ధనుర్మాసాన్ని శూన్యమాసంగా పిలుస్తారు ఇందుకే..!
ధనుర్మాసాన్ని శూన్యమాసంగా పిలుస్తారు ఇందుకే..!
భారతీయ హిందూ క్యాలెండర్ లో ప్రతి మాసానికి, ప్రతి తిథికి ప్రాముఖ్యత ఉంది. వీటిలో కొన్ని తిథులు, మాసాలు మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. కొన్ని మాసాలు కొన్ని దేవతలకు చాలా ప్రత్యేకంగా మారాయి. వాటిలో మార్గశిర మాసం ముఖ్యమైనది. మార్గశిర మాసాన్నిమాసాలలోకెల్లా శీర్షం అంటారు. అంటే తల వంటిది అని అర్థం. ఈ విషయాన్ని సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీత ఉపదేశం సందర్భంగా చెప్పాడట. అలాంటి మార్గశిర మాసం మధ్యలో మొదలై.. పుష్య మాసంలో మధ్యలో ముగిసేదే ధనుర్మాసం. అయితే ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసంగా పిలుస్తారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. ఇలా ఎందుకు జరుగుతుంది? దీని వెనుక ఉన్న కారణమేంటి? తెలుసుకుంటే..
సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడాన్ని ధనుసంక్రమణం అంటారు. ఇది డిసెంబర్ 16 వ తేదీ మొదలవుతుంది. సాధారణంగా హిందూ కాలాన్ని దైవికంగా ఉత్తరాయణం, దక్షిణాయణం అని పిలుస్తారు. వీటిలో ఉత్తరాయణం పగలుగానూ, దక్షిణాయణం రాత్రిగాను పేర్కొంటారు. ఈ ఉత్తరాయణంలో దేవతలకు బ్రాహ్మీ కాలం వంటిది ధనుర్మాసం. సాధారణ ప్రజలకు కూడా బ్రహ్మ ముహూర్తం చాలా పవిత్రమైనదని తెలుసు. అలా దేవతలకు కూడా బ్రాహ్మీ కాలంగా ధనుర్మాసం పేర్కొనబడుతుంది. సూర్యోదయానికి ముందు వచ్చే కాలాన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు. దేవతలకు కూడా ధనుర్మాసం బ్రహ్మముహూర్తంతో సమానం.
ఈ ధనుర్మాస కాలం విష్ణువుకు చాలా ప్రతీకరమైనది. ధనుర్మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పిలుస్తారు. అదే పేరుతో పూజిస్తారు కూడా. ఇక భూదేవి ఆండాళ్ గా పూజలు అందుకుంటుంది. ఆండాళ్ నే గోదాదేవి అంటారు. విష్ణువును వివాహం చేసుకోవాలనే తలంపుతో గోదాదేవి ఈ ధనుర్మాసంలోనే తిరుప్పావే పాశురాలు గానం చేస్తూ విష్ణువుకు మేలుకొలుపు పాడుతూ ప్రత్యేక పూజలు చేసిందట. అందుకే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ ఆలయంలో తిరుప్పావే పాశురాలు గానం చేయబడతాయ.
మరొక విషయం ఏమిటంటే.. ధనుర్మాసం ఇంత గొప్పదైనా దీన్ని శూన్యమాసంగా పేర్కొన్నారు. అంటే ఈ మాసంలో ఎలాంటి వివాహాలు, శుభకార్యాలు చేయకూడదు. దీని వెనుక కారణం కూడా దైవికమైనదే.. దేవతలకు బ్రహ్మ ముహూర్తమైన ఈ మాసాన్ని దైవపూజలకోసమే కేటాయించాలని, ఈ మాసంలో దేవతలను పూజించడం వల్ల ప్రతి ఒక్కరూ పుణ్యఫలం పోగు చేసుకోవాలనే తలంపుతో ఈ నెల రోజుల కాలాన్ని శూన్యమాసంగా కేటాయించారు. భోగి రోజు జరిగే గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాసం పూర్తవుతుంది. మకర సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. దీంతో ఉత్తరాయం ప్రారంభమవుతుంది. ఇదీ శూన్యమాసం వెనుక ఉన్న వాస్తవం.
*రూపశ్రీ.