వివేకానందుడు చెప్పిన మూడు ముఖ్య విషయాలు!
వివేకానందుడు చెప్పిన మూడు ముఖ్య విషయాలు!
స్వామి వివేకానందుడు ఎంతటి సూర్తివంతమైన వ్యక్తో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన యువతకు ఎన్నో సందేశాలు ఇచ్చారు. యువత కోసం ఆయన చెప్పిన మూడు ముఖ్య విషయాలు ఇవిగో...
శీలాన్ని పెంపొందించుకోవడం ఎలా?
శీలం అంటే ఏమిటనే ప్రశ్న యువతరం తరచూ అడుగుతుంటుంది. శీలం అంటే ఆ వ్యక్తి యొక్క జీవనవిధానమే అవుతుంది. శారీరక దారుఢ్యం, పవిత్రత, జాలి, నిజాయతీ, సత్యసంధత, ముక్కుకు సూటిగా మాట్లాడే తత్త్వం, నిరాడంబరత, నిస్వార్థం, లోకోపకారం ఈ గుణాలన్నీ ఓ మనిషికి ఉన్నత లక్షణాలు కలగడానికి దోహదం చేస్తాయి. ఈ గుణాల్ని అభివృద్ధి చేసుకుంటూ తద్విరుద్ధ గుణాల్ని దూరంగా ఉంచే మనిషి ప్రపంచాన్నే ప్రభావితం చేయగలిగిన గొప్ప శీలవంతుడవుతాడు. అలాంటి మహత్తరమైన శీలం కోసం ప్రార్థన, ధ్యానం చేస్తూ మహాత్ముల, దేశభక్తుల నాయకుల జీవిత చరిత్రల్ని చదవాలి.
దివ్యత్వాన్ని ఎన్నడూ మరువకపోవడం:
యువకులు తరచూ పొగత్రాగడం, మధ్యపానం మాదకద్రవ్యాలు సేవించడం విషయ వాంఛలు వీటన్నిటినీ ఎలా అధిగమించాలి అని అడుగుతూ ఉంటారు. ముందుగా ఈ అలవాట్లన్నీ మన శరీరాన్నీ, ఇంద్రియాల్నీ, మనసునీ బలహీనపరుస్తాయని తెలుసుకోవాలి. దీని వల్ల ఈ వ్యసనాల పట్ల ఆకర్షణ అనే జబ్బును మెల్లమెల్లగానే అయినా తగ్గించుకోవచ్చు. దానితోపాటే ఆత్మ నిగ్రహం వల్ల కలిగే మహత్తర ప్రయోజనాలను గుర్తు చేసుకుంటే, అతడు దానిపట్ల ఆకర్షితుడవుతాడు. దీని వల్ల సంకల్పశక్తి అధికమై నిర్లిప్తత అలవడుతుంది. తద్వారా అతి క్లిష్టమైన వ్యసనాల నుంచి కూడా నెమ్మదిగా బయటపడవచ్చు. ఆత్మనిగ్రహం, ఆత్మోద్ధరణ అనే అద్భుతమైన ఆదర్శాన్ని స్వామీజీ మన ముందు ఉంచారు. ప్రతి జీవిలోనూ దివ్యత్వం గర్భితంగా ఉంది. అంతర్గతంగా ఉన్న ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చెయ్యడమే జీవిత పరమావధి. స్వార్థరహిత కర్మలు, పూజ, మనో నిగ్రహం, తత్త్వచింతన వీటిల్లో ఏ ఒక్కటైనా, లేక అన్నీ అయినా అవలంబించి ముక్తి పొందాలి. ఇదే మతమంటే. ఇతర సిద్ధాంతాలూ, కర్మకాండలూ, గ్రంథాలూ, ఆలయాలూ, రూపాలు ఇవన్నీ కూడా అప్రధానమైనవే.
పవిత్రంగా, దృఢంగా ఉండటం:
తిరిగి భగవంతుణ్ణి చేరడం, లేక మానవుడి సహజ స్వభావమైన దివ్యత్వం పొందడం అనే ఉత్కృష్ట ఆదర్శం వైపు స్వామీజీ యువతరాన్ని ప్రేరేపిస్తారు. ఈ లక్ష్యం సాధించడానికి మనిషికి తగినంత భౌతిక, మానసిక శక్తి ఉండాలి. విషయపరమైన భావనలు లేకుండా పవిత్రమైన జీవితం గడపడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఈ భావాన్ని స్వామీజీ ఎంత చక్కగా విశదీకరిస్తారో చూద్దాం.
"మానవ శరీరంలో ఉన్న అన్ని రకాలైన శక్తుల్లో అత్యంత శక్తిమంతమైన దాన్ని "ఓజస్' ” అని అంటారు యోగులు. ఈ ఓజస్సు మెదడులో గుప్తంగా ఉంటుంది. శిరస్సులో ఎంత ఎక్కువ ఓజస్సు ఉంటే మనిషి అంత శక్తిమంతుడవుతాడు, అంత తెలివి తేటలు కలవాడు అవుతాడు. ఆధ్యాత్మిక శక్తి అధికంగా కలవాడవుతాడు. పవిత్రంగా ఉన్న వారు మాత్రమే ఈ ఓజస్సును ఊర్ధ్వ ముఖంగా పంపి, మెదడులో గుప్తపరచగలుగుతారు. అందుకనే పవిత్రత అనేది అత్యంత విలువైన గుణంగా పరిగణితమవుతోంది. ఈ మూడు ఉంటే యువత శక్తిమంతుడు అవుతాడు.
◆నిశ్శబ్ద.