స్త్రీలను చెడుగా చూపించదానికి కారణాలివే!
స్త్రీలను చెడుగా చూపించదానికి కారణాలివే!
మన జీవితంలో పరిచయాలు, స్నేహాలు అనేవి సాధారణమైనవి. అయితే ఇప్పటి జనరేషన్ లో స్త్రీ, పురుష స్నేహం అనేది వ్యతిరేకించాల్సిన అంశం కూడా కాదు. స్త్రీ, పురుషుల స్నేహం కూడా ఎంతో సాధారణం అయిపోయింది. కుటుంబాలకు కూడా తెలిసి ఇలా స్నేహంలో ఉన్నవారున్నారు.
అయితే స్నేహం కావచ్చు, పరిచయం కావచ్చు, వేరే ఇతర బంధం కావచ్చు. దానిలో ఒక మగవాడిది తప్పైతే, ఆ విషయం బయటకు తెలిస్తే చాలామటుకు కేవలం ఆ వ్యక్తిని మాత్రమే నిందించడం, అతడిని చెడ్డవాడిగా చూసి వదిలేయడం చేస్తారు. కానీ అదే స్థానంలో ఒక ఆడపిల్ల ఉంటే ఆమెను ఎన్ని రకాలుగా అనాలో అన్నిరకాలుగా నిందిస్తారు, నడవడిక, ప్రవర్తన, తల్లిదండ్రుల పెంపకం నుండి పూర్తిగా స్త్రీలవైపు మళ్లడం, పూర్తిగా స్త్రీ జాతిని నిందించడం చాలామంది అలవాటు. ఇలా ఒక తప్పు జరిగినపుడు కేవలం ఆ వ్యక్తులను మాత్రమే కాకుండా పూర్తిగా ఆ జాతి మొత్తాన్ని నిందించడం న్యాయమేనా??
స్త్రీజాతి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో ఇదీ ఒకటి. సాధారణంగా ఏ సోషల్ మీడియా లోనో ఎవరో ఆడవాళ్లు అసభ్య దుస్తులు వేసుకోవడం, లేదా ఏదైనా తప్పు చేసి దొరికిపోవడం గురించి చూస్తే అందరూ కేవలం ఆమెను కాకుండా మొత్తం స్త్రీజాతిని నిందించడం బాగా గమనించవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుంది??
ఆడవాళ్లు ఒకరిమీద మరొకరు అసూయతో ఉండటమే మొదటి కారణం!!
ఆశ్చర్యపోవాల్సిందేమి లేదు. ఎక్కడైనా ఒక ఆడదాని విజయం గురించి చర్చ జరిగితే మరొక ఆడది దాన్ని మనస్ఫూర్తిగా అభినందించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి.
ముఖ్యంగా ప్రతి ఇంట్లో తండ్రి తరువాత బాధ్యత అంతా కొడుకుదే అనేవాళ్ళు ఆ బాధ్యతను కూతురుకి ఇవ్వడానికి అయినా ఆలోచన చేస్తారా అంటే చేయరు. కారణం కొడుకు ఉండగా కూతురుకి హక్కు ఏమిటని వాదిస్తారు. అలాగే పెళ్లయ్యాక అత్తింట్లో అత్త స్థానాన్ని కోడలు భర్తీ చేయాలని అనుకుంటారు, కానీ అత్తలు మాత్రం కొడళ్లను మనస్ఫూర్తిగా అభినందించే సందర్బాలు, ఇంటి బాధ్యతను పూర్తిగా కోడళ్ల చేతిలో పెట్టే పరిస్థితులు అరుదు. కారణం కొడుకు తన చెయ్యి దాటిపోతారని, తనకు విలువ తగ్గుతుందని. ఆఫీసుల్లోనూ, పనుల్లోనూ, ఇంటా బయట ఎక్కడ చూసినా ఎదుటి ఆడదాన్ని చూసి సంతోషపడేవాళ్ళు తక్కువ.
అమ్మాయిల మధ్య స్నేహం నిలబడదు అనేది నిజమా పుకారా?
సాధారణంగా చాలామంది రెండు కొప్పులు ఒకచోట ఇమడవు అంటారు. అంటే ఇద్దరు ఆడవాళ్లు ఆరోగ్యకరంగా కలిసుండటం జరగదని. నిజానికి దీన్ని ఒక పుకారుగా ప్రచారం చేసినవాళ్లే దాన్ని చాలామంది మెదళ్ళలో ఇరికించారు. అబ్బాయిలకు మల్లే అమ్మాయిలు కూడా మంచి స్నేహితులుగా ఉంటారు. అయితే సున్నితత్వం వల్ల చిన్న విషయాలకు కూడా తొందరగా డిస్టర్బ్ అయిపోయి స్నేహాన్ని వదులుకోవడానికి సిద్ధమవుతారు. ఇవి మాత్రమే కాకుండా జీవితంలో కొన్ని పరిస్థితులలో ఆడవారి వల్లనే నష్టాన్ని చవిచూడటం వల్ల ఆడవారు వేరే ఆడవారితో స్నేహానికి విముఖంగా ఉంటారు.
భావోద్వేగాలే మూలకారణం!!
స్త్రీలలో భావోద్వేగాలు ఎక్కువ. వాటిని వ్యక్తం చేయడం కూడా ఎక్కువ. ముఖ్యంగా మగవారికిలా బయట ప్రపంచంతో అనుబంధం అంతగా ఉండదు. దానివల్ల తాము ఎవరినైనా స్నేహితులుగా భావిస్తే వారితో అన్ని చెప్పేసుకుంటారు. అయితే అవతలి వాళ్ళు వాటిని తమ వరకు ఉంచుకోకుండా ప్రచారపరంపరలో పడిపోతారు. సరిగ్గా ఈ అంశం వల్లనే స్త్రీలకు ఒకరంటే మరొకరు ఎడముఖం పెడముఖంగా ఉంటారు.
స్త్రీలు ఒకరికొకరు తోడుగా నిలబడితేనే సాధికారత ఏదైనా సాధ్యమవుతుంది. దీనికోసం ఇలాంటి అపార్థాల తెరలు తొలగించేసుకోవాలి. ఇంటిలో పరువంతా ఆడవాళ్లదేనని, ఒకరు తప్పు చేస్తే దాన్ని స్త్రీజాతి మొత్తం ఆపాదించి మాట్లాడే వైఖరిని, స్త్రీల పట్ల సమాజంలో తొందరగా దొర్లిపోయే మాటలను అరికట్టాలంటే పరిష్కారాలు ఎక్కడో లేవు. వాటిని స్త్రీలు మాత్రమే చేయగలరు. ఈ ప్రపంచం స్త్రీలకు స్త్రీలను శత్రువులుగా చూపిస్తున్నంత కాలం స్త్రీలు సాధికారత సాధించలేరు. కాబట్టి స్త్రీలు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి.
◆నిశ్శబ్ద.