బావిలో పాము - చర్లపల్లి రాజా (Cobra in well)
నమ్మలేని నిజాలు (Mysteries and Miracles)
బావిలో పాము - చర్లపల్లి రాజా (Cobra in well)
మోపిదేవి స్థల విశేషాలు ఇదివరలో కొన్ని తెలుసుకున్నాం. అలాంటి ఆసక్తికరమైన విశేషం ఇంకొకటి చూద్దాం..
చాలాకాలం క్రితం ఓ వ్యక్తి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయం దగ్గర్లో ఉన్న బావిలో నీళ్ళు తోడేందుకు వెళ్ళగా, బావిలో పాము కనిపించింది. కానీ అది ఎంత ప్రయత్నించినా నీళ్ళు చేదే బకెట్లోకి ఎక్కలేదు, నీళ్ళలోంచి పైకి రాలేదు. ఆ సంఘటనను దైవలీలగా భావించిన గ్రామస్తులు వెంటనే ఆలయ ధర్మకర్త చర్లపల్లి రాజా గారికి కబురు చేశారు.
చర్లపల్లి రాజా క్షణం ఆలస్యం చేయకుండా వచ్చారు. ఆయన ఒక పీటకు నాలుగు తాళ్ళు వేసి కట్టి, దాన్ని బావిలోకి దించమన్నారు. అయినా పాము రాలేదు. దాంతో చర్లపల్లి రాజా నాగుపాముకు నమస్కరించి, "ఏదో అపచారం వాటిల్లి ఉంటుంది.. లేకుంటే ఇలా జరగదు.. జరిగిన తప్పుకు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. సుబ్రహ్మణ్యేశ్వరా క్షమించు.." అంటూ చెంపలేసుకుని మరోసారి పీటను బావిలోకి పంపించారు. అలా చర్లపల్లి రాజా వేడుకున్నాక పాము బయటకు వచ్చింది.
చర్లపల్లి రాజా గారు ఊహించినది అక్షరాలా నిజమే అయింది. గుడి పూజారి నగలు అమ్ముకున్నట్లు తెలిసింది. ఆ దోషం అలా పాము రూపంలో దృష్టాంతం కనిపించి నలుగురికీ చాటి చెప్పినట్లు అయింది. ఇలా మోపిదేవి మహత్యాన్ని తెలిపే కధలు ఎన్నో ఉన్నాయి.