Nala Maharaj

 

నలమహారాజు వంటవాడిగా ఎలా మారాడు?

Nala Maharaj

 

నలుడు నిషధదేశ రాజు వీరసేనుడి కుమారుడు. పూర్వజన్మలో ఇతడు ఆహుకుడనే భిల్లుడు. శివుని వర ప్రభావం వల్ల ఇతడు నలుడిగా జన్మించాడు. శని దృష్టి ప్రభావం ఒకరి జీవితాన్ని ఎంతగా దిగాజారుస్తుందో తెలియజేయడానికి నలుని కథ ఒక ఉదాహరణ.

 

నలుడు ఒకరోజు తన ఉద్యానవనంలోని ఓ హంసను పట్టుకోగా, ఆ హంస మానవభాషలో మాట్లాడుతూ, తనను విడువమని, అలా విడిచిపెట్టినట్టయితే దమయంతి అనే అందాలరాశితో వివాహమయ్యే విధంగా ప్రయత్నిస్తానని చెబుతుంది.

 

నలుడు హంసను వదిలేయగా, హంస దమయంతి వద్దకు వెళ్ళి, నలుడి గురించి చెబుతుంది. నలుడి గుణగణాలు విన్న దమయంతి అతడినే వివాహం చేసుకుంటానని చెబుతుంది. అయితే స్వయంవరానికి నలుగురు దిక్పాలకులు నలుని వలె మారువేషంలో వచ్చినా, చివరకు ఆమె నలుడినె వరిస్తుంది. అయితే దమయంతి నలుడినే వరించడంతో దిక్పాలకులు అసూయ పెంచుకుని, నలుడిపై పగబడతారు.

 

ఒకనాడు శని వారితో కలిసి, తను అవకాశం చూసుకుని నలుడిపై దృష్టి సారిస్తానని చెబుతాడు. ఒకరోజు అపరిశుభ్రంగా ఇంట్లోకి వచ్చిన నలుడిని శని పట్టి పీడించడం ప్రారంభిస్తాడు. శని ప్రభావంతో పుష్కరుడనె రాజుతో జూదానికి దిగిన నలుడు రాజ్యం సర్వస్వం కోల్పోతాడు.

 

ఒక అడవిలో పక్షులను పట్టుకోవడానికి తన వద్ద ఉన్న వస్త్రం విసరగా, పక్షులు ఆ వస్త్రంతో సహా ఎగిరిపోతాయి. కర్కోటకుడు అనే పాము అడవిలో కార్చిచ్చులో చిక్కుకోగా, ఆ పామును నలుడు రక్షిస్తాడు. ఆ సర్పం వెంటనే నలుడిని కరుస్తుంది.

 

నలుడు కురూపిగా మారిన తర్వాత ఆ సర్పం ఈ రూపం నీకు వరం వంటిదని, నలుడిగా ఎవరూ గుర్తించరని, అశ్వహృదయమనే విద్య నేర్పి అదృశ్యమవుతుంది.

 

అశ్వహృదయ విద్య ప్రత్యేకత ఏమిటంటే, ఏ అశ్వం ఎటువంటిదో గుర్తించి దాని శక్తిసామర్థ్యాల మేరకు అశ్వాన్ని అత్యంత వేగంతో నడపగలగడం సాధ్యమవుతుంది, నలుడు దమయంతిని అడవిలో వదిలేయగా, ఆమె తన తండ్రి వద్దకు చేరుతుంది.

 

నలుడు ఋతుపర్ణుడనే రాజు వద్ద బాహుకుడనే పేరుతో వంటవానిగా చేరతాడు. నలుడు అడవిలో అదృశ్యమయ్యాడని, దమయంతి తండ్రికి చెప్పగా అతను నలుడి కోసం గూఢచారులను అన్ని రాజ్యాలకూ పంపుతాడు.

 

నలుడు కురూపిగా మారినా, అతని గుణగణాల ఆధారంగా గూఢచారులు అతడిని నలుడిగా అనుమానించి, ఆ విషయాన్ని తమ రాజుకు చెబుతారు. అప్పుడా రాజు, తన కుమార్తెకు తిరిగి స్వయంవరం నిర్వహిస్తున్నానని ప్రకటిస్తాడు.

 

సమయం తక్కువగా ఉన్నప్పటికీ అశ్వహృదయం తెలిసిన బాహుకుడు ఋతుపర్ణుడిని త్వరగా దమయంతి స్వయంవరానికి చేర్చగలుగుతాడు.

 

అక్కడ బాహుకుడికి అనేక పరీక్షలు నిర్వహించి, అతడే నలుడు అని తేల్చడంతో నలుడు తిరిగి తన సహజ రూపానికి వస్తాడు. తర్వాత పుష్కరుడిని ఓడించి, తన రాజ్యం కూడా సంపాదించుకుంటాడు.

 

king Nala changes as cook , Nala maharaju, Nala chakravarti, story of Nala, the story of Nala maharaja