తాచుపాము పగ పడుతుందా ?!

 

నమ్మలేని నిజాలు (Mysteries and Miracles)

తాచుపాము పగ పడుతుందా ?!

 

జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు, సన్నివేశాలు మనకు కొన్ని నమ్మకాలను ఏర్పరుస్తాయి. అవి నిజాలో, భ్రమలో తెలీని పరిస్థితిని కల్పిస్తాయి. భయాన్నీ, భీతినీ కలిగిస్తాయి. కొందరు ఇలాంటివాటిని హాస్యాస్పదంగా భావిస్తే, ఇంకొందరు గాఢంగా విశ్వసిస్తారు. చాలాసార్లు అలాంటివి నిజాలో, భ్రమలో, ఊహాజనితాలో, యాదృచ్చికంగా చోటుచేసుకున్న అంశాలో అర్ధం కాదు. అలాంటి ఓ సంఘటన చూడండి...

విజయవాడకు దగ్గర్లో ఉన్న రాయనపాడులో శాకమూరి సీతమ్మ అనే ఆవిడకి ఏడో నెల. కాస్త నీరసంగా ఉండటంతో పెరట్లో మంచం వాల్చుకుని పడుకుంది. ఇంతలో పక్కనున్న గడ్డివాము దగ్గర ఓ తాచుపాము కనిపించింది. దాన్ని చూసి, సీతమ్మ కంగారుగా అరవడంతో ఇద్దరు పాలేళ్ళు వచ్చి పామును చంపేశారు.

ఆ పాము తలభాగం ఇంకా కదులుతుండటంతో సీతమ్మ “పాము పూర్తిగా చావలేదు, తలమీద కొట్టండి.. అసలే నాగుపాము పగ పడుతుందంటారు” అంది.

పెద్ద పాలేరు నవ్వుతూ “లేదులెమ్మా, చచ్చిపోయింది.. కావాలంటే చూడండి.” అంటూ పాము తలను మరింత చితక్కొట్టాడు.

మరి కొన్ని రోజులకే సీతమ్మకు నొప్పులొచ్చాయి. కొందరు ఏడో నెలలో ప్రసవించడం మామూలే. అందులో వింతేం లేదు. అయితే సీతమ్మకు పుట్టిన బిడ్డ మృత శిశువు. పైగా తల ఛిద్రమై ఉంది.

ఆ బిడ్డను చూట్టానికి ఊరంతా కదిలివచ్చింది.

“కడుపుతో ఉండి నాగుపాముని చంపించావు.. అది శాపం పెట్టింది.. అందుకే ఇలా జరిగింది” అన్నారు.

వాళ్ళ మాటలో నిజం కనిపించి, సీతమ్మ, ఆమె కుటుంబసభ్యులు విలపించారు. పాము చావలేదేమోనని తలమీద కొట్టించడం గుర్తొచ్చి సీతమ్మ భయ కంపితురాలయింది.

తన తప్పు క్షమించమంటూ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి వేడుకుంది. అనేక వారాలపాటు పుట్టలో పాలు పోసింది. నాగ దోష నివారణ చేయించింది.

తర్వాత పుట్టిన మగబిడ్డకు చెవిలో చీము ధార కట్టడంతో పూజారిగారు నాగ దేవతను ప్రార్ధించి “సుబ్బారావ”ని పేరు పెట్టుకోమన్నారు. దాంతో బిడ్డకు చెవిలో చీము కారడం ఆగిపోయింది.

ఇక అప్పట్నించీ ఆ కుటుంబంలో పుట్టే ఏ బిడ్డకైనా నాగేశ్వరరావు, నాగమణి, నాగభూషణం లాంటి పేర్లు పెట్టడం రివాజైంది.

ఇదంతా చూస్తే సీతమ్మ లేదా వాళ్ళ కుటుంబసభ్యులది ఉత్త మూఢ నమ్మకం అని తీసిపడేయగలమా?

జరిగిన సంఘటన భయాన్ని కలిగించి, సమాజంలో ఉన్న నమ్మకాన్ని బలపరిచేట్లుగా ఉంది.

తల చితికిన బిడ్డ పుట్టడమే కాకుండా, రెండో బిడ్డకు చెవిలో చీము వచ్చి, “నీ పేరు పెట్టుకుంటా”నంటూ నాగదేవతకు మొక్కుకోగానే తగ్గింది.