శంకరులు వేదాలను ఏ వృక్షంతో పోల్చారు?
శంకరులు వేదాలను ఏ వృక్షంతో పోల్చారు?
వేళ్లు పైకి, ఆకులు కిందికి ఉన్నటువంటి అశ్వత్థవృక్షము, నాశము లేనిది అని పెద్దలు చెబుతారు. ఆ అశ్వత్థ వృక్షము యొక్క ఆకులే వేదములు. ఈ విషయమును ఎవరు తెలుసుకుంటారో వారే వేదముల గురించి తెలుసుకున్న వారు అవుతారు.
సంసారమును అశ్వత్థ వృక్షముతో పోల్చారు. అశ్వత్థవృక్షము అంటే రావి చెట్టు. సంసారము అంటే సంగమము. అటాచ్ మెంట్. అనుబంధము. మనకు ఈ బయట కనిపించే ప్రతి వస్తువుతో అనుబంధం ఉంది. అది కావాలి, ఇది వద్దు, అనే అనుబంధము ప్రతి వస్తువుతో, ప్రాణితో, మానవులతో ఏర్పరచుకుంటాము. ఈ సంసారానికి అశ్వత్థ వృక్షానికి కొన్ని పోలికలు ఉన్నాయి. ఈ వృక్షము చాలా పెద్దది. విశాలంగా విస్తరించి ఉంటుంది. అలాగే ఈ సంసారం కూడా అనంతము. దీనికి మొదలు, తుది లేదు. అంతటా విస్తరించి ఉంటుంది. ఈ సంసార వృక్షమునకు మూలము అంటూ మనకు కనపడదు. ఎవరిలో, ఏ కోరిక ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు. ఏ బంధము ఎప్పుడు ఎవరితో ఎలా కలుగుతుందో తెలియదు. అలాగే ఈ అశ్వత్థవృక్షముయొక్క మూలము అంటే తల్లి వేరు ఎక్కడి వరకు వ్యాపించి ఉందో మనకు తెలియదు. కనపడదు.
ఈ సంసారానికి ఎన్నో విధములైన, రకరకాలైన లక్షణాలు, కోరికలు, ఆశలు, ఆశయాలు, అనుబంధాలు, ఉన్నాయి. అవి మనిషికి మనిషికీ మారుతుంటాయి. అవి ఇన్ని అని చెప్పలేము. అలాగే ఈ అశ్వత్థ వృక్షానికి కూడా అనేకములైన శాఖలు ఉపశాఖలు రెమ్మలు ఉన్నాయి. ఈ అశ్వత్థ వృక్షానికి లెక్కపెట్టలేనన్ని ఆకులు ఉన్నాయి. ఆ ఆకులతోనే చెట్టు తన ఆహారాన్ని తయారుచేసుకుంటుంది. సంసారంలో కూడా లెక్కపెట్టలేనన్ని కర్మలు ఉన్నాయి. మనం చేసే పనులు ఇన్ని అని చెప్పలేము. క్షణానికో పని చేస్తుంటాము. ఈ కర్మలతోనే ఈ సంసారాన్ని నడుపుతుంటాము. పోషిస్తుంటాము. ఫలప్రదం చేస్తుంటాము.
ఈ కర్మకాండలన్నీ మనకు వేదములలో చెప్పబడ్డాయి. అందుకే ఈ చెట్టు ఆకులను వేదములతో పోల్చారు. (ఛందాంసి యస్య పర్ణాని) ఈ అశ్వత్థ వృక్షమునకు పళ్లు కాస్తాయి. ఈ సంసారము అనే మహావృక్షము మనం చేసే కర్మలకు తగిన ఫలితములను, అంటే సాత్విక కర్మలకు, రాజస కర్మలకు, తామస కర్మలకు, వాటి వాటికి అనుగుణమైన ఫలితములను, ఇస్తుంటాయి. ఈ అశ్వత్థవృక్షము అనేకములైన పక్షులకు, మానవులకు, గూళ్లు కట్టుకోడానికి, పళ్లు తినడానికీ, దాని కింద విశ్రమించడానికీ, ఆశ్రయం అవుతూ ఉంది. అలాగే సంసార వృక్షం కూడా అందులో ఉండే మానవులకు, ప్రాణులకు ఆశ్రయంగా ఉంటూ ఉంది. ఈ సంసారంలో పడిన వారికి ఆశ్రయం కల్పిస్తూ ఉంది. మంచి కర్మలు చెడు కర్మలు చేయిస్తూ ఉంటుంది. మంచి చెడు ఫలితములను ఇస్తూ ఉంటుంది. ఈ అశ్వత్థ వృక్షమును గొడ్డళ్లతో నరికి నాశనం చేయవచ్చు. అలాగే ఈ సంసారము అనే వృక్షమును జ్ఞానము అనే గొడ్డలితో సమూలంగా నాశనం చేయవచ్చు. ఈ కారణాలచేత సంసారమును అశ్వత్థవృక్షముతో పోల్చవచ్చు అని శంకర భగవత్పాదులవారు బోధించారు.
◆వెంకటేష్ పువ్వాడ.