Read more!

లంకె బిందెలు దొరికితే?! (Lucky Pots)

 

లంకె బిందెలు దొరికితే?!

(Lucky Pots)

లంకె బిందెలు పేరు వింటే చాలు మన ముఖాలు వికసిస్తాయి. ఎవరికో లంకె బిందెలు దొరికాయని వింటే ''అవునా'' అని కళ్ళు తేలేస్తాం. అదే ఒకవేళ మనకే దొరికితే.. గుండె ఒక్కక్షణం ఆగిపోయి, వెంటనే నూట డెబ్భైసార్లు కొట్టుకుంటుంది.

 

ప్రపంచంలో లక్ష్మీదేవికి ఉన్న గ్లామర్ మరెవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. డబ్బు ఆడిస్తుంది, పాడిస్తుంది. తన చుట్టూ తిప్పుకుంటుంది. ఎంత వాడైనా కాంతకి దాసుడు అన్నారు కానీ, నిజానికి ఆడామగా తేడా లేకుండా అందరూ డబ్బుకి దాసులు. డబ్బు ఉంటే కొండమీది కోతి అయినా దిగివస్తుంది. ఆ డబ్బే లేకపోతే ఉన్నవి కూడా రెక్కలు కట్టుకు ఎగిరెళ్ళిపోతాయి.

 

ఇంత విలువైన డబ్బు ఏ కష్టం చేయకుండా, ఎంతమాత్రం శ్రమించకుండా, అనుకోకుండా, అకస్మాత్తుగా దొరికితే ఎలా ఉంటుంది? అల్లా-ఉద్దీన్ అద్భుత దీపం గుర్తుకొస్తోందా? విఠలాచార్య సినిమాలు తలపుకొస్తున్నాయా? హారీ పోటర్ సిరీస్ కళ్ళముందు మెదులుతున్నాయా? అబ్బే, అవేవీ కాకుండా నిజంగా అలాంటి అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. నిజానికి ఇలాంటి మిస్టరీలు, మిరాకిల్సే సోషియో ఫాంటసీ సినిమాలకి ప్రేరణ.

 

ఇంతకీ, ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ ఏమిటంటే, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. వెంకటేశ్వరరావుది బతికి చెడిన కుటుంబం. తాతల ఆస్తులు చాలా ఉండేవి కానీ, అవన్నీ క్రమక్రమంగా హారతికర్పూరంలా కరిగిపోయాయి. ప్రస్తుతం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఒకరోజు వేంకటేశ్వరరావు కూతురి కాలి పట్టాలు బావిలో పడ్డాయి. పడటం అంటే, ఐదేళ్ళ బుడత తెలీక, బావిలో పడేసింది. కరువులో అధికమాసంలా ఇదేమిటని భార్య మొత్తుకోవడంతో వెంకటేశ్వరరావు గజ ఈతగాడైన వీరయ్యను బ్రతిమాలి బావిలో దింపాడు.

 

వెంకటేశ్వరరావు కూతురి కాలి పట్టాల కోసం వెతుకుతుంటే ఓ విడ్డూరం జరిగింది. బావిలో రెండు బిందెలు ఉన్నాయంటూ వీరయ్య నీటిపైకి వచ్చి చెప్పాడు. ''ఏమిటీ, బిందెలా, ఎప్పుడూ పడలేదే'' అని ఆశ్చర్య పోయారు. ''సరే, పైకి తీసుకురా'' అన్నారు. వీరయ్య మళ్ళీ నీటిపైకి ముఖం పెట్టి ''ఖాళీగా లేవు, బరువుగా ఉన్నాయి'' అని చెప్పాడు.

''నీ ముఖంలే... నీళ్ళతో బరువుగా ఉండవా మరి? నీళ్ళు వంపేసి తీసుకురా''

''నీళ్ళ బరువు కాదురా బాబూ.. మూత పెట్టి ఉన్నాయి.. బహుశా లంకె బిందెలేమో..''

