జీవితకాల సమస్యలకు అద్భుత మంత్రం ఇది!!
జీవితకాల సమస్యలకు అద్భుత మంత్రం ఇది!!
మనిషికి ఉన్న సమస్యలను పోగొట్టి బాధలు నుండి సాంత్వన చేకూర్చడానికి పురాణాలలో ఎన్నో శ్లోకాలు ఉపదేశించారు మన మహర్షులు, ఋషులు. వాటిలో మృత్యుంజయ మంత్రం ఒకటి. ఈ మృత్యుంజయ మంత్రం గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు…
'ఓం జుం సు' అనే మూడక్షరాల మంత్రం మృత్యుంజయ మంత్రం. ఇది మృత్యువునూ దారిద్ర్యాన్ని మర్దించే మంత్రం, శివ, విష్ణు, సూర్యాది దేవతలంతా దీన్ని పఠించే వారి పట్ల ప్రసన్నులౌతారు. 'ఓం జుం సః' అనే ఈ మహామంత్రాన్ని అమృతేశ నామంతో కూడా వ్యవహరిస్తారు. ఈ మంత్రాన్ని జపించేవారి పాపాలన్నీ నశిస్తాయి. మృత్యువు లాగా బాధించే కష్టాలన్నీ దూరమవుతాయి.
ఈ మంత్రాన్ని నూరుమార్లు అనితర ధ్యాన తత్పరతతో జపిస్తే వేదాధ్యయనం వల్ల వచ్చే సుకృతం, యజ్ఞఫలం, తీర్థ స్నాన దాన పుణ్యం లభిస్తాయి. మూడు సంధ్యలలోనూ నూట యెనిమిదేసి మార్లు ఈ మంత్రాన్ని జపించేవారికి అలా జపిస్తున్నంత కాలం మృత్యువు దూరంగానే వుంటుంది. కఠినాతి కఠినములైన విఘ్న బాధలన్నీ తొలగిపోతాయి. శత్రువులపై విజయం లభిస్తుంది.
భగవానుడైన మృత్యుంజయుడు లేదా అమృతేశ్వరుడు శ్వేతకమలంపై కూర్చుని వుంటాడు. ఆయన చతుర్భుజుడు ఒక చేతిని అభయముద్రలో మరొక చేతిని వరద ముద్రలో వుంచి మిగతా రెండు చేతులలో అమృత భాండాన్ని పెట్టుకొని నిత్యం మనను శారీరక మానసిక ప్రాణాంతక బాధల నుండి రక్షించడానికి సిద్ధంగా, సర్వసన్నద్ధుడై వుంటాడు ఈ అమృతేశ్వర దేవుడు. ఆయన వామాంకృతయై అమృతభాషిణీ అమృతాదేవి నిత్యమూ కొలువుంటుంది. ఆమెను ధ్యానించాలి. ఆమె ఒక చేతిలో కలశాన్నీ మరొక చేతిలో కమలాన్నీ ధరించి వుంటుంది. కలశం కుడిచేతిలో వుండాలి.
ఓం జుం సః అనే ఈ మంత్రం పరమశక్తిప్రదాయకం, అతులిత శాంతిదాయకం కూడా. అమృతాదేవి సహిత అమృతేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఈ మహా మంత్రాన్ని మూడు సంధ్యలలో జపిస్తూ అలా రోజుకి ఎనిమిదివేల మార్లు ఒక నెలదాకా చేయగలిగిన వారికి జర, మృత్యు, మహావ్యాధి బాధలుండవు. శత్రువులపై స్పష్టమైన శాశ్వతమైన విజయాన్ని సాధించగలుగుతారు. మహాశాంతినీ పొందగలుగుతారు.
కాబట్టి ఈ మృత్యుంజయ మంత్రాన్ని రోజులో తప్పకుండా జపిస్తూ ఉంటే అన్ని రకాల బాధలు తొలగి మానసిక స్వస్థత చేకూరుతుంది. జీవితంలో ఉన్న చిక్కుముడులు తొలగిపోతాయి.
◆నిశ్శబ్ద.