ధ్యానం ద్వారా ఆకర్షింపబడేవి ఏంటి?
ధ్యానం ద్వారా ఆకర్షింపబడేవి ఏంటి?
మనకు తెలియని ప్రపంచంలోనికి ప్రవేశించడానికి ధైర్యము, విశ్వాసము, స్థిర నిశ్చయత్వం అనేవి ఆవశ్యకరం. మనలో ఇమిడి వుంటున్న అంతర్గతశక్తిని ఉన్నత చైతన్యశక్తిగా ఎఱుకలోనికి తెచ్చుకోవడానికి ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మిక గురువుల సహాయాన్ని, వారి బోధనలను ఆధారంగా చేసుకొని సాధన చేయవలసి ఉంది.
వాస్తవంగానైతే, జీవితంలో అన్ని సంఘటనలూ అప్రయత్న పూర్వకంగానే సంభవిస్తూ వున్నాయి. జీవితం అనేది మనకు ఇవ్వబడిన గొప్ప వరం! ఈ జీవితం యొక్క మనుగడ మరి కొనసాగింపు అనేవి ప్రతిక్షణమూ మనఅంతరశక్తి చేత సంరక్షింపబడుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన అంటే అంతరశక్తిని శరణాగతి పొందడమూ, ఆందోళన లేని జీవితం, జరుగుతున్న వాటిని సాక్షీభూతంగా చూడడం ఇంకా వ్యర్థకరమైన విషయాల పట్ల అనాసక్తితో వుండడం, అది మాత్రమే కాకుండా వ్యర్థ ప్రేలాపనలు కట్టి పెట్టడం వంటివి చేయడం.
మనస్సును అధిగమించడం అంటే దాన్ని శూన్య స్థితిలోకి తీసుకురావడం ద్వారా అధిగమించడం. ఇంకా బాహ్య ఇంద్రియాలకు గోచరించే పరిమిత భావనలను అధిగమించి, ద్వంద్వత్వం నుండి బయటపడి ఏకత్వంలోకి ప్రవేశించడమే ధ్యానం యొక్క ఉద్దేశ్యం.
అంతరంగ ప్రపంచంలో ద్వంద్వత్వం అనేది ఉండదు. అంతరశక్తి అనేది అపరిమితమైనది, అప్రమేయమైనది, నిత్య శాశ్వతమైనది. దానిని మెల్ల మెల్లగా, క్రమ క్రమంగా మన ఎఱుకలోనికి తెచ్చుకుని బుద్ధి వికాసాన్ని విస్తరింపజేసుకుంటూ 'ఆనందం'ను పొందడం కోసం మనం ధ్యాన సాధన చేయవలసి వుంది. ఆధ్యాత్మిక పరిణామం అనేది రాకెట్ వ్యోమనౌక ద్వారా భూమి నుండి ఒక ఉపగ్రహాన్ని గగనతలంలోనికి అంటే ఆకాశంలోనికి ప్రయోగించే రీతిలో వుంటుంది. ఆ రాకెట్ పైకి ప్రయాణించేటపుడు భూమ్యాకర్షణ శక్తిని అధిగమించవలసి వుంటుంది. ఆ తర్వాత భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటపడి అతి సునాయాసంగా గగనతలంలోనికి ఆ రాకెట్ ప్రయాణించగలదు.
అదే మాదిరిగా ప్రారంభ దశల్లో ఆధ్యాత్మిక సాధనలో కూడా ఎక్కువ శక్తిని, శ్రమను వినియోగించవలసి వుంది. సాధన చేయగా, చేయగా అప్రయత్నపూర్వకంగా, అతి సునాయాసంగా అంతర్ ప్రపంచంలోనికి శరణాగతితో ప్రయాణించి అంతర్ శక్తిని మన ఎఱుకలోకి తెచ్చుకోవడం జరుగుతుంది. ఎలాగంటే పాడగా పాడగా రాగమతిశయించునట్టు, చేయగా చేయగా ఈ అంతర్ ప్రపంచంలోకి మన ప్రయాణం, మన అంతర్ శక్తి మొదలైనవి మన చేతుల్లోకి తెచ్చుకోవడం అంటే మన అంతర్ శక్తిని మనం గుర్తించి, యోగించడం.
మనం ప్రయత్నించి తెలుసుకునేది కాకుండా అప్రయత్నపూర్వకంగా ఆధ్యాత్మిక సత్యాలు మనకు విశదం అవుతాయి. ప్రయత్నించునప్పుడు ఏదో తొందరపాటు, తెలిసి చేసేపనిలో ఇంకా అవ్వలేదే అనే తొందరపాటు ఉంటాయి. కానీ తెలియకుండా చేసినప్పుడు ఎలాంటి ఊహలు ఉండవు కాబట్టి సులభంగా అర్థమవుతాయి. ధ్యానం అనేది మన ఆధ్యాత్మిక పురోగతికి ఇంకా చైతన్య పరిణామానికి చాలా సరళమైన మార్గం.
మనం చైతన్యశక్తిని అధికంగా కలిగివుంటున్నప్పుడు అసత్యం వైపు వికర్షింపబడం అనేది కాకుండా సత్యం వైపు ఆకర్షింపబడతాము. దివ్య నిశబ్దం, అపరిమితమైన అవ్యాజమైన ప్రేమ, బ్రహ్మానందం మరి ఏకత్వ భావన అనేవి మన వైపుకు అప్రయత్న పూర్వకంగా ఆకర్షింపబడతాయి.
◆ నిశ్శబ్ద.