రాముడికి రావణుడిని చంపే ఉపాయం చెప్పిన మాతలి!

 

రాముడికి రావణుడిని చంపే ఉపాయం చెప్పిన మాతలి!

రామ-రావణ యుద్ధం ప్రారంభం అవ్వగానే అప్పటిదాకా కొట్టుకున్న వానరులు, రాక్షసులు ఒకరి పక్కన ఒకరు నిలబడి అలా చూస్తుండిపోయారు. రాముడు, రావణుడు ప్రయోగించిన బాణాలకి ఆకాశం అంతా చీకటి అయిపోయి, ఆకాశంలో గుద్దుకుంటున్న బాణముల మెరుపులే కనపడుతున్నాయి. అప్పుడు రావణుడు కొన్ని బాణములని రాముడి రథం యొక్క ధ్వజం మీదకి ప్రయోగించాడు. ఆ రథం ఇంద్రుడు ఇచ్చినది కావడంతో దానికి ఉన్న శక్తి వల్ల రావణుడు వేసిన బాణములు నిర్వీర్యం అయిపోయాయి. తరువాత రాముడు వేసిన బాణములకి రావణుడి ధ్వజం విరిగిపోయి నేలమీద పడిపోయింది.

ఆ తరువాత రావణుడు బాణములతో రాముడి రథాన్ని లాగుతున్న గుర్రాలని కొట్టాడు. కాని ఆ గుర్రాలు రావణుడి బాణాలు తగిలినా కనీసం కదలను కూడా కదలలేదు. అవి గొప్ప శక్తితో అలాగే ముందుకు సాగుతున్నాయి. రావణుడు వేస్తున్న మాయతో కూడిన బాణముల నుండి కొన్ని వేల రోకళ్ళు, పర్వతములు, వృక్షాలు, రోళ్ళు, చిత్ర విచిత్రమైనవన్నీ పుట్టి రాముడి రథం మీద పడిపోతున్నాయి. అన్ని పడినా అవి ఆ రథాన్ని ఏమీ చేయలేకపోయాయి. రావణుడి అన్ని బాణములకు సమాధానంగా రాముడు బాణ ప్రయోగం చేసి రావణుడి సారధిని, గుర్రాలని, ధ్వజాన్ని కొట్టాడు.

వాళ్ళిద్దరూ చేస్తున్న యుద్ధానికి సముద్రాలన్నీ క్షోభించాయి, సదులు గట్లు దాటి ప్రవహించాయి. భూమి అంతా కదిలిపోయింది. సూర్యమండలం అంతా ధూమముతో ఆవహించబడి ఉంది, బ్రహ్మాండములో ఉన్న సర్వ భూతములు కలత చెందాయి. 

ఆ భయంకరమైన యుద్దం ఎలా ఉందంటే ఆకాశానికి ఆకాశమే పోలిక, సముద్రానికి సముద్రమే పోలిక, రామ రావణ యుద్ధానికి రామ రావణ యుద్ధమే పోలిక. ఇంకా వేరేది ఏమి లేదు అన్నట్టు అక్కడ యుద్ధం జరుగుతోంది.

అప్పుడు రాముడు విషం  కలిగిన సర్పం వంటి బాణమును తీసి, వింటినారికి సధించి, రావణుడి కంఠానికి గురిచూసి విడిచిపెట్టాడు. ఆ బాణం తగలగానే రావణుడి ఒక శిరస్సు తెగిపోయి భూమి మీద పడిపోయింది. ఆ శిరస్సు అలా పడిపోగానే మళ్ళీ ఒక కొత్త శిరస్సు మొలకెత్తింది. మళ్ళీ బాణం పెట్టి ఇంకొక శిరస్సుని రాముడు కొట్టాడు, అది కూడా మొదటిదానిలాగానే కిందపడిపోయింది, కాని మళ్ళీ కొత్త శిరస్సు పుట్టింది. అలా రాముడు మొత్తం 100 సార్లు రావణుడి శిరస్సులని కొట్టాడు.

అప్పుడు రాముడు "ఈ బాణంతో మారీచుడిని, ఖరుడిని, దూషణుడిని, వాలిని సంహరించాను. ఈ బాణానికి ఎదురులేదు. ఈ బాణంతో ఇప్పటికి నూరు తలకాయలు భూమి మీద పడేశాను. కాని ఈ బాణం రావణుడి చంపలేకపోతుంది" అని అనుకున్నాడు.

వాళ్ళిద్దరి మధ్య ఆ యుద్ధం 7 రాత్రులు, 7 పగళ్ళు, ఒక్క క్షణం కూడా విరామం లేకుండా జరిగింది. ఆకాశం అంతా దేవతలు, ఋషులు మొదలైన వాళ్ళతో నిండిపోయింది. అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

అప్పుడు మాతలి "రామ! 7 రాత్రులు 7 పగళ్ళ నుండి యుద్ధం చేస్తున్నావు. దేవతలందరూ రావణుడి శిరస్సు పడిపోయే ముహూర్తాన్ని నిర్ణయించిన సమయం ఆసన్నమయిపోయింది. అగస్త్యుడు ఇచ్చిన దివ్యమైన అస్త్రం నీ దగ్గరున్న బాణతుణీరంలో ఉంది, దానిని బయటకి తీసి అభిమంత్రించి విడిచిపెట్టు" అన్నాడు.

                                         ◆నిశ్శబ్ద.