్టమి అంటారు. కానీ కొందరు అష్టమిరోజు  మంచిపనులు మొదలుపెట్టడానికి ఇష్టపడరు. అష్టమినాడు  ఏదైనా చేస్తే అష్టకష్టాలు పడాలని బహుశా కృష్ణుడి జన్మదినం చూసే అని ఉంటారు. కృష్ణుడు తన జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు కానీ వాటన్నిటికి చలించలేదు. ఆయనది తటస్థమైన వ్యక్తిత్వం. కృష్ణుడి జీవితమంతా భాగవతంగా చెప్పబడుతుంది. 

భారతంలో శ్రీకృష్ణుడిని ఎందరో దూషిస్తారు. విమర్శిస్తారు. పరుషవాక్యాలు ప్రయోగిస్తారు. శ్రీకృష్ణుడు భగవంతుడికి ప్రతిరూపం. ఆ దూషణలు, విమర్శలు అన్నీ భగవంతుడికే అన్నమాట. అయినా, అలా దూషించినవారిని శ్రీకృష్ణుడు ద్వేషించడు. వారి విమర్శలను తిప్పి కొట్టడు. వారితో వాదాలకు దిగడు. 'వారి అభిప్రాయం వారిది' అన్న రీతిలో వదిలేస్తాడు. అన్ని దూషణలనూ చిరునవ్వుతో భరిస్తాడు. 'వీరు నన్ను విమర్శించారు. వీరి పని పట్టాలి' అన్నట్టు ప్రతీకారభావనను ప్రదర్శించడు.

కానీ.... ఎప్పుడైతే ధర్మచ్యుతి జరిగిందో, ఎప్పుడైతే వ్యక్తి ధర్మాన్ని కాదని ప్రవర్తించాడో అప్పుడు శ్రీకృష్ణుడు నిర్ణయాత్మకంగా, నిర్దాక్షిణ్యంగా, నిక్కచ్చిగా వ్యవహరించాడు.

దేవుడని చూడకుండా గోవర్ధనగిరి ఎత్తి ఇంద్రుడికి శృంగభంగం చేశాడు. నూరు తప్పులు చేసి, ధర్మభంగం పొరపాటు వల్ల కాదు అలవాటు వల్ల అని నిరూపించుకొన్న తరువాతనే శిశుపాలుడికి శిరచ్ఛేదం చేశాడు. అలాగే, అర్జునుడు, భీముడు వంటి వీరుల ద్వారా ధర్మరక్షణ కావించాడు.

భారతీయ జీవనవిధానానికి అత్యుత్తమ ప్రామాణికం అనదగిన భగవద్గీతను బోధిస్తూ,

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం॥

అని స్పష్టంగా చెప్తాడు. అంటే భగవంతుడి కన్నా ధర్మం గొప్పది అన్నమాట. ఇక్కడ సాక్షాత్తు శ్రీకృష్ణుడే దేవుడికంటే ధర్మమే గొప్పదని చెప్పాడు. అంటే ఈ సృష్టిలో కనిపించని దేవుడికన్నా మనిషిని సక్రమమార్గంలో నడిపించే ధర్మం ఎంతో ఉన్నతమైనది. ఆ ధర్మం ఇక్కడైతే ఉంటుందో అక్కడ ఆ దైవం కూడా ఉంటాడు ఖచ్చితంగా.

భగవంతుడిని నమ్మటం, నమ్మకపోవటం అన్నది వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలకు సంబంధించింది. వ్యక్తి భగవంతుడిని నమ్మినా, నమ్మకున్నా నష్టం లేదు. కానీ వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతే ప్రమాదం. అది వ్యక్తికే కాదు సమాజానికే ప్రమాదం. వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోవటం అంటే ధర్మాన్ని పాటించకపోవటమే. ధర్మభంగం చేయటమే.

ధర్మభంగం వల్ల సామాజిక ఆత్మకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి భగవంతుడు తనపై వ్యక్తిగతదూషణలను చేసేవారిని పట్టించుకోడు. కానీ ధర్మభంగం చేసినవారిని క్షమించడు. దేవుడిని నమ్మనివారిని విస్మరిస్తాడు. కానీ ధర్మానికి హాని కలిగించినవారిని శిక్షించకమానడు. దీన్ని బట్టి చూస్తే, భారతీయధర్మంలో వ్యక్తిత్వవికాసానికి, ధర్మపాలన రాజమార్గం అని స్పష్టమౌతుంది. ధర్మపాలన వ్యక్తిత్వవికాసానికి పర్యాయపదం అని తేలుతుంది. ధర్మపాలన సక్రమంగా చేసే వ్యక్తి సంపూర్ణవ్యక్తిత్వంతో అలరారుతూ పురుషోత్తముడు అవుతాడని అర్థమవుతుంది.

అందుకే 'పురుషులలో నేను ఉత్తముడి'ని అని శ్రీకృష్ణుడు ప్రకటిస్తే, తన ప్రవర్తన ద్వారా ఆ భావనను ప్రపంచానికి ప్రదర్శించాడు పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు. అందుకే, భారతీయధర్మానికి శ్రీకృష్ణుడు మార్గదర్శి అయ్యాడు.

                                       ◆నిశ్శబ్ద.