What Markandeya asked Mahashiva
మార్కండేయుడు మహాశివుని ఏమడిగాడు?
What Markandeya asked Mahashiva
కైలాసానికి చేరుకున్నమార్కండేయుడు అక్కడ జగతికే ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరుల్ని చూసి పరవశుడైపోయాడు. ఒళ్ళు పులకరించిపోయింది. జన్మ ధన్యమైందనుకున్నాడు. రెండు చేతులు జోడించి మాతాపితరుల ముందు సాగిలపడి దండప్రణామాలు ఆచరిస్తూ ఇలా అంటున్నాడు ''స్వామీ చంద్రశేఖరా!లోకమంతా నన్నునీ భక్తుల్లో అగ్రగణ్యుడిగా భావిస్తుంది. నీ గురించి పూర్తిగా తెలిసినవాడినని నన్నుకీర్తిస్తుంది. అయితే నాకు నీ గురించి నీ విశేషమైన మహిమల గురించి, విశిష్టవైభవం గురించి పెద్దగా తెలీదు. ఇది నాకు చాలా చిన్నతనంగా ఉంది. అదీగాక నీ గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసిందే ఎక్కువగా ఉంటుంది. నీ తత్త్వాన్ని అర్ధం చేసుకునేందుకు ఆ నారాయణుడికే భోదపడలేదు ఇక నేననగా ఎంతటివాణ్ణి?! కనుక నాపై దయతలచు..
శ్రీ గిరి నిలయా !నీకిదె
సాగిలపడి మొక్కుచుంటి సత్కృపసాంద్రా!
నీగుణ లీలాచరితము
లాగమములకన్నమాకు అధికమ్మీశా!!
అంటూ తాను వచ్చిన పనిని శంకరునికి నివేదించాడు. ఎంతో ఆర్తిగా, భక్తితో అడిగిన ఆ కోరికకు శంకరుడు కరిగిపోయాడు. అసలే ఆయన భోళాశంకరుడు. అడిగినవారికి అడిగినట్టే వరాలిచ్చే అభయప్రదాత. దుర్మార్గులను సైతం ఆలోచించకుండా అనుగ్రహించే ఆ అభయంకరుడు ఇక భక్తుల విషయంలోఐతే చెప్పాల్సిన అవసరం ఏమిటి? మార్కండేయుడిని చేరదీసి '''నాయనా మార్కండేయా! నీ కోరిక ఎంతో సమ౦జసమైనది. నీ కోరిక మూలంగా నీకే కాదు, ఈ లోకానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. నీ అభీష్టాన్నితీర్చేవాడు ఇక్కడే ఉన్నాడు. నా చరితాన్ని నీకు స్పష్టంగా, నీవు కోరిన విధంగా తెలియచెయ్యగలవాడు నందీశ్వరుడే. కాబట్టి అతడిని ప్రసన్నం చేసుకుని నీ కోరిక నివేదించు .నీ మనోభీష్టం తప్పక నెరవేరుతుంది'' అన్నాడు మహేశ్వరుడు.
కైలాసవాసుడు అలా చెప్పగానే మార్కండేయుడు మరోసారి పార్వతీపరమేశ్వరులకు వినమ్రంగా నమస్కరించి నందీశ్వరుని వద్దకు వచ్చాడు .
''నందీశ్వరా !నీవు శివభక్తులలోకెల్లా గొప్పవాడివి. పరమేశ్వర మహత్యాన్ని బాగా తెలిసినవాడివి. అదీగాక ,పార్వతీ పరమేశ్వరుల గురించి వారి సంతానం విఘ్నేశ్వరుడు, కుమారస్వాములకు కూడా తెలియని ఎన్నో సంగతులు నీకు బాగా తెలుసు. దీనికంతటికి శివానుగ్రహం కావాలి. నా కోరిక తీర్చగల సమర్డుడివి నువ్వే. ఆ విషయం సాక్షాత్తు పరమశివుడే నాకు తెలియజేశాడు. కనుక నన్ను, అనుగ్రహించి శివలీలలు, వైభవాలు, మహిమలు కూలంకషంగా నాకు తెలియజేసి నన్ను పావనం చెయ్యి'' అంటూ నందీశ్వరుని అర్ధించాడు మార్కండేయుడు. అందుకా నంది ఎ౦తో పొంగిపోయి, ''మునికులశ్రేష్ఠా! ఈ శివ పురాణాన్ని ఎవరైతే శ్రద్దగా పఠిస్తారో వాళ్ళకి జన్మే ఉండదు. నియమనిష్టలతో విన్నా, రాసినా సకల సంపదలు చేకూరుతాయి. భోగ, మోక్షదాయకమైనది శివ పురాణం కనుక నేను నీకు తప్పక వినిపిస్తాను'' అన్నాడు నందీశ్వరుడు.
''ఈ మహిమాన్వితమైన శివపురాణాన్ని మీకు వినిపించే భాగ్యం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను'' అన్నాడు సూతుడు. ఇంకా ఉంది....
shiva purana part 11, Brahma manasa putrulu, hindu God's Creation, brahmadeva complete details, brahma in Shiva Purana, auspicious shiva purana in telugu, shiv purana among 18 epics