వాలి-సుగ్రీవుల వైరానికి కారణం?
వాలి-సుగ్రీవుల వైరానికి కారణం?
ఒకానొకప్పుడు వాలి సుగ్రీవుల తండ్రి అయిన ఋక్షరజస్సు వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ ఋక్షరజస్సుకి ఇంద్రుడి అనుగ్రహంగా వాలి ఔరసపుత్రుడిగా జన్మించాడు, సూర్యుడి అనుగ్రహంగా సుగ్రీవుడు ఔరసపుత్రుడిగా జన్మించాడు. పెద్ద కొడుడైన వాలి తండ్రి ప్రేమను ఎక్కువ పొందాడు. సుగ్రీవుడు కూడా చాలాకాలం వాలితో ప్రేమగా ఉండేవాడు. కొంతకాలానికి ఋక్షరజస్సు మరణించాడు, పెద్ద కొడుడు కాబట్టి వాలికి పట్టాభిషేకం చేశారు. సుగ్రీవుడు వాలి పట్ల వినయవిధేయలతో, భయభక్తులతో ఉండేవాడు. దుందుభి అనే రాక్షసుడి అన్న అయిన మయుడికి ఒక కుమారుడు ఉన్నాడు, వాడి పేరు మాయావి. ఆ మాయవికి, వాలికి ఒక స్త్రీ సంబంధంగా వైరం వచ్చింది. ఆ కారణం చేత మాయావి ఒకరోజు రాత్రి కిష్కింద ద్వారం దగ్గరికి వచ్చి గట్టిగా కేకలు వేసి వాలి బయటకి రా, మనిద్దరమూ యుద్ధం చేద్దాము. ఈరోజుతో నిన్ను సంహరిస్తాను' అన్నాడు. అప్పటివరకూ తన భార్యలతో సంతోషంగా కాలం గడుపుతున్న వాలి గబగబా బయటకి వచ్చాడు. అప్పుడు సుగ్రీవుడు కూడా బయటకి వచ్చాడు. ఆ మాయావి వాలి సుగ్రీవులను ఇద్దరినీ చూసి భయపడి పారిపోయాడు. అక్కడున్న స్త్రీలు 'ఎలాగు వాడు పారిపోతున్నాడు కాదా, ఇంక విడిచిపెట్టు' అన్నారు వాలితో. కాని, శత్రువుని విడిచిపెట్టనని వాలి వాడి వెనకాల పరిగెత్తాడు. అప్పుడు సుగ్రీవుడు కూడా వాలి వెనకాల పరిగెత్తాడు, ఒక పెద్ద బిలంలోకి ఆ మాయావి దూరిపోయాడు. అక్కడికి వెళ్ళి సుగ్రీవుడు, వాలి నిలబడ్డారు.
అప్పుడు వాలి "సుగ్రీవా! నువ్వు ఈ బిల ద్వారం దగ్గర కాపలాగా ఉండు, నేను ఇందులోకి వెళ్ళి ఆ రాక్షసుడిని సంహరించి వస్తాను. నువ్వు నా తమ్ముడివి, చిన్నవాడివి నా పాదముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, నువ్వు ఇక్కడే ఉండు" అని చెప్పి వాలి గుహలోపలికి వెళ్ళాడు.
వాలి లోపలికి వెళ్ళి ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. సుగ్రీవుడు బయట అలాగే నిలబడ్డాడు అలా చాలాకాలం తరువాత లోపలినుండి రాక్షసుల కేకలు వినిపించి, నురగతో కూడిన నెత్తురు ప్రవహిస్తూ బయటకి వచ్చింది. ఎక్కడా వాలి మాట కాని, వాలి అలికిడి కాని వినపడలేదు. బహుశా వాలిని రాక్షసులు సంహరించి ఉంటారు అనుకొని, రాక్షసులు బయటకి వస్తే ప్రమాదము అని, సుగ్రీవుడు ఒక పెద్ద శిలని తీసుకొని వచ్చి ఆ బిలానికి అడ్డుగా పెట్టి. వాలికి తర్పణాలు విడిచాడు.