''లం...కె... బిందెలే?'' నోరు తెరిచి గంపెడు ఆశ్చర్యంగా అన్నాడు వెంకటేశ్వరరావు.

అతని భార్య కూడా అంతే ఆశ్చర్యంగా బావిలోకి తొంగి చూస్తోంది.

''పైకి తెచ్చాక అవేంటో చూద్దాం గానీ, ముందో తాడు నీళ్ళలోకి వదులు'' అన్నాడు వీరయ్య.

వెంకటేశ్వరరావు క్షణంలో ఇంట్లోకి పరిగెత్తి తాడు బావిలోకి వేశాడు.

వీరయ్య కష్టంమీద రెండు బిందెలకీ తాడు జాగ్రత్తగా బిగించాడు. వెంకటేశ్వరరావు బిందెలను జాగ్రత్తగా పైకి లాగాడు.

వీరయ్య కూడా వెంటనే బావిలోంచి పైకి వచ్చాడు.

వెంకటేశ్వరరావు బిందెల్లో ఏముందో అని భయపడుతూ చూశాడు.

వీరయ్య నవ్వి, ''నీకు మంచి రోజులు వచ్చాయిలే.. ముందు దేవుడికి, తాత, తండ్రులకీ దణ్ణాలు పెట్టుకుని మూత తెరువు'' అన్నాడు.

వెంకటేశ్వరరావు, అతని భార్య కూడా తెగ దణ్ణాలు పెట్టారు.

ఒణుకుతున్న చేతులతో బిందెల మూతికి కట్టిన గోనె సంచిని విప్పాడు. అది ఏనాటిదో కానీ చీకిపోయి ఉంది. లోపల గట్టిగా బిగించిన మూతలు కూడా తీశాడు. రెండు బిందెల్లో ముప్పావు శాతం చొప్పున బంగారు నాణాలు ఉన్నాయి.

ముగ్గురికి ముగ్గురూ ఆ విడ్డూరాన్ని ఆశ్చర్యంగా చూశారు.

లంకెబిందెల గురించి వినడమే తప్ప ఇలా ఎప్పుడూ చూడలేదు. కళ్ళు తేలేశారు. రెండు క్షణాలు నోట మాట పెగల్లేదు.

కాసేపటికి తేరుకున్న వెంకటేశ్వరరావు ''వీరయ్య, ఇదంతా నీ చలవే.. ఇదిగో తీసుకో'' అంటూ దోసిలి నిండా బంగారు నాణాలు తీసి ఇవ్వబోయాడు.

''అయ్యబాబోయ్.. ఒక్కటి కూడా వద్దు.. లంకె బిందెలంటే ఏమనుకున్నావ్? మీ తాతముత్తాతలు దొంగల భయంతోనో, మనవలు, మునిమనవలు సుఖంగా ఉండాలనో ఇలా బావుల్లో, గోతుల్లో దాచి పెడతారట. ఇవి ఆ కుటుంబంలో వాళ్ళే తప్ప, ఇతర్లు ముట్టుకోకూడదు అంటారు..''

''నా ఇష్టంతో ఇస్తున్నాగా, తీసుకో వీరయ్యా.. నువ్వే బావిలోకి దిగకపోతే, నాకు దొరికేవా చెప్పు''

''వద్దు బాబోయ్.. నీ ఇంట్లో పండిన కాయో, ఫలమో ఇవ్వు, తీసుకుంటా.. పిలిచి భోజనం పెట్టు, తృప్తిగా తింటా.. అంతే తప్ప, వీటిల్లో మాత్రం భాగం ఇస్తాననకు.. ప్రాణం పోయినా తీసుకోను.. కావాలంటే, పేదసాదలకి కొంత పంచిపెట్టు..'' అంటూ వీరయ్య వెళ్ళిపోయాడు.

వెంకటేశ్వరరావు, అతని భార్య ఆ అపూర్వ నిధిని అలా చూస్తూనే ఉన్నారు.

Pots with gold coins, pots with gold in well, Lanke bindelu, Lucky Pots, pots with gold in underground