సీతమ్మ మీద రాముడి అనుమానం!
సీతమ్మ మీద రాముడి అనుమానం!
లోకం నన్ను చేతకాని వాడు అనుకోకూడదని నేను నిన్ను రక్షించాను అని సీతతో చెప్పాడు రాముడు. ఆ తరువాత ఆయన సీతమ్మతో "సీతా ఇవ్వాళ నీ గురించి శంక మొదలైంది. నీమీద అనుమానం బయటకు చెప్పాల్సి వస్తోంది. నువ్వు చాలాకాలం రాక్షసుని గృహంలో ఉన్నావు. నువ్వు అలా ఉన్న కారణం వల్ల నిన్ను చూస్తున్నప్పుడు నాకు ఎలా ఉందో తెలుసా, కంటికి జబ్బు చేసిన వాడు దీపాన్ని ఎలా చూడలేడో, అలా నేను నీ వైపు చూడలేకపోతున్నాను. నీకు తెలుసు నాకు తెలుసు, నువ్వు గొప్ప సౌందర్యరాశివి, నిన్ను చూసినవాడు చపలచిత్తుడైతే వెంటనే నీ మీద మనసు పడతాడు. పరమ చపలచిత్తుడైన రావణుడు నిన్ను చూడకూడని చూపు చూశాడు, బలవంతంగా నీ జుట్టు పట్టి ఈడ్చాడు, తన తొడ మీద కుర్చోపెట్టుకున్నాడు. గుండెల మీద వేసుకున్నాడు. అశోకవనంలో పెట్టాడు. 10 నెలలు నిన్ను చూశాడు. నువ్వూ మహా అందగత్తెవి, వయస్సులో ఉన్న దానివి. అటువంటి నువ్వు ఖచ్చితమైన నడువడితో ఉన్నావని నేను ఎలా నమ్మను??
అందుకని ఇప్పుడు నీ ఇష్టం. నీకు ఎవరు వచ్చితే వాళ్ళతో వెళ్ళిపో. లక్ష్మణుడితో కాని, భరతుడితో కాని, విభీషణుడితో కాని, సుగ్రీవుడితో కాని నువ్వు వెళ్ళిపోవచ్చు. వీళ్ళు మాత్రమే కాదు ఈ పది దిక్కులలో నీకు ఎవరు నచ్చినా వాళ్ళతో వెళ్ళిపోవచ్చు. నేను నీకు అనుమతి ఇస్తున్నాను, నువ్వు వెళ్ళిపోవచ్చు. నీతో నాకు మాత్రం ఏవిధమైన అవసరం లేదు" అన్నాడు.
ఆ మాటలు వినగానే సీతమ్మ "రామ! నన్ను చిన్నతనంలో పాణిగ్రహణం చేశావే. నా చెయ్యి పట్టుకున్నావే. చాలా కాలం కలిసి దాంపత్య జీవనం చేశామే, నేను ఎలాంటి దాన్నో నీకు తెలియదా. నేనంత చేతకాని స్త్రీలా నీకు కనపడుతున్నాన. నేను నిజంగా అటువంటి వ్యక్తిత్వం ఉన్నదానిని అని నువ్వు అనుమానించినవాడివైతే ఆనాడు హనుమని నాకోసం ఎందుకు పంపించావు. నేను రాక్షసుల మధ్యలో ఉన్నాను అని హనుమ నీకు చెబితే, మళ్ళీ హనుమతోనే నేను నీ వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నాను. అని కబురు చేస్తే నేను ప్రాణాలు విడిచిపెట్టేదాన్ని కదా!!. అలా చెయ్యకుండా నాకోసం ఎందుకు ప్రాణం మీదకు తెచ్చుకున్నావు. ప్రాణాలు ప్రమాదంలో వేసుకుని మరీ యుద్ధం చేసావు. ఎందుకు సముద్రానికి సేతువు కట్టి, లంకకి వచ్చి, అంత యుద్ధం చేశావు.
యుద్ధంలో జయాపజయములు విధి నిర్ణయములు, నువ్వు గెలవచ్చు రావణుడు గెలవచ్చు. నామీద నీకు ప్రేమ ఉంది కాబట్టి అంత ప్రాణ సంకటం తెచ్చుకున్నావు. కాని ఇవ్వాళ ఎందుకింత బేలగా మాట్లాడుతున్నావు. నేను స్త్రీని కాబట్టి ఎలా అయినా మాట్లాడచ్చు అనుకుంటున్నావా. నా భక్తి, నా సౌశీల్యం, నా నడువడి అన్నిటినీ వెనక్కి తోసేశావు. నేను బతికుంటే రాముడికి ఇల్లాలిగా బతుకుతాను, చచ్చిపోయినా రాముడికి ఇల్లాలిగానే చచ్చిపోతాను. ఒకసారి అపనింద పడ్డాక నాకీ జీవితంతో సంబంధం లేదు. లక్ష్మణా! చితి పేర్పు" అని పలికింది.
అప్పుడు లక్ష్మణుడు రాముడివంక కనుగుడ్లు మిటకరిస్తూ కోపంగా చూశాడు. రాముడు అంతకన్నా కోపంగా, ఎర్రటి కళ్ళతో లక్ష్మణుడివంక చూసేసరికి లక్ష్మణుడు గబగబా వెళ్ళి చితిని పేర్చాడు.
అప్పుడు సీతమ్మ "నా మనస్సు రాముడి మీదే ఉన్నదైతే, సర్వకాలములలో రాముడిని ధ్యానము చేసిన దాననైతే, పృధ్వీ, ఆకాశము, అష్ట దిక్పాలకులు, అంతరాత్మ, అగ్ని సాక్షిగా ఉండి, ఒక్క క్షణం కూడా నా మనస్సు రాముడిని విడిచిపెట్టనిది నిజమే అయితే ఈ అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక" అని చెప్పి అగ్నిలో దూకింది సీతమ్మ.
◆నిశ్శబ్ద.