తరువాత రాజ్యానికి వచ్చి, ఎవ్వరికీ తెలియకుండా శాస్త్రం ప్రకారం వాలికి చేయవలసిన కార్యములను చేశాడు. కానీ ఆ విషయం మంత్రులకు తెలిసి రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు అని బలవంతంగా సుగ్రీవుడిని సింహాసనం మీద కూర్చోపెట్టి పట్టాభిషేకం చేశారు. సుగ్రీవుడు చాలా ధర్మబద్ధంగా వాసర రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలం గడుపుతున్నప్పుడు ఒకనాడు అకస్మాత్తుగా వాలి తిరిగివచ్చాడు. అప్పుడాయన ఎర్రనైన కళ్ళతో సుగ్రీవుడి వంక చూశాడు. నా మంత్రులని, స్నేహితులని బంధించి కారాగారంలో వేశాడు.
అప్పుడు సుగ్రీవుడు రెండు చేతులని జోడించి, శిరస్సు వంచి "అన్నయ్యా! నువ్వు లేక నేను అనాథనయ్యాను. నువ్వు తిరిగి రావడం వలన ఇవ్వాళ నేను నాథుడున్న వాడిని అయ్యాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. అన్నయ్యా! నువ్వు మళ్ళి సింహాసనం మీద కూర్చొని పూర్వం ఎలా పరిపాలించేవాడివో అలా పరిపాలించు. నేనెప్పుడూ పట్టాభిషేకం చేసుకుందామని అనుకోలేదు. బలవంతంగా మంత్రులు, పౌరులు నాకు పట్టాభిషేకం చేశారు. నేను నీకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తున్నాను. ఎప్పటికీ నువ్వే వానర రాజ్యానికి రాజువి. అందుకని రాజ్యాన్ని స్వీకరించు" అన్నాడు.
అప్పుడు వాలి "చి ఛి, పరమ దుష్టుడా నేను లేని సమయం చూసి నువ్వు పట్టాభిషేకం చేసుకున్నావు. నువ్వు పరమ దుర్మార్గుడివి' అన్నాడు. మరునాడు జానపదులను, మంత్రులను, ఇతరమైన వానరములను పిలిచి ఒక పెద్ద సభ తీర్చాడు. నేను లోపలికి వెళ్ళాక మాయావి నాకు కనపడలేదు. ఒక సంవత్సర కాలం వెతికాక ఆ మాయావి తన బంధువులతో, స్నేహితులతో కనపడ్డాడు. నేను వాళ్ళందరినీ సంహరించాను. ఆ గుహ అంతా నెత్తురుతో నిండిపోయింది. నేను బయటకి వద్దాము అనుకున్నాను. కాని వీడు శిలని అడ్డుపెట్టాడు. నేను ఎంతో కష్టంతో ఆ శిలని పక్కకి తోసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి ఏడు రాజ్యాన్ని పరిపాలిస్తూ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. కావాలనే నన్ను గుహలో పెట్టి రాజ్యాన్ని తీసుకున్నాడు. వీడిని ఎట్టి పరిస్థితులలోను ఆదరించకూడదు. రాజ్యం కోసమని అన్నని హత్య చెయ్యాలని ప్రయత్నం చేసినవాడు" అన్నాడు.
సుగ్రీవుడిని కట్టుబట్టతో బయటకి తరిమేశాడు. అతడు భయపడుతూ బయటకి వెళ్ళిపోయాడు. కాని వదిలిపెట్టకుండా చంపుతానని భూమండలం అంతా తరిమాడు. శాపం వల్ల వాలి ఋష్యమూక పర్వతం మీదకు పోలేడు. అందుకే సుగ్రీవుడు అక్కడ ఉంటాడు.
◆వెంకటేష్ పువ్వాడ.