ఆశ్చర్యం కలిగించే కాలగతి క్రమం!

 

ఆశ్చర్యం కలిగించే కాలగతి క్రమం!

మనకు ఈ సౌర కుటుంబంలో క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు ఇలా దొర్లుకుంటూ పోతాయి.మనకు కాలం గడిచినట్టే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు, ఇతర దేవతలకు కాల ప్రమాణాలు ఉంటాయి. అవి వారి ప్రమాణాలను బట్టి గడుస్తాయి. ఈ సృష్టి గురించి, దీని క్రమం గురించి చెప్పుకోవాలంటే ఎన్నేళ్ళు వెనక్కు వెళ్లినా సరిగా చెప్పలేని అజ్ఞానులం మనం అయితే… నారాయణుడు ఈ సృష్టికి పరిచయమైన కాలం నుండి పురాణాలలో పొందుపరిచిన విధానం గమనిస్తే…

నారం అంటే నీరు. అది నివాసముగా గలవాడు నారాయణుడు. ఆ నారాయణుడు భూతరాశికి కర్త అయి ప్రజాపతి అని చెప్పదగినవాడు. అతని పరమాయువు నూరు సంవత్సరాలు. ఆ దేవుని పరమాయువైన నూరు సంవత్సరాల కాలములో మనలాంటి వారికి ఎన్నో సంవత్సరాలు తిరిగిపోతాయి. ఆ కాలక్రమం వింటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కాలక్రమం గురించి సరైన వివరణ ఇదిగో....

ఒక్క లఘువును పలికేకాలం ఒక నిమిషం. పదునెనిమిది నిమిషాలొక కాష్ఠ. అవి ముప్పది ఒక కళ. ముప్పది కళలు ఒక క్షణం. పన్నెండు క్షణాలు ఒక ముహూర్తం. ముప్పది ముహూర్తాలు ఒక పగలు, ఒక రాత్రి (దినం). పదునైదు దినాలు ఒక పక్షం. రెండు పక్షాలు ఒక నెల. రెండు నెలలు ఒక ఋతువు. మూడు ఋతువులు (ఆరునెలలు) ఒక అయనం. అది ఉత్తరాయణం, దక్షిణాయణం అని రెండు. ఆ రెండు ఒక సంవత్సరం. ఇలాంటి ఒక సంవత్సరం దేవతలకు అది ఒక పగలు, ఒక రాత్రి (ఒక దినం) అవుతుంది. అంటే మనకు గడిచే ఒక సంవత్సరం దేవతలకు ఒకరోజు. దానికి సౌరమానం అని వ్యవహారం.

పదేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు కృతయుగం. పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు త్రేతాయుగం. ఎనిమిది లక్షల ఇరవై నాలుగువేల సంవత్సరాలు ద్వాపరయుగం. నాలుగు లక్షల ముప్పై రెండువేల సంవత్సరాలు కలియుగం. అలాంటి నాలుగు యుగాలు ఒక దివ్యయుగం. దానిలెక్క నాలువది మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు. ఇలాంటి యుగాలు ఒక వెయ్యి అయితే బ్రహ్మకి ఒక దినం.

బ్రహ్మకి పగలు ఉంటే ఈ సృష్టి జరుగుతూనే ఉంటుంది, అదే ఆయనకు రాత్రి వస్తే ఇక సృష్టికి ప్రళయమే వస్తుంది.  దీనికి నైమిత్తిక కల్పమని సంజ్ఞ. ఇలాంటి దినాలు ముప్పై జరిగితే బ్రహ్మకి ఒక నెల. అలాంటి నెలలు  పన్నెండు ఒక సంవత్సరం. అలాంటి సంవత్సరాలు  నూరు గడిస్తే బ్రహ్మ ఆయుఃపరిమాణం. దానికి మహాకల్పం అని వ్యవహారం. దానికి పూర్వార్థానికి పద్మకల్పం అని ఉత్తరార్ధానికి వరాహకల్పం అని సంజ్ఞలు. ఇవీ కాలగతులు…

                                       ◆నిశ్శబ్ద.