రాముడు వాలిని చంపాలని ఎందుకు అనుకున్నాడు?
రాముడు వాలిని చంపాలని ఎందుకు అనుకున్నాడు?
హనుమంతుడు రామలక్ష్మణులను సుగ్రీవుడి దగ్గరకు తీసుకెళ్లాడు. "సుగ్రీవా! వచ్చినవాడు శత్రువు కాదు. మహా ప్రాజ్ఞుడైన, ధృడమైన విక్రమము ఉన్న రామచంద్రమూర్తి మరియు ఆయన తమ్ముడు లక్ష్మణుడు. రాముడిని దశరథ మహారాజు అరణ్యవాసానికి పంపిస్తే అరణ్యాలకి వచ్చాడు తప్ప, ధర్మబద్ధమైన నడువడిలేక రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడు కాదు. ఈయన తన భార్య అయిన సీతమ్మతో, లక్ష్మణుడితో అరణ్యవాసానికి వస్తే. ఆయన భార్యను ఎవడో ఒక రాక్షసుడు అపహరించాడు. అందుకని ఆ సీతమ్మని అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. నిన్ను శరణాగతి చేస్తున్నాడు, నీతో స్నేహం చెయ్యాలనుకుంటున్నాడు. అందుకని సుగ్రీవా, ఈయనతో స్నేహం చెయ్యవలసింది" అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడు "రామ! మీ దగ్గర గొప్ప తపస్సు ఉంది. అనేకమైన గుణములు, విశేషమైన ప్రేమ ఉంది. ఇన్ని గుణములు కలిగిన వ్యక్తి నాకు స్నేహితుడిగా లభించడం నా అదృష్టం. ఇటువంటి వ్యక్తి స్నేహితుడిగా లభిస్తే ఈ ప్రపంచంలో దేనినైన పొందవచ్చు. అందుచేత ఇది నాకు దేవతలు ఇచ్చిన వరము అని అనుకుంటున్నాను. రామ! నీకు తెలియని విషయం కాదు, స్నేహం చేసేటటువంటివాడికి ఒక ధర్మం ఉంది. భర్త ఎలాగైతే తన కుడి చేతిని భార్య కుడి చేతితో పట్టుకుంటాడో, అలా స్నేహం చేసేవారు కూడా పట్టుకోవాలి. అందుకని నువ్వు నాతో స్నేహమును కోరుకునే వాడివైతే, నా చేతిని చాపుతున్నాను, నీ చేతిని నా చేత్తో కలుపు" అన్నాడు.
వెంటనే హనుమంతుడు గబగబా వెళ్ళి నాలుగు ఎండిపోయిన కట్టెలని తెచ్చి, కర్రతో కర్రని రాపాడించి అగ్నిహోత్రాన్ని పుట్టించాడు. అప్పుడు రాముడు, సుగ్రీవుడు ఆ అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేసి, ఇద్దరూ తమ చేతులు కలుపుకున్నారు.
అప్పుడు రాముడు "మనిద్దరమూ స్నేహం చేసుకున్నాము, ఇకనుండి ఇద్దరి కష్టసుఖాలు ఇద్దరివీ" అన్నాడు.
సుగ్రీవుడు వెంటనే వెళ్ళి పుష్పించి ఉన్న పెద్ద సాలవృక్షము కొమ్మని విరిచి రాముడికి ఆసనంగా వేసి కుర్చోమన్నాడు. అలాగే హనుమంతుడు ఒక గంధపు చెట్టు కొమ్మని తీసుకొని వచ్చి లక్ష్మణుడిని కుర్చోమన్నాడు. రామలక్ష్మణులిద్దరు కూర్చున్న తరువాత సుగ్రీవుడు "రామ। నన్ను నా అన్నగారైన వాలి రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. నా భార్యను తన భార్యగా అనుభవిస్తున్నాడు. దిక్కులేనివాడినై ఈ కొండమీద మీద జీవితాన్ని గడుపుతున్నాను" అన్నాడు.
అప్పుడు రాముడు "ఉపకారము చేసినవాడు స్నేహితుడు కాబట్టి, నువ్వు కష్టంలో ఉన్నావు కాబట్టి, నేను నీ స్నేహితుడిని కాబట్టి నీకు ఉపకారము చెయ్యాలి. నువ్వు బతికి ఉండగా నీ భార్యను తన భార్యగా అనుభవిస్తున్నాడు వాలి. ఈ ఒక్కమాట చాలు ధర్మం తప్పిన వాలిని చంపడానికి. అందుకని వాలిని చంపేస్తాను" అన్నాడు.
ఈ మాటలు విన్న సుగ్రీవుడు, సుగ్రీవుడి మంత్రులు పొంగిపోయారు. ఒకరిని ఒకరు చూపులతో తాగుతున్నార! అన్నట్టుగా చూసుకున్నారు. అలా రాముడు. సుగ్రీవుడు ఒకళ్ళ చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని సంతోషంగా మాట్లాడుతుంటే, ముగ్గురికి ఎడమ కళ్ళు అదిరాయి. పద్మంలాంటి కన్నులున్న సీతమ్మ ఎడమ కన్ను, బంగారంలాంటి పచ్చటి కన్నులున్న వాలి ఎడమ కన్ను, ఎర్రటి కన్నులున్న రావణాసురుడి ఎడమ కన్ను అదిరాయి. ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే మంచి, మగవాళ్లకు ఎడమ కన్ను అదిరితే చెడు జరుగుతుందనే నమ్మకం అందరికీ తెలిసిందే.
◆ వెంకటేష్ పువ్వాడ.