ఈ దేవాలయాలలో పువ్వులకు బదులు రాళ్లే దేవుడికి సమర్పిస్తారు.. ఎక్కడంటే..!
ఈ దేవాలయాలలో పువ్వులకు బదులు రాళ్లే దేవుడికి సమర్పిస్తారు.. ఎక్కడంటే..!
మన దేశంలో ఆలయ పూజల సమయంలో పండ్లు, పువ్వులు, తీపి పదార్థాలు, లేదా బంగారం , వెండిని కూడా సమర్పిస్తుంటారు. అయితే, భారతదేశంలో కొన్ని విశేషమైన ఆలయాలు ఉన్నాయి, అక్కడి సంప్రదాయాలు సాధారణ ప్రదేశాల సంప్రదాయాలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఆ పవిత్ర పుణ్యక్షేత్రాలలో, భక్తులు తమ కోరికలు నెరవేరడం కోసం గులకరాళ్లు, రాళ్లను పువ్వులకు బదులుగా సమర్పిస్తారు. చాలా చోట్ల తమ మనసులో, జీవితంలో ఉండే బాధాకరమైన విషయాలను, సమస్యలను కాగితంపై రాసి దేవుని పాదాల వద్ద ఉంచుతారు. భక్తులు ఎంత నమ్మకంగా తమ సమస్యలు దేవుడి ముందు ఉంచుతారో.. దాన్ని బట్టి వారి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెబుతారు.
చిత్తై గోలు..
ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో లో చితై గోలు దేవతా ఆలయం ఉంది. ఈ ఆలయంలో తప్పక న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతారు. ఈ ఆలయం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. ఇక్కడ దేవునికి పువ్వులు లేదా పండ్లు సమర్పించడానికి బదులుగా, తమ బాధలు, వేదనలను కాగితంపై రాసి దేవుడి పాదాల వద్ద ఉంచుతారు.
ఎవరైనా న్యాయం జరగకపోయినా లేదా పెద్ద ఏదైనా పెద్ద సమస్య ఎదుర్కొన్నా, వారు తమ సమస్యలను స్టాంప్ పేపర్‌పై రాసి గుడిలో వేలాడదీస్తారట. వారి కోరికలు నెరవేరినప్పుడు, దేవుని పట్ల కృతజ్ఞతగా తిరిగి మళ్లీ గుడికి వచ్చి ఇత్తడి గంటను మోగిస్తారట.
బిలాస్పూర్లో ఐదు రాళ్ల కథ..
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో ఖమ్తరాయ్ వద్ద మా బాగ్దాయి వందేవి పురాతన ఆలయం ఉంది. ఈ పుణ్యక్షేత్రంలో అమ్మవారికి గులకరాళ్లను సమర్పిస్తారు. ఇక్కడ ఈ సంప్రదాయం చాలా ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ భక్తులు పొలాల నుండి ఐదు గోట రాళ్లను సేకరించి, వాటిని దేవత ముందు ఉంచి, ఒక కోరిక కోరుకుంటారు. ఈ సంప్రదాయం సుమారు 100 సంవత్సరాల పురాతనమైనదని చెబుతారు.
పూర్వకాలంలో ప్రజలు దట్టమైన అడవుల గుండా ప్రయాణించేటప్పుడు, క్షేమంగా తిరిగి రావడానికి ముందుకు వెళ్లే ముందు ఐదు రాళ్లను ఉంచేవారట. ఆ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఎవరైనా సరే తమ కోరిక నెరవేరినప్పుడు ఇక్కడ ఐదు రాళ్లను పేర్చి వెళ్లడానికి మళ్లీ ఈ గుడికి తిరిగి వస్తారట.
బంగారు తిరుపతి..
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులో ఉన్న బంగారు తిరుపతి ఆలయంలో కూడా రాళ్లకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆలయ ప్రాంగణంలో ఒక పురాతన, పవిత్రమైన చెరువు ఉంటుంది.
కోరికలతో ఇక్కడికి వచ్చే భక్తులు, చెరువులో చిన్న గులకరాళ్లు, రాళ్లు వేసి దేవుడిని ప్రార్థిస్తారట. ఈ చెరువులో భక్తితో రాళ్లను సమర్పించడం వేయడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి, భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం.
రాళ్లతో కోర్కెలు నెరవేరే మరిన్ని ఆలయాలు..
హిమాచల్ ప్రదేశ్‌లోని కొండ ప్రాంతాలలో , ఛత్తీస్‌గఢ్‌లోని రతన్‌పూర్‌లోని మహామాయ అమ్మవారి ఆలయం చుట్టూ మరో అందమైన రాతి నిర్మాణం కనిపిస్తుంది. ఇక్కడి భక్తులు నేలపై పడి ఉన్న రాళ్లను పేర్చి చిన్న ఇళ్లను నిర్మిస్తారు.
అలా చేయడం వల్ల దేవత ప్రసన్నమై, సొంత ఇల్లు కావాలి అనుకునే వారి కల నెరవేరుస్తుందని ప్రజలు నమ్ముతారు. సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకునేవారు ఈ దేవాలయాన్ని సందర్శించి ఈ పద్దతి తప్పకుండా పాటిస్తారు.
భక్తికి, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనాలు..
ఈ దేవాలయాల సంప్రదాయాలు చదవడానికి లేదా వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ ఆ ఆలయాలలో జరిగే పద్దతులు చాలా లోతుగా పాతుకుపోయి ఉన్నాయి. కొందరు తమ బాధను కాగితంపై రాసి దేవునిపై తమ విశ్వాసాన్ని వ్యక్తపరిస్తే, మరికొందరు కేవలం ఐదు గులకరాళ్లను ఉంచి రక్షణ కోసం ప్రార్థిస్తారు. క్షేమంగా ఉంటామని నమ్ముతారు.
*రూపశ్రీ.