కృష్ణుడు తన గురించి తాను ఏమి చెప్పాడు?

 

కృష్ణుడు తన గురించి తాను ఏమి చెప్పాడు?


న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించనః నానవాప్త మవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ॥


అర్జునా! మూడులోకాలలో నేను చేయవలసిన కర్తవ్యం అంటూ కొంచెం కూడా ఏమీ లేదు. అలాగే నేను కోరుకోదగ్గది, పొంద తగినది, నేను పొందలేనిది ఏదీ లేదు. ఐనప్పటికినీ నేను అనునిత్యం కర్మలు చేస్తూనే ఉన్నాను.

కృష్ణుడు అందరి గురించీ చెప్పినా అర్జునుడిలో ఏమీ చలనం లేదు. ఇంక లాభం లేదని, ఇప్పుడు కృష్ణుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. "అర్జునా! నాకు ఈమూడులోకాలలో చేయతగినపని కానీ, చేయవలసిన పని కానీ లేదు. నాకు కావాల్సింది ఏదీ లేదు. కోరతగినది ఏదీ లేదు. అలాగే నేను కోరుకుంటే పొందలేనిది అంటూ ఏమీ లేదు. అయినా నేను కర్మలు చేస్తూనే ఉన్నాను. నీకు సారధిగా కూడా పని చేయడానికి ఒప్పుకున్నాను. కారణం నాకు అన్నీ తెలుసు, నేను గొప్పవాడిని, అని ఎప్పుడూ అనుకోలేదు. ఏ చిన్న పని చేయడానికి వెనుకాడలేదు.” అని తన గురించి తాను చెప్పుకున్నాడు.

ఒకవిధంగా కృష్ణుడు, నేను ఆత్మసాక్షాత్కారం పొందిన వాడిని, స్థితప్రజ్ఞుడిని అని నర్మగర్భంగా చెబుతున్నాడు. కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ అవతారము. నిర్గుణుడు, నిరాకారుడు, నిర్మలమైన మనస్సు కలవాడు. త్రిగుణములకు అతీతుడు. ఆ ఉద్దేశంలో అనుకుంటే కృష్ణుడికి చేయవలసిన కర్మ అంటూ ఏమీ లేదు. తీరవలసిన కోరికలు అంటూ ఏమీ లేవు. ఆయన కోరుకుంటే తీరని కోరిక అంటూ ఏదీ లేదు. రెండవ ఉద్దేశం కృష్ణుడు జ్ఞాని. అన్నీ తెలిసిన వాడు, అన్నిటికీ అతీతుడు. మాయ గురించి తెలిసిన వాడు. స్థితప్రజ్ఞుడు. అలా చూచినా కూడా కృష్ణుడికి చేయవలసిన కర్మ, తీర వలసిన కోరిక అంటూ కూడా ఏమీ లేదు.

అందుకే అంటున్నాడు.....అయినా నేను లోకం కొరకు కర్మలు చేస్తూనే ఉన్నాను. ఎందుకు? ప్రజలు నన్ను చూచి, వారూ అలాగే ఆచరించాలి. ధర్మమార్గంలో నడవాలి. అంతే కానీ నా కోసం కాదు, నాకు రూపం లేదు. అయినా ఒక రూపం ధరించాను. ఎక్కడో పుట్టాను. ఎక్కడో పెరిగాను. చిన్నప్పుడే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. ఒక సామాన్యుడు ఏమేమి చేయాలో అన్నీ చేసాను. వీలున్నంతవరకు ప్రజలకు ధర్మమార్గంలో నడవమని బోధించాను. ఇంతెందుకు ఇప్పుడు నీకు సారధిగా ఉన్నాను. ఎంతో ఉత్సాహంగా నీకు సారధ్యం  చేస్తున్నాను. నీ ఆజ్ఞలు పాటిస్తున్నాను. నీవు రథం ఎటు పోనిమ్మంటే అటు పోనిస్తున్నాను. ఒక విధంగా నీకు సేవచేస్తున్నాను. ఈ విధంగా నీకు సారధ్యం చేసినందు వలన నాకు వచ్చే లాభం అంటూ ఏమీ లేదు. పైగా నష్టం ఎక్కువ. ఎందుకంటే, నీ మీదికి సంధించిన ప్రతి బాణము నాకు తగిలే అవకాశం ఉంది. కొంత మంది ముందు సారధిని చంపుతారు. కాబట్టి యుద్ధంలో నీకంటే ముందు నేనే మరణించవచ్చు. నాకే ప్రమాదము ఎక్కువ. అయినా ఈ పనికి నేను సంతోషంగా ఒప్పుకున్నాను. కారణం ఇది నా కర్తవ్యం నేనుచేయాలి. ప్రతివాడూ చిన్న పని. పెద్ద పని అనే తేడా లేకుండా అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి అనే ప్రమాణాన్ని నెలకొల్పడానికి నీకు సారధిగా ఉన్నాను.

నాకు పెద్దపని చిన్న పని అంటూ లేదు. గొప్ప బీద తేడా లేదు. నా చిన్ననాటి మిత్రుడు సుదాముడు పరమ బీదవాడు, కుచేలుడు, ఆయన వచ్చినపుడు నేను ఆయన కాళ్లు కడిగాను. ఎందుకు. ఆయన సృహ్మణుడు. వేదములు చదువుకున్న వాడు. జ్ఞాని, నిష్కామ కర్మలు. ఆచరించిన వాడు. అటువంటి బ్రాహ్మణులు నాకు దైవంతో సమానము. పైగా ఆయన నాకు అతిథి. అందుకే ఆయనకు నేను, నా భార్యలు అతిథి సత్కారాలు, సేవలు చేసాము. నేను గొప్పవాడిని, నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు అని గర్వంతో విర్రవీగలేదు. 

ఈ ప్రకారంగా అన్ని తెలిసిన నేను నా కర్తవ్య కర్మ నేను చేస్తుంటే నీవు చేయడానికేమి? నీవే కాదు జీవన్ముక్తులు అనే వారు కూడా కర్మలు చేయాలి. వారు చేసి లోకానికి ఆచరించమని బోధించాలి. ప్రజల చేత ఆచరించేటట్టు చేయాలి. అదీ నిష్కామంగా చేయాలి ఎటువంటి ఫలితములను ఆశించి చేయరాదు. సన్యాసులు, జీవన్ముక్తులు కూడా సమాజ శ్రేయస్సు కోరి ధర్మకార్యాలు ఆచరించాలి. అందరూ ఆచరించేటట్టు చేయాలి. స్వార్ధరహితంగా చేయాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది అని చెప్పాడు కృష్ణుడు.

   ◆ వెంకటేష్ పువ్వాడ.