చేతబడులు ఉన్నాయా ? (Black Magic - true or false)

 

నమ్మలేని నిజాలు (Mysteries and Miracles)

 

చేతబడులు ఉన్నాయా ?

 

చేతబడి అనే మాట ఇప్పటికీ తరచుగా వినిపిస్తుంటుంది. ఈ అభ్యుదయకాలంలోనూ చేతబడిని నమ్మేవాళ్ళు ఎందరో ఉన్నారు. కొందరు చేతబడి చేస్తున్నారు. కొందరు చేయిస్తున్నారు. ఇంతకీ అసలు చేతబడి అంటే ఏమిటి?

అపరాత్రి వేళ మంత్ర తంత్రాలతో క్షుద్ర శక్తులను పూజిస్తూ, వాటి సాయంతో అనుకున్న వ్యక్తికి కీడు చేయడాన్నే చేతబడి అంటారు. తమకు గిట్టనివారికి హాని జరగాలని, లేదా, వాళ్ళని అసలు లోకంలోనే లేకుండా చేయాలనే దురాలోచనతో చేసే క్షుద్రపూజ అన్నమాట. చేతబడికి బాణామతి, చిల్లంగి, మర్మ కళ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇంగ్లిష్ లో విచ్ క్రాఫ్ట్, బ్లాక్ మాజిక్ అంటారు.

ముస్లింలు కూడా చేతబడులను నమ్ముతారు. వాళ్ళు ఈ నమ్మకాన్ని “సిహ్ర్”, “తావీజ్” అని పిలుస్తారు. “సిహ్ర్” అనేది అరబిక్ పదం. అంటే బ్లాక్ మాజిక్ అని అర్ధం. జీనీ అంటే అరబిక్ లో భూతం అని అర్ధం. ఖురాన్ లో జీనీల ప్రస్తావన ఉన్నప్పటికీ, వాటిని తీవ్రంగా ఖండించింది.

చేతబడి అనేది ఒట్టి మూఢ నమ్మకం అని కొట్టి పడేసే హేతువాదులతోబాటు, దీన్ని నూటికి నూరుశాతం నమ్మి భయభ్రాంతులయ్యేవాళ్ళూ ఉన్నారు.

యదార్ధంగా జరిగిన సంఘటన చూడండి.

పానకాల రావుకు పక్క వీధి చలమయ్యతో గొడవ జరిగింది. అది ఎంతవరకూ వెళ్ళిందంటే, చలమయ్యను సర్వ నాశనం చేసేయాలని కంకణం కట్టుకున్నాడు పానకాలరావు.

స్మశానం పక్కనుండే చేతబడుల నరసింహాన్ని కలిశాడు.

పానకాలరావు డబ్బివ్వడంతో, చలమయ్యమీద చేతబడి చేసేందుకు క్షుద్ర పూజలు ప్రారంభించాడు నరసింహం.

అర్ధరాత్రిపూట పసుపు, కుంకుమ, వేపాకులు, మేకపోతు రక్తంతో మనోవికారం కలిగించే వికృత భయానక చర్య అది.

పక్కా పల్లెటూరు కావడంతో ఈ సంగతి వెంటనే బయటకు పొక్కింది.

ఆ నోట, ఈ నోట వెళ్ళి చలమయ్య చెవి చేరింది ఆ వార్త.

రెండు రోజులైనా గడవకముందే చలమయ్య మంచాన పడ్డాడు.

అది క్షుద్ర శక్తుల ప్రభావమేనని అందరూ అన్నారు.

తిక్క కుదిరింది అంటూ కసిగా, కర్కశంగా నవ్వుకున్నాడు పానకాలరావ్.

“చేతబడి అనేది లేనేలేదని, చలమయ్య మూలపడ్డాడు అంటే, కాకతాళీయంగా ఆరోగ్యం అయినా పాడయ్యుండాలి లేదా మానసిక భయంతో రోగం వచ్చినట్లు భ్రమకు లోనై అయినా ఉండాలి” అన్నారు ఆ ఊరి పూజారి గారు.

 

ఏది నిజమో మాత్రం ఎవరికీ అర్ధం కాలేదు.

ఈ మిస్టరీపై మీ అభిప్రాయం రాయండి.