సుఖదుఃఖాలను నిర్వచించిన కృష్ణ భగవానుడు
సుఖదుఃఖాలను నిర్వచించిన కృష్ణ భగవానుడు
ప్రపంచంలో ప్రాంతాలు ఏవైనా, మనుషులు ఎక్కడివారైనా ప్రతి మనిషి జీవితంలో ప్రధాన పాత్ర పోషించే అంశాలు రెండు ఉంటాయి.
1. సుఖం
2. దుఃఖం
మనిషి తన జీవితంలో ఈ రెండింటి మధ్య సతమతం అవుతుంటాడు. సాధారణంగా సుఖాలకు పొంగిపోవడం, దుఃఖాలకు కృంగిపోవడం మనం చూస్తూనే ఉంటాం. ఎందుకు ఇలా మనిషి రెండిటి మధ్య సందిగ్ధపడుతూ ఉంటాడు. రెండు తన జీవితంలో జరిగేవే, సుఖం అయినా, దుఃఖం అయినా రెండు కూడా తన ప్రమేయంతో జరిగే పనుల వల్ల కలిగే ఫలితాలే. మరి అలాంటప్పుడు రెండింటిని సమానంగా తీసుకోలేకపోతున్నాం ఎందుకని??
ఇదంతా మనకు ఏ విదేశీ మానసిక శాస్త్రవేత్తనో మానసిక విశ్లేషణలో చెప్పి ఉంటాడని అనిపిస్తూ ఉంటుంది. కానీ శాస్త్రవేత్తలకు, పరిశోధకుల కంటే ముందే మన భారతీయ గ్రంథాలలో ఒకటైన, ప్రతి మనిషి తన జీవితకాలంలో తప్పక తెలుసుకోవలసిన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడనే విషయం చాలామందికి తెలియదు. అవును మరి మహాభారతాన్ని, భగవద్గీతను ప్రస్తుత తరంలో ఎంతమంది చదువుతున్నారు అంటే ప్రశ్నార్ధకమే ఎదురవుతుంది.
【సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజమౌ, తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాప మవాప్స్యసి.】
తాత్పర్యం:- ఇది సుఖదాయకము, ఇది దుఃఖదాయకము అను భావము మనస్సులో
లేకుండ, సుఖముపట్ల ఆసక్తిగాని దుఃఖము యందు విరక్తి భావముగాని లేకుండా,
రెంటియందును సమభావము కలిగియుండి, లాభనష్ట భావము కూడ లేకుండ, జయపరాజయ భావము అనగా జయమునందు ఆసక్తి మరియు అపజయము నందు దుఃఖభావము లేకుండ యుద్ధము చేయుటకు నీవు సన్నద్ధుడవుకమ్ము. అలా యుద్ధము చేసినట్లయితే ఆ యుద్ధమునందు నీవు ఎంతమందిని చంపినా నీకు పాపము అంటదు. అట్టి సమభావము వలన నీకు సుఖదుఃఖాదులు సంభవించవు.】అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి భోదిస్తాడు.
పైన చెప్పబడిన శ్లోకం, దాని తాత్పర్యం భగవద్గీతలోని రెండవ అధ్యాయం, ముప్పై ఎనిమిదవ శ్లోకం. శ్లోకాన్ని చదివి అర్థం చేసుకుంటే ఆ విషయం నిజమేనని తెలుస్తుంది.
ఇది సుఖం, ఇది దుఃఖం అనే విషయాలను మనసులో లేకుండా, సుఖం అనే విషయం పట్ల ఆసక్తి కానీ, దుఃఖం అనే విషయం పట్ల విరక్తి భావం కానీ కలిగి ఉండకుండా, రెండు విషయాల పట్ల ఒకే విధమైన ప్రవర్తన కలిగి, రెండింటికి ఒకే విధంగా స్పందిస్తూ ఉండాలి. దీని వల్ల లాభం, దీని వల్ల నష్టం అని ఆశించడం మరియు వదులుకోవడమనే విషయాలను ఎప్పటికి పరిగణలోకి తీసుకోకూడదు. అలాగే ఈ పోటీ ప్రపంచంలో కొన్ని విషయాలలో గెలుస్తూ, విజయం సాధిస్తూ ఉంటాము. మరికొన్ని విషయాలలో ఓటమి పాలు అవుతూ ఉంటాము. అలాంటివాటిని కూడా వేరు వేరుగా చూడకుండా రెండింటి గురించి ఆలోచించకుండా కేవలం చేయవలసిన విషయం గురించి ఆలోచించి, పనిని చేయడం మాత్రమే మనిషి కర్తవ్యం అని. అలాంటి భావన మనసులో ఉంటే ఏ సుఖదుఃఖాలు మనిషిని వెంటాడవని, ఎలాంటి దిగులు జీవితంలో ఉండదని తెలుపుతుందీ శ్లోకం.
మనిషి జీవితంలో గందరగోళానికి కారణమైన సుఖదుఃఖాలను సమానంగా తీసుకోవడమనే విషయం తేలికైనది ఏమి కాదు. కానీ అసాధ్యం కాదు కదా. ప్రస్తుత తరం చిన్న చిన్న పరాజయాలకు కృంగిపోతూ, కొన్ని సందర్భాలలో ఆత్మహత్యల వరకు వెళుతున్న సందర్భాలు నిత్యం చూస్తూనే ఉంటాము. కాబట్టి మొక్కకు రక్షణ, పోషణ ఇస్తే మహావృక్షం అవుతుంది. అలాంటి పోషణ ఏదంటే, ఇదిగో ఇలాంటి జ్ఞానాన్ని పిల్లలకు విశ్లేషణగా చెప్పడమే.
◆ వెంకటేష్ పువ్వాడ