సీతమ్మ ఆభరణాలు చూసిన రాముడి పరిస్థితి?

 

సీతమ్మ ఆభరణాలు చూసిన రాముడి పరిస్థితి?

రాముడు సుగ్రీవుడు  మాట్లాడుకుంటూ ఉండగా సుగ్రీవుడు రాముడితో "కనపడకుండా పోయిన వేదాన్ని మళ్ళి తీసుకొని వచ్చి ఇచ్చినట్టు, నీకు నేను సీతమ్మని తీసుకొని వచ్చి ఇస్తాను. సీతమ్మని పాతాళలోకములో కాని, స్వర్గలోకములో కాని దాయని, నేను సీతమ్మని వెతికి తీసుకొస్తాను" అన్నాడు. 

సుగ్రీవుడి మాటలు విన్న రాముడికి సీతమ్మ గుర్తుకువచ్చి భోరున రోదించాడు. అప్పుడు సుగ్రీవుడు "రామ శోకించకు. నీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి చెబుతాను. ఒకరోజు నేను ఈ పర్వత శిఖరాల మీద నా నలుగురు మంత్రులతో కలిసి కూర్చొని ఉన్నాను. అప్పుడు ఆకాశంలో ఎర్రటి కళ్ళు కలిగిన రాక్షసుడు పచ్చటి వస్త్రములు కట్టుకున్న ఒక స్త్రీని తీసుకుపోతున్నాడు. అప్పుడు ఆ తల్లి తన చీర కొంగుని చింపి, అందులో తన ఆభరణములను కొన్నిటిని మూటకట్టి పైనుండి కిందకి జారవిడిచింది. బహుశా ఆ స్త్రీ సీతమ్మ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను వెళ్ళి ఆ ఆభరణములు తీసుకొస్తాను, అవి సీతమ్మ ఆభారణాలేమో చూడు" అని చెప్పి ఋష్యమూక పర్వతం మీద తను నివసించే గుహలోకి వజాగ్రత్త చేసిన ఆభరణాల మూటను తీసుకురావడానికి వెళ్ళాడు.

కొంతసేపటికి సుగ్రీవుడు ఆ ఆభరణాలని తీసుకొచ్చాడు. ఆ ఆభరణాలని చూసేసరికి, ఒక్కసారి శోకం తన్నుకొచ్చినవాడై రాముడు మూర్ఛపోయి నేలమీద పడిపోయాడు. తరువాత ఆయన తేరుకొని ఆ ఆభరణాలని చూద్దాము అంటే కళ్ళనిండా నీరు ఉండడం చేత, ఎన్ని సార్లు తుడుచుకున్నా ఆ కన్నీరు ఆగడం లేదు. అప్పుడు  ఆయన లక్ష్మణుడిని పిలిచి 'లక్ష్మణా! ఈ ఆభరణాలని ఒక్కసారి చూడు ఇవి విరిగిపోయి ముక్కలు అవ్వలేదు. సీత ఈ ఆభరణాలని విడిచిపెట్టినప్పుడు ఇవి గడ్డి మీద పడి ఉంటాయి. నువ్వు వీటిని ఒకసారి చూడు" అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు "అన్నయ్యా! ఈ కేయూరాలు(వంకీలు, మోచేతులకు పైన పెట్టుకునేవి) వదిన పెట్టుకుందో లేదో నాకు తెలీదు. ఈ కుండలాలు(చెవికి పెట్టుకునే బుట్టలు)వదిన పెట్టుకుందో లేదో నాకు తెలీదు. కానీ అన్నయ్యా! ఈ  నూపురాలు(కాలిమెట్టెలు) మాత్రం వదినవే. నేను ప్రతిరోజు వదిన కాళ్ళకి నమస్కారం పెట్టేవాడిని. అప్పుడు ఈ నూపురాలని వదిన పాదాలకి చూశాను" అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడు రాముడితో "అయ్యయ్యో, అలా ఏడవకు రామ. నేను కూడా నీలాగే కష్టపడుతున్నాను. నువ్వే ఆలోచించు, నేను నీలా ఏడుస్తున్నాన? నీలాగే నా భార్య కూడా అపహరింపబడింది. నీకు చెప్పగలిగేంత సమర్దుడిని కాదు, కాని ఒక్కసారి నీకు జ్ఞాపకం చేద్దామని స్నేహ లక్షణంతో చెప్పాను. నీ యొక్క దుఃఖాన్ని ఉపశమింప చేసుకో, నాతో నీకు ఉన్న స్నేహాన్ని జ్ఞాపకం చేసుకో" అన్నాడు.

వెంటనే రాముడు స్వస్థతని పొంది "ఉత్తమమైన మిత్రుడు ఎటువంటి మాట చెప్పాలో అటువంటి మాట చెప్పావయ్య సుగ్రీవా. కాని నాకు ఒక విషయం చెప్పు. ఈ రాక్షసుడు ఎక్కడ ఉంటాడో నాకు చెప్పు. నేను వెంటనే వెళ్ళి రాక్షస సంహారం చేస్తాను" అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడు "నేను సత్యం చెబుతున్నాను. నా మాట నమ్ము. నీ భార్యను తీసుకొచ్చే పూచి నాది. కాని నీ భార్యను అపహరించిన రాక్షసుడి పేరు నాకు తెలీదు, ఎక్కడుంటాడో నాకు తెలీదు. నువ్వు బెంగ పెట్టుకోవద్దు అన్నాడు.

                           ◆వెంకటేష్ పువ్వాడ.