రావణుడి మరణం, విభీషణుడి స్పందన!!

 

రావణుడి మరణం, విభీషణుడి స్పందన!!


మాతలి ఇచ్చిన సలహా ప్రకారం రాముడు బాణతుణీరం నుండి  ఆ అస్త్రాన్ని బయటకి తీస్తుంటే, అది పుట్టలో నుండి బయటకి వస్తున్న బ్రహ్మాండమైన సర్పంలా ఉంది. లోకాలని రక్షించమని ఆ అస్త్రాన్ని బ్రహ్మగారు దేవేంద్రుడికి ఇచ్చారు. దేవేంద్రుడు ఇప్పుడు రాముడికి ఇచ్చాడు. రాముడు ఆ అస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టగానే అది వాయు వేగంతో వెళ్ళిపోతుంది, దానికున్న బంగారు ములుకులో అగ్ని, సూర్యుడు ఉంటారు, దాని శరీరం బ్రహ్మమయం అయ్యి ఉంటుంది, సుర్యుడివంటి తేజస్సుతో ఉంటుంది, ధూమంతో నిండిపోయిన కాలాగ్నిలా ఉంటుంది. ఆ బాణం ఇంతకముందు ఎన్నో పర్వతాలని చీల్చుకుంటూ, ద్వారాలని బద్దలుకొడుతూ, పరిఘలని విరుచుకుంటూ, ఎందరో రాక్షసుల గుండెల్ని బేధించుకుంటూ వెళ్ళింది. దాని ఒంటి మీద కొంచెం రక్తం, కొవ్వు ఉంటాయి. ఆ బాణం ఇంతకముందు ఎక్కడెక్కడ ప్రయోగింపబడిందో అక్కడ వెంటనే డేగలు, గ్రద్దలు, రాబందులు, నక్కలు, క్రూరమృగాల గుంపులుగా వచ్చి చనిపోయిన శత్రువుల మాంసాన్ని తినేవి.


రాముడు ఆ బాణాన్ని చేతితో పట్టుకుని దానిమీద వేదప్రోక్తంగా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. ఆయనలా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించేసరికి భూమి అంతా కంపించింది. అప్పుడాయన ఆ బాణాన్ని వింటినారికి తగిలించి, చెవి వరకూ లాగి, పరమాత్మని స్తోత్రం చేస్తూ, శత్రువు నిగ్రహింపబడాలని కోరుకుంటూ విడిచిపెట్టాడు. ఆ బాణం ఒక్క క్షణంలో భయంకరమైన ధ్వనిని చేస్తూ, లోకాలన్నిటినీ క్షోభింప చేస్తూ, ఇంతకాలం ఏ రావణుడు లోకములన్నిటినీ పీడించాడో, ఆ రావణుడి గుండెల్ని బద్దలు చేస్తూ ఆయన వక్షస్థలం నుండి దూసుకు వెళ్ళింది.


అది అలా దూసుకుపోగానే రావణుడి చేతిలో ఉన్న ధనుస్సు, ఆయుధములు కింద పడిపోయాయి, ప్రాణాలు విడిచిపెట్టేసి ఆ శరీరముతో కింద పడిపోయాడు.


రావణుడు మరణించగానే ఆకాశంలో దేవదుందుభిలు మ్రోగాయి. వెంటనే సుగ్రీవుడు, లక్ష్మణుడు, అంగదుడు, ఋషభుడు, వేగదర్శి, నీలుడు, సుషేణుడు, గందమాధనుడు, మైందుడు, జాంబవంతుడు, కొన్ని కోట్ల వాసరములు అందరూ పరమానందంతో రాముడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ రాముడి పాదాల మీద పడిపోయి, ఆనందంతో పూజలు చేసి, "రామ రామ" అంటూ ఆయన ఒళ్ళు ముట్టుకుని పరవశించిపోయారు. హనుమంతుడు ఆనందంతో నాట్యం చేశాడు.


రావణుడు రథం మీద నుండి కింద పడిపోయేసరికి అక్కడున్న రాక్షసులు పరుగులు తీశారు. వానరాలన్నీ కనపడ్డ రాక్షసుడిని వెంట తరిమి సంహరించారు. ఆకాశంలో దేవతలందరూ పొంగిపోయి రాముడిని పొగిడారు.


రావణుడు ఆ రణభూమిలో నిహతుడై పడిపోగానే విభీషణుడు ఏడుస్తూ ఆయన దగ్గరికి పరిగెత్తాడు. అప్పుడాయన రావణుడిని చూస్తూ "అన్నయ్యా! ఆనాడే నేను నీకు చెప్పాను. యుద్ధానికి వెళ్ళవద్దు, తప్పు చేసింది నువ్వు, నీ తప్పు నువ్వు దిద్దుకో అన్నాను. కాని నువ్వు నా మాట వినలేదు. ఆ వినకపోవడం వలన ఈనాడు ఎలా పడిపోయి ఉన్నావో చూశావ. ఆ రోజున దర్పంతో ప్రహస్తుడు, ఇంద్రజిత్, కుంభకర్ణుడు, అతిరధుడు, అతికాయుడు, నరాంతకుడు నా మాట వినలేదు. మా అన్నయ్య జీవించి ఉన్నంతకాలం ఎందరికో దానాలు చేశాడు. గొప్ప అగ్నిహోత్రాలు నిర్వహించాడు, మిత్రధర్మాన్ని నెరపి స్నేహితులకి కానుకలు ఇచ్చాడు, భూరి దానాలు చేశాడు. శత్రువుల గుండెల్లో నిద్రపోయాడు. ఇన్ని చేసినవాడు ఇవ్వాళ కేవలం కిందపడిపోయి, ఎందుకూ పనికిరానివాడిగా చేతులు భూమికి ఆన్చి, నోరు తెరిచి ఉండిపోయాడు. శాంతి పొందిన అగ్నిహోత్రంలా ఉన్నావాన్నయ్య" అని ఏడిచాడు.

                                         ◆నిశ్శబ్ద.