సమస్యల తెరచాపపై మధ్యతరగతి మహిళ!!

 

సమస్యల తెరచాపపై మధ్యతరగతి మహిళ!!

 

స్త్రీ పురుషుల కలయికే ఈ సృష్టికి మూలం. ఇద్దరిదీ సమాన పాత్ర ఉంటుంది ఇందులో.  అలాగే జీవితంలోనూ ఇద్దరి కర్తవ్యాలు వేరు వేరుగా ఉంటూ వారి వారి సామర్థ్యము మేరకు వారు భాగస్వామ్యం అవుతారు. అయితే కాలం ఎంత మారినా స్త్రీలు అన్ని విధాలా మెరుగవుతున్నా, అది కేవలం మెరుగవ్వడం అని మాటలో చెప్పుకోవడమే కానీ వాళ్ళ జీవితాల్లో ఆ మెరుగుపడటం అనేది ఎంతమాత్రం ఉందొ సమాజానికి కూడా తెలుసు. నాటి కలాం నుండి నేటి కాలం వరకు ఆడవాళ్లు ఇంటా, బయట కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో ఆడవాళ్లను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నవి ఏవి అంటే…

లింగ వివక్ష!!

విచిత్రంగా ఈ లింగ వివక్ష చూపించడం కూడా ఆడవాళ్ళలోనే ఎక్కువగా ఉంటుందంటే ఆశ్చర్యం వేస్తుంది. కొడుకు కొరివి పెడతాడు. ఆడపిల్ల పెళ్లి చేసుకుని పోయేదే!! ఇవీ సగటు భారతీయ తల్లిదండ్రుల మాటలు.  వయసొచ్చిన ఆడపిల్లకు ఆటలు ఎందుకు, బయటకు తిరగడం ఎందుకు, సినిమాలు, షికార్లకు  వెళ్లకూడదు, ఇంటి పట్టున ఉండి పని నేర్చుకోవాలి. ఇవి మాత్రమే కాకుండా ఏ పనిలో అయినా నువ్వు ఆడపిల్లవు అనే విషయాన్ని గుర్తుచేస్తున్నట్టే ఉంటాయి మాటలు.  చాలామంది ఆడవాళ్లు మెరుగవుతున్నారని అంటారు కానీ సగటు మధ్యతరగతి, మరియు దిగువ తరగతి కుటుంబాలలో ఆడపిల్లల జీవితం ఏమి మారలేదు. 

పెళ్లి!!

మధ్యతరగతి ఆడపిల్ల పెళ్లి, అందులో 99% తల్లిదండ్రులు, చుట్టాలు, పక్కాల మాటలు నిర్ణయాలు ఎక్కువ ఉంటాయి. మనస్ఫూర్తిగా తన ఇష్టాన్ని బయటకు చెప్పి పెళ్లి చేసుకునే ఆడపిల్లలు బహుశా చాలా అరుదు. కారణం ఆడపిల్లను ఆవిషయం గురించి మాట్లాడనివ్వరు, మాట్లాడటానికి ప్రయత్నం చేసినా నీకేం తెలియదు నువ్వు ఉరుకో అంటారు. భవిష్యత్తు గురించి జ్యోస్యం చెప్పేస్తూ ఆడపిల్లల్ని ఒకానొక వలయంలో బంధించేస్తారు. అందుకే అన్నీ భరించడం అనేది ఆడపిల్లలకు ఒక అలవాటుగా మారిపోయింది.

మానసిక లైంగిక దాడులు!!

మగవాళ్ళకంటే ఆడవాళ్లు మానసికంగా దృఢంగా ఉంటారు. బహుశా భరించడమనేది అలవాటైపోవడం వల్ల ఆ మానసిక బలం చేకూరి ఉండవచ్చు. కానీ నివ్వెరపోయే నిజం సమాజం అదే మానసిక కోణంలో ఆడవాళ్లను దెబ్బతీస్తూ ఉంటుంది. ప్రయాణాలలోనూ, అని చేసే ప్రదేశాలలోనూ, ఇంకా చెప్పాలంటే ఇంట్లో కూడా ఆడవాళ్లు లైంగిక దాడులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ లైంగిక దాడి కూడా చిన్న పిల్లల నుండి ఎంతో పెద్దవాళ్ల వరకు ఎవరినీ మినహాయించకుండా ఇబ్బంది పెట్టే అంశం.

హక్కులు!!

ఈ మాట మాట్లాడితే పితృస్వామ్య వ్యవస్థకు కోపమొస్తుంది. బహుశా ఇప్పటికే ఆడవాళ్లకు ఎంతో విచ్చలవిడితనం ఇచ్చేసాం అని తెగ బాధపడిపోతూ ఉంది. కానీ ఇవ్వాల్సింది ఏమిటి?? ఇచ్చింది ఏమిటి అనేది ఆలోచించరు. ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తే అందులో పేరు ఆడవాళ్ళది, పెత్తనం మగవాళ్ళది. ఇలాంటివి లెక్కలేనన్ని చోట్ల కనబడుతుంటాయి. ఇష్టాల గురించి, తమకున్న హక్కుల గురించి ఏ ఆడపిల్ల అయినా ఎక్కడైనా మాట్లాడితే తెగించిన ఆడది అని ముద్ర వేసి వ్యక్తిత్వం లేని మనుషుల జాబితాలో వేస్తారు. అంతేనా ఏ ఆడపిల్లకు తాను సంపాదించిన డబ్బు పట్ల కూడా పూర్తి అధికారం ఉండదు అనేది చేదు నిజం.

సంప్రదాయం!!

నిజానికి ఈ సంప్రధాయం  కేవలం ఆడవాళ్లకు మాత్రమే ఉంటుందా?? మగవాళ్లకు అక్కర్లేదా. భారతీయ హిందూ సంప్రదాయం బ్రష్టు పట్టడంలో సగంకు పైగా పాత్ర మగవాళ్ళది కూడా ఉంది. మరి దాన్ని ఆలోచించకుండా ఆడవాళ్లు మాత్రం కుక్కిన పేనులా ఇంట్లో ఉంటూ హోమ్ మేకర్లు గా ఉంటే అదే ఉత్తమమని, వ్రతాలు, పూజలు చేస్తే అదే సంప్రదాయాన్ని కాపడినట్టు అని తెగ ఇదైపోయే వాళ్లకు ప్రాచీన భారతీయ వ్యవస్థలో మగవాళ్ళ విధులు, వారి పద్ధతులు,

సంప్రదాయాలు అన్ని పుస్తకం తెరచి చూపించాల్సిందే!!

ఇట్లా చెప్పుకుంటూ పోతే నచ్చిన బట్ట కట్టుకోవడానికి, నచ్చిన తిండి తినడానికి, నచ్చిన పుస్తకం చదవడానికి, నచ్చిన ప్రదేశానికి వెళ్ళడానికి నచ్చినట్టు తృప్తిగా నవ్వడానికి ఇలా అన్ని విషయాల్లోనూ ఆంక్షలు ఎదురవుతుంటే సగటు మధ్యతరగతి ఆడపిల్ల అయోమయంలో మానసిక ఒత్తిడిలో నలిగిపోతూ ఉంటుంది.


◆ వెంకటేష్ పువ్వాడ