అక్షరమే పరబ్రహ్మ అని నొక్కి చెప్పిన శ్రీకృష్ణ భగవానుడు!!
అక్షరమే పరబ్రహ్మ అని నొక్కి చెప్పిన శ్రీకృష్ణ భగవానుడు!!
అంతః బాహ్య చైతన్యాల గురించి వివరిస్తూ అంతంలేని అక్షరాన్ని ప్రస్తావిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎనిమిదవ అధ్యాయం అయిన అక్షరబ్రహ్మ అధ్యాయంలో మూడవ శ్లోకాన్ని ప్రస్తావిస్తాడు. అందులో నిఘూడంగా దాగి ఉన్న విశ్లేషణ తప్పక తెలుసుకోవలసిందే!!
శ్లోకం:- అక్షరం బ్రహ్మ పరమం స్వభావోని ధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంక్షితః॥
అన్నిటికంటే ఉత్తమమైనది, నాశనము, మార్పులేనిది అయిన దానిని బ్రహ్మము అని అంటారు. ఆ బ్రహ్మ యొక్క స్వభావమే అధ్యాత్మము అని చెప్పబడుతుంది. ప్రాణులను ఉత్పత్తి చేయాలని భావించడం, వాటిని ఉత్పత్తి చేయడం అనే వాటిని కర్మ అని అంటారు. బ్రహ్మ అంటే అక్షరము అంటే నాశనము లేనిది. అది పరమ మైనది అంటే అన్నిటి కంటే గొప్పది. అంతకంటే పెద్దది, గొప్పది, ఉత్తమమైనది మరొకటి లేదు. మనం ఈ ప్రపంచంలో చూసేవి అన్నీ ఏదో ఒక రోజు నశించిపోతాయి లేక మార్పు చెందుతాయి. కాని ఎటువంటి మార్పుచెందకుండా నాశనం లేకుండా ఉండేది. బ్రహ్మము, దీనినే మనం పరాప్రకృతి అని కూడా అనవచ్చు.
అధ్యాత్మము అంటే స్వభావము. తియ్యగా ఉండటం చక్కెర స్వభావము. చక్కెర ప్రతి కణంలోనూ తీపిదనం ఉంటుంది. అలాగే కాలడం అగ్నిస్వభావము. చిన్న నిప్పు రవ్వఅయినా, పేద్ద దావానలము అయినా కాలడం దాని స్వభావము. ఈ స్వభావము కంటికి కనపడదు. అనుభవంతోనే తెలుసుకోవాలి. అలాగే శరీరంలో ఉండే చైతన్యం కూడా దాని స్వభావమే.
చైతన్యం శరీరంలోనే కాదు బయట కూడా ఉంది. కాని శరీరంలో ఉండే చైతన్యము శరీరము యొక్క స్వభావము. ఈ స్వభావము అంతటా విస్తరించి ఉంటే దానిని బ్రహ్మ అంటారు. పరిమితంగా శరీరంలో ఉంటే దానిని పరిమిత చైతన్యము అని అంటారు. దానినే అధ్యాత్మ, జీవాత్మ అని కూడా అంటారు.
విసర్గ: అంటే మనం సంకల్పించి, ఆ సంకల్పములో నుండి పుట్టే పనులను కర్మలు అంటారు. ఈ కర్మలే సృష్టికి మూలము, బీజము, ఉదాహరణకు ఆడ మగ కలవాలని సంకల్పించి, దానిని కార్యరూపంలో పెడితే, అది మరొకరిని సృష్టిస్తుంది. ఈ సృష్టికార్యములు సృష్టిని నిరంతరం కొనసాగిస్తున్నాయి. ప్రపంచాన్ని జీవజాలంతో నింపుతున్నాయి. అంటే మరొక జీవిని కానీ, మరొక వస్తువును కానీ సంకల్పించి, సృష్టించే పనిని, కర్మ అని అంటారు.
ఈ అధ్యాయం అక్షర బ్రహ్మ అనేపదాలతో మొదలయింది. అందుకే ఈఅధ్యాయానికి అక్షర బ్రహ్మ యోగము అని పేరు. కాబట్టి ఈ అక్షర బ్రహ్మ గురించి, స్వభావం గురించి ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే అన్ని జీవరాసులలో అంతర్లీనంగా ఉండే చైతన్యమే ఆత్మస్వరూపము. కాని మానవులు ఈ ఆత్మస్వరూపమును తెలుసుకోలేక ఈ శరీరము నేను అని అనుకుంటున్నారు. అదే వారి స్వరూపము అని అనుకుంటున్నారు. కాని మానవుల స్వరూపము ఆత్మ, దేహము కాదు. ఆత్మ పరమాత్మ స్వభావంతో అన్ని జీవరాసులలో వెలుగుతూ ఉంది. ఆత్మ స్వరూపాన్ని అంటే స్వభావాన్ని తెలుసుకోనంత కాలము జీవుడు ప్రాపంచిక సుఖముల కోసం పాకులాడుతుంటాడు. అదే నిజము సత్యము అనుకుంటాడు. అవన్నీ క్షరములు అనీ అక్షరము పరబ్రహ్మ అనీ తెలుసుకోలేరు. కాబట్టి ప్రతి మానవుడూ తన స్వభావము ఆత్మ అనీ శరీరము కానీ, ప్రాపంచిక వస్తువులు కావనీ తెలుసుకోవాలి.
కర్మ అంటే ఈ సృష్టిని కొనసాగించడానికి అవసరమైన పనులే కర్మలు. మానవుల మంచి కోసం మనుగడ కోసం చేసే పనులే కర్మలు, యజ్ఞయాగములు, పూజలు, వ్రతములు ఆరాధనలు, ధ్యానము, నిష్కామ యోగములు, దానములు ఇవన్నీ కర్మలు. ఇవి మానవుల సుఖసంతోషాలను వర్ధిల్లచేసేవి. వీటినే సత్కర్మలు అని కూడా అంటారు. సత్కర్మలు కానివి దుష్కర్మలు, వాటి వలన దుఃఖము కలుగుతుంది.
మరి సత్కర్మలు చేయాలో, దుష్కర్మలు చేయాలో నిర్ణయం మనదే!!
◆ వెంకటేష్ పువ్వాడ