కనిపిం చింది , మాయమయింది.... (Appeared and disappeared)
నమ్మలేని నిజాలు (Mysteries and Miracles)
కనిపించింది , మాయమయింది.... (Appeared and disappeared)
ఆవేళ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఒక వింత జరిగింది. నాగావళి చెట్టు వద్ద ఉన్నట్టుండి ఓ పాము ప్రత్యక్షమయింది. అందరూ విడ్డూరంగా చూశారు. ఆ దృశ్యాన్ని దైవలీలగా భావించిన కొందరు పెద్దలు ఒక వస్త్రం తెచ్చి పామును దానిమీదికి ఎక్కించారు. నాలుగు చెంగులూ కలిపి పట్టుకుని శివలింగం వద్దకు తీసికెళ్ళారు.
మొజాయిక్ ఫ్లోర్ పై నాగుపాము కదల్లేదు. దాంతో పామును మళ్ళీ వస్త్రం మీదికి ఎక్కించి, ముందు కనిపించిన చోటుకు తీసుకొచ్చారు.
చిత్రం! మహా విచిత్రం!! వస్త్రంలో పాము లేనేలేదు!!! కొందరు పాము ఉన్న వస్త్రపు చెంగుల్ని దగ్గరగా కలిపి పట్టుకున్నారు. ఇంకెందరో వెంట నడిచారు. పాము తప్పించుకునే అవకాశం లేదు. జారిపడిన దాఖలా లేదు. మరి ఏమయింది? ఎలా ప్రత్యక్షం అయిందో అలా అంతర్దానమయింది.
ఇది నమ్మలేని నిజం. నమ్మి తీరాల్సిన సత్యం. ఎందుకంటే ఇది ఎవరో కన్న కల కాదు. ఏ ఒక్కరో చూసిన దృశ్యం కాదు. అనేకమంది చూస్తుండగా జరిగిన యదార్థ సంఘటన. పైగా ప్రత్యక్ష సాక్షి ఒకరు ఆ సంఘటనను, తన వద్ద ఉన్న కెమెరాలో బంధించారు కూడా.
ఇంకో గమ్మత్తు ఏమిటంటే, ఇలాంటి పామును ముందెన్నడూ చూడలేదని, ఇది చాలా చిత్రంగా ఉందని సర్పాల గురించి తెలిసినవారు అంటున్నారు.
మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చాలా విశిష్టమైంది. నాగదోషం ఉన్నవాళ్ళు ఎందరో ఇక్కడికొచ్చి పుట్టలో పాలు పోస్తారు. శాంతి చేయించుకుంటారు. పాము ఈ గుడిలోనే కనిపించి, మాయమయింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇంకో విశేషం నాగావళి లేదా నాగవల్లి చెట్టు. ఈ చెట్టు పూలు శివలింగాన్ని, నాగపాము పడగను పోలి ఉంటాయి కనుక దీన్ని "నాగపడిగ" అని కూడా అంటారు. .
ఈ మిస్టరీపై మీ అభిప్రాయం రాయండి.