మధురై మీనాక్షి అమ్మవారికి మూడు వక్షోజాలు ఉండటం వెనుక రహస్యం ఇదే..!
మధురై మీనాక్షి అమ్మవారికి మూడు వక్షోజాలు ఉండటం వెనుక రహస్యం ఇదే..!
తమిళనాడులోని మదురైలో ఉన్న మీనాక్షి ఆలయం ఎంతో ప్రత్యేకమైనది, అంతకంటే ఈ అమ్మవారు పవిత్రమైన వారు కూడా. దేశం నలుమూలల నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా ఎంతో మంది భక్తులు మధురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఆలయ వాస్తుశిల్పంతో పాటు, మీనాక్షి అమ్మవారి విగ్రహం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది, ఎందుకంటే ఇక్కడి మీనాక్షిఅమ్మవారి విగ్రహానికి మూడు వక్షస్థలాలు ఉంటాయి. దీని వెనుక ఒక పౌరాణిక కథ ఉంది. దీని గురించి తెలుసుకుంటే..
మీనాక్షి అమ్మవారి పౌరాణిక కథ..
మీనాక్షి దేవి పురాణ గాథ ప్రకారం, మధురై పాండ్య రాజుకు సంతానం లేకపోవడంతో ఆయన హోమం చేశారు. ఆ హోమం నుండి దేవతలు పాండ్య రాజుకు హోమ గుండం నుండి ఒక ఆడపిల్లను ప్రసాదించారు. ఆ అమ్మాయికి యుక్తవయస్సుకు వచ్చాక మూడు రొమ్ములు ఉంటాయని, ఆమెకు తగిన పురుషుడు దొరికిన రోజున ఆ అదనపు రొమ్ము అదృశ్యమవుతుందని దేవతలు చెబుతారు. ఆ యువరాణికి తడతగై అని పేరు పెట్టారు, ఆమె తరువాత చేప కళ్లంత అందమైన కళ్లతో మీనాక్షిగా ప్రసిద్ధి చెందింది.
తన తండ్రి సింహాసనాన్ని అధిష్టించిన తరువాత, ఆమె ఉత్తరం వైపు ప్రయాణించాలని నిర్ణయించుకుందట. విశ్వంలోని రాజులు, దేవతలు, గణాలు , నంది అందరినీ ఓడించి, చివరకు ఒక యువ ఋషిని కలుసుకుందట, ఆయనే సాక్షాత్తు శివుడని. మీనాక్షి దేవి కళ్ళు శివుని కళ్ళను చూడగానే, తాను పార్వతీ దేవి పునర్జన్మ అని ఆమె గ్రహించిందట, అప్పుడే మీనాక్షి అమ్మవారికి ఉన్న అదనపు వక్షోజం అదృశ్యమైందట. అప్పుడు మీనాక్షి పరమేశ్వరుడిని తన భర్తగా, సహచరుడిగా మధురై నగరానికి తీసుకువెళ్ళిందట. ఆమె ఆయనకు సుందరేశ్వరర్ అని నామకరణం చేసిందట.
ఆలయానికి సంబంధించిన గాథల ప్రకారం, 700 సంవత్సరాల క్రితం మాలిక్ కాఫూర్ అనే ముస్లిం పాలకుడు ఈ ఆలయంపై దాడి చేసి దోచుకున్నాడు. సుమారు 1200 సంవత్సరాల క్రితం రచించిన సుందరర్ కవితలలో కూడా ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. ఆ కాలంలో మధురైలో శివారాధన క్రమంగా వృద్ధి చెందింది. అంతేకాకుండా 'సంగం' అని పిలువబడే తమిళ కవుల మొదటి సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన మొదటి నగరం మధురై.
మీనాక్షి ఆలయం..
ఒక అంచనా ప్రకారం, ఆలయ ప్రాంగణాలు , గోపురాలలో 33,000కు పైగా శిల్పాలు ఉన్నాయి, వాటిలో ప్రతిదానికీ దానికంటూ ఒక ప్రత్యేక కథ ఉండేదట. ఈ ఆలయంలో దేవతామూర్తుల పెద్ద విగ్రహాలతో పాటు, ఆ కాలంలో జీవించిన జీవులు , సాధారణ ప్రజల విగ్రహాలు కూడా ఉన్నాయట. మీనాక్షి ప్రధాన విగ్రహంలో ఆమె ఒక చిలుకను పట్టుకుని ఉంటుంది, దీన్ని కామదేవునికి ప్రతీకగా భావిస్తారు. మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వర స్వామి వారి వివాహానికి సంబంధించిన చిత్రాలు కూడా ఆలయ గోడలపై స్పష్టంగా కనిపిస్తాయి.
ప్రతి రాత్రి శివుని ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో మీనాక్షి అమ్మవారి ఏకాంత గదికి తీసుకువెళతారు. ఆలయ పురోహితులు సుందరేశ్వర స్వామికి పుష్పాలతో ఘన స్వాగతం పలికి, మీనాక్షి అమ్మవారి ఉత్సవ విగ్రహం పక్కన ఉన్న ఉయ్యాలలో కూర్చోబెడతారు. అంతేకాకుండా గదిని ప్రత్యేక సువాసనగల మల్లెపూలతో అలంకరిస్తారు , గోడలకు అద్దాలను అమరుస్తారు. పగలంతా రాజ్యాన్ని రక్షించిన తర్వాత, ఆ అమ్మవారు రాత్రంతా తన ప్రియుడిని పూజిస్తూ గడుపుతారట.
*రూపశ్రీ.