చేపల వాన (Fish Rain)
నమ్మలేని నిజాలు (Mysteries and Miracles)
చేపల వాన (Fish Rain)
రెండేళ్ళ క్రితం అంటే 2008 ఫిబ్రవరి 12 న కేరళ రాష్ట్రం తిరుచూరు సమీపంలోని కందనస్సేరి గ్రామంలో చేపల వర్షం పడింది. చేపలకోసం వాగులకో, చెరువులకో వెళ్ళి, వలలేసి పట్టాల్సిన అవసరం లేకుండా తిన్నగా వాకిట్లో వానలోంచి చేపలు పడ్డాయన్నమాట.
ఈ విషయాన్ని ముందుగా ఇద్దరు కుర్రాళ్ళు గమనించారు. వాళ్ళ ద్వారా వెంటనే సమాచారం ఊళ్ళో అందరికీ తెలిసింది. ఒక్కొక్కళ్ళూ విస్తుపోయారు. ఇదేం గమ్మత్తు అంటూ తెగ ఆశ్చర్యాలు ప్రకటించారు. మొత్తానికి వాననీళ్ళు నేలమీద పడకుండా వీలైనంతవరకూ
బకెట్లు పెట్టారు.
ఆ రాత్రి చేపల వాన పడగా, మరుసటిరోజు ఆ విషయం మొత్తం దేశమంతా పాకింది. మీడియావారు, కొచ్చిన్ యూనివర్సిటీ వారిని ఈ విషయమై వివరణ ఏమైనా ఇవ్వగలరా అని అడిగారు. అక్కడి విద్యావేత్తలు ఈ అంశాన్ని అధ్యయనం చేసి, శాస్త్రీయంగా విశ్లేషించే ప్రయత్నం చేశారు. కొచ్చిన్ యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనుబంధ సంస్థ మెరీన్ సైన్సెస్ స్కూల్ ప్రొఫెసర్లు ''గ్రామస్తులు చెప్పిన మాటను నమ్మకపోవడానికి ఏమీ లేదు. ఇది చాలా సహజమైన సంగతే. ఇలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి...'' అన్నారు.
''మామూలుగా నదులు, సముద్రాల్లోని జలం ఆవిరై మేఘాలుగా రూపొందుతాయి. ఆ క్రమంలో కేవలం నీరే కాక, చిన్ని చిన్ని కణాలు, దుమ్ము, ధూళి, సూక్ష్మక్రిములు లాంటివి ఎన్నో ఆవిరైన నీటితో పాటు పైకి చేరతాయి. అలాంటప్పుడు చేప గుడ్లు లేదా అతి చిన్న చేప పిల్లలు కూడా మబ్బులుగా రూపొందే అవకాశం ఉంది. అలా ఆకాశం చేరిన చేప పిల్లలు మేఘావృతమై, వర్షం పడినప్పుడు ఆ వానజల్లుతో పాటు తిరిగి భూమ్మీద పడి ఉంటాయి. అంతే, తప్ప ఇందులో ఇంతకంటే విడ్డూరమో, మాయలు, మంత్రాలో లేవు..'' అంటూ సవివరంగా తెలియజేశారు కొచ్చిన్ యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనుబంధ సంస్థ మెరీన్ సైన్సెస్ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ సి.కె. రాజన్.
రాజన్ మరింత సోదాహరణంగా చెప్తూ ''ఇదివరలో ఒకసారి ఈ ప్రాంతంలో ఎర్రటి వాన పడింది. అది రక్తపు నీరో, కుంకుమ నీళ్ళో కావు. వాతావరణంలో పేరుకుపోయిన కాలుష్యం మేఘాల్లో చేరి, అది వానజల్లుతోబాటు తిరిగి వచ్చేసింది అన్నమాట..'' అన్నారు.
సృష్టిలో ఎన్నో వింతలూ విడ్డూరాలు జరుగుతుంటాయి. వాటిల్లో కొన్ని మన ఊహకు అందవు. కొన్నిటి వెనుక ఈ ఉదంతం మాదిరిగా శాస్త్రీయత దాగి ఉంటుంది.