మారిష ఎవరు వృత్తాంతమేమి?

 

మారిష ఎవరు వృత్తాంతమేమి?

ఒకప్పుడు కంధుడు అనే ముని గోమతీ తీరమునందు అసాధారణమైన తపస్సు చేస్తూండగా ఇంద్రుడు బాధపడి అతని తపస్సు చెడగొట్టాలని సంకల్పించి ప్రమోచన అనే అప్సరసను రప్పించి "వెళ్లు గోమతీ తీరాన తపస్సు చేస్తూన్న కంధుని నీ మోసాలతో వశపరచుకుని తపస్సు భంగం చెయ్యి. తగిన చెలికత్తెలతో వెళ్లు" అని నియమించాడు.  ఆ అప్సరస చెలికత్తెలను కొందరిని వెంటపెట్టుకుని కందుని ఆశ్రమానికి వెళ్లింది. ఆ ముని ఎదురుగా వెళ్లడానికి భయపడి దగ్గరలో ఉన్న పొదరిళ్లలో ఆటలాడుతూ, పాటలు పాడుతూ అతనికి కనిపిస్తూ కనిపించక విహరించసాగింది.

ఆ సమయంలో చల్లని మలయవాయువు ఆ అప్సరసకు తోడయి ఆ మునికి మైమరపు కలిగించేది. అది అప్పుడు పూచిన పువ్వులు తెచ్చి ముని ముందువంగి ఉంచేది. వీణమీటుతూ, శృంగార కీర్తనలు పాడేది. అప్పుడప్పుడు తన చేతులు తగిలేట్టుగా వంగి ముని పాదాలకు నమస్కరించి లేచి చిరునవ్వుతో చూసేది. ఆ విలాసాలకూ, వికారాలకూ ముని తపోదీక్షకు స్వస్తి చెప్పి మదనవిలాస దీక్షకు సంసిద్ధుడయిపోయాడు.  ఒకరోజు ఆయన "సుందరీ! నా మనసు దొంగిలించినదానవు. శిక్ష నా కౌగిటిలో నిన్ను బంధించడం" అని అనగా..  ఆ దేవవేశ్య "స్వామీ! మీ మాటకి ఎదురుచెప్పగలనా?" అని దగ్గరగా వచ్చింది.  ఇంకేముంది ముని ఆమెతో సుఖాలు అనుభవిస్తూ కొన్ని సంవత్సరాలు వెళ్లించాడు.

ఆ విధంగా ముని తపస్సు పాడుచేసి ఒకనాడు "మునీంద్రా! నేను ఇంద్రుని కొలువులో ఉండే దేవవేశ్యను. ఇక్కడికి వచ్చి చాలాకాలం అయింది. ఇక సెలవిస్తే అమరావతికి వెళ్లుతాను. ఇంకా ఆలస్యం చేస్తే ఇంద్రుడు ఆగ్రహిస్తాడు అని అనింది. అప్పుడు  కంధముని కాదు కాదు నాకు సంతృప్తి కలగలేదు. నాతో ఉన్న నిన్ను తెలిసి ఇంద్రుడు ఏమీ చెయ్యలేడు. రా! అని చేతిని పట్టుకుని పొదరింటికి తీసుకుపోయాడు.

మళ్లీ కొంతకాలమయిన తరువాత ప్రహ్లచి "స్వామీ! ఇక సెలవిప్పించు" అని గట్టిగానే వేడుకుంది. 

"సుందరీ! నేను సూర్యోదయ సమయంలో దినకరునకు అర్ఘ్య మిస్తూండగా నువ్వు నా కంటపడ్డావు. నీతో నిన్నరాత్రి వెళ్లించాను. ఈ ఒక్కనాటితో నన్ను విడిచి వెళ్లడం న్యాయమా?" అని ముని అనగా…  "మునీంద్రా! నీ మాటకి ఎదురుచెప్పలేను. కాని జరిగినది ప్రమాణవాక్కుగా చెప్తాను. నాతో నీవు గడపిన కాలం  తొమ్మిదివందల ఏడు సంవత్సరాల ఆరునెలల మూడు దినాలు. యోగదృష్టితో చూడు" అని చెప్పింది. 

ప్రమ్లోచి మాటలు విని ముని కనులుమూసి ధ్యానించి తెలుసుకున్నాడు. కనులు తెరిచాడు. కోపరేఖతో కనులు ఎరుపెక్కాయి. "నా తపస్సు ఇలా పాడుచేశావా? ఇంద్రుని కపటోపాయం అయినా తప్పు నీదే. కాని యింతకాలం నన్ను అలరించావు కనుక క్షమించాను. ఇక పో! నా ఎదుట ఉండకు. మళ్లీ ఎన్నడూ నా వద్దకు రాకు" అని సింహంలాగా గర్జించాడు.

చిత్తం సెలవు అని ప్రమోచి రివ్వున పైకెగిరింది. ఆ ఎగరడంలో దాని గర్భమునందున్న ముని వీర్యం చెమటగా అవయవాల నుంచి కారింది. ప్రమోచి చెట్ల చిగురాకులతో ఆ చెమట తుడుచుకుని వెళ్లిపోయింది. కంధముని అక్కడినుంచి పురుషోత్తమ తీర్థమునకు పోయి దేవవేశ్యతో గడపిన అధర్మ ప్రవర్తన పాపం పోవడానికి బ్రహ్మసూత్రస్తోత్రముతో మహావిష్ణువును ప్రార్థిస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడు.

చెట్ల చిగురాకులలో కలిసిన ఆ ముని తేజస్సు  కిరణాలనుంచి స్రవించే అమృతముచే ఓ లతాంగి రూపొందింది. ఆ మహాముని తేజస్సు, దివ్యకాంత గర్భరూపం, వాయువుచే చెట్ల ఆకులలో పడడం,  కిరణామృత దోహదం ఆ విధంగా పుట్టినది మారిష.  ఇదీ మారిష వృత్తాంతం.

                                     ◆నిశ్శబ్ద.