రాముడు సీతను ఎలా చూడాలనుకున్నాడు?

 

రాముడు సీతను ఎలా చూడాలనుకున్నాడు?

రాక్షస మహిళలకు నా రక్ష ఉంటుందని సీతమ్మ చెప్పగానే  "అమ్మ! ఈ మాట చెప్పడం నీకే చెల్లింది తల్లి" అని పీతమ్మతో అని, అక్కడినుండి బయలుదేరి రాముడి దగ్గరికి వెళ్ళి "రామ! సీతమ్మ నీ దర్శనం చెయ్యాలని అనుకుంటోంది" అని రాముడితో చెప్పాడు హనుమంతుడు.

హనుమంతుడు చెప్పిన మాట విన్న రాముడు కొంచెంసేపు ఆలోచించాడు. ఆ సమయంలో ఆయన కళ్ళల్లో నీళ్ళు నిండాయి. చాలా శోకం పొందినవాడిలా అయి ఒకసారి నేల చూపులు చూసి, తన పక్కన ఉన్న విభీషణుడిని పిలిచి "విభీషణ! నువ్వు లోపలికి వెళ్ళి, సీతకి నేను చెప్పానని చెప్పి తలస్నానం చేయించి, పట్టు వస్త్రం కట్టించి, అన్ని అలంకారములు చేసిన తరువాత నా దగ్గరికి ప్రవేశపెట్టు" అన్నాడు.

రాముడి మాటలు విన్న విభీషణుడు మొదట ఆశ్చర్యపోయాడు. ఎందుకిలా అన్నాడు రాముడు అనే ప్రశ్న ఆయన మనసులో కలిగింది. కానీ రాముడు చెప్పాక ప్రశ్నలు వేయకూడదని  వెంటనే సీతమ్మ దగ్గరికి వెళ్ళి 'సీతమ్మ! నువ్వు తల స్నానం చేసి, పట్టుబట్ట కట్టుకొని, ఒంటినిండా అలంకారాలు చేసుకుని వస్తే రాముడు నిన్ను చూడాలని అనుకుంటున్నాడు" అని చెప్పాడు

ఆ మాటలు వినగానే సీతమ్మ విభీషణుడితో "నేను ఎలా ఉన్నానో అలానే వచ్చి రామదర్శనం చేసుకోవాలని నా మనస్సు కోరుకుంటోంది" అని చెప్పింది.

సీతమ్మ మాటల్లో నిజమున్నా రాముడు చెప్పినట్టు జరగాలి కదా. అందుకే అదే అమలుచేయాలి అనుకున్నాడు విభీషణుడు.

అందుకే సీతమ్మతో  "అమ్మా! అది రామ ఆజ్ఞ. మనం మనకు నచ్చినట్టు ఎలా చేస్తాము తల్లీ!! ప్రభువు ఎలా చెప్పాడో అలా చెయ్యడం మంచిది. అంతఃపుర కాంతలు నీకు తలస్నానం చేయిస్తారు, నువ్వు పట్టుబట్టలు కట్టుకుని మంచి ఆభరణాలు వేసుకొని, గొప్పగా తయారయ్యి రాముడికి దర్శనం ఇవ్వమ్మా" అన్నాడు.

ఇక చేసేది ఏమిలేక సీతమ్మ స్నానం చేసి అలంకరించుకున్న తరువాత పరదాలు కట్టిన ఒక పల్లకి ఎక్కించి సీతమ్మను రాముడి దగ్గరికి తీసుకు వెళ్ళారు. అప్పుడు రాముడి ముఖంలో సంతోషం, దైన్యం కనబడ్డాయి, ఆ వెంటనే కోపం కూడా ఆయనలో బయటకు వచ్చింది. 

అప్పుడు రాముడు కోపంతో పల్లకి మోస్తున్నవారిని ఉద్దేశించి "మీరు ఆవిడని పల్లకిలో ఎందుకు తీసుకొస్తున్నారు. దిగి నడిచి రమ్మనండి" అన్నాడు.

వాళ్ళు పల్లకి ఆపేసి కిందకు దించేసరికి సీతమ్మ అందులో నుండి దిగి అలా నడిచి వస్తున్న సీతమ్మని చూడడం కోసమని అక్కడున్న వానరాలు ఒకరిని ఒకరు తోసుకోవడం మొదలుపెట్టారు. (ఆ వానరాలు అప్పటిదాకా సీతమ్మని చూడలేదు). అప్పుడు సుగ్రీవుడు కొంతమందిని ఆజ్ఞాపించి ఆ వానరాలని వెనక్కి తొయ్యమన్నాడు.

రాముడు సుగ్రీవుడితో "'ఈ సీత కోసం వారు తమ ప్రాణాలని ఫణంగా పెట్టి యుద్ధం చేశారు. ఇప్పుడావిడ నడిచొస్తుంటే వాళ్ళని కొట్టి దూరంగా తోసేస్తార. వాళ్ళందరూ సీతని చూడవలసిందే. ఎవరైనా ప్రియ బంధువులు వియోగం పొందినప్పుడు, రాజ్యంలో క్షోభం ఏర్పడినప్పుడు, యజ్ఞము జరుగుతున్నప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు అంతఃపుర కాంతలు బయటకి రావచ్చు. ఇవ్వాళ నేను యుద్ధభూమిలో ఉన్నాను. కనుక భర్త దర్శనానికి సీత అలా రావచ్చు. నా పక్కన ఉండగా సీతని అందరూ చూడడంలో దోషంలేదు అన్నాడు.

                                     ◆నిశ్శబ్ద